చీరాల పేరాల ఉద్యమం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చీరాల పేరాల ఉద్యమ పితామహుడు - దుగ్గిరాల గోపాలకృష్ణయ్య

చీరాల పేరాల ఉద్యమం స్వాతంత్ర్యోద్యమ కాలంలొ ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కాకుండా భారతదేశ చరిత్రలోనే ప్రముఖంగా పేర్కొనే బ్రిటీష్ వ్యతిరేక ఉద్యమంగా పేరుపడినది. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో ఉన్న చీరాలలో దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ఆధ్వర్యంలో జరిగింది. బ్రిటీష్ ప్రభుత్వం 1919లో చీరాల-పేరాల గ్రామాలను కలిపి పురపాలక సంఘంగా చేయడంతో ప్రజలపై పన్నుల భారం అధికమై పురపాలక సంఘం రద్దు చేయాలని ఉద్యమించారు.

ప్రకాశం జిల్లాలో ఉన్న చీరాల, పేరాల గ్రామాల జనాభా ఆ కాలంలో 15000. జాండ్రపేట, వీరరాఘవపేట గ్రామాలను చీరాల, పేరాలతో కలిపి చీరాల యూనియన్ అని వ్యవహరించే వారు. ఈ యూనియన్ నుంచి ఏడాదికి నాలుగు వేల రూపాయలు వసూలయ్యేవి. మద్రాసు ప్రభుత్వం 1919 లో చీరాల-పేరాలను మున్సిపాలిటీగా ప్రకటించింది. పన్ను ఏడాదికి 40,000 రూపాయలయ్యింది. సౌకర్యాలు మాత్రం మెరుగు పడలేదు. ఇక్కడ ఉన్న నేతపని వారు, చిన్నరైతులు పన్ను చెల్లించలేక మున్సిపాలిటీని రద్దు చేయాలని ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు సమర్పించారు. ఫలితం లేదు. దాంతో వారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో ఆందోళన ప్రారంభించారు. గోపాలకృష్ణయ్య వేయిమంది సభ్యులతో రామదండు అనే వాలంటీర్ సంస్థను ఏర్పాటు చేశారు. విజయవాడ కాంగ్రెస్ సమావేశాల సందర్భంగా గాంధీ వచ్చినపుడు గోపాలకృష్ణయ్య ఆయనకు సమస్య వివరించాడు. గాంధీ చీరాలను సందర్శించి ఊరు ఖాళీ చేసిపోతే మున్సిపాలిటీ దానంతట అదే రద్దవుతుందని ఆలోచన చెప్పాడు. గోపాలకృష్ణయ్య చీరాల, పేరాల ప్రజలను ఊరు ఖాళీచేయించి[1] దాని పొలిమేర అవతల రామ్‌నగర్ పేరుతో కొత్త నివాసాలు ఏర్పర్చాడు. అక్కడ 11 నెలలపాటు కష్ట నష్టాలని అనుభవించారు. ఉద్యమానికి కావలసిన విరాళాలను సేకరించడానికి గోపాలకృష్ణయ్య బరంపురం వెళితే ప్రభుత్వం అతనిని నిర్భందించి ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష విధించింది. దీంతో చేసేదేమీ లేక ప్రజలు తమ నివాసాలకు తిరిగి వెళ్ళాల్సి వచ్చింది.

మూలాలు[మార్చు]

  1. ఆంధ్రప్రదేశ్ దర్శిని, 1982 ప్రచురణ, పేజీ 83

వెలుపలి లంకెలు[మార్చు]