Coordinates: 25°00′18″N 85°03′47″E / 25.005°N 85.063°E / 25.005; 85.063

బరాబర్ గుహలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బరాబర్ గుహలు
బరాబర్ గుహలు, మెట్లు, గృహ ద్వారం
బరాబర్ గుహలు is located in Bihar
బరాబర్ గుహలు
భారతదేశంలోని బిహార్ లో ఉనికి
ఇతర పేర్లుబరాబర్, సాత్ఘర్వ
స్థానంజహానాబాద్ జిల్లా, బిహార్, భారతదేశం
నిర్దేశాంకాలు25°00′18″N 85°03′47″E / 25.005°N 85.063°E / 25.005; 85.063
రకంరాతి గుహలు
ఇందులో భాగంబరాబర్, నాగార్జున కొండలు
చరిత్ర
స్థాపన తేదీక్రీ. పూ. 322–185

భారతదేశంలో కొండలను తొలిచి నిర్మించిన రాతి గుహలలో అత్యంత పురాతనమైనవి బరాబర్ గుహలు.[1] ఇవి బిహార్ లోని గయ జిల్లాలో వున్నాయి. క్రీ.పూ. 3 వ శతాబ్దానికి చెందిన ఈ రాతి గుహలు మౌర్య చక్రవర్తుల కాలం నాటివి.[2] ఈ గుహలలో మౌర్య చక్రవర్తులు అశోకుడు, అతని మనుమడు దశరథుడు లకు చెందిన శిలా శాసనాలు లభించాయి. ఈ గుహలను మౌర్య చక్రవర్తులు తొలిపించి అజీవకులకు దానంగా ఇచ్చారు.

ఉనికి[మార్చు]

బరాబర్ గుహలు (నాలుగు గుహలు), నాగార్జుని గుహలు (మూడు గుహలు) బిహార్ లోని గయకు 16 మైళ్ళ దూరంలో ఫల్గు నదికి ఎడమ ఒడ్డున గల బరాబర్ కొండలలో, నాగార్జుని కొండలలో వున్నాయి. బరాబర్ గుహలలో సుదామ గుహ, లోమస్ రుషి గుహ, కరణ్ చౌపర్ గుహ, విశ్వా జోప్రి అనే నాలుగు గుహలు వున్నాయి. ఈ గుహలలో సుదామ గుహ, లోమస్ రుషి గుహలు భారతదేశంలో కొండలను తొలిచి చేసిన శిలా వాస్తు నిర్మాణాలకు తొలి ఉదాహరణలు. [2][3] నాగార్జుని గుహలలో గోపికా గుహ, వహిమ గుహ, వేదాంతి అనే మూడు గుహలు వున్నాయి. అయితే ప్రస్తుతం ఈ బరాబర్ ప్రాంతంలో కూడా అనేక శిలలను తొలిపించి నిర్మించిన బౌద్ధ, హిందూ శిల్పాలు వెలసి ఉన్నాయి.[4]

ముఖ్యాంశాలు[మార్చు]

 • బరాబర్ గుహలు భారతదేశపు తొలి ప్రాచీన రాతి గుహలు. (క్రీ.పూ. 3వ శతాబ్దానికి చెందినవి)
 • మౌర్య చక్రవర్తులు అశోకుడు, దశరథుడు వీటిని నిర్మించి అజీవక శాఖకు చెందిన శ్రమణులకు దానంగా ఇచ్చారు.
 • ఈ రాతి గుహలను శిలాఖందానికి నేరుగా (parallel to the surface of the rock) తోలిచారు. లంబరేఖా రూపంలో (perpendicular) తొలచలేదు.
 • ఈ రాతిగుహాల గోడలు మౌర్యుల కాలపు తళతళ నునుపుదనాన్ని (Polish) కలిగివున్నాయి.
 • అప్పటికీ మహాయానశాఖ ఏర్పడనందువల్ల ఈ రాతిగుహలలో బుద్ధుని శిల్పం కనిపించదు. దానికి బదులుగా ఆరాధనకు వాడే స్థూపం (otive stupa) కనిపిస్తుంది.
 • బరాబర్ గుహలకు చెందిన రాతి శిల్పంలో కొయ్య నిర్మాణానికి చెందిన వాస్తురీతి ప్రతిఫలించింది. నేర్పరియైన వడ్రంగి పనితనం ఈ గుహల రాతికట్టడంలో రమణీయంగా అనుకరించబడింది.
 • మౌర్యుల వాస్తు శిల్పకళకు ఉదాహరణగా బరాబర్ రాతి గుహలు నిలుస్తాయి.
 • బరాబర్ రాతి గుహలలో వెలసిన మౌర్యుల శిల్పం, మౌర్యుల తరువాత కొనసాగిన శిల్పకళపై ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది.

బరాబర్ గుహలు[మార్చు]

బరాబర్ కొండలలో తొలిచిన రాతి గుహల సాధారణ దృశ్యం
బరాబర్ కొండలలో తొలిచిన సుదామ, లోమస్ రుషి గుహలు 1870 లో తీసిన ఫోటో
లోమస్ రుషి గుహ
లోమస్ రుషి గుహ 1875 లో తీసిన ఫోటో

బరాబర్ కొండ గుహలలో మొత్తం నాలుగు గుహలున్నాయి.

 • సుదామ గుహ
 • లోమస్ రుషి గుహ
 • కరణ్ చౌపర్ గుహ
 • విశ్వ జోప్ర గుహ

ఈ గుహలలో సుదామ గుహ, లోమస్ రుషి గుహలు భారతదేశంలో కొండలను తొలిచి చేసిన శిలా వాస్తు నిర్మాణాలకు తొలి ఉదాహరణలు. [2][3] వీటిలో సుదామ గుహ, కరణ్ చౌపర్ గుహలలో అశోకుని శిలా శాసనాలు లభ్యమవుతున్నాయి. మొత్తం మీద బరాబర్ గుహలన్నీ ఒకే నిర్మాణ రీతిలో వున్నాయి. ఈ గుహలను శిలా ముఖభాగానికి సమాంతరంగా (face of the rock) నిర్మించడం ఒక ప్రత్యేక లక్షణం. ఈ గుహలలో ప్రవేశ మార్గాలు సమలంబ చతుర్భుజ (trapezoidal) ఆకారంలో వున్నాయి. ప్రతీ గుహకు సాధారణంగా దీర్ఘచతురస్త్రాకారపు హాలు (Hall), వర్తులాకారపు దేవగృహం (Cell) వున్నాయి.[5] వీటి పైకప్పులు పీపాకారంలో (barrel vaulted roof) వున్నాయి.హాలుకు దేవగృహాన్ని కలుపుతూ ఒక ప్రవేశ ద్వారం కలదు. ఈ గుహల లోపలి కుడ్యభాగాలు అద్దంలాగ మెరిసే నునుపుదనాన్ని (polish) కలిగి వున్నాయి.

సుదామ గుహ[మార్చు]

ఈ గుహకు దీర్ఘ చతురస్త్రాకారపు హాలు వుంది. దానిపై పీపాకారపై కప్పు (barrel vaulted roof) వుంది.[6] దేవగృహం (Cell) మాత్రం గుండ్రంగాను, దాని పైకప్పు గుండ్రంగాను వుంది. సుదామ గుహలోనే అతి ప్రాచీనమైన అశోకుని శిలా శాసనం కనిపిస్తుంది. దీన్ని బట్టి అశోక చక్రవర్తి తను రాజ్యానికి వచ్చిన 12 వ పాలనా సంవత్సరంలో (క్రీ. పూ. 252 లో) ఈ గుహను నిర్మించి అజీవకులకు దానంగా ఇచ్చినట్లు తెలుస్తుంది.

లోమస్ రుషి గుహ[మార్చు]

ఈ గుహకు కూడా ఒక దీర్ఘ చతురస్త్రాకారపు హాలు వుంది. దానిపై పీపాకారపై కప్పు (barrel vaulted roof) వుంది. దేవగృహం (Cell) మాత్రం కోడిగుడ్డు (oval) ఆకారంలో, దాని పైకప్పు పీపా ఆకారంలో వుంది. ఈ గుహలో శిలా శాసనం లేదు. ఈ గుహ ప్రవేశ ద్వారం కొయ్యతో నిర్మించిన కట్టడం యొక్క వాస్తు రీతిని పోలి వుంది. సునిశితమైన వడ్రంగి పనితనం ఈ గుహకు సంబందించిన రాతి కట్టడంలో అందంగా అనుకరించబడింది.[5] దీని ప్రవేశ ద్వారపు పైభాగంలో ఒక వరుసలోని ఏనుగు జంటలు ఎదురెదురుగా స్తూపాన్ని ఆరాదిస్తున్నట్లు చెక్కబడ్డాయి. [7]

కర్ణ చౌపర్ గుహ[మార్చు]

ఇది 33 X 14 అడుగుల విస్తీర్ణం గల ఒక దీర్ఘచతురాస్త్రాకారపు హాలును, అత్యంత నునుపైన (polish) గోడలను కలిగివుంది. దీనిలో అశోకుని శిలా శాసనం కనిపిస్తుంది. దీని ద్వారా అశోక చక్రవర్తి తను రాజ్యానికి వచ్చిన 19 వ పాలనా సంవత్సరంలో (క్రీ. పూ. 245 లో) ఈ గుహను తొలిపించినట్లు తెలుస్తుంది.

విశ్వా జోప్రి గుహ[మార్చు]

ఇది రెండు దీర్ఘచతురాస్త్రాకారపు గదులను కలిగివుంది.[8]

నాగార్జుని గుహలు[మార్చు]

బరాబర్ కొండకు సమీపంలో గల నాగార్జుని కొండలో 3 గుహలు వున్నాయి. బరాబర్ గుహలతో పోలిస్తే ఇవి చిన్నవి మాత్రమే కాక తరువాత కాలానికి చెందినవి.[9]

 • గోపికా గుహ
 • వపియ గుహ
 • వేదాంతి గుహ

గోపికా గుహ[మార్చు]

ఇది అశోకుని మనుమడు మౌర్య చక్రవర్తి దశరథుని కాలంలో క్రీ.పూ. 204 లో తొలచి నిర్మించబడింది.ఇది మౌర్యులు తొలిపించిన ఆఖరి గుహ. దీనిలో 46 అడుగుల పొడవు గల హాలు వుంది. దీనిపై పీపాకార పైకప్పు (barrel vaulted roof) వుంది. ఇది విహారం కావచ్చు.

వపియ గుహ[మార్చు]

ఈ గుహలో కూడా ఒక దీర్ఘచతురాస్త్రాకారపు హాలు, దాని ముందు ఒక అర్ధ మండపం వుంది.

వేదాంతి గుహ[మార్చు]

ఈ గుహ ఒక గుడిసె (toda) లాగా కనపడుతుంది.

రాతిగుహలలో మౌర్యుల వాస్తు శిల్పం-ప్రభావం[మార్చు]

బరాబర్ గుహలు దక్షిణాసియాలో శిలా వాస్తు నిర్మాణ (రాక్-కట్ ఆర్కిటెక్చర్) సంప్రదాయాన్ని బాగా ప్రభావితం చేశాయి.[10] బరాబర్ గుహలు, నాగార్జుని గుహలు తరువాత కాలంలో భారతదేశంలో వెలసిన అనేక రాతి గుహలకు మార్గదర్శకంగా నిలిచాయి. అప్పటిదాకా వాస్తుశిల్పాలకు కొయ్యను ఉపయోగించిన మౌర్యులు తొలిసారిగా రాతిగుహలలో వాస్తు శిల్పాలను చెక్కడం ప్రారంభించారు. అయితే మౌర్యుల వాస్తు శిల్పానికి ఉదాహరణగా నిలిచిన బరాబర్ రాతి గుహలు, అందలి మౌర్య శిల్పం ఆ మౌర్యుల తరువాత కొనసాగిన శిల్పకళపై ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. కారణం మౌర్య చక్రవర్తుల అభిరుచులకు, సిద్ధాంతాలకు అనుగుణంగా రూపుదిద్దుకొన్న మౌర్యశిల్పం మాదిరిగానే బరాబర్ రాతి గుహలలో నిర్మించిన మౌర్య వాస్తు శిల్పం కూడా ప్రజాదరణను పొందలేదు. అందువలన మౌర్యుల పతనానతరం వారి వాస్తుకళ కూడా అంతరించిపోయింది. అయితే వాస్తు శిల్పాలకు శిలలను తొలిసారిగా ఉపయోగించడం, కొండలను తొలిచి రాతి గుహలను ప్రప్రధమంగా నిర్మించడాలు భారతీయ వాస్తు శిల్పకళకు మౌర్యులు చేసిన గొప్ప సేవగా పేర్కొనవచ్చు.

చిత్రమాలిక[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

 1. Culture of peace[permanent dead link] Frontline magazine, Volume 25 – Issue 18 :: 30 August – 12 September 2008.
 2. 2.0 2.1 2.2 "Sculptured doorway, Lomas Rishi cave, Barabar, Gya". www.bl.uk (in ఇంగ్లీష్). Retrieved 11 May 2017.
 3. 3.0 3.1 Architectural history www.indian-architecture.info. Archived 2008-09-14 at the Wayback Machine
 4. "Rock sculptures at Barabar". www.bl.uk (in ఇంగ్లీష్). Retrieved 11 May 2017.
 5. 5.0 5.1 F. R. Allchin,, George Erdosy. The Archaeology of Early Historic South Asia: The Emergence of Cities and States (1995 ed.). Cambridge University Press. p. 247.{{cite book}}: CS1 maint: extra punctuation (link)
 6. "Sudama [and] Lomas Rishi Caves at Barabar [Hills], Gya". www.bl.uk (in ఇంగ్లీష్). Retrieved 11 May 2017.
 7. "Part of the elephant frieze over the doorway at the Barabar caves. 1790". www.bl.uk (in ఇంగ్లీష్). Retrieved 11 May 2017.
 8. "Rocky outcrop with Karna Chowpar cave, Barabar Hills". www.bl.uk (in ఇంగ్లీష్). Retrieved 11 May 2017.
 9. "Barabar and Nagarjuna Caves". Archived from the original on 2009-07-17. Retrieved 2017-09-29.
 10. "Entrance to one of the Barabar Hill caves". www.bl.uk (in ఇంగ్లీష్). Retrieved 11 May 2017.