Jump to content

అజీవకులు

వికీపీడియా నుండి
మహాకశ్యపుడు (ఎడమ వైపు చివరలో వున్న వ్యక్తి) ఒక అజీవకునితో బుద్ధుని పరినిర్వాణం గురించి తెలియచేయడం [1]

క్రీ.పూ.6 వ శతాబ్దంలో అంటే వర్ధమాన మహావీరుడు, గౌతమ బుద్ధుని కాలంలోనే సాంస్కృతిక తిరుగుబాటుకు ప్రేరణ కలిగిస్తూ ప్రజలలో భౌతికవాదాన్ని ప్రచారం చేసిన అవైదిక మత శాఖలలో అజీవకమతం ప్రసిద్ధమైనది. భౌతికవాద దార్శనికుడైన మక్ఖలి గోశాలుడు అజీవక మతాన్ని స్థాపించాడు. అజీవక మతాన్ని అవలంబించే వారిని అజీవకులు అంటారు. బౌద్ధ గ్రంథాలలో పేర్కొనబడ్డ ఆరుగురు ప్రసిద్ధ తీర్ధంకరులలో రెండవ వాడు మక్ఖలి గోశాలుడు. ఇతను మహావీరుని, గౌతమ బుద్ధుని సమకాలికుడు. వైదిక మత విశ్వాసాలకు వ్యతిరేకంగా భౌతిక వాదాన్ని ప్రచారం చేసిన అజీవక మతాన్ని తోటి అవైదిక మతాలైన జైన, బౌద్ధ మతాలు ప్రత్యర్థి మత శాఖ గానే గుర్తించి విమర్శించాయి. జైన బౌద్ధ మతాల వలె క్రీ.పూ. 6 వ శతాబ్దం లోనే వెలసిన ఈ అజీవక మతం మౌర్యసామ్రాజ్య కాలంలో ఉచ్చస్థితిలో వుండి తదనంతరకాలంలో క్షీణిస్తూ సా.శ. 14 వ శతాబ్దానికి తమిళ దేశంలో నామ మాత్రంగా ఉనికిని నిలబెట్టుకొంది.

అజీవక మత శాఖను స్థాపించినవాడుగా మక్ఖలి గోశాలుని పేర్కొంటారు. అయితే కొందరు గోశాలుడికి పూర్వమే అజీవక శాఖ ఉనికిలో వున్నదని నంద వచ్చ, కిశ సాంకిచ్చ (కృత సాంకృత్య) అనే ప్రచారకులు ఈ అజీవక శాఖకు ఆద్యులని, మక్ఖలి గోశాలుడు ఈ అజీవక శాఖకు చివరి తీర్ధంకరుడని అభిప్రాయ పడ్డారు.

ఆధార గ్రంధాలు

[మార్చు]

అజీవకుల బోధించిన భౌతికవాద సూత్రాలను తెలిపే మూల ఆధార గ్రంథాలు స్పష్టంగా లభించలేదు. తూర్పు ప్రాకృత భాషలో వ్రాయబడినవిగా భావిస్తున్న అజీవకుల మూల ఆధార గ్రంథాలు బహుశా ధ్వంసమై పోయి ఉండవచ్చు. మతస్థాపకుడైన మక్ఖలి గోశాలుని గురించి అతని తాత్విక ధోరణి గురించి ఉటంకించిన కథనాలు, వ్యాఖ్యలు జైన గ్రంథాలైన భగవతి సూత్ర, సూత్రక్రుతాంగ; బౌద్ధ గ్రంథాలైన దిఘ నికాయ, మధ్యమ నికాయ, అంగుత్తర నికాయ, బుద్దఘోషుని “సుమంగళ విలాసిని” మొదలగు గ్రంథాలలో లభిస్తాయి. తమిళ గ్రంథాలైన బౌద్ధుల "మణి మేఖలై", జైనుల "నీలకేశి", శైవుల "శివజ్ఞానసిద్ధియార్" ఈ మూడు గ్రంథాలు అజీవకుల సిద్ధాంతాల గురించి స్థూలంగా వివరిస్తాయి. సా.శ. 9 వ శతాబ్దానికి చెందిన నీలకేశి తమిళ గ్రంథంలో కథా నాయిక నీలకేశి సత్యాన్వేషణలో భాగంగా బుద్ధుని, పురాణ కాశ్యపుని, అజీవక మత శాఖ ప్రచారకులను సందర్శించినట్లుగా పేర్కొనబడింది.

అజీవకమత ఆవిర్భావానికి నేపథ్యం

[మార్చు]

క్రీ. పూ. 6 వ శతాబ్దం నాటికి సమాజంలో భావవాదం వ్యవస్థీకృతమైంది. భావవాద తత్వ భావనలతో పెనవేసుకొన్న వైదికమతం సమాజంపై పూర్తి ప్రాబల్యం వహించింది. వైదికమతంలో బ్రాహ్మణ పురోహిత వర్గం, మత పరంగాను, మతేతర రంగంలలోను కూడా మిగిలిన సామాజిక వర్ణాలపై ఆధిపత్యం చెలాయిస్తూ వచ్చారు. అర్ధరహితమైన ఆడంబరయుతమైన వైదిక మత కర్మ కాండల పట్ల నిరసన, యజ్న యాగాదుల పేరిట హరించుకుపోతున్న పశు సంపద, కోట్లకు పడగలెత్తినా సామాజిక గౌరవానికి నోచుకోని వైశ్యుల అసంతృప్తి, మోక్ష సాధనామార్గాలు అందుబాటులో లేని సామాన్యుల అసంతృప్తి, పరాకాష్ఠకు చేరిన బ్రాహ్మణాధిక్యత ఇత్యాదికారణాలు క్రీ. పూ. 6 వ శతాబ్దంలో భారత ఆధ్యాత్మిక రంగంలో తీవ్రమైన అశాంతిని కలుగచేసాయి.

దీనికి తోడు క్రీ. పూ. 6 వ శతాబ్దం నాటికి సమాజంలో నూతన ఆర్థిక వ్యవస్థలు అనేక రూపాలలో (నూతన స్థిర వ్యవసాయిక విధానం, నగరాల వృద్ధి, చేతివృత్తుల అభివృద్ధి, వాణిజ్య అవకాశాల వృద్ధి) అనేక విధాలుగా విస్తరించాయి. ఈ దశలో వచ్చిన సామాజికమార్పులకు అనుగుణంగా భావవాద తత్వ భావనలతో కూరుకుపోయిన వైదిక మతం మారడానికి ప్రయత్నించలేదు. కాలం గడుస్తున్న కొలదీ, సమాజానికి కావలిసిన భౌతిక, ప్రాపంచిక అవసరాలను పరిగణన లోనికి తీసుకోవడానికి వైదికమతం తిరస్కరిస్తూనే వచ్చింది. సమాజం ఎదుర్కొంటున్న క్లిష్ట సమస్యలను పరిష్కరించడంలో వైదిక మతం పూర్తిగా విఫలమైంది. మారుతున్న సమాజంలో రోజూవారి జీవితం గడపడంలో ఎదుర్కొటున్న పలు సమస్యలకు ఆత్మ-దేవుడు-మోక్షం-యజ్ఞం వంటి భావనలతోనే కూరుకుపోయిన వైదిక మతం పరిష్కారాలు చూపలేని స్థితిలో వుంది సరికదా మారుతున్న సమాజానికి వైదిక మతం తానే ఒక ప్రతిబంధకంగా మారిపోయింది. అందువలన మారుతున్న వ్యవసాయ ఆధారిత, వాణిజ్యావసర సమాజపు దైనందిక అవసరాలను తీర్చగలిగే, ప్రాపంచిక వ్యవహారాలకు అనుకూలమైన భౌతికవాద తత్వ ఆవశ్యకత సమాజానికి కలిగింది.

ఈ విధంగా బ్రాహ్మణాధిక్యతతో నిండిన వైదిక మత సిద్దాంతాలకు విసుగు చెందిన సామాన్య ప్రజలు, వైశ్యులు కొత్త మత విధానానికి, కొత్త జీవితమార్గాలను అన్వేషించే ప్రయత్నం చేయసాగారు. సమాజంలో నెలకొన్న ఆధ్యాత్మిక అశాంతికి పరిష్కారంగా ఆలోచనాపరులు అనేక విధాల తమ వంతు పరిష్కార మార్గాలను సూచిస్తూ సమాజానికి క్రొత్త ఆలోచనలను అందించే ప్రయత్నాలు ప్రారంభించారు. ఇటువంటి ప్రయత్నాలలో భాగంగా వైదిక మతం పట్ల అసంతృప్తులైన కొంతమంది ఆలోచనాపరులు (ఉపనిషత్కర్తలు) అరణ్యాలకు పోయి తాత్విక చింతన సాగించారు. వీరు యజ్నయాగాదులని నిరసిస్తూనే సామరస్య ధోరణితో దేవుని, మోక్షాన్ని అంగీకరించారు. మరికొంతమంది ఆలోచనాపరులు (మక్ఖలి గోశాలుని వంటి భౌతికవాదులు) యజ్న యాగాదులను నిరసిస్తూనే ఉపనిషత్కర్తలబోధనలకు విరుద్ధంగా కనిపించని దేవునికోసం, మోక్షం కోసం ప్రయాసపడటం కూడా వృధా అనే భావనతో సమాజాన్ని భౌతికవాదం వైపు, ఇహలోక విషయాలవైపు మలచడానికి ప్రయత్నించారు. ఆ రోజులలో భౌతికవాదాన్ని బోధించడం అంటే వేద ప్రామాణ్యాన్ని, వైదిక మతాన్ని తిరస్కరించడమే. అంటే అవైదిక వాదమే.

ఈ విధంగా క్రీ. పూ. 5,6 వ శతాబ్దాలలో వైదిక మతంపై నిరసనగా దేశంలో అవైదిక మతాన్ని బోదిస్తూ అనేకానేక అవైదిక మత తెగలు తమ తమ వాదనలతో ప్రచారం చేస్తుండేవి. ఒక విధంగా ఆధ్యాత్మిక అశాంతికి పరిష్కారంగా అనేక తాత్విక చింతనలు సిద్ధాంతాలు బయలుదేరాయి. అనేక మంది తత్వ వేత్తలు తమ తమ సిద్ధాంతాలతో, వాదనలతో ఎదుటి మత సిద్దాంతాలను ఖండిస్తుంటే మరికొంతమంది బలపరుస్తూ వచ్చారు. వ్యక్తీ-ఆత్మ-దేవుడు-యజ్ఞం-కర్మ-మోక్షం-శూన్యం-ఔన్నత్యం-ప్రకృతి ల గురించి అనేక సిద్ధాంతాలు బయలుదేరి, వాటి వాద ప్రతివాదనలతో ఆధ్యాత్మిక రంగంలో అయోమయ పరిస్థితి నెలకొంది. వర్ధమాన మహావీరుని, గౌతమ బుద్ధుని కాలం నాటికి దేశంలో 62 మత శాఖలున్నట్లు బౌద్ధ గ్రంథాలు పేర్కొంటే 363 శాఖలున్నట్లు జైన గ్రంథాలు పేర్కొన్నాయి శంకరాచార్యులు 72 మత శాఖలను ఖండించారని చరిత్ర చెప్తోంది. ఈ "ఆధ్యాత్మిక అశాంతి" నేపథ్యంలోనే మక్ఖలి గోశాలుడు తన అనునూయులైన అజీవకులతో ప్రజలకు అవైదిక మతాన్ని బోధిస్తూ, భౌతికవాదాన్ని ప్రచారం చేసాడు.

అజీవకుల జీవన శైలి

[మార్చు]

అజీవకులు దిగంబర సంప్రదాయం పాటించేవారు. పూర్తి దిగంబరంగా కాకుండా చాపలు చుట్టుకునేవారని, నెమలి ఈకల గుత్తులు ధరించేవారని మరొక ప్రతీతి. వీరు వ్యక్తిగత జీవితంలో చాలా నియమ నిష్ఠలు పాటించేవారు. మద్యం, మాంసం లాంటి పంచ 'మకారాలు' నిషేధించారు. ఎవరైనా తమంతట తాము బిక్ష వేస్తె తప్ప బిచ్చం ఎత్తేవారు కారు. ఆహారం ఎలా వున్నా పట్టించుకొనేవారు కారు. ఆహారంలో నెయ్యి నిషిద్దం. తాము స్వయంగా ఇంద్రియ నిగ్రహం కఠోరంగా పాటించేవారు. తమ నియతి వాదాన్ని బోదిస్తూ దేశమంతటా సంచార జీవితం గడిపేవారు.

నిజానికి 'అజీవక' అనే పదంతో వీరిని ప్రత్యర్థి మతాలే ఉటంకించాయి. అజీవక మత స్థాపకుడైన మక్ఖలి గోశాలుడు ముక్తి కోసం సన్యసించలేదని, జీవనోపాధి (అజీవ) కోసం సన్యసించాడని జైనులు దూషిస్తూ, అతని అనుచరులను అజీవకులు ( మక్ఖలి గోశాలుని జీవన శైలిలో వుండేవారు) గా పిలిచేవారని తెలుస్తుంది.

అజీవకుల బోధనలు

[మార్చు]

శ్రావస్తి నగరాన్ని కేంద్రంగా చేసుకొని గంగ మైదాన ప్రాంతాలలో విస్తృతంగా పర్యటిస్తూ పదహారు సంవత్సరాల పాటు ప్రజలలో నియతి వాదాన్ని బోదిస్తూ, మక్ఖలి గోశాలుడు అజీవక మత ప్రచారం సాగించాడు. జైనులు, బౌద్ధులతో సమానంగా అజీవకులకు నాడు ప్రజాదరణ వుండేదని తెలుస్తుంది.

  • అజీవకుల మతానికి మౌలిక సూత్రం నియతి వాదం (Determinism). ప్రపంచమంతా నియతి ప్రకారమే జరుగుతుంది. సృష్టి లోని ప్రతి చర్య నియతిప్రకారమే జరుగుతుంది తప్ప మానవ ప్రమేయం ఏమీలేదు. అందువలన కర్మ అనేది అవాస్తవం అని వీరు బోధించారు. అజీవక మత శాఖను స్థాపించిన మక్ఖలి గోశాలుడు ఈ నియతి వాదాన్ని ప్రతిపాదించాడు.
  • నియతి వాదం ప్రకారం జగత్తు అంతా ముందు గానే నిర్ణయించినట్లు ప్రకారమే జరుగుతుంది. దానిని ఎవరూ మార్చలేరు. మానవ ప్రయత్నం ఏదీ కూడా ‘విధి’ని మార్చలేదు. మానవుడు కేవలం నిమిత్త మాత్రుడు మాత్రమె. అందరూ ‘నియతి’ ప్రకారం నడుచుకోవాల్సిందే. ఇదే నియతివాదం.
  • ఈ నియతివాదంలో మానవుడు కేవలం నిమిత్త మాత్రుడు మాత్రమే. అతని చేతులలో ఏమీ లేదు. యాదృచ్ఛికంగా పుణ్యం కలగవచ్చు. లేదా పాపం కలగవచ్చు. పాప పుణ్యాలలో అతని ప్రమేయమేమీ లేదు. మంచి చేసినా పుణ్యం కలుగక పోవచ్చు. చెడు చేసినా పాపం కలుగక పోవచ్చు. అంటే మంచి చేసినా ప్రయోజనం లేదు. చెడు చేసినా నష్టం లేదు. కనుక వీరి దృష్టిలో సమాజం-వ్యక్తి ప్రయత్నించవలసినదేమీ లేదు. దాని వలన ఆహితమే కలుగుతుంది
  • సృష్టి లోని ప్రతి చర్య నియతి ప్రకారమే జరుగుతుంది తప్ప మానవ ప్రమేయం ఏమీలేదు. అందువలన కర్మ అనేది అవాస్తవం అని వీరు బోధించారు. ఈ విషయంలోనే అజీవక మతం, కర్మను అంగీకరించిన సమకాలిక జైన, బౌద్ధ మతాలతో నిరంతర ఘర్షణ పడింది.
  • ప్రతి జీవి యొక్క అస్తిత్వం ఆ జీవి యొక్క స్వభావ సామర్ధ్యాల మీద కాకుండా నియతి సూత్రంపై ఆధారపడి వుంటుంది. మానవ ప్రమేయం లేకుండానే ప్రాపంచిక ఘటనలు (events) సంభావించడమో, సంభవించకపోవడమో జరుగుతుంది. ఈ విధంగా అజీవకులను అదృష్టవాదులు (Fatalists) అని కూడా పిలవచ్చు.జీవి యొక్క సుఖ దుఖాలు అదృష్టాలనుసరించి వుంటాయి
  • వైదిక మత విశ్వాసాలకు వ్యతిరేకంగా భౌతికవాద సూత్రాలను బోధించారు.
  • జైనులు, బౌద్ధులు వలె అజీవకులు కూడా నాస్తికవాదులు (నిరీశ్వరవాదులు). వేద ప్రామాణ్యాన్ని తిరస్కరించి వైదికమతాన్ని నిరసించారు.
  • ప్రకృతిలో ప్రతీది (జీవులు, వస్తువులు) జన్మిస్తూ మరణిస్తూ తిరిగి జన్మిస్తూ వుంటాయి. ఈ విధంగా ప్రతీది 84 లక్షల మహాకల్పాల పాటు జన్మలు ఎత్తుతుంది. చివరికి జినత్వం చెంది, మోక్షం పొందుతుంది. అంటే సృష్టిలో ప్రతీది చిట్ట చివరకు తీర్ధంకరుడు అవుతుంది. అయితే ఎప్పుడు అవ్వాలో అప్పుడే అవుతుంది తప్ప దానిని వేగిరపరచడం లేదా ఆలస్యం చేయడం అనేది ఆ వస్తువు లేదా జీవి స్వభావంలో గాని, సామర్ధ్యంలో గాని, చేతల్లో గాని ఏమీ లేదు.
  • అనగా ఏ ప్రాణి ఎప్పుడు మోక్షం పొందాలో అప్పుడు పొందుతుంది. దానిని త్వరితం చేయలేము. ఆలస్యము చేయలేము. నివారించానూ లేము. మంచి పనులు చేయడం వలన దాన్ని త్వరితం చేయలేము. చెడ్డ పనులు చేయడం వలన దానిని ఆలస్యమూ చేయలేము. అసలు మన చేతులలో ఏమీ లేదు. ఎప్పుడు మోక్షం పొందాలో అప్పుడే వస్తుంది తప్ప అంతకు ముందు ఎంత గింజుకొన్నా ఏమీ ప్రయోజనం లేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే అజీవకులు మోక్ష సాధనకై మానవ ప్రయత్నం వృధా అని తేల్చి చెప్పినట్లయ్యింది. అందుకే మోక్ష సాధనకై (జైనుల ప్రకారం 'కేవల జ్ఞానం' పొందడానికై, బౌద్ధుల ప్రకారం 'నిర్వాణం' పొందడానికై) మానవుడు ఆచరించాల్సిన పనులను సూచించిన జైన, బౌద్ధ మతాలు ‘అసలు మోక్ష సాధనకై ప్రయత్నించడమే వృధా’ అని చెప్పినందుకు మక్ఖలి గోశాలుని బోధనలను తీవ్రంగా విమర్శించాయి.
  • అజీవకులు జైనులవలె ప్రతీ జీవిలోనూ ఆత్మ వుంటుంది అని విశ్వసిస్తారు. అయితే జైనులు విశ్వసించేది నిరాకార ఆత్మ అయితే వీరిది సాకార ఆత్మ. ఈ సాకార ఆత్మ, ఆ జీవి ఎత్తే అనేకానేక జన్మలలో ప్రవేశిస్తూ తుదకు జినత్వం చెంది, మోక్షం పొందుతుంది అని విశ్వసిస్తారు.

జైన, బౌద్ద మతాలతో ఘర్షణ - కారణాలు

[మార్చు]

వైదిక మత విశ్వాసాలను, మత కర్మకాండలను, యజ్న యాగాదులను తిరస్కరిస్తూ వచ్చినవే అజీవక, జైన, బౌద్ధాలు. ఈ మూడు మతాలూ మౌలికంగా అవైదిక దర్శనాలే. నాస్తిక మతాలే. అయినప్పటికీ జైన బౌద్ధ మతాలు నిరంతరం అజీవక మతంతో ఘర్షణ పడ్డాయి. అజీవక దర్శనాన్ని విమర్శించడంలో జైన బౌద్ధ మతాలు పోటీ పడి మరీ వారి బోధనలను ఖండిస్తూ తమ తమ గ్రంథాలలో అనేక విధాలా హేళన చేసాయి.

కర్మను అంగీకరించిన జైన బౌద్ధ మతాలు, కర్మను అవాస్తవం అంటూ నియతి వాదాన్ని బోధించే అజీవక మతాన్ని ఖండించాయి. అంతేకాక కార్యా కారణ సిద్దాంతాన్ని నిరాకరించినందుకు, క్రియలకు (మంచి పనులకు, చెడ్డ పనులకు) నైతిక బాధ్యత కల్పించకపోవడాన్ని, మోక్ష సాధనలో వాటికి ప్రాధాన్యత లేనందుకు అనగా మోక్షసాధనలో మానవ ప్రమేయం లేదన్నందుకు మహావీరునితో పాటు, గౌతమ బుద్ధుడు కూడా మక్ఖలి గోశాలుని (అజీవకుల) నియతివాదాన్ని విమర్శించారు. సమాజంలో మానవ నీతికి అమిత ప్రాధాన్యం ఇచ్చే జైన బౌద్ధ మతాలు అజీవకుల జీవన శైలిని ఖండించారు.

  • మతం – క్రియలు - నైతికత ఈ మూడూ పెనవేసుకొన్న నాటి సమాజంలో మతంలో పెనవేసుకుపోయిన భావవాదానికి ప్రత్యమ్నాయంగా అజీవకులు భౌతికవాదాన్ని బోధించారు. అయితే క్రియలకు, నైతికతకు మద్య గల సున్నితమైన సంబంధాన్ని సమతౌల్యంగా వివరించలేకపోయారు. ఫలితంగా వీరి బోధనలలో నడవడికి- నైతికతకు మద్య తార్కికంగా సమన్వయం కుదరక పోవడంతో మనిషి నడవడి దృష్ట్యా నైతికతకు అమిత ప్రాధాన్యత నిచ్చిన జైన బౌద్ధ మతాలు వీరిని ఖండించే అవకాశం కలిగింది.

తాత్విక చింతనలో సామాజిక నీతి ఒక ముఖ్యాంశంగా వున్న ఆ కాలంలో భౌతికవాదులందరూ (అజీవకులు, చార్వాకులుతో సహా) నీతి నియమాలపై మౌనం వహించారు. వైయుక్తికంగా వీరు నియమనిష్ఠలతో కూడిన జీవన శైలి అవలంబించినప్పటికి సామాజికంగా మానవులను నీతి మార్గానికి మరలించే అంశాలు వీరి బోధనలలో భాగం కాలేకపోయాయి వీరి బోధనాతర్కంలో సామాజిక నీతికి దారి చూపే మార్గం మూసుకుపోయినట్లయ్యింది. వర్ణ వ్యవస్థను తిరస్కరించి వైదిక మత దుర్నీతిని తులనాడిన వీరు అదే సమయంలో సమాజ హితానికి అవసరమైన నీతినియమాలను ఒక ప్రత్యమ్నాయంగా ప్రజలకు తెలియ చేయడంలో తాత్వికంగా మౌనం పాటించారు. అందుకే సమాజంలో మానవ నీతికి అమిత ప్రాధాన్యం ఇచ్చే జైన బౌద్ధ మతాలు మొదటి నుంచీ అజీవకులను ఖండిస్తూనే వచ్చారు.

  • అజీవకుల నియతివాదం ప్రకారం ఏ ప్రాణి ఎప్పుడు మోక్షం పొందాలో అప్పుడే పొందుతుంది తప్ప ఆ మోక్షం పొందడాన్ని మనం త్వరితం చేయలేము. ఆలస్యము చేయలేము. నివారించానూ లేము. మంచి పనులు చేయడం వలన దాన్ని త్వరితం చేయలేము. చెడ్డ పనులు చేయడం వలన దానిని ఆలస్యమూ చేయలేము. అసలు మన చేతులలో ఏమీ లేదు. ఎప్పుడు మోక్షం పొందాలో అప్పుడే వస్తుంది తప్ప అంతకు ముందు ఎంత గింజుకొన్నా ఏమీ ప్రయోజనం లేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే అజీవకులు మోక్ష సాధనకై మానవ ప్రయత్నం వృధా అని తేల్చి చెప్పినట్లయ్యింది. అందుకే మోక్ష సాధనకై మానవుడు ఆచరించాల్సిన పనులను సూచించిన జైన, బౌద్ధ మతాలు ‘అసలు మోక్ష సాధనకై ప్రయత్నించడమే వృధా’ అని చెప్పినందుకు అజీవకుల బోధనలను తీవ్రంగా విమర్శించాయి.

సా.శ.2వ శతాబ్దానికి చెందిన అశోకవదన గ్రంథం ప్రకారం బౌద్ధం లోకి మారిన తరువాత అశోకుడు బుద్ధుని ప్రతికూల దృష్టితో చిత్రించిన చిత్రం పట్ల కోపోద్రికుడై పుండ్రవర్ధన లోని అజీవకులంరిని చంపమని ఆజ్ఞ ఇచ్చినట్లు, తత్ఫలితంగా అశోకుని కోపాగ్నికి 18,000 మంది అజీవకులు సంహరించబడ్డారని పేర్కొంది. అయితే బౌద్ధంలోకి మారిన అశోకుని కాలంలో అజీవకులకు లభించిన ప్రాధాన్యం గమనిస్తే ఈ వ్యాఖ్యలు నమ్మశఖ్యంగా కనిపించవు.

మౌర్యుల కాలంలో అజీవకులు

[మార్చు]

మొదటినుంచీ సమకాలీన జైనులు, బౌద్ధులు అజీవకులను ప్రమాదకరమైన ప్రత్యర్థులుగా పరిగణించడం బట్టే అజీవకులకు గల ప్రజాదరణ, సమాజంలో వారికి గల ప్రాధాన్యత ఎక్కువని మనకు తెలియవస్తుంది. మౌర్యుల కాలంలో అజీవకులు ఉచ్చస్థితిలో ఉన్నారు. బిందుసారుడు, అతని పట్టపు రాణి శుభద్రాంగి అజీవక మతాన్ని స్వీకరించారు. మౌర్య చక్రవర్తి అశోకుని 7వ స్తంభ శాసనం ప్రకారం అశోకునిచే పోషించబడ్డ మతాల ప్రాధాన్యతా క్రమంలో బౌద్ధులు, బ్రాహ్మణులు తరువాత 3 వ స్థానంలో అజీవకులు ఉన్నారు. దీనిని బట్టి అశోకుని కాలానికి జైనుల కన్నా అజీవకులే ప్రాధాన్యం వహించారని తెలుస్తుంది.

మౌర్య చక్రవర్తులు అశోకుడు, దశరథులు అజీవకుల ఆశ్రమాల కోసం బుద్ధుదు జ్ఞానోదయం చెందిన బోధిగయకు సమీపంలో గల కొండలను తొలిచి నిర్మించిన బరాబర్ గుహలు, నాగార్జుని గుహలు, సీతామర్హి గుహలును దానం చేసారు. మౌర్యకాలపు తళతళ, నునుపుదనం ఈ కొండ గుహాలయాలలోని గోడలలో కనిపిస్తాయి. అజీవకులకు దానంగా ఇవ్వబడిన ఈ గుహాలయాలే భారతదేశంలో కొండలను తొలిచి నిర్మించిన అతి ప్రాచీనమైన తొలి రాతి గుహాలయాలు. మౌర్య చక్రవర్తులు అశోకుడు, దశరథుల యొక్క శిలాశాసనాలు ఈ రాతి గుహలలో కనిపిస్తాయి.

దక్షిణ భారత దేశంలో అజీవకులు

[మార్చు]

క్రీ.పూ. 2వశతాబ్దం తరువాత ముఖ్యంగా శుంగ రాజుల కాలం నుండి ఉత్తర భారతదేశంలో అజీవకుల ప్రస్తావనలు అంతగా కనిపించవు. తదనంతరకాలంలో క్షీణిస్తూ దక్షిణ భారతదేశంలో సా.శ. 14 వ శతాబ్దానికి తమిళ దేశంలో నామ మాత్రంగా ఉనికిని నిలబెట్టుకొన్నారు. దక్షిణ భారతదేశంలో అజీవకులకు కర్ణాటక లోని కోలారు జిల్లా కేంద్రస్థానమైంది. కాలక్రమంలో అజీవకులు ఇతర మత శాఖలలో కలసిపోయారు. బెంగాల్లో భక్తీ మార్గాన్ని అంగీకరించి కొందరు అజీవకులు వైష్ణవ సంప్రదాయాన్ని స్వీకరించారు. దక్షిణ భారతదేశంలో (కర్ణాటక, తమిళనాడు) మాయా వాదాన్ని అంగీకరించి మహాయాన బౌద్ధానికి తొలుత చేరువైనారు. తమ మత నాయకుడైన మక్ఖలి గోశాలుని బుద్ధ అక్షోభయ అవతారంగా భావించారు. చివరకు శైవానికి చేరువై మక్ఖలి గోశాలుని శివుని అవతారంగా భావించారు. మరికొంతమంది దిగంబర జైన శాఖలో విలీన మయ్యారు.

జైన మతంపై అజీవకుల ప్రభావం

[మార్చు]
  • ఒకప్పటి వర్ధమాన మహావీరుని సహచరుడు, శిష్యుడు అయిన మక్ఖలి గోశాలుడు ఆదినుంచి దిగంబరుడిగానే సంచరించేవాడని, ప్రారంభంలో వస్త్రాలు ధరించిన మహావీరుడు తరువాత దిగంబరత్వం లోకి మారడానికి దిగంబర శిష్యుడైన మక్ఖలి గోశాలుని ప్రభావం వుంది అని భద్రబాహుని “కల్పసూత్రం” ద్వారా తెలుస్తుంది. అజీవక మత స్థాపకుడైన మక్ఖలి గోశాలుడు కఠోరంగా పాటించిన నగ్న సంప్రదాయం, మహావీరుని తదనంతరకాలలో దిగంబర జైనులను అమితంగా ప్రభావితం చేసింది. తద్వారా జైన మతంలోని ఒక ప్రధాన శాఖకు దిగంబరమే చిహ్నంగా నిలిచింది.
  • బిక్ష పాత్రను వర్జించి, రెండు అరచేతులను పాత్రలా దగ్గరకు మడిచి ఆహారాన్ని స్వీకరించే విధానాన్ని మక్ఖలి గోశాలుని ద్వారా దిగంబర జైనులు స్వీకరించారు.

వైదిక మతంపై అజీవకుల ప్రభావం

[మార్చు]
  • అజీవకులు వైశేషిక దర్శనం పేర్కొన్న అణు సిద్దాంతాన్ని ప్రభావితం చేసారు. అజీవకుల ప్రకారం కూడా ప్రతీది అణువుల నిర్మితం. అణువుల సంయోగం చేత పదార్దం సృష్టించబడుతూ ఉంటుంది. అణువుల యొక్క గుణాలు, సంయోగాన్ని అనుసరించి పదార్థం యొక్క గుణాలు మారుతూ ఉంటాయి. అయితే నియతివాదానికి అనుగుణంగా అణువుల సంయోగాలు వాటివల్ల ఏర్పడిన పదార్ధ గుణాలు మునుముందుగానే నిర్ణయమై వుంటాయి అని అజీవకులు భావించారు.
  • A.L. భాషం ప్రకారం అజీవకులు వైదిక మతం లోని ద్వైత సిద్ధాంతాన్ని ప్రభావితం చేసి ఉండవచ్చు.


సంప్రదించిన పుస్తకాలు

1. History and Doctrines of The Ajivikas by A.L. Basham 2. The Ajivikas by B.M. Barua 3. The Riddle of the Jainas and Ajivikas in early Buddhist Literature by Johannes Bronkhorst 4. Ajivika by Jarl Charpentier 5. Ashoka in Ancient India bynayanjot lahiri 6. Hindus an Alternate History by Wendy Doniger

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Marianne Yaldiz, Herbert Härtel, Along the Ancient Silk Routes: Central Asian Art from the West Berlin State Museums ; an Exhibition Lent by the Museum Für Indische Kunst, Staatliche Museen Preussischer Kulturbesitz, Berlin, Metropolitan Museum of Art, 1982 p. 78

ఆధారాలు

[మార్చు]
  • History and Doctrines of the Ajivikas, a Vanished Indian Religion - A.L.Basham
  • The Culture & Civilization of Ancient India- D.D. Kosambi
  • ప్రాచీన భారత దేశ చరిత్ర – రామ్ శరణ శర్మ
  • భారతీయ సంస్కృతి -ఏటుకూరు బలరామమూర్తి (V.P.H.-1993)
  • విశ్వ దర్శనం, భారతీయ చింతన – నండూరి రామమోహన రావు
  • Ajivika (https://en.wikipedia.org/wiki/%C4%80j%C4%ABvika)

ఇతర లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=అజీవకులు&oldid=4009328" నుండి వెలికితీశారు