హైహయ వంశము
హైహయ వంశము ఒక పురాణాలలోని ప్రసిద్ధమైన వంశము. మహావిష్ణువు లక్ష్మీదేవి అశ్వం రూపంలో ఉండగా జన్మించిన హైహయుని ద్వారా ఈ వంశం వృద్ధిచెందినది. కార్తవీర్యార్జునుడు ఈ వంశానికి చెందిన వీరుడు. హయము అనగా అశ్వము.
పురాణ కథనం
[మార్చు]సూర్యుని కుమారుడు రేవంతుడు ఉచ్చైశ్రవం మీద వైకుంఠానికి వస్తుండగా చూసిన లక్ష్మీదేవికి మనోవికారం కలిగింది. గమనించిన విష్ణుమూర్తి బడబ (ఆడగుర్రము) గా భూలోకంలో జన్మించమని శాపమిస్తాడు. కలత చెందిన లక్ష్మీదేవి ప్రార్థించగా, తనకు పుత్రుడు జన్మించిన తరువాత శాపవిమోచనమౌతుందని అనుగ్రహిస్తాడు. భూలోకానికి వచ్చిన లక్ష్మి తమసా కాళింది నదుల సంగమ స్థలంలో శివున్ని ధ్యానిస్తూ కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేసింది. శివుని కోరిక మేరకు విష్ణువు అశ్వరూపుడై భూలోకంలో లక్ష్మిని చేరి ఆనందంగా విహరించారు. కొంతకాలానికి లక్ష్మీదేవి దివ్య సుందరుడైన కొడుకును ప్రసవించింది. ఆమెకు శాపవిమోచనమై వైకుంఠం చేరినది.
యయాతి కొడుకు యదువు పుత్ర సంతతికై తపస్సు చేస్తున్నాడు. విష్ణువు ప్రత్యక్షమై తాను సృష్టించిన పుత్రున్ని తెచ్చు పెంచుకొమ్మని ఆనతిస్తాడు. ఆ శిశువుకు జాతకర్మాదికం చేసి ఏకవీరుడు అని నామకరణం చేశాడు. ఇతనికి హైహయుడు అని పేరు కూడా ఉంది. ఇతడు రభ్యుని కూతురైన ఏకావళిని వివాహం చేసుకున్నాడు. వీరికి కలిగిన కుమారుడు కృతవీర్యుడు. కృతవీర్యుని కొడుకు కార్తవీర్యార్జునుడు.
చారిత్రిక అభిప్రాయాలు
[మార్చు]హైహయులు తాము యదువంశపు రాజులమని చెప్పుకొన్నారు. హరి వంశము (34.1898) గ్రంథం ప్రకారం ఐదు హైహయ వంశముల వారు కలిసి తాళజంఘులని (విష్ణు పురాణము (4.11) అన్నారు. ఆ వంశాలు - వితిహోత్రులు, శర్యాతులు (శర్యాతి సంతతి), భోజులు, అవంతీయులు, తుండికేరులు. వీరు పశ్చిమ భారతం నుండి మధ్యభారతం (మాళ్వా ప్రాంతం) కు వలస వెళ్ళారు. వారిలో మహిష్మంతుడు స్థాపించిన మహిష్మతీ నగరం (హరి వంశం 33.1847) తరువాత వారి రాజధాని అయ్యింది. అదే ఇప్పటి "మహేశ్వర్" పట్టణం. మహిషుడనేవాడు ఈ నగరాన్ని స్థాపించాడని పద్మ పురాణము (6.115) లో ఉంది. హైహయులలో గొప్ప రాజైన కార్త వీర్యార్జునుడు "కర్కోటక నాగుడు" నుండి ఈ నగరాన్ని గెలుచుకొని తన రాజధాని చేసుకొన్నాడు. హైహయుల విజయ పరంపరలో ఉత్తరదేశ దండయాత్రలకు ఇక్ష్వాకు రాజైన సగరుడు అడ్డుకట్ట వేసి ఉండవచ్చును. కార్తవీర్యార్జుని మనుమడు, తాళజంఘుని కొడుకు అయిన వీతిహోత్రుని పేరుమీద హైహయులలో వీతిహోత్రులు ముఖ్య వంశమైంది. వీతిహోత్రుని కాలంలో వింధ్యకు ఇరువైపులా ఉన్న ప్రాంతం మహిష్మతి, ఉజ్జయిని రాజధానులుగా రెండు విభాగాలై ఉండవచ్చును. వీతిహోత్రుల చివరి రాజైన రిపుంజయుని అతని మంత్రి పులికుడు చంపేశాక పులికుని కొడుకు ప్రద్యోతనుడు రాజై ఉండవచ్చును (మత్స్య పురాణము 5.37). హైహయులు వేదవిద్యా పారంగతులని చెబుతారు.[1] నాగవ రాజ్యం అంతమైనాక ఆ రాజు వంశస్థుడు పురోహితుడైనాడు.[2] మధ్యయగంలో హైహయులు ముస్లిం రాజులతో యుద్ధాలకు తలపడి ఉండవచ్చును.[3]
ఇవి కూడా చూడండి
[మార్చు]- ఆంగ్ల వికీ వ్యాసం en:Heheya Kingdom