తిరుమల సుప్రభాత సేవ
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతిదినం జరిగే ఆర్జిత సేవల్లో 'సుప్రభాతం' ఒకటి. ఇది 'మేలుకొలుపు' సేవ. రోజువారీ నిర్వహించే పూజా కార్యక్రమాలు ఈ సేవతోనే ప్రారంభమై, బంగారు వాకిలి తలుపులు తెరుస్తారు. సంవత్సరంలో మార్గశిర మాసంలో తప్ప ప్రతీదినం ఈ సేవను నిర్వహిస్తారు. మార్గశిర మాసంలో సుప్రభాతం స్థానంలో 'తిరుప్పావై' (గోదాదేవి రచించిన భక్తి పాటలు) పఠిస్తారు. ఈ తిరుప్పావై ఆర్జిత సేవ కాదు, ఏకాంతంగా నిర్వహిస్తారు.
చరిత్ర
[మార్చు]15వ శతాబ్దం మధ్యలో మొదలైనట్లు పీవీఆర్ కే ప్రసాద్ రాసారు. శ్రీ వేంకటేశ్వర సుప్రభాతాన్ని 14వ శతాబ్ది చివరలో కానీ, 15వ శతాబ్ది మొదటిలో కానీ ప్రతివాది భయంకర అణ్ణన్ రాశాడు.అన్నమయ్య ఆ కాలంలో స్వామి వారి ముందు తన కీర్తనలు పాడేవాడు.
సన్నాహాలు
[మార్చు]తిరుమలలో ప్రతిరోజూ ప్రప్రథమంగా శ్రీ వారి దర్శన భాగ్యాన్ని పొందే వ్యక్తి 'సన్నిధి గొల్ల'. ఆదిలో శ్రీ వేంకటేశ్వర స్వామి మొదటి దర్శన భాగ్యాన్ని వరంగా పొందిన ఆనాటి గోపాలకుని (యాదవుని) సంతతికి చెందిన వ్యక్తే ఈ గొల్ల. తిరుమల స్వామి వారి సన్నిధి సేవతో సంబంధించిన వ్యక్తి కాబట్టి 'సన్నిధి గొల్ల ' అని అంటారు. ప్రతి దినం బ్రాహ్మ ముహూర్తంలో (తెల్లవారు జామున 2-30 నుండి 3-00 గంటల ప్రాంతంలో) సన్నిధి గొల్ల శుచిస్నాతుడై తిరునామాన్ని ధరించి గోవింద నామాన్ని పఠిస్తూ దివిటీ (కాగడా ) పట్టుకొని తిరుమల ఉత్తర మాడవీధిలోని శ్రీవారి నిత్యసేవా కైంకర్యపరులైన శ్రీ వైఖానస అర్చకుల తిరుమాళిగక కు (ఇంటికి) వెళ్ళి భక్తిపూర్వకంగా వారికి నమస్కరించి అర్చక స్వాములను ఆలయానికి ఆహ్వానిస్తాడు.
శ్రీవారి అర్చకులు శుచిస్నాతులై, ద్వాదశ ఊర్ధ్వపుండ్రాలను (12 నామాలు) ధరించి, సంధ్యానుష్టానాదులు పూర్తి చేసి ఆలయానికి బయలుదేరుతారు. శ్రీవారి ఆలయ మహద్వారం వద్దకు రాగానే అక్కడ ఉత్తరం వైపున వున్న చిన్న మంటపం (నగారా మంటపం లేదా నౌబత్ ఖానా ) లో అర్చకుల రాకను తేలియజేయడానికన్నట్టు పెద్ద పలక గంటను మోగిస్తారు. అర్చకులు ఆలయంలోనికి ప్రవేశించి బంగారువాకిలి వద్ద వేచి వుంటారు. ఈ లోగా పెద్ద జీయంగార్, చిన్న జీయంగార్ స్వాములు, ఏకాంగి స్వామి, ఆలయ అధికారులు తలుపులు తెరవడానికి సిద్ధంగా వుంటారు.
ఇంతలో సుప్రభాత సేవకు నిర్ణీత రుసుము చెల్లించిన భక్తులను 'వైకుంఠం క్యూ ' ద్వారా ఆలయం లోనికి అనుమతిస్తారు. వీరంతా బంగారువాకిలి ముందు - దక్షిణం వైపు పురుషులు, ఉత్తరం వైపు స్త్రీలు - వరుసగా నిలిచి వుంటారు.
సేవ విధానం
[మార్చు]ఇలా అందరూ సిద్ధంగా ఉండగా సమయం 3 గంటలు కాగానే, అర్చకులు 'కుంచకోల ' అనబడే తాళాలతో 'కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే' అని బిగ్గరగా సుప్రభాతాన్ని ప్రారంభిస్తూ బంగారువాకిలి ద్వారములను తెరుస్తారు. ముందుగా సన్నిధి గొల్ల, వెనుకనే వరుసగా అర్చకస్వాములు, జీయంగారు స్వాములు మరియూ ఏకాంగి మహంతు మఠం వారు తెచ్చిన పాలు, చక్కెర, వెన్న, తాంబూలం గల పళ్ళేన్ని తీసుకుని అందరూ లోనికి వెళతారు. బంగారువాకిలి ముందు నిలిచి వున్న వేదపారాయణదార్లు అర్చకులు ప్రారంభించిన సుప్రభాతాన్ని శ్రావ్యంగా పఠిస్తారు. వీరితోపాటు తాళ్ళపాక అన్నమయ్య వంశీయు లొకరు అన్నమయ్య కీర్తన నొకదానిని ఆలపిస్తూండగా, అర్చకులు లోపలికి వెళ్ళిన వెంటనే శయన మండపంలో పాన్పు పై పవళించి వున్న భోగ శ్రీనివాసమూర్తి స్వామి విగ్రహాన్ని అత్యంత భక్తి శ్రధ్ధలతో గర్భగుడి లోనికి తీసుకుని వెళతారు. బంగారు వాకిలి బయట సుప్రభాత పఠనం జరుగుతూ ఉండగా సన్నిధిలో శ్రీవారికి మొట్టమొదటి నివేదనగా పాలు (పచ్చి ఆవు పాలు) సమర్పిస్తారు. తర్వాత శ్రీ వైఖానసులైన అర్చకులు శ్రీవారి గడ్డంపై పచ్చకర్పూరపు చుక్కను అందంగా అలంకరిస్తారు. తర్వాత స్వామివారికి కర్పూర నీరాజనం సమర్పించి ముందుగా బంగారు పంచపాత్రలో రాత్రి ఏకాంత సేవానంతరం బ్రహ్మాది దేవతలర్చించిన తీర్ధాన్ని అర్చకులు స్వీకరించి తర్వాత జీయంగార్ స్వామికి తీర్థం, శఠారి ఇచ్చిన అనంతరం సుప్రభాతాన్ని పఠించిన వేదపారాయణదార్లు మొదలైన వాళ్ళు, భక్తులు లోనికి వచ్చి శ్రీవారిని విశ్వరూప దర్శనం చేసుకుంటారు.
ముందురొజు రాత్రి బ్రహ్మ స్వామీని అర్చించి వెతాడని భక్తుల నమ్మకం.
సుప్రభాత సేవ కోసం నిర్ణీత రుసుము చెల్లించిన భక్తులు సేవలో పాల్గొనవచ్చు.
ఇతర వివరాలు
[మార్చు]ఈ సేవకు రుసుము రూ.120-00. సుమారు సుమారు 60 రోజుల ముందుగా తి.తి.దే వారి ఈ దర్శన్ కౌంటర్ లో ముందుగా అడ్వాన్స్ రిజర్వేషన్ చేసుకోవచ్చు. సిఫార్సు లేఖల ద్వారా ఒక రోజు ముందుగా కూడా ఈ సేవ టికెట్లు పొందవచ్చు. ఈ సిఫార్సు లేఖలను తిరుమల జే.ఈ.ఓ వారి క్యాంపు కార్యాలయంలో సమర్పించి టిక్కెట్లు పొందవచ్చు. ఈ విధంగా ఖరీదు చేసే టిక్కెట్టు వెల 240-00 వుంటుంది.