Jump to content

తిరుమల శ్రీవారి ఆభరణాలు

వికీపీడియా నుండి


చిత్తూరు జిల్లాలో తిరుపతి పట్టణానికి ప్రక్కన ఉన్న ఏడు కొండలపైని వూరిని తిరుమల అంటారు. రెండింటినీ కలిపి తిరుమల తిరుపతి అని అంటారు. ఇక్కడి శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం ప్రసిద్ధమైన వైష్ణవ క్షేత్రం. ఈ ఆలయంలో మూలవిరాట్టు అయిన శ్రీవేంకటేశ్వరుని దర్శించుకోవడానికి లక్షలాది భక్తులు తరలి వస్తుంటారు. ఈ స్వామిని "శ్రీవారు" అని వ్యవహరిస్తుంటారు.

ధృవబేరం అనబడే స్వామి మూలవిగ్రహానికి, ఇతర ఉత్సవ విగ్రహాలకూ అనేక విలువైన ఆభరణాలున్నాయి. స్వామి వారి ఆభరణాల నిర్వహణకు బొక్కసం సెల్‌ను తిరుమల తిరుపతి దేవస్థానములు సంస్థ ఏర్పాటు చేసింది. సహాయ కార్యనిర్వాహణాధికారి పర్యవేక్షణలో ఇది కొనసాగుతుంది. ఆభరణాల కోసం తి.తి.దే. 19 రికార్డులను నిర్వహిస్తోంది.[1] తిరుమల వెంకన్నకు దాదాపు 11 టన్నుల స్వర్ణాభరణాలు ఉన్నాయి.[1]

శ్రీవారికి 12వ శతాబ్ది నుంచే రాజులు విశేషంగా కానుకలు సమర్పించారని ఆలయంలోని శాసనాధారాల ద్వారా తెలుస్తోంది. విజయనగర రాజుల కాలం (1450) లో శ్రీవారికి ఆభరణాల వెల్లువ ప్రారంభమైంది. ప్రధానంగా శ్రీకృష్ణదేవరాయులు పాలించిన 21 ఏళ్లు (1509-1530) [1] స్వర్ణయుగమేనని చెప్పవచ్చును. తిరుమల ఆలయాన్ని ఏడుసార్లు సందర్శించిన శ్రీకృష్ణ దేవరాయలు విశేష కానుకలతో స్వామివారి భాండాగారాన్ని స్వర్ణమయం చేశారు. శ్రీకృష్ణ దేవరాయలు 10-02-1513న శ్రీవారి ఆలయాన్ని సందర్శించి కెంపులు, పచ్చలు, వజ్రాలు, నీలాలు, మాణిక్యాలు, వైఢూర్యాలు, గోమేధికాలతో పొదిగిన వజ్రకిరీటాన్ని కానుకగా సమర్పించారు. 2-5-1513 న నవరత్నఖచిత ఉడుధార, స్వర్ణఖడ్గం, నిచ్చెన కఠారి, రత్నఖచిత మరో చిన్న కత్తి, నవరత్నాలు పొదిగిన కంఠహారం, భుజకీర్తులు, 30 తీగల పతకం కానుకగా సమర్పించారు.[1] తంజావూరు రాజులు పాండ్యన్‌ కిరీటాన్ని కానుకగా సమర్పించారు. రాజులు పోయినా... మహ్మదీయ రాజ్యం, బ్రిటిష్‌ పాలన, మహంతుల శకం, ప్రస్తుతం ప్రజాస్వామ్య భారతంలో పాలక మండళ్ల వ్యవస్థ ఇలా ఆలయ నిర్వహణ పలు పుంతలు తొక్కినప్పటికీ కాలమాన పరిస్థితులతో నిమిత్తం లేకుండా స్వామి వారికి కానుకల వెల్లువ పెరుగుతూనే ఉంది. స్వామి వారికి ఉన్న విశేష ఆభరణాల్లో 500 గ్రాముల గరుడమేరు పచ్చ ప్రధానమైనది.[1] ఉత్సవాల్లో శ్రీవారికి దీన్ని అలంకరిస్తారు.

స్వామి వారికి ప్రస్తుతం ముఖ్యమైన
  • 6 - కిరీటాలు
  • 20 - ముత్యాల హారాలు
  • 50 - కాసుల దండలు
  • ఉత్సవ విగ్రహాలకు 7 కిరీటాలు ఉన్నాయి. వాటిలో వజ్రాల కిరీటం, గద్వాల మహారాణి కిరీటం ముఖ్యమైనవి.
స్వామివారి ఇతర ఆభరణాలు ఇలా ఉన్నాయి...
  • సువర్ణపద్మపీఠం
  • సువర్ణపాదాలు
  • నూపురాలు
  • పగడాలు
  • కాంచీ గునము
  • ఉదర బంధము
  • దశావతార హారము
  • దశావతార వడ్డాణం
  • చిన్న కంఠాభరణము
  • బంగారు పులిగోరు
  • గోపు హారము
  • సువర్ణ యజ్ఞోపవీతం
  • తులసీ పత్రహారం
  • 4 - కిలోల చతర్భుజ లక్ష్మీహారం
  • అష్టోత్తర శతనామహారం
  • 32 - కిలోల సహస్రనామ హారం
  • సూర్య కఠారి (ఖడ్గం)
  • కటి వరద హస్తాలు
  • కడియాలు
  • భుజదండ భూషణాలు
  • నాగాభరణాలు
  • భుజకీర్తులు
  • కర్ణపత్రాలు
  • శంఖుచక్రాలు
  • ఆకాశరాజు కిరీటం
  • సాలిగ్రామహారం
  • తిరుక్కాళం
  • వజ్ర అశ్వర్షథపత్రహారం
  • అయిదుపేటల కంఠి
  • చంద్రవంక కంఠి
ఇవి కాకుండా ఉత్సవాల్లో అలంకరించేందుకు ప్రత్యేక ఆభరణాలు ఉన్నాయి. వాటిలో...
  • రత్నకిరీటం
  • మేరు పచ్చ
  • రత్నాలతో చేసిన శంఖుచక్రాలు
  • రత్నాల కరపత్రాలు
  • రత్నాల కఠి వరదహస్తాలు
  • 7 - కిలోల రత్నాల మకర కంఠి
  • బంగారు వస్త్రాలు తదితరాలు ఉన్నాయి.[1]

స్వర్ణ పీతాంబరం

[మార్చు]

2009 అక్టోబరు 16 - నెల్లూరు ఎంపీ, మాజీ టీటీడీ బోర్డు సభ్యుడు మేకపాటి రాజమోహన్‌ రెడ్డి శ్రీవారికి 20 కిలోల స్వర్ణ పీతాంబరాన్ని కానుకగా సమర్పించారు. రూ. 3.7 కోట్ల విలువగల ఈ పీతాంబరాన్ని ఆయన టీటీడీ ఈవో కష్ణారావుకు అంజేశారు. స్వామివారి మూలవిరాట్టు నాభిభాగానికి దిగువన ఈ పీతాంబరాన్ని ధరింపచేస్తారు. గురువారం మాత్రం దీనిని అలంకరించరు. గతంలో 20 కిలోల బంగారుతో టీటీడీ సొంతంగా తయారు చేయించిన పీతాంబరాన్ని ఇప్పటిదాకా అలంకరిస్తున్నారు. ఇది రెండవది. నూతన పీతాంబరాన్ని చెన్నయ్‌లో ఐదుగురు నిపుణులు 5 నెలల పాటు శ్రమించి తయారుచేశారు.[2]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 1.7 1.8 ఈనాడు దిన పత్రికలో శ్రీవారు 'బంగారు' కొండ[permanent dead link] ఆభరణాల వివరాలు జులై 08, 2008 న సేకరించబడినది. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "eenadu" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  2. "ఆంధ్ర జ్యోతి వార్త". Archived from the original on 2009-10-17. Retrieved 2020-02-19.