తిరుమల ఆనంద నిలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆనంద నిలయం గోపురం విమానం
1613 నాటి తిరుమల దృశ్యం - హైదరాబాదులోని తెలంగాణ రాష్ట్ర పురావస్తు మ్యూజియంలో ఏర్పాటుచేసిన చిత్రపటం

తిరుమలలో ప్రధానాలయంలో శ్రీనివాసుడు ఉండే గర్భగుడి పైనున్న గోపురాన్ని ఆనంద నిలయం అంటారు. ఇది బంగారపు పూతతో కనుల పండువుగా దర్శనమిస్తుంది. శ్రీవైష్ణవ సంప్రదాయంలో తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయ గోపుర విమానాన్ని "ఆనంద నిలయం" అని, శ్రీరంగంలోని శ్రీరంగనాధ స్వామి ఆలయ గోపుర విమానానన్ని "ప్రణవ విమానం" అని, కంచిలోని వరదరాజస్వామి ఆలయ గోపుర విమానాన్ని "పుణ్యకోటి విమానం" అని అంటారు.

నిర్మాణం[మార్చు]

హిందూ దేవాలయ వాస్తులో గర్భగుడి లేదా గోపురం పైనున్న భాగాన్ని "విమానం" అంటారు. ఆనంత నిలయం విమానం మూడంతస్తుల కట్టడం.[1]

శ్రీ మహా విష్ణు రూపాలలో శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయం తొలి ఏక బేరాలయం. 'బేరం' అనగా సంస్కృతంలో 'విగ్రహం' లేదా 'మూర్తి' అని అర్ధం. ఆగమంలో చెప్పబడిన మరే ఇతర మూర్తులు లేకుండా ప్రధాన దైవం లేదా ప్రధాన ధృవ బేరం మాత్రమే ఉండే ఆలయాన్ని "ఏక బేర ఆలయం" అంటారు. స్వయంభూవుగా అర్చా స్వరూపంలో వెలసిన శ్రీవారికి తొలినాళ్ళలో ఆకాశమే పైకప్పు. వైకుంఠంనుండి శ్రీనివాసుడు దివ్య విమానంలో తిరుమలకు వేంచేశాడని గాథ. ఆ విమానం మానవులకు కనుపించదు గనుక భక్తులకు కనుపించేలా తొండమానుడు విమానాన్ని నిర్మించాడని చెబుతారు.[2]

నిర్మాణానికి ముందు[మార్చు]

సా.శ.రెండవశతాబ్దానికి చెందిన తమిళ గ్రంథం తొల్కాప్పియంలో వేంగడమనే తమిళదేశానికి ఉత్తర సరిహద్దు పర్వతాన్ని పవిత్రమైన పర్వతం అని చెప్పి విడిచింది. కొండపై వున్న ఆలయం గురించి, విగ్రహం గురించి మరే ఇతర ప్రస్తావనలు ఆ గ్రంథంలో లభించడం లేదు. అదే శతాబ్దికి చెందిన శిలప్పదిగారం(శిలప్పధికారం) అనే ఇతిహాస గ్రంథంలో మాత్రం తిరువేంగడముడైయాన్ (తిరుమల దేవుడు) ప్రస్తావన దొరుకుతోంది. దక్షిణాది భాషల్లో స్వామివారి తొలి ప్రస్తావనగా ప్రసిద్ధికెక్కిన ఈ గ్రంథంలోనే ఆ మూర్తి (తిరువేంగడముడైయాన్ అనే తిరుమల దేవుడు) ని సూర్యచంద్రులు సేవిస్తున్నారు అన్న వర్ణన లభించింది. దీనివల్ల అప్పటికి ఆలయం లేదని, ఆరుబయట పీఠంపైనో లేక మంటపంలోనో వెలసివున్నట్టు చరిత్రకారులు భావిస్తున్నారు.[3]

ప్రాచీన నిర్మాణం[మార్చు]

12వ, 13వ శతాబ్దాలలో తిరుమల ఆలయ నిర్మాణ సమయంలో "విమానం" అనే పదాన్ని వాడినట్లు తెలుస్తున్నది. ఈ సమయంలోనే గర్భగుడి చుట్టూరా ఉన్న ప్రాకారం వెలుపల మరొక ప్రాకారాన్ని కట్టారు. పైనున్న విమానం భారాన్ని మోయడానికి సరిపడా దృఢత్వం కోసం ఇలా చేసి ఉండవచ్చును.

1251 నుండి 1275 వరకు పాలించిన పల్లవరాజు జాతవర్మ సుందర పాండ్యన్ సువర్ణలేపనం కలిగిన "కలశం" సమర్పించాడు. విమానంపై బంగారు పూత ఉన్న రాగి రేకుల కోసం వీర నరసింగరాయలు తనయెత్తు బంగారాన్ని తులాభారంగా సమర్పించాడు. ఇతడు 1262 వరకు రాజ్య పాలన చేశాడు..[4] ఇది తిరుమల ఆలయం నిర్మణంలో నాలుగవ దశ (మొత్తం ఏడు దశలు) అని భావిస్తున్నారు. కుమార కంపన వడయార్‌కు సేనాని అయిన సాళువ మంగిదేవుడు 1359లో మరొకమారు బంగారుతాపడం చేయించాడు. రెండవ దేవరాయలు కొలువులో ఉన్న మల్లన్నమంత్రి 1444 ప్రాంతంలో ఆనంద నిలయానికి మరమ్మతులు చేయించాడు. 9-9-1518న బహుధాన్య సంవత్సరంలో కృష్ణదేవరాయలు విమానాన్ని మెరుగుపరచి బంగారం తాపడం చేయించాడు. కంచికి చెందిన తాతాచార్యులు 1630లో బంగారం పూత పూయించాడు. 1908లో మహంత్ ప్రయాగదాస్ మరొకసారి కలశాలను ఏర్పరచాడు.[2]

1950 - 60 దశకంలో[మార్చు]

1950 దశకం కొంత నాటికి బంగారు పూత చెరగిపోసాగింది. అంతే కాకుండా గర్భగృహం పైకప్పు లోపలికి క్రుంగుతున్న లక్షణాలు కనపడసాగాయి. ఈ సమస్యలను పరిష్కరించడానికి తి.తి.దే. 1958లో గర్భగుడి మరమ్మతు పనులు చేపట్టింది. బంగారాన్ని జాగ్రత్తగా వేరు చేశారు. పైకప్పులో దెబ్బతిన్న భాగాలను కాంక్రీటు, మెటల్ సపోర్టుల ద్వారా బలపరచారు. ఈ సమయంలో (1960 దశకం మధ్య కాలం) గర్భగుడిలో పూజాదిక కార్యక్రమాలు నిర్వహించడం వీలు కాలేదు. కనుక ధృవబేరం శక్తిని మరొక "బాల ఆలయం"లో ప్రతిష్టించిన మూర్తిలోకి ఆవాహన చేశారు. పూజాదిక కార్యక్రమాలు బాల ఆలయంలోనే నిర్వహించారు. ఐదేళ్ళు శ్రమించి నిర్మాణ కార్మికులు విమానం నిర్మాణానికి, కోణాలకు అనుగుణంగా అచ్చులను తయారు చేసి, ఆ షేపులలో రాగి రేకులను మలచారు. 9వ శతాబ్దంలో వాడిన మేకులలాంటివి తీసివేసి ఆధునిక నిర్మాణ విధానంలో లభ్యమయ్యే సిమెంటు, దూలాలు వంటివి వాడారు. తరువాత రాగి రేకులు తిరిగి అతికించారు. "అపరంజి" (ఉత్తమ నాణ్యత బంగారం) ను పలుచని రేకులుగా మలచి రాగి రేకులపై అతికించారు. ఇందుకు 12 లక్షల రూపాయల విలువ చేసే 12 వేల తులాల బంగారాన్ని వాడారు. మొత్తం 18 లక్షల రూపాయల ఖర్చయింది.

1964లో అష్టబంధన మహాసంప్రోక్షణం జరిపి క్రొత్తగా నిర్మించి ఆనంద నిలయాన్ని ఆవిష్కరించారు. ఆప్పటినుండి ప్రతి పన్నెండేళ్ళకొకసారి ఆలయం మరమ్మతు పనులు చేసి అష్ట బంధన మహాసంప్రోక్షణం జరుపుతున్నారు.[5]

ఆనంద నిలయం రూపం[మార్చు]

ఆనంద నిలయం మూడంతస్తుల చతురస్రాకారపు నిర్మాణం. దీని భుజపు కొలత 27 అడుగుల 4 అంగుళాలు. ఎత్తు 37 అడుగుల 8 అంగుళాలు. రెండవ అంతస్తులో విమాన వేంకటేశ్వరుడు ఉన్నాడు. ఈ ఆనంద నిలయ విమానాన్ని పై నుంచి చూస్తే సుదర్శన చక్రం ఆకృతిలో కనిపిస్తుంది. చాలామందికి తిరుమల గురించి అనేక అపోహలు ఉన్నాయి. అందులో ఒకటి ఆది శంకరుడు తిరుమల శ్రీవారి ఆలయంలో గర్భగుడిలో 'జనాకర్షక' యంత్రం, హుండి క్రింద 'ధనాకర్షక' యంత్రాన్ని ప్రతిష్ఠించాడని, లేక, తిరుమల గర్భగుడిలో శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించాడని, తరువాతి కాలంలో అదే ఆకారంలో ఆనందనిలయపు విమానాన్ని నిర్మించారని ఇలా అనేక రకాల ఉహాగానాలు ఉన్నాయి. వాస్తవానికి తిరుమల శ్రీవారి ఆలయంలో శంకర భగవత్పాదులు ఎటువంటి యంత్రాలను ప్రతిష్ఠించలేదు.[2] ఆనంద నిలయ విమానానికి నలువైపులా మూడు అంతస్తులలోనూ ఎనిమిదేసి సింహాల విగ్రహాలున్నాయి.

బంగారం మయం[మార్చు]

బంగారు పూత పూసిన రాగి రేకుల స్థానే పూర్తి బంగారు రేకులు తాపాలని 2004లో ప్రతిపాదన తలెత్తింది. అయితే ఆ కార్యక్రమం అప్పటిలో చేపట్టలేదు.[1] 2006లో పాత రేకులకు మళ్ళీ పాలిష్ చేసి అష్టబంధన మహా సంప్రోక్షణం నిర్వహించారు. ఇదే సమయంలో ఇతర ఆలయాలలోనూ మరికొన్ని మరమ్మతులు చేశారు.[5]

2008 అక్టోబరులో మొత్తం గర్భ గృహం లోపలి భాగానికి బంగారుపూత పూయాలన్న ప్రతిపాదనను తి.తి.దే. పాలక మండలి ఆమోదించింది. ఈ ప్రాజెక్టుకు మొదటి దశలో 100 కోట్లు, మొత్తం 1,000 కోట్లు రూపాయల వ్యయం కాగలదని అంచనా. ఇందుకు కావలసిన మొత్తం ఖర్చును విరాళాల ద్వారా సేకరిస్తారు. ఈ ప్రాజెక్టును "ఆవంద నిలయము - అనంత స్వర్ణ మయము" అని అంటున్నారు. "కర్ణాటక భక్తమండలి" వారు ఇందుకు ఇప్పటికే 20 కిలోగ్రాముల బంగారాన్ని అందజేశారు. మరొక 22 కిలో గ్రాముల బంగారానికి తగిన నిధులు సమకూరుస్తామని కూడా అన్నారు. ఇతర భక్తులు 10 కోట్ల రూపాయల విరాళాలను ఇవ్వడానికి సంసిద్ధత తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయం గోడలపైనున్న శాసనాలను పరిరక్షించే విధంగా రూపకల్పన చేస్తారు.[6][7]

విమాన వెంకటేశ్వరస్వామి[మార్చు]

శ్రీవారి దర్శనానంతరం భక్తులు ఆనంద నిలయం ఉత్తర వాయవ్య దిక్కున ఉన్న విమాన వెంకటేశ్వరస్వామిని దర్శించుకొంటారు. 16వ శతాబ్దంలో వ్యాస తీర్ధులు ఈ స్వామిని ఆరాధించి మోక్షం పొందాడని ప్రతీతి. కనుక ఈ మూర్తి దర్శనానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. విమానంపై విమాన వెంకటేశ్వర స్వామి మూర్తిని ప్రత్యేకంగా వెండి, బంగారు పూతలో దర్శించుకోవచ్చును.

ఇతర విశేషాలు[మార్చు]

  • ఆనంద నిలయం చిత్రంతో భారతదేశపు తపాలా విభాగం వారు 2002 అక్టోబరులో ఒక తపాలా బిళ్ళ విడుదల చేశారు. 15 రూపాయల అ స్టాంపు 39 మి.మీ. x 29 మి.మీ. సైజులో ఉంది.[8]
  • వెంకటేశ్వరస్వామి ఆలయం మొదట బుద్ధుని ఆలయం వివాదం కూడా ఉన్నది [9][10][11]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "Gold sheets for Ananda Nilayam". The Hindu. 2004-09-24. Archived from the original on 2007-04-02. Retrieved 2007-05-01.
  2. 2.0 2.1 2.2 తిరుమల కొండ పదచిత్రాలు - పున్నా కృష్ణమూర్తి - ప్రచురణ : సూర్య పబ్లికేషన్స్, హైదరాబాదు (2002)
  3. తిరుమల చరితామృతం:పి.వి.ఆర్.కె.ప్రసాద్:ఎమెస్కో:ఆగస్టు2013:పేజీ.4
  4. Ramesan, Dr N (1981). The Tirumala Temple. Tirumala: Tirumala Tirupati Devasthanams.
  5. 5.0 5.1 "Tirumala glistens with a `touch' of gold". The Hindu. 2006-08-25. Archived from the original on 2012-11-07. Retrieved 2007-05-01.
  6. "[[హిందూ పత్రిక]]లో వార్త". Archived from the original on 2008-10-05. Retrieved 2008-10-30.
  7. తి.తి.దే. వెబ్ సైటు Archived 2008-12-08 at the Wayback Machine The historic dcision to gold plate the Ananda Nilayam, the sanctum santorum of the Tirumala temple will be implemented today. - ... the first phase of Ananda Nilayam- Ananta Swarnamayam Pathakam estimated to cost Rs.100 crore . The exercise of gold plating the Srivari Temple began way back in 1267 when the then Pandyan king Sundara Pandyan got done the Kalasham of the temple . Later the Salva King Mungidevudu in 1359 and the Vijayanagara emperor Sri Krishna Devaraya provided gold for the entire gopuram of the sanctum of the Srivari temple. In 1958 the Temple authorities got the sanctum outerwall gold plated with 12 kgs of gold donated by the devotees. - ... the TTD board has taken up this unique program as per the suggestions of Agama Shastra pundits and the Peethadhipathis of the Vaikhanasa cult to enhance the divine energy around the Srivari Temple . ... The authorities have plans to digitise the inscriptions on the outer and inner walls of the Ananda Nilayam stretching around 10,000 square feet . "Even the gold plating will be done without damaging the inscriptions by leaving an half inch gap between the wall and the plating ", ... - The entire project is expected to cost over Rs.1000 crore ... With the gold plating of the Srivari Ananda Nilayam, the TTD will be one among the several Indian temples like Golden temple of Amristsar to achieve the feat . "We will be more unique as the TTD will spend over Rs.1000 crore for the purpose "
  8. స్టాంపు వివరాలు[permanent dead link]
  9. Tirupathi balaji was Buddhist Shrine - K. Jamanadas, publishers - Dalit E Forum
  10. Exploring the Hindu Mind: Cultural Reflections and Symbolisms - By M.K.V. Naraya
  11. https://archive.org/stream/historyoftirupat035504mbp/historyoftirupat035504mbp_djvu.txt

బయటి లింకులు[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]