వేటపాలెం
వేటపాలెం | |
---|---|
రెవిన్యూ గ్రామం | |
![]() | |
నిర్దేశాంకాలు: 15°47′N 80°19′E / 15.78°N 80.32°ECoordinates: 15°47′N 80°19′E / 15.78°N 80.32°E ![]() | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం జిల్లా |
మండలం | వేటపాలెం మండలం ![]() |
విస్తీర్ణం | |
• మొత్తం | 11.14 కి.మీ2 (4.30 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 38,671 |
• సాంద్రత | 3,500/కి.మీ2 (9,000/చ. మై.) |
ప్రాంతీయ ఫోన్ కోడ్ | +91 (08594 ![]() |
పిన్(PIN) | 523187 ![]() |
వేటపాలెం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ప్రకాశం జిల్లాకు చెందిన గ్రామం, వేటపాలెం మండల కేంద్రము. ఈ గ్రామం జీడిపప్పు ఉత్పత్తికి, వ్యాపారానికి పేరు పొందింది. ఆంధ్రలో పురాతనమైన, 1918 లో స్థాపించిన సారస్వత నికేతనం అనబడే గ్రంథాలయం కూడా ఇక్కడే వున్నది.
చరిత్ర[మార్చు]
"వేటపాలెం" పేరును సంస్కృతీకరించి "మృగయాపురి" అని కొన్నిచోట్ల వ్రాస్తారు. ఒకప్పుడు వేటకు అనువుగా ఈ ఊరు ఉండేది అంటారు. "ఎచ్చులకు వేటపాలెం పోతే తన్ని తల గుడ్డ తీసుకున్నారట" అనే సామెతలో ఈ ఊరు ప్రస్తావన వుంది. రంగస్థల నటుడు రావిపాటి శ్రీరామచంద్రమూర్తి ఈ ఊరివారే.
భౌగోళికం[మార్చు]
ఈ గ్రామం సముద్ర తీరం నుండి 4.5 కి.మీ. దూరంలో ఉంది. వేటపాలెం గ్రామం ఒంగోలు - విజయవాడ రైల్వే లైనులో ఉంది. వేటపాలెం గ్రామం చీరాల పట్టణానికి 9 కి.మీ దూరంలో ఉంది. వేటపాలెం కి సమీపంలోనే ఒకనాడు ఆంధ్రదేశానికే మకుటాయమానంగా నిలిచి, దేశ విదేశాలతో కోట్ల రూపాయల వ్యాపారాన్ని జరిపి, నౌకా కేంద్రాల్లో కెల్లా మహానౌకా కేంద్రంగా వెలుగొందిన మోటుపల్లి ఉన్నది. ప్రస్తుతం మోటుపల్లి ఒక సామాన్య కుగ్రామంగా మిగిలిపోయింది.
జనాభావివరాలు[మార్చు]
2011 జనగణన ప్రకారం జనాభా 38,671.[1] 2001 జనాభా లెక్కల ప్రకారం వేటపాలెం జనాభా 37,037.[2] దశాబ్దకాలంలో 4.4 శాతం పెరుగుదల వుంది.
గ్రామ పరిపాలన[మార్చు]
వేటపాలెం గ్రామ పంచాయతీ 1886, ఏప్రిల్-9న ఆవిర్భవించింది. ఆ రోజులలో గ్రామ విస్తీర్ణం 3,178 ఎకరాలు. అప్పట్లోనే మేజర్ పంచాయతీగా, కుటీరపరిశ్రమల కేంద్రంగా విరాజిల్లినది. 17 వార్డులలో, 16,000 జనాభా ఉండేవారు. తరువాత 1987,డిసెంబరు-19న, పురపాలకసంఘంగా గూడా ఎదిగినది. 1988లో ఎన్నికలు నిర్వహించారు. అప్పటివరకూ రు. 3 లక్షలు ఉన్న పన్నులు, రు. 10 లక్షలు అయినవి. దీనితో పౌరసమితిని ఏర్పాటుచేసి, ప్రజలు మునిసిపాలిటీని రద్దు చేయాలని ఉద్యమాలు చేశారు. ఈ నేపథ్యంలో 1992లో చీరాల శాసనసభ్యులుగా పోటీచేసిన కొణిజేటి రోశయ్య మునిసిపాలిటీని రద్దు చేసి, పంచాయతీగా మారుస్తానని ఎన్నికలలో వాగ్దానం చేశారు. ఆ రకంగా, ఇది వేటపాలెం, రామన్నపేట, దేశాయిపేట గ్రామాలతో. కలిసి, మరలా పంచాయతీగా మారిపోయినది,. ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే ఉత్తర ప్రత్యుత్తరాలు, వేటపాలెం మునిసిపాలిటీ పేరిటే జరుగుచున్నవి.
విద్యా సౌకర్యాలు[మార్చు]
సారస్వత నికేతనం[మార్చు]
"సారస్వత నికేతనం" అనే గ్రంథాలయం ప్రపంచ ప్రసిద్ధమైనది. దీన్ని 1918లో వూటుకూరి వేంకట శ్రేష్టి స్థాపించాడు. స్వాతంత్ర్యము రాక ముందు స్థాపించబడిన ఈ గ్రంథాలయము మొదటి నుండి ప్రైవేటు కుటుంబము నిర్వహించే గ్రంథాలయముగానే ఉంది. ఆంధ్ర ప్రదేశ్ లో కెల్ల ఇటువంటి అరుదైన ఏకైక గ్రంథాలయము సారస్వత నికేతనం. ఈ గ్రంథాలయ భవనానికి 1929లో జాతిపిత మహాత్మా గాంధీ శంకుస్థాపన చేశాడు. 1935లో బాబూ రాజేంద్ర ప్రసాద్ దీన్ని సందర్శించి ఆశీర్వదించారు. కట్టడము పూర్తైన భవనాలను సేఠ్ జమ్నాలాల్ బజాజ్, టంగుటూరి ప్రకాశం పంతులు ప్రారంభించారు.తరువాతి రోజుల్లో గాంధీగారు ఆ గ్రంథాలయాన్ని సందర్శించారు.ఆ సందర్భమున వారి చేతి కర్ర అక్కడ విరిగిపోతే దానిని జాగ్రత్తగా భద్రపరిచారు.[3]
ఈ గ్రంథాలయములో పాత పుస్తకాలు, వార్తా పత్రికలు, మేగజిన్లు, పత్రికల విస్తారమైన సేకరణ ఉంది. కొన్ని వార్తాపత్రికలు 1909వ సంవత్సరమునుండి ఉన్నాయి. 70,000కు పైగా సేకరణలు ఉన్న ఈ గ్రంథాలయములో చాలా మటుకు సేకరణలు అరుదైనవి. దేశము నలుమూలల నుండి, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా మొదలైన విదేశాలనుండి పలువురు పరిశోధకులు తమ పరిశోధనా ప్రాజెక్టుల కొరకు ఇక్కడ బస చేసి గ్రంథాలయ వనరులను ఉపయోగించుకొన్నారు. తెలుగులో తొలి యాత్రాచరిత్రగా పేరొందిన ఏనుగుల వీరాస్వామయ్య కాశీయాత్రచరిత్ర గ్రంథాన్ని 1950 ప్రాంతాల్లో పునర్ముద్రించేందుకు ప్రముఖ చరిత్ర పరిశోధకుడు, పుస్తకప్రియుడు దిగవల్లి వేంకటశివరావు ప్రయత్నించగా వేటపాలెం గ్రంథాలయంలోనే మంచి ప్రతి దొరికి పునర్ముద్రణ సాధ్యమైంది.[4]
కళాశాలలు[మార్చు]
- బండ్ల బాపయ్య హిందూ జూనియర్, డిగ్రీ కాలేజి ఉంది. ఇది 1921లో స్థాపించబడింది. ఇక్కడి గొల్లపూడి సీతారామయ్య వసతి గృహములో పేద విద్యార్థులకు ఉచిత భోజన సౌకర్యము కల్పిస్తారు.
- నాయునిపల్లి గ్రామంలో సెయింటాన్స్ ఇంజినీరింగ్ కాలేజి, చీరాల ఇంజినీరింగ్ కాలేజిలు ఉన్నాయి.
- సెయింట్ ఆన్స్ ఇంజినీరింగ్ కాలేజి - చల్లారెడ్డిపాలెం లోని ఒక ఇంజినీరింగ్ కళాశాల
- సెయింట్ యాన్స్ పాలిటెక్నిక్
ఉన్నత పాఠశాలలు[మార్చు]
బండ్ల బాపయ్య హిందు ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల వుంది. మండలం లోని కొత్తపేట గ్రామం లో జిల్లాపరిషత్ హైస్కూల్ అధునాతన సౌకర్యాలతో నిర్మాణం పూర్తి కావడంతో 1000 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు.2018 లో ప్రారంభించిన ఈ పాఠశాల లో విశాల మైన డైనింగ్ హాలు,30 కంప్యూటర్లు గల డిజిటల్ క్లాస్ రూమ్, ఆరు స్క్రీన్లు ఉన్నాయి. క్రీడల్లో కూడా విశేష ప్రాచుర్యం పొందింది.
మౌలిక వసతులు[మార్చు]
మార్కెట్లు[మార్చు]
రెండు పెద్ద మార్కెట్లు ప్రక్క ప్రక్కనే ఉన్నాయి. చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు ఈ మార్కెట్లకి కొనుగోలుకి వస్తూంటారు.
- కూరగాయల మార్కెట్ - అన్ని రకాల కూరగాయలు ఇచ్చట లభించును.
- చేపల మార్కెట్ - ఇందులో అన్ని రకాల సముద్రపు చేపలు, మంచి నీటి చేపలు, రొయ్యలు, ఎండు చేపలు, ఎండు రొయ్యలు, పీతలు, ఎండ్రకాయలు, కోడి మాంసము, వేట (మేక /గొర్రె /పొట్టేలు)మాంసము అమ్మెదరు.
ఆశ్రమములు[మార్చు]
నిత్యావతార దత్తక్షేత్రమ్.
సినిమా థియేటర్లు[మార్చు]
జయలక్ష్మి థియేటర్, రామకృష్ణ థియేటర్, విజయభాస్కర(సరస్వతి) థియేటర్ .
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు[మార్చు]
- శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయం;- ఇక్కడ గడియార స్తంభం సెంటర్ లో ఉన్నది ఇందులోనే కళ్యాణ మండపం కూడా ఉంది. ప్రతి దసరా పండగకి నవరాత్రి ఉత్సవాలను ప్రజలందరి సహకారంతో ఘనంగా జరుపుతారు.
- శ్రీ భోగ లింగేశ్వరస్వామివారి ఆలయo:- ఈ గ్రామంలోని నాయునిపల్లిలో శివాలయం వున్నది.
- శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం.
- శ్రీ కన్యకా పరమేశ్వరీ అమ్మవారి ఆలయం:- ఈ ఆలయంలో ప్రతి రోజూ సహస్ర దీపాలంకరణసేవ నిర్వహించెదరు.
- శ్రీ నాగవరపమ్మ తల్లి ఆలయం.
తిరునాళ్ళ-సంబరాలు-పండుగలు[మార్చు]
- శ్రీ పోలేరమ్మ తిరునాళ్ళ.
- శ్రీ కనక నాగవరపమ్మ తిరునాళ్ళ. (రావూరిపేట)
- హిందువులు అన్ని పెద్ద పండుగలను దేవాలయాలలో, వారి ఇళ్ళల్లో ఘనంగా జరుపుతారు.
- ముస్లింలు రంజాన్, బక్రీద్, పీర్ల పండుగలను ఘనంగా జరుపుతారు.
- క్రైస్తవులు క్రిస్టమస్ పండుగను ఘనంగా జరుపుతారు.
ప్రధాన వృత్తులు[మార్చు]
వ్యవసాయం ప్రధానంగా జీడి తోటలు, మామిడి తోటలపై కేంద్రీకృతమైంది. సముద్రతీరం వుండడంతో రొయ్యల పెంపకం, చేపల పెంపకం కూడా ప్రధాన వ్యవసాయ అనుబంధ వృత్తిగావున్నది.
పరిశ్రమలు[మార్చు]
చేనేత పరిశ్రమలు, జీడి పప్పు పరిశ్రమలు, అగరబత్తి పరిశ్రమలు, తాటి కల్లు పరిశ్రమలు, బీడి పరిశ్రమలు వేటపాలెంలో ముఖ్యమైనని.
మూలాలు[మార్చు]
- ↑ "Village/Town-wise Primary Census Abstract, 2011 - Prakasam District of ANDHRA PRADESH". September 7, 2015.
- ↑ "Primary Census Abstract for Prakasam District of Andhra Pradesh, 2001". September 16, 2016.
- ↑ "Saraswata Niketanam, Vetapalem". Archived from the original on 2010-10-31.
- ↑ వీరాస్వామయ్య, యేనుగుల (1941). కాశీయాత్రా చరిత్ర (PDF) (మూడవముద్రణ ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. Retrieved 26 November 2014.
బయటి లింకులు[మార్చు]
![]() |
Wikimedia Commons has media related to Vetapalem. |