Coordinates: 15°49′N 80°21′E / 15.82°N 80.35°E / 15.82; 80.35

చీరాల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పట్టణం
పటం
Coordinates: 15°49′N 80°21′E / 15.82°N 80.35°E / 15.82; 80.35
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాబాపట్ల జిల్లా
మండలంచీరాల మండలం
Area
 • మొత్తం20.12 km2 (7.77 sq mi)
Population
 (2011)[2]
 • మొత్తం1,72,826
 • Density8,600/km2 (22,000/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
Area code+91 ( 08594 Edit this on Wikidata )
పిన్(PIN)523155 Edit this on Wikidata
WebsiteEdit this at Wikidata

చీరాల, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనిబాపట్ల జిల్లాకు చీరాల మండలంకు చెందిన పట్టణం. వస్త్ర ఉత్పత్తి, వ్యాపారంలో సాధించిన ప్రగతి కారణంగా చీరాల చిన్న బొంబాయిగా పేరుగాంచింది. దగ్గరలోని వాడరేవు పర్యాటక కేంద్రం. పటం

చరిత్ర[మార్చు]

పురపాలక కార్యాలయం
సముద్రతీరం

ఈ పట్టణం పేరు పాత చీరాలకు అసలు పేరైన 'శుద్ధనగరం' నుండి ఏర్పడిందని అంటారు.[3] ఇక్కడ సముద్రము తెల్లగా కనపడుతుంది కావున, ఈ పట్టణాన్ని క్షీరపురి కూడా అంటారు. అయితే ఇవి ఈ పుస్తకాలు రాసిన రోజుల్లో సంస్కృతం పేరు ఉంటేనే గొప్పగా భావించి ప్రాచీనమైన తెలుగు పేర్లను సంస్కృతీకరించడం సర్వసాధారణం కాబట్టి ఈ పేర్లు కూడా అతిసంస్కృతీకరణ (hyper-Sanskritization)కు ఉదాహరణలుగా భావించాలి.

11వ శతాబ్దంలో చోళులు కట్టించిన పురాతన ఆదికేశవస్వామి గుడి ఇక్కడి గుడులలో పురాతనమైనది. 12వ శతాబ్దంలో పలనాటిని పాలించిన హైహయ వంశ పాలకుడైన అనుగురాజు, బ్రహ్మనాయుడితో కలిసి పరివార సమేతంగా పాత చీరాలకు వచ్చినపుడు చెన్నకేశవస్వామి విగ్రహాన్ని, స్వామి దేవేరులు, ఆయుధాలతో సహా ఇచ్చి వెళ్ళాడు. మద్రాసు ప్రాచ్య లిఖిత భాండాగారం లోని రికార్డుల ప్రకారం, శుద్ధనగరాన్ని కాకతి గణపతిదేవ చక్రవర్తి వద్ద మంత్రిగా ఉన్న గోపరాజు రామన్న, చీరాల అనంతరాజుకు సా.శ.1145 లో దానమిచ్చాడు. అతని వారసుడు చీరాల వెంకటకృష్ణుడు ప్రస్తుత చీరాలను కొత్త పట్టణాన్ని నిర్మించేందుకు గాను యాదవులకు కౌలుకిచ్చాడు. నేటి చీరాల పట్టణానికి శంకుస్థాపన విశ్వావసు సంవత్సర వైశాఖ శుద్ధ సప్తమి నాడు 1604లో ఇద్దరు యాదవ ప్రభువులు - మించాల పాపయ్య, మించాల పేరయ్యలు చేశారు.

కొత్త పట్టణంలో 1619 లో వేణుగోపాలస్వామి గుడిని, 1620 లో మల్లేశ్వరస్వామి గుడి కట్టించారు. మరి కొద్దికాలం తరువాత గంగమ్మ గుడి కట్టించారు. 19వ శతాబ్దపు మధ్య కాలంలో చీరాల రామన్న పంతులు ఈ గుడులకు రథాలు తయారుచేయించాడు. బ్రిటిషువారు చీరాలను ఆరోగ్య విడిదిగా భావించేవారు. 1906 లో మొదటగా ఎడ్వర్డు VII పట్టాభిషేక స్మారక ఆసుపత్రి ప్రారంభమైంది. 1912లో బాయరు మిషనరీ ఆసుపత్రి ప్రారంభమైంది.

1923 లో పొగాకు క్యూరింగు కేంద్రాన్ని ప్రారంభంకావడంతో ఈ ప్రాంతంలో చాలా మందికి ఉపాధి ఏర్పడింది. యాంత్రికీకరణకు ముందు, 6,000 మంది వరకు ఇక్కడ పనిచేసేవారు. చేనేతకు పట్టుగొమ్మైన చీరాల 25,000 నుండి 30,000 వస్త్రకారులకు ఉపాధి కల్పిస్తున్నది. ఈ ప్రాంతంలో ఉత్పత్తి అయ్యే ప్రత్యేక నేత వస్త్రానికి మంచి ఎగుమతి మార్కెట్టు ఉంది. 1959 లో సహకార స్పిన్నింగు మిల్లు కూడా ప్రారంభమైంది.

చెన్నై-కోల్‌కతా-ఢిల్లీ ప్రధాన రైలుమార్గంలో ఉన్న చీరాలలో రైల్వే స్టేషను ఏర్పాటయ్యాక, వ్యాపారపరంగా చీరాల అభివృద్ధి చెందింది. ఒకప్పుడు మోటుపల్లి రేవు ద్వారా సముద్ర వ్యాపారం చేసిన పాత చీరాల క్రమేణా ప్రాముఖ్యతను కోల్పోయి, ఓ చిన్న గ్రామంగా మిగిలిపోయింది.

స్వాతంత్ర్య సమరంలో ప్రత్యేక భూమిక పోషించిన చీరాల 2004, ఏప్రిల్ 27 న (వైశాఖ శుద్ధ సప్తమి) 400 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.

చీరాల పేరాల ఉద్యమం[మార్చు]

స్వాతంత్ర్యోద్యమ కాలంలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కాకుండా భారతదేశ చరిత్రలోనే ప్రముఖంగా పేర్కొనే బ్రిటీష్ వ్యతిరేక ఉద్యమంగా పేరుపడిన చీరాల పేరాల ఉద్యమం చీరాలలో దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ఆధ్వర్యంలో జరిగింది. బ్రిటీష్ ప్రభుత్వం 1919లో చీరాల-పేరాల గ్రామాలను కలిపి పురపాలక సంఘంగా చేయడంతో ప్రజలపై పన్నుల భారం అధికమై పురపాలక సంఘం రద్దు చేయాలని ఉద్యమించారు.

ఉద్యమం[మార్చు]

చీరాల, పేరాల గ్రామాల జనాభా ఆ కాలంలో 15000. జాండ్రపేట, వీరరాఘవపేట గ్రామాలను చీరాల, పేరాలతో కలిపి చీరాల యూనియన్ అని వ్యవహరించే వారు. ఈ యూనియన్ నుంచి ఏడాదికి నాలుగు వేల రూపాయలు వసూలయ్యేవి. మద్రాసు ప్రభుత్వం 1919 లో చీరాల-పేరాలను మున్సిపాలిటీగా ప్రకటించింది. పన్ను ఏడాదికి 40,000 రూపాయలయ్యింది. సౌకర్యాలు మాత్రం మెరుగు పడలేదు. ఇక్కడ ఉన్న నేతపని వారు, చిన్నరైతులు పన్ను చెల్లించలేక మున్సిపాలిటీని రద్దు చేయాలని ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు సమర్పించారు. ఫలితం లేదు. దాంతో వారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో ఆందోళన ప్రారంభించారు. గోపాలకృష్ణయ్య వేయిమంది సభ్యులతో రామదండు అనే వాలంటీర్ సంస్థను ఏర్పాటు చేశారు. విజయవాడ కాంగ్రెస్ సమావేశాల సందర్భంగా గాంధీ వచ్చినపుడు గోపాలకృష్ణయ్య ఆయనకు సమస్య వివరించాడు. గాంధీ చీరాలను సందర్శించి ఊరు ఖాళీ చేసిపోతే మున్సిపాలిటీ దానంతట అదే రద్దవుతుందనే ఆలోచన చెప్పాడు. గోపాలకృష్ణయ్య చీరాల, పేరాల ప్రజలను ఊరు ఖాళీచేయించి[4] దాని పొలిమేర అవతల రామ్‌నగర్ పేరుతో కొత్త నివాసాలు ఏర్పర్చాడు. అక్కడ 11 నెలలపాటు కష్ట నష్టాలని ప్రజలు అనుభవించారు. ఉద్యమానికి కావలసిన విరాళాలను సేకరించడానికి గోపాలకృష్ణయ్య బరంపురం వెళితే ప్రభుత్వం ఆయన్ను నిర్భందించి ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష విధించింది. దీంతో చేసేదేమీ లేక ప్రజలు తమ నివాసాలకు తిరిగి వెళ్ళాల్సి వచ్చింది.

విద్యా సౌకర్యాలు[మార్చు]

ప్రస్తుత ఎన్.ఆర్ అండ్ పీ.మున్సిపల్ ఉన్నత పాఠశాల 1912లో ప్రథమాంగ్ల పాథశాలగా స్థాపించబడింది. చారిత్రాత్మక చీరాల-పేరాల స్వాతంత్ర్య పోరాటంలో గాంధీ మహాత్ముని సూచనమేరకు, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో 18 వేల ప్రజానీకమంతా పట్టణాన్ని వదలి వెళ్ళిపోవడం వలన-పాఠశాల 1921లోమూతపడి మరల 1924లో మునిసిపల్ మిడిల్ స్కూల్గా పునःప్రారంభమైంది. 1928లో మొట్టముదటి యస్.యస్.యల్.సి బ్యాచ్ విద్యార్థులు ఈ స్కూల్ నుండి పబ్లిక్ పరీక్షకు హాజరైనారు. 2004లో ఈ స్కూల్ అశీతి (80) వసంతోత్సవాలను ప్రధానోపాధ్యాయులు చంగవల్లి సత్యనారాయణ శర్మ సారథ్యంలో ఘనంగా జరుపుకున్నది. వివిధ రంగాలలో లబ్ధప్రతిష్ఠులైన ఎన్.ఆర్.అండ్.పి.మున్సిపల్ ఉన్నత పాఠశాల పూర్వవిద్యార్థులలో జి.వి.జి.కృష్ణమూర్తి, ప్రగడ కోటయ్య, వెంకట్ చంగవల్లి (సిఈఓ,108 అంబులెన్స్) ఉన్నారు.

1946లో కస్తూరిబా గాంధీ మునిసిపల్ గరల్స్ ఉన్నత పాఠశాల స్థాపించబడింది.దీన్ని టంగుటూరి ప్రకాశం పంతులు ప్రారంభించాడు. 1948లోఎన్.ఆర్.ప్.యమ్ ఉన్నత పాఠశాలలో గాంధీ విగ్రహాన్నిప్రతిష్ఠించారు. 1951లో పేరాలలో ఆంధ్రరత్న మున్సిపల్ ఉన్నత పాఠశాల స్థాపించబడింది.

ఇంజనీరింగ్ కళాశాలలు[మార్చు]

  1. వి.ఆర్.ఎస్. అండ్ వై.ఆర్.ఎన్. కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ: 1951లో స్థాపన
  2. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్
  3. చీరాల ఇంజనీరింగ్ కాలేజి

రవాణా సౌకర్యాలు[మార్చు]

చీరాల రైల్వే స్టేషన్

చీరాల ప్రముఖ రవాణా కూడలి. పిడుగురాళ్ల-వాడరేవును కలిపే జాతీయ రహదారి 167A చీరాల గుండా పోతుంది. చెన్నయ్-హౌరా రైలు మార్గములో ఈ పట్టణం ఉంది. రైల్వే స్టేషన్, బస్సు స్టేషన్ పక్క పక్కనే వుండడంతో ప్రయాణీకులకు సౌకర్యంగా వుంటుంది. ఇక్కడి రైల్వే స్టేషన్లో ప్లాట్ఫారములు చేరటానికి లిఫ్టు సదుపాయం కూడావుంది.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

వాడరేవు[మార్చు]

  • ఓడరేవు: ఇక్కడికి 9 కి.మీ దూరంలో సముద్రతీరం, ఓడరేవు.

శ్రీ రేణుకాదేవి అమ్మవారి ఆలయం[మార్చు]

చీరాల పట్టణంలోని బోస్‌నగర్‌లో గల పురాతన ఆలయం. ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో బహుళ పాడ్యమి నుండి బహుళ పంచమి వరకు, ఐదు రోజులపాటు, ఈ ఆలయంలోని అమ్మవారి తిరునాళ్ళు వైభవంగా నిర్వహిస్తారు. మొదటి రోజున 108 కలశాలతో అమ్మవారికి అభిషేకాలు నిర్వహించెదరు. రెండవ రోజు సాయంత్రం సామూహిక కుంకుమార్చనలు మూడవరోజు సాయంత్రం అమ్మవారి తిరునాళ్ళ మహోత్సవం, నాల్గవ రోజున అమ్మవారికి 108 రకల ప్రసాదాల నైవేద్యం, ఐదవ రోజున అన్నసంతర్పణ, హారతుల సమర్పణతో సేవలతో ఉత్సవాలు ముగింపుకు చేరుకుంటవి. ఈ వేడుకలకు గుంటూరు, ప్రకాశం జిల్లాల నుండి భక్తులు అధికసంఖ్యలో విచ్చేయుదురు. ముఖ్యముగా ఒంగోలు, పరుచూరు, బాపట్ల, అ చుట్టు ప్రక్కల గ్రామాలనుండి వేలాదిగా తరలి వచ్చెదరు.[5]

శ్రీ మల్లీశ్వరాలయం[మార్చు]

17వ శతాబ్దానికి చెందిన ప్రాచీన శివాలయం ఇది.ఇక్కడి స్థల పురాణం ప్రకారం ఈ ఆలయాన్ని అగస్త్య మహర్షి ప్రతిష్ఠించాడు. మెకంజీ కైఫీయతుల ప్రకారము ఈ ఆలయంలో 1620, రౌద్రి నామ సంవత్సరం మాఘ శుద్ధ సప్తమి గురువారం నాడు విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ఈ ఆలయంలో ఈశ్వరునికి ఈశాన్యమున భ్రమరాంబా దేవి విగ్రహం ఉంది. ఈ ఆలయంలో వినాయకుడు, నందీశ్వరుల విగ్రహాలు కూడా ఉన్నాయి. నందీశ్వరుని విగ్రహం మైసూరులో చాముండేశ్వరి ఆలయంలో ఉన్న నందీశ్వరుని పోలివుంది. ఈ ఆలయానికి దక్షిణం వైపున వీరభద్రుని ఆలయం ఉంది. ఆలయ ప్రాంగణంలో తూర్పున నవగ్రహాలు ఉన్నాయి. వాయవ్యదిశలో షణ్ముఖ ఆలయం ఉంది. ఇక్కడ ప్రతి శుక్రవారం అమ్మవారికి పూజలు జరుపబడుతుంది. కార్తీక మాసంలోను, గణపతి నవరాత్రి ఉత్సవాలు, షణ్ముఖ జయంత్యుత్సవాలు, పార్వతీ కళ్యాణము, వల్లీ కళ్యాణములు ఇక్కడ అత్యంత వైభవంగా జరుగుతాయి. ప్రతిదినము ఈ ఆలయంలో పురాణాది సత్కాలక్షేపాలు జరుగుతాయి.[6]

చిత్రమాలిక[మార్చు]

ఇవీ చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. ఆంధ్ర ప్రదేశ్ జిల్లాల జనగణన దత్తాంశ సమితి - పట్టణాలు (2011), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q58768667, archived from the original on 15 March 2018
  2. Error: Unable to display the reference properly. See the documentation for details.
  3. చీరాల చరిత్రము (వ్రాతప్రతి). 1921.
  4. "ఆంధ్రప్రదేశ్ దర్శిని, 1982 ప్రచురణ, పేజీ 83". {{cite journal}}: Cite journal requires |journal= (help)
  5. "ఈనాడు ప్రకాశం 7వపేజీ". 2017-03-14.
  6. అచ్యుతుని, బాలకృష్ణమూర్తి (16 February 1980). "చీరాల మల్లీశ్వరాలయం". ఆంధ్రపత్రిక దినపత్రిక. No. సంపుటి 66, సంచిక 313. Retrieved 21 January 2018.[permanent dead link]

వెలుపలి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=చీరాల&oldid=4045311" నుండి వెలికితీశారు