కాశీ కృష్ణాచార్యులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కాశీ కృష్ణాచార్యులు

కాశీ కృష్ణాచార్యులు(1872-1967)“అవధాని శిరోమణి” బిరుదు అందుకున్న సంస్కృతాంధ్ర విద్వాంసులు, అనేక భాషలు నేర్చిన పండితులు. సంగీతం, వీణ, వేణువు,వయోలిన్ మృదంగాది వాద్యాలు, వడ్రంగం, కుమ్మరం, నేత, ఈత, వంటకం, వ్యాయామం, కుస్తి, గారడీ మొదలైన చతుష్షష్ఠి కళలన్నీ నేర్చిన మహా మనీషి.[1]

జీవిత విశేషాలు

[మార్చు]

వీరు కవి, పండితులు మాత్రమే కాదు, అవధానులు, సంగీత విద్వాంసులు కూడ. వీరు సంస్కృత భాషా బోధనకు, ప్రచారానికి జీవితాంతం పాటుపడిన వ్యక్తి. గుంటూరు హైస్కూలులో సంస్కృత పండిత పదవిని నిర్వహించారు. వీరి శిష్యులు పండ్రంగి రామారావు ఎఫ్.ఎ.చదువుతూ శతావధానాన్ని నిర్వహించడం వీరి చలవే.శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి మరణానంతరం 1961లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆస్థానకవి పదవిని చేపట్టి 1967లో మరణించేవరకు ఆ పదవిని అలంకరించారు. 1965లో ఆంధ్ర విశ్వవిద్యాలయము వీరిని కళాప్రపూర్ణ బిరుదుతో సత్కరించింది.

అవధానాలు

[మార్చు]

వీరి మొదటి అష్టావధానం వినుకొండలో జరిగింది. ఆ తరువాత వీరు వాడరేవు, పర్లాకిమిడి, పొదిలి, పామూరు మొదలైన చోట్ల సంస్కృతాంధ్రాలలో అష్టావధానాలు, మక్థల, ఉడిపి, కాశీ మొదలైన చోట్ల సంస్కృతావధానాలు, బందరులో శతావధానము, గద్వాల, వనపర్తి, ఆత్మకూరు, వేంకటగిరి, పిఠాపురం, నూజివీడు, శ్రీకాళహస్తి, విజయనగరం మొదలైన సంస్థానాలలో అవధానాలు, ఆశుకవితా ప్రదర్శనలు నిర్వహించారు.[2]

వీరు సమస్యాపూరణములలో కష్టముగా నున్నట్లు తోచినప్పుడు,హయగ్రీవస్వామిని ప్రార్థించెడివారట. అట్టి ఒక పద్యము-

భావమునందు నిన్నెపుడు బాసి యెఱుంగని వాడనయ్య, యో
పావన నామధేయ, నను బాలను ముంచిన నీట ముంచినన్
నీవ గదయ్య, దిక్కితరునిన్ మఱి వేడగబోవ నో హయ-
గ్రీ వవధాన వార్ధి నను రేవును జేర్పుము నీకు మ్రొక్కెదన్

వీరు ప్రతి ప్రదర్శనమునకు ముందు, ఉపన్యాసమునకు ముందు అశ్వధాటి వృత్తములో స్తుతి చేయు వారట. అల్లసాని పెద్దన ఆశుకవిత్వ చంపకమాలిక సుప్రసిద్ధమైనది. దానికి దీటుగ చెప్పదలచి ఆచార్యులు తలచి ఈ మాలికను ఆశువుగా చెప్పినారు.

పొలుపుల లొల్కులే ముగుద మొల్క చనుంగవఁ బోలెఁగుల్కు బె
ళ్కులు గల మేలి కైతము దెలుంగునఁ బల్కెడు కల్కిచిల్క ప
ల్కులవలె వీనుదోయికిఁ దగుల్కొనఁ గావలెఁ జూలు గోలము
ద్దుల నునుచెక్కుటద్దములతోరపు బొద్దుగ పూఁతరంగౌ ని
నిగ్గుల పన రెమ్మె వాల్గనుల కోపునఁ దారసిలన్వలె, న్మదిన్
దలఁచినఁ దుంట వింటి సరదారుని సేఁతల సోలియాడు ని
మ్ముల చెలికాని మోవివలె ముచ్చటగావలెఁ బంట నంటినన్
వలపున నీను కప్రపు టనంటుల బోదెల చాటుచాటునన్
దొలిపొలయల్క మోముపయిఁదోపఁగఁ జూపులవాడి తూపులం
జిలికెడు కుల్కులాడి జిగిఁజిల్కు హొయల్వెలిజారు పైటలో
పల వలఁ జిక్కు జక్కవకవ న్బురుదించెడు దబ్బ గుబ్బ యు
బ్బుల వెలయింపఁగా వలయుఁ బొమ్ము! తెలుంగునగైఁత లిమ్ముగన్
విలసదమర్త్యవాఙ్మయ కవిత్వమునాన్, భుజగేంద్రభూషణో
జ్జ్వలమణిరుగ్జటాపటల సంవిలుఠద్దివిషత్తరంగిణీ
చలదురు వీచికా నికర శబ్దధణంధణ ధం ధణార్భటీ
కలన నొసంగగావలె నొకానొకయప్పుడు, పద్మసంభవ
ప్రళయ మహార్ణవోత్పత దభంగురభంగ మృదంగనాద సం
కలిత కృతాన్తరాట్చరణఘాత దళద్దృహిణాండ నిస్సరత్
పెళపెళ సాధ్వసధ్వనుల బింకము నొక్కయెడ,న్ముహుర్ముహు
ర్లలదరవింద బృంద మకరంద నిరంకుశ పాన మత్త తుం
దిలిత మిళింద ఝంకృతి గతిన్మఱి యెక్కెడ, నింకనొక్కెడన్
లలిత సరస్వతీచరణ లాస్య చలన్నవ శింజినీఝళం
ఝళుల పసందుఁ జూపవలె ఝల్లున రాలెడు పూలతేనె వా
నల నలరారుమాధురిఁ గనన్బరుపంవలెఁ గొన్ని వేళలన్...

వీరి అవధాన పద్యాలలో కొన్ని:

ద్వైతము లుబ్ధ సుఖద మ-
ద్వైతము తస్కర సుఖప్రదంబు, విశిష్టా-
ద్వైతము యాత్రిక సుఖదము,
భూతలమున మొత్తమునకు మూడును మెఱుగే

  • సమస్య: నీహారాద్రిని నిప్పుకొండయని పాండిత్యంబు దీపింపగన్

పూరణ:

ఓహోహో! యిది వెండి కొండయని నేనూహించితిన్మున్ను, నేఁ
డూహింప న్విలసన్నటేశ్వర నిటాలోద్భుత ధూమావళీ
వ్యూహంబున్గని తర్కశాస్త్రగతి నేనూహించి సాధించితిన్
నీహారాద్రిని నిప్పుకొండయని పాండిత్యంబు దీపింపగన్

  • దత్తపది: కీర - వైర - హార - భార అను పదాలనుపయోగించి విరహ వర్ణన

పూరణ:

కీరమునెక్కి మన్మథుడు కేల సుమాస్త్రము బూని బాలికన్
వైరముతోడ గొట్టుట కవారిగ బాఱుచు నుండ దానికిన్
హారము భారమాయెను, విహారమునుం గడు దూరామాయె నీ
భారము సుమ్ముబాల నికఁ బాలను ముంచిన నీటముంచినన్

మూలాలు

[మార్చు]
  1. ప్రసాదరాయ, కులపతి. కవితా మహేంద్రజాలమ్. హైదరాబాదు: డాక్టర్ కులపతి షష్టిపూర్తి అభినందన సమితి. Retrieved 18 July 2016.
  2. రాపాక, ఏకాంబరాచార్యులు. "అవధాన విద్యాధరులు". అవధాన విద్యా సర్వస్వము (ప్రథమ ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. pp. 128–134.

యితర లింకులు

[మార్చు]