అక్షాంశ రేఖాంశాలు: 24°41′42″N 84°59′29″E / 24.695102°N 84.991275°E / 24.695102; 84.991275

గయ

వికీపీడియా నుండి
(బుద్ధగయ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
  ?గయ
బీహార్ • భారతదేశం
గయను చూపిస్తున్న పటం
Location of గయ
 గయ 
అక్షాంశరేఖాంశాలు: 24°41′42″N 84°59′29″E / 24.695102°N 84.991275°E / 24.695102; 84.991275
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
జిల్లా (లు) గయ
జనాభా 30,883 (2001 నాటికి)

గయ, హిందువులకు, బౌద్ధులకు పవిత్రమైన స్థలం. ఇది బీహార్ రాష్టంలో గయ జిల్లాలో ముఖ్యపట్టణం. రాష్ట్ర రాజధాని పాట్నా నుండి 100 కి.మీ. దూరంలో ఉంది. గయ చారిత్రాత్మక మగధ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది.

చరిత్ర

[మార్చు]

గయ చరిత్ర గౌతమబుద్ధుడు జన్మించిన తరువాత చరిత్రపుటలలోకి ఎక్కింది. గయకు 11 కిలోమీటర్లదూరంలో బుద్ధునికి జ్ఞానోదయం కలిగిన బోధగయ ఉంది. గయకు సమీపంలో రైగిర్, నలందా, వైశాలి, పాటలీపుత్ర ఉన్నాయి. ఈ పురాతన ప్రపంచానికి జ్ఞానభాండాగారమని కీర్తించబడుతుంది. గయ మగధ సామ్రాజ్యంలో ఒక భాగం. పాటలీపుత్ర నగరాన్ని రాజధానిగా చేసుకుని మౌర్యులు సామ్రాజ్యాన్ని పాలించారు. మౌర్యుల కాలంలో నలందావిశ్వవిద్యాలయం ప్రజలను విజ్ఞానవంతులని చేయడంలో ప్రథమస్థానంలో ఉంది.

సా.శ. 1810 లో గయ రెండు భాగాలుగా ఉండేది. ఒకభాగం పూజారులు నివసించే భాగం. ఈ భాగాన్ని గయ అనేవారు. రెండవ భాగంలో న్యాయవాదులు, వ్యాపారులు ఉండేవారు. దానిని ఎలహాబాద్ అనేవారు. అయినా తరువాత రోజులలో కలెక్టర్ సాహెబ్ థోమస్ ఈ నగర పునరుద్ధరణ చేసిన తరువాత దీనిని సాహెబ్‍గంజ్ అంటూ వచ్చారు. ప్రఖ్యాత జాతీయవాది బీహార్ విభూతి డాక్టర్ అనుగ్రహ నారాయణ్ సిన్హా జన్మస్థలమిదే. ఇతను బీహార్ మొదటి ఉపముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రిగా పనిచేసాడు. అలాగే మగధ చివరి రాజైన టెకారీ జన్మించిన నగరం ఇదే. ప్రఖ్యాత జాతీయవాది, కిసాన్ ఆందోళన్ నాయకుడు, స్వామి సహజానంద సరస్వతి గయలోని నేయమత్ పూర్ వద్ద ఆశ్రమనిర్మాణం చేసాడు. తరువాత అది బీహార్ స్వాతంత్ర్యోద్యమ నాయకులకు కేంద్రమైంది.అతని అంతరంగిక సహాయకుడు వీర్ కేశ్వర్ సింగ్ ఆఫ్ పరిహాస్. భారతీయ జాతీయ కాంగ్రెస్ కు చెందిన ప్రముఖ నాయకులందరూ దాదాపు ఈ ఆశ్రమానికి తరచుగా యదునందన శర్మను చూడడానికి విచ్చేసేవారు. యదునందన్ గయజిల్లా రైతులకు నాయకుడుగా కిసాన్ ఆందోళన్ ఉద్యమానికి నాయకత్వం వహించాడు. తరువాతి కాలంలో స్వాతంత్ర్యోద్యమ నాయకుడైన సహజానంద సరస్వతి రైతులకు నాయకత్వం వహించాడు. బీహార్ స్వాతంత్ర్యోద్యమంలో విస్తారంగా పాల్గొన్నది. స్వతంత్రోద్యమ కాలంలో 1922 లో ఇక్కడ దేశ్ బంధు చిత్తరంజన్ దాసు నాయకత్వంలో జాతీయ కాంగ్రెస్ సభ నిర్వహించబడింది. ఆ సభలో ప్రముఖ స్వాతంత్ర్యోద్యమ నాయకులందరూ భాగస్వామ్యం వహించారు. మోహ‍న్‍దాస్ కరమ్‍చంద్ గాంధీ, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ అనుగ్రహ్ నారాయణ్ శర్మా, సరదార్ పటేల్, మౌలానా ఆజాద్, జవహర్ లాల్ నెహ్రూ, శ్రీకృష్ణ సింహా వంటి మహామహులు ఆ సభలో పాల్గొన్నారు.

గయ నియోజకవర్గానికి శ్రీ ఈశ్వర్ చౌదరి ఐదవ, ఆరవ, తొమ్మిదవ 1971-79 నుండి 1989 -1991 వరకు పార్లమెంట్ సభ్యుడుగా ఉన్నాడు. అతను ప్రఖ్యాత సంఘసేవకుడు.అతని జీవితాన్ని బలహీనవర్గాలను ముందుకు తీసుకురావడానికి అంకితం చేసాడు. పార్లమెంటులో క్రియాశీలకంగా పనిచేసాడు. షెడ్యూల్ కులాలు. గిరిజనుల సంక్షేమానికి కృషిచేసాడు.అతని సేవలు శ్రామిక సంక్షేమ మంత్రిత్వశాఖ సలహా కమిటీలో కూడా కొనసాగాయి. 1991 మే మాసంలో ఆయన తన 52వ సంవత్సరంలో పదవ పార్లమెంటరీ ఎన్నికలలో పోటీ చేసిన సమయంలో తుపాకితో కాల్చివేయబడ్డాడు.

పేరువెనుక చరిత్ర

[మార్చు]

గయాసురుడు కావడానికి రాక్షసుడే అయినా మహా భక్తుడు. ఆయన రాక్షసులకు రాజు. వేలాది సంతవ్సరాలు మహావిష్ణువును ప్రసన్నం చేసుకునేందుకు చాలా గొప్ప తపస్సు చేశారు. తను చేసిన అద్భుతమైన తపస్సుకు ప్రసన్నుడై మహావిష్ణువు వరం కోరుకొమ్మనగా నా శరీరం అన్ని పరమ పావనమైన తీర్థాలకన్నా పవిత్రమై ఉండేలాగా వరం కావాలని కోరుకున్నారు. విష్ణువు ఆ కోరికను మన్నించగా గయాసురుని శరీరం పరమ పవిత్రమైపోయింది. బ్రహ్మహత్య, సురాపాన, స్వర్ణస్తేయ, గురుతల్ప మొదలైన పంచమహాపాపాలు సహితంగా అన్ని రకాల పాపాలు ఆయన శరీరాన్ని తాకగానే నశించిపోయేవి. ఆయనను తాకివెళ్ళిన ప్రతివారూ నేరుగా మోక్షాన్ని పొందేవారు, అంతేకాక కీటకాలు, సూక్ష్మజీవులు కూడా గాలికి కొట్టుకువస్తూ ఆయన శరీరాన్ని తాకిపోతూండగానే మోక్షాన్ని పొందేవి.ఇది కాక ఆయన చేసిన గొప్ప యాగాలు, పుణ్యకార్యాల వల్ల నేరుగా ఇంద్రపదవి లభించింది, అప్పటివరకూ స్వర్గాధిపతిగా ఉన్న ఇంద్రుడు పదవీభ్రష్టుడయ్యారు. పదవిని కోల్పోయిన ఇంద్రుడు కూడా ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మదేవుడిని ప్రసన్నం చేసుకున్నారు. బ్రహ్మ ఓ గొప్ప యాగాన్ని తలపెట్టానని, దానికి తగ్గ పరమ పవిత్రమైన స్థలాన్ని చూపించమని గయాసురుణ్ణి కోరారు. గయాసురుడు చాలా భారీకాయుడు. 576 మైళ్ళ పొడవు, 268 మైళ్ళ నడుము చుట్టుకొలత కలిగిన అతికాయుడు కాబట్టి పవిత్రమూ, విశాలమూ అయిన తన తలపై యజ్ఞం చేసుకొమ్మని అనుమతించారు.బ్రహ్మ యాగం వేడికి గయుని తల కదలడం ప్రారంభించింది. దాన్ని కదలకుండా చేసేందుకు బ్రహ్మ చాలా పెద్దపెద్ద శిలలను గయాసురిని తలపై పెట్టసాగారు. ఆ శిలలేవీ కూడా గయాసురుని తల కదలకుండా ఆపలేకపోగా అవన్నీ చుట్టూ పడి రామపర్వతం, ప్రేతపర్వతం వంటివి ఏర్పడ్డాయి. దానితో బ్రహ్మ చివరకు మరీచి శాపం వల్ల శిలగా మారిన మహాపతివ్రత దేవవ్రత శిలను తీసుకువచ్చి తలపై పెట్టారు. శిలారూపంలోనున్న మహాపతివ్రతను తోసివేయలేక కదలికలు కట్టడి చేసుకున్నా మొత్తానికి మానుకోలేకపోయాడు. అప్పుడు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని ప్రార్థించగా ఆయన గదాధారుడై వచ్చి తన కుడికాలు గయాసురుని తలపై పెట్టి తొక్కిపట్టారు.గయాసురుడు ఆ సమయంలో విష్ణుమూర్తిని ప్రార్థించి నా శరీరం పరమ పవిత్రమైన తీర్థక్షేత్రంగా వరం పొందింది. నా తలపై బ్రహ్మదేవుడే యాగం చేశాడు. పతివ్రతయైన దేవవ్రత శిలారూపంలో నిలిచింది. సాక్షాత్తూ మహావిష్ణువువైన నీవే కుడిపాదాన్ని పెట్టావు. ఇన్ని పొందిన నా శిరోమధ్యపాద భాగాలు పితృదేవతలను సైతం తరింపజేసే ప్రభావశాలి, పరమ పవిత్రమూ అయిన దివ్యక్షేత్రములయ్యేట్టుగా, అవి తన పేరున వ్యవహరింపబడేట్టుగా వరం కావాలని కోరి పొందారు.
దాని వల్లనే ఆయన శరీరంలో తల భాగంలో ఉన్న ఈ పట్టణం పరమ పవిత్రంగా పితరులను తరింపజేసే ప్రాంతంగా పేరొందింది.[1]

గయలో పవిత్ర క్షేత్రాలు

[మార్చు]
మహాబోధి ఆలయం, బోధ గయ. గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం పొందిన ప్రదేశం.

బౌద్ధ, హిందూ మతాలకు గయ ఒక పవిత్రనగరం. పవిత్ర ఫలగూ నదీతీరము స్నాన ఘట్టాలు, ఆలయాలు బారులుతీరి ఉంటాయి. రావిచెట్లు, అక్షయవట్, మర్రిచెట్టు మొదలైన పవిత్ర వృక్షాలుకూడా ఉన్నాయి. పవిత్రమైన మంగళగౌరి ఆలయం సతీదేవి ఛాతీ భాగం పడిన ప్రదేశమని విశ్వసించబడుతుంది. ప్రస్తుతం ఫలగూ నదీతీరంలో చాలా ప్రసిద్ధిచెందిన విష్ణుపద్ ఆలయం ఉంది. అక్కడ విష్ణుపాద ముద్రలు ఉంటాయి. గయాసురుని చాతి మీద భగవానుడైన మహావిష్ణువు పాదము ఉంచిన ప్రదేశం ఇదే. విష్ణుపద్ ఆలయంలో భూమిహార్ బ్రాహ్మణులు వంశపారంపర్యంగా పూజలు చేస్తుంటారు. పక్కన జిల్లా అయిన హజారీభాగ్ నుండి వచ్చే గయావాల్ పాండాలు ఇక్కడ పూజాదికాలకు యాత్రీకులకు సహకరిస్తుంటారు. 18వ శతాబ్దిలో దేవి అహల్యాభాయ్ హోల్‌కర్ ప్రస్తుత ఆలయం నిర్మించింది. విష్ణుపద్ ఆలయంలోని పాదముద్రలను బౌద్ధసంప్రదాయం కూడా గౌరవిస్తుంది. భగవాన్ విష్ణుమూర్తి దశావతారాలలో బుద్ధుడు ఒకడని విశ్వసించబడుతుంది.

గయ హిందువులకు పితరులకు మోక్షప్రదాయకమైన నగరంగా విశ్వదించబడుతుంది. ఇక్కడ పితరులకు పిండప్రదానం చేస్తే పితరులకు మోక్షం లభిస్తుందని హిందువుల విశ్వాసం. శ్రీరాముడు తనదేవేరి సీత, సోదరుడైన లక్ష్మణునితో ఇక్కడకు వచ్చి పితరులకు పిండప్రదానం చేసినట్లు పురాణకథనాలు వర్ణిస్తున్నాయి. పిండప్రదానానికి ముందు స్నానమాచరించడానికి శ్రీ రాముడు వెళ్ళిన సమయంలో మహారాజైన దశరథుని హస్తాలు రెండు సీతముందు కనిపించి తాను చాలా ఆకలిగా ఉన్నానని రామునికి బదులుగా పిండం ప్రదానం చెయ్యమని సీతను అడుగగా సీతాదేవి పిండములు తీసి ఆచేతులలో ఉంచింది. శ్రీరాముడు తిరిగి వచ్చి యధావిధిగా పిండములు ప్రదానము చేసే సమయములో అతని తండ్రి ఆ పిండాలను స్వీకరించక పోయినప్పుడు శ్రీరాముడు ఆశ్చర్యానికి గురికావడమే కాక బాధపడ్డాడు. తరువాత సీతాదేవి జరిగిన ఉదంతం వివరించి సాక్ష్యానికి ఫలగు నది సమీపంలో నిలిచియున్న బ్రాహ్మణుని, ఆవుని, రావిచెట్టుని పిలిచింది. రావిచెట్టు తప్ప మిగిలిన వారు సాక్ష్యం చెప్పలేదు. ఆవు శ్రీ రామునికి భయపడి, ఫల్గూ నది శ్రీరాముని నుండి అధిక వరాలు పొందడానికి, బ్రాహ్మణుడు శ్రీరాముని నుండి అధిక దక్షిణ పొందాలని నిజం చెప్పలేదు. సీతాదేవి ఆముగ్గిరిని శపించిందని పురాణకథనం వివరిస్తుంది. శాపకారణంగా ఫల్గూనదిలో నీరు ఇంకి పోయింది. రావిచెట్టును శాశ్వతంగా జీవించమని వరమిచ్చింది. ఈ రావిచెట్టు ఆకులు ఎప్పుడూ రాలవని ఎప్పుడూ పచ్చగానే ఉంటాయని ఇక్కడివారు చెప్తున్నారు. అక్షయ వృక్షం అంటే ఎప్పటికీ క్షయం పొదని వృక్షం అని అర్ధం. కరువు సమయంలో కూడా ఈ వృక్షం పచ్చగా ఉంటుంది.

బౌద్ధులకు ఒక ప్రాముఖ్యమైన యాత్రాక్షేత్రం. ఈ బ్రహ్మయోని కొండల మీద బుద్ధుడు ఆదిత్య పర్యాయ సూత్రాలను బోధించాడని చెప్పబడుతుంది. ఈ సూత్రాలను విన్న వేలాది అగ్నిఆరాధకులు. జ్ఞానసిద్ధి పొందారని అందువలన ఈ కొండని గయాసిసా అని పిలిచేవారని చెప్పబడుతుంది.

జమ్మా మసీద్

[మార్చు]

గయలో ఉన్న జమ్మా మసీద్ బీహారులోనే అతిపెద్ద మసీదు. ముజాఫీరి రాజకుటుంబం 150 సంవత్సరాలక్రితం ఈ మసీదును నిర్మించారు. ఇక్కడ ఒకేసారి వేలమంది నమాజ్ చేసేవీలుంది. ప్రస్తుతం ఈ మసీదును చారిత్రక ప్రదేశంగా చూపుతున్నారు.

గయలో వ్యాపార ఆధారిత సంతలు అనేకం జరుగుతున్నా సంవత్సరానికి రెండుమార్లు జరిగే జంతువుల సంత మాత్రం ప్రత్యేకత సంతరించుకున్నది. ఫల్గు నదీతీరంలో విష్ణుపద్ ఆలయానికి ఎదురుగా ఈ సంత నిర్వహించబడుతుంది. ఈ సంత సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా ఉంటుంది.

ప్రాచీన చరిత్ర

[మార్చు]

గయ నుండి ఇంచుమించు 15 కి.మీ. దూరంలో ఉన్నది బుద్ధ గయ, గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం పొందిన ప్రదేశం. చుట్టుప్రక్కల నలందా, వైశాలి, పాటలీపుత్రం) ఆనాటి విజ్ఞానానికి మూల స్తంభాలుగా నిలిచి, మౌర్య రాజ్యంలో భాగంగా భారతదేశ పరిధి దాటి వ్యాపించాయి. ఈ కాలంలో గయ మగధ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది.

హిందువులకు ప్రాముఖ్యత

[మార్చు]

పురాణకథనాలు అనుసరించి గయాసురుడు పేరులోని గయ ఆధారంగా ఈ నగరానికి ఈ పేరు వచ్చింది. విష్ణుమూర్తి గయాసురుని వధించిన సమయంలో గయాసురుని హృదయస్థానం మీద తనపాదముతో వత్తి వధించాడు. విష్ణమూర్తి పాదము పడిన ప్రదేశంలో పెద్దలకు పితరులకు శ్రాద్ధం చేసిన వారు వారి పాపముల నుండి విముక్తులై ఉత్తమగతులు పొందగలరని హిందువులు విశ్వసిస్తున్నారు. పురాణకథనం అనుసరించి విష్ణుమూర్తి చేతిలో వధించబడిన గయాసురుడు కొండలవరుసగా మారాడని విశ్వసించబడుతుంది. విష్ణుమూర్తి పాదము మోపిన ప్రదేశంలో విష్ణుమూర్తి ఆలయనిర్మాణం జరిగింది. క్రమంగా ఈ ప్రదేశం నగరంగా మారింది. విష్ణుమూర్తి ఆలయసమీపంలో పితరులకు శ్రాద్ధకర్మలు నిర్వహించబడుతున్నాయి. గయనగరంలో పాదముమోపిన వారి పాపాలను పోగొట్టగలిగిన పవిత్రనగరమిదని విశ్వసించబడుతుంది. గయాసురుడు మరణించిన తరువాత సకల దేవతలు అతడి శరీరం మీద నివసిస్తామని మాటిచ్చారు. కొండల కోనల మీద వివిధ ఆలయాలు ఉన్నాయి. యాత్రీకులుప్రధానంగా చూడవలసిన ఆలయాలలో ముఖ్యమైనవి రామశిల, మంగళగౌరి, శ్రీరంగస్థాన్, బ్రహ్మయోని మొదలైనవి.

జనసంఖ్య

[మార్చు]

2011లో గణాంకాల ప్రకారం నగర జనాభా 4,70,839. గయ మునిసిపల్ కార్పొరేషన్, కాలెర్, పహర్‌పుర్ కలిపి 4,63,454. వీరిలో పురుషుల సంఖ్య 2,45,764, స్త్రీల సంఖ్య 2,17,690. ఐదు సంవత్సరాలకు తక్కువ వయసున్న పిల్లల సంఖ్య 59,015. స్త్రీ పురుషుల నిష్పత్తి 886:1000. అక్షరాస్యత శాతం 85.74%. జాతీయ అక్షరాస్యత కంటే ఇది 7% అధికం.

అహార విధానం

[మార్చు]

బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలలో జానాదరణ పొందిన చిరుతిండి పదార్ధాలు గయలో కూడా ఉన్నాయి. గయలో వాడుకలో ఉన్న ఇతర ఆహారాలు మాత్రం అసలైన బీహార్ సంప్రదాయాన్ని అనుసరించి ఉంటాయి. వీటిలో చాలా ప్రసిద్ధమైన ఆహారం సత్తు. లిత్తి-చోఖా, లిత్తి, పిత్త, పూయా, మరుయా- కా- రోటీ, బారీ-డాల్, సత్తు-కా-రోటీ, బైగాన్ భరతా, సుఖాతా, కోపల్కీ కోఫ్తా, చాలా ప్రసిద్ధమైన టవర్ చౌక్ చాట్ మొదలైనవి.

మిఠాయిలు

[మార్చు]
  • బీహార్, జార్ఖండ్, భారతదేశం అంతటా ఉన్నట్లే గయలో పలు ప్రసిద్ధమైన స్వీట్లు తయారుచేసి విక్రయించబడుతున్నాయి. టిల్కుత్, ఖాజా, కేసరియా పేడా, లై మొదలైనవి.అమ్‍రసా రమణారోడ్ తెకారీ రోడ్ లలో లభ్యమౌతున్న స్వీట్లు గయకు ప్రత్యేకతను తీసుకువస్తున్నాయి.
  • వీటిలో అత్యంత ప్రసిద్ధమైన టిల్కుత్ ను నువ్వులు, బెల్లము లేక చక్కెరలతో చేస్తారు. ప్రత్యేకంగా చలికాలంలో అధికంగా వాడుతున్న ఈ మిఠాయిని శ్రామికులు అధికంగా తింటుంటారు.

అధికంగా ఇవి తెకేరీ రోడ్డు, రమణా, గయలో లభ్యమౌతున్నాయి. ఇవి కోల్‌కతా, డిల్లీలో కూడా లభ్యమౌతాయి.

  • మరొక రుచికరమైన తీపి వంటకం కేసరియా పేడాను పాల మీగడ, చక్కెర, కేసరి రంగుతో చేస్తారు. కేసరుయా పేడా చౌక్ ప్రాంతంలో అత్యధికాంగా తయారు చేయబడుతుంది.
  • బీహారులో పలురకాల లై లభ్యమౌతుంది. గయలో కూడా ఇది లభ్యమౌతుంది. లై అనే ఇఠాయిలో వాడే ప్రధాన ఆహారపదార్ధం రాం దన విత్తనాలు. రాం దన విత్తనాలను తయారుచేసి కోవా, చక్కెరలతో కలిపి ఈ వంటకాన్ని తయారు చేయచేస్తారు.
  • అనారసా కూడా కోవా ఆధారిత స్వీటు. దీనిని నూనెలో వేపి చెక్కెరతో కలిపి తయారుచేస్తారు. ఇవి గుండ్రగా, గోళాకారంగా లభిస్తాయి. ఈ మిఠాయి మీద నువ్వులు చల్లుతారు.

ఈ మిఠాయిలను తడిలేకుండా ప్యాక్ చెయ్యడానికి, నిలువ ఉంచడానికి, రవాణాచేయడానికి వీలుగా తయారుచేస్తారు. బెంగాలి మిఠాయిలు అనేకం చక్కెర పాకంలో నానవేసి తయారు చేయబడతాయి కనుక అవి తడిగా ఉంటాయి. ఇంటికి వచ్చిన బంధువులు తిరిగిపోయే సమయంలో వారికి ఈ మిఠాయిలను బహుమతిగా ఇచ్చే సంప్రదాయం వాడుకలో ఉంది. గయలో దారివెంట విక్రయించబడుతున్న ఆలూ-కచాలూ, చాట్, ఆలూ-కచాలూలు ఉడికించిన బంగాళదుంపలు, కారం, జిలకరపొడులను చల్లి, ఉప్పు చింతపండు రసం కలిపి తయారుచేస్తారు. వీటిని ప్రత్యేకంగా బటామోర్ ప్రాంతంలో విక్రయిస్తుంటారు. పాఠశాలలు, కళాశాలల సమీపంలో వీటిని తప్పక విక్రయిస్తుంటారు. వీటిని పిల్లలు, యువత అధికంగా ఇష్టపడుతుంటారు.

చిరుతిండి

[మార్చు]

గయ వాసులు కారమైన చిరుతిండిని అభిమానిస్తారు. గయలో మాత్రమే చూడతగిన కొన్ని ప్రత్యేకమైన చిరుతిండులు కొన్ని ఉన్నాయి. వాటిలో ప్రబలమైనది సమోసా చాట్. ఆలూ-కచాలూ, సాబుదానా- బాదం భూంజా, ఆలూ చాట్ మొదలైనవి. ప్రమోద్ బందర్ దుకాణం ఈ ఆహారపదార్ధాల విక్రయంలో ప్రసిద్ధిచెందినది.

  • గయ అంతటా ఒకేలా విక్రయించబడుతున్న సాబూదానా - బాదం భూజా తడిలేని ఆహారం. ఇది నూనెలో వేపిన మసాలా. సగ్గుబియ్యం, బాదం పప్పు, వేరుశనగపప్పు, పెసలతో ఉప్పు కలిపి వీటిని చేస్తారు. తోపుడు బండ్లమీద తిరుగుతూ రద్దిగా ఉండే సమయంలో భూంజా విక్రయదారులు హాస్యపూరిత నినాదాలతో విక్రయించడం గయనగరమంతటా చూడవచ్చు.

విద్య

[మార్చు]

గయలో బిహార్ స్కూల్ ఎక్జామినేషన్ స్కూల్‌కు అనుసంధానంగా జిలా స్కూల్, హాది హాష్మి ఉన్నత పాఠశాల, క్వాస్మీ ఉన్నత పాఠశాల, హరిదాస్ సెమినరీ ( టౌన్ స్కూల్), థియోసాఫికల్ మోడెల్ స్కూల్, గయ ఉన్నత పాఠశాల, అనుగ్రహ కన్యా విద్యాలయ, మహావీర్ స్కూల్, గవర్నమెంట్ ఉన్నత పాఠశాల విద్యాసేవలందిస్తున్నాయి. న్యూ డిల్లీకి చెందిన కేంద్రీయ విద్యాలయ సంఘటన్ కి అనుసంధానంగా రెండు కేంద్రీయ విద్యాలయ పాఠశాలలు సేవలందిస్తున్నాయి. ప్రభుత్వేతర పాఠశాలలో అధికంగా ఐ.సి.ఎస్.ఈ, సి.బి.ఎస్.ఈ బోర్డుకు అనుసంధానంగా పనిచేస్తున్నాయి. బ్రిటిష్ శకానికి ముందుగా స్థాపించబడి కొన్ని శతాబ్దాలుగా విద్యాసేవలందిస్తున్న సర్వస్వతంత్ర విద్యా సంస్థ అయిన నజారెత్ అకాడమీ ఇప్పటికీ తన సేవలు కొనసాగిస్తున్నది. బోధగయలో ఉన్న ఒకేఒక పాఠశాల నాన్ గరవర్నమెంట్ ఆర్గనైజేషన్ చారిటబుల్ స్కూల్ అయిన జ్ఞాన్ నికేతన్ స్కూల్ తనవంతుకు విద్యాసేవలందిస్తుంది. ఈ పాఠశాల పరిసరరాంతాలలో ఉన్న ఐదు గ్రామాలలోని 200 మంది బాలబాలికలకు ఉచిత విద్యను అందిస్తున్నది. క్రేన్ పాఠశాల ఐదు దశాబ్ధాలుగా విద్యాసేవలు అందిస్తూ నగరంలో అత్యున్నత పాఠశాలగా పేరుప్రతిష్ఠలు సంపాదించుకున్నది. ఈ పాఠశాలలో విద్యార్థులకు విద్యాబోధనతో ఇతర రంగాలలో శిక్షణాతరగతులు నిర్వహిస్తూ విద్యార్థులకు ఉన్నత స్థాయి విద్యను అందిస్తున్నది.

గయలో ఉన్న ఒకేఒక విశ్వవిద్యాలయం మగధ్ విశ్వవిద్యాలయం. ఇదే బీహారులోని అత్యంత పెద్ద విశ్వవిద్యాలయం. బోధ్ గయ సమీపంలో ఉన్న ఈ విశ్వవిద్యాలయం విద్యామంత్రి ఎస్.ఎన్ సింహా చేత స్థాపించబడింది. సైన్స్, ఆర్ట్స్, కామర్స్, మేనేజ్మెంట్, కంప్యూటర్ అప్లికేషన్స్ వంటి విద్యలలో డిగ్రీ, పోస్ట్ గ్రాజ్యుయేట్ విద్యలను అందిస్తున్న పలు కళాశాలలు ఉన్నాయి. గుర్తింపు పొందిన కళాశాలలలో గయ కాలేజ్ (ఎన్.ఎ.సి గ్రేడ్ ఎ గుర్తింపును పొందింది ), అనుగ్రహ్ మెమోరియల్ కాలేజ్, గయ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ (జి.సి.ఇ), జగ్‌జీవన్ కాలేజ్, మహేష్ సింగ్ యాదవ్ కాలేజ్, మిర్జా గాలిబ్ కాలేజ్, గౌతం బుద్ధ మహిళా కాలేజ్ (జి.బి.ఎం కాలేజ్) మొదలైనవి. ఒ.టి.ఎ గయలో ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ అనే కొత్త అకాడమీ స్థాపించబడింది.

సైనిక శిక్షణ

[మార్చు]

ఒ.టి.ఎ గయలో 2011 జూలై నుండి ఇండియన్ ఆర్మీ మూడవ ప్రీ కమిషన్ ట్రైనింగ్ (పి.టి.సి) ని 750 మంది కేడెట్స్‌కు శిక్షణ అందిస్తున్నది. ఈ శిక్షణ లక్ష్యం ఇండియన్ ఆర్మీకి అత్యుత్తమ సైనిక అధికారులను అందించడమే. ఈ అకాడమీ గయలోని కొండప్రాంతమైన పహర్‌పూర్ లోని 870 ఎకరాల ఎస్టేట్‌లో ఈ సైనిక శిక్షణా కేంద్రం ఏర్పాటు చేయబడింది. గయ నుండి బోధ్ గయకు పోయే మార్గంలో దాదాపు గయ రైల్వే స్టేషనుకు 7 కిలోమీటర్ల దూరంలో ఈ శిక్షణా కేంద్రం ఉంది. ఇక్కడి నుండి అంతర్జాతీయ పర్యాటక కేంద్రమైన బోధగయ కనిపిస్తూ ఉంటుంది. బ్రిటిష్ ఆర్మీలో అంతర్భాగమైన గయ కంటోన్మెంటు రెండవప్రపంచ యుద్ధానికి ముందే స్థాపించబడి ఉంది.

ఈ అకాడమీ ప్రారంభించే ముందు జెండా ఎగురవేసే కార్యక్రమం రూపొందించబడింది. మతాతీత ఇండియన్ ఆర్మీని రూపొందించే ప్రయత్నంలో ఈ అకాడమీ స్థాపించబడింది. వివిధ మతాలకు చెందిన పుస్తకాలలో ఈ సైనికశిక్షణాకేంద్రం గురించి ప్రస్తావించబడింది. ఈ అకాడమీలో ఇతర సైనిక అకాడమీలలో చోటు చేసుకోని కళల శిక్షణకు వసతి చేయబడింది. ఈ అకాడమీ చిహ్నంలో రెండు భాగాలున్నాయి. పైభాగంలో బూడిద రంగు ఉంటుంది. కింది భాగంలో రక్తవర్ణం ఉంటుంది. రక్తవర్ణం ఉన్న కింది భాగంలో ధర్మచక్రాన్ని కాపాడుతున్న రెండు కత్తులు ఒకదానిని ఒకటి అడ్దగిస్తున్నట్లు ఉంటాయి. దానికి కింది భాగంలో దేవనాగరి లిపిలో " శౌర్య, జ్ఞానం, సంకల్పం " అనే నినాదం ఉంటుంది.

2011 జూలై నుండి 2012 జూన్‌ మద్య కాలంలో ఈ అకాడమీ నుండి 149 మంది సైనికాధికారులు శిక్షణ పూర్తిచేసుకున్నారు. అలాగే 2012 జూన్ 8 లో ఈ శిక్షణాధికారుల మొదటి సైనికవిన్యాసం జరిగింది. 2012 2012 జనవరి డిసెంబరు 8 నాటికి మధ్యలో ఈ అకాడమీ నుండి రెండవ జట్టు సైనికాధికారులు శిక్షణ పూర్తి చేసుకున్నారు. 2012లో టి.ఇ.ఎస్ 26, ఎస్.సి.ఒ 29 కోర్సులలో మొత్తం 176 సైనికాధికారులు శిక్షణ పూర్తిచేసుకున్నారు. ప్రస్తుతం మూడవ విడతగా 350 మంది సైనికాధికారులుగా శిక్షణ పొందుతున్నారు.

గయ విద్యార్థులు చాలా శ్రమకుఓర్చగలిగిన వారు. మాంపూర్ లోని పాత్వాటోలి వద్ద ఉన్న పవర్ లూం పరిశ్రకు చెందిన కుటుంబాల నుండి వరసగా పదిమంది విద్యార్థులు వారి కృషికి ఫలితంగా ఐ.ఐ.టిలో చదవడానికి అర్హులు కావడం గమనార్హం. పత్వాటోలికి " అభియంతా విహార్ " (ఇంజనీర్ల ప్రదేశం) అని పేరు మార్చబడుతుందన్న సమాచారం ప్రచారంలో ఉంది. అయినప్పటికీ జి.ఐ.ఐ.టి వంటి శిక్షణా కేంద్రాలకు కూడా ఈ విజయంలో భాగం ఉంది. అలాగే ప్రతి సంవత్సరం పలు విద్యార్థులు ఐ.ఐ.టికి అర్హత సంపాదిస్తున్నారు. డి.జి.పి అభయానంద్ ఆధ్వర్యంలో ఏర్పాటైన మగధ సూపర్-30 అనే బృందం ఉంది. ప్రస్తుతం సెంట్రల్ యూనివర్శిటీ ఆఫ్ మగధ శాఖ ఒకటి గయలో స్థాపించబడింది.

గయలోని వైద్యకళాశాల పేరు అనుగ్రహ్ నారాయణ్ మగధ్ మెడికల్ కాలేజ్, హాస్పిటల్ (ఎ.ఎన్.ఎం.ఎం.సి.హెచ్) . నదీతీరం రోడ్డులో ఉన్న బాబా సాహెబ్ భీంరావు అంబేద్కర్ విశ్వవిద్యాలయానికి చెందిన హోమియోపతి మెడికల్ కాలేజ్ బి.హెచ్.ఎం.ఎస్ కోర్సులను అందిస్తుమ్నది. గయలో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇంస్టిట్యూట్ (ఐ.టి.ఐ) ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్ & గవర్నమెంట్, డిప్లొమా కోర్సులైన పాలిటెక్నికల్ కాలేజ్ బోధ్ గయ రోడ్డులో ఉన్నాయి.

ప్రయాణవసతులు

[మార్చు]

గయ మిగిలిన భారతదేశంతో రహదారులు, రైల్వేతో భాగా అనుసంధానించబడి ఉంది. గయలో ఉన్న విమానాశ్రయం నుండి దక్షిణాసియా దేశాలు ప్రయాణించే సేవలు అందిద్తుంది.

నగరంలో ప్రయాణవసతి

[మార్చు]

సిటీ బస్, టాంగాలు, ఆటో రిక్షా, సైకిల్ రిక్షాలు వంటివి నగరమంతా ప్రయాణసౌకర్యాలను అందిస్తున్నాయి.

రహదారులు

[మార్చు]

రోజువారీగా నేరుగా బస్సులు పాట్నా, నలందా, రైగర్, వారణాసి, రాంచి, టాటా, కొల్‌కత్తా, ధన్‌బాద్ వంటి నగరాలకు ప్రయాణ వసతి కల్పిస్తున్నవి. 2011లో బీహార్ స్టేట్ రోడ్ ట్రాన్స్‍పోర్ట్ కార్పొరేషన్ ముజాఫర్పూర్, పాట్నా, మోతిహరి, హజారీభాగ్, రామ్‌ఘర్ నగరాలకు ఎ.సి మెర్సిడెజ్ బెంజ్ లగ్జరీ సర్వీసులను అందిస్తుంది. కొలకత్తా, ఢిల్లీలను కలుపుతూ ఉన్న జాతీయ రహదారి 2 గయ నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ రహదారి గయను పాట్నా, రాంచి, జంషెడ్ పూర్, బొకారో, రూర్‌కెలా, దుర్గాపూర్, కొలకత్తా, వారణాసి, అలహాబాద్, కాన్పుర్, ఢిల్లీ, అమృతసర్ అలాగే పాకిస్థానీ నగరాలైన పెషావర్, లాహోర్ నగరాలకు ప్రయాణ వసతి కల్పిస్తుంది. జాతీయ రహదారి 83 రహదారి గయను పాట్నాతో అనుసంధానిస్తున్నది. గయను నవాదా, రైగర్, బీహార్ సఫారి లతో జాతీయ రహదారి 82 కలుపుతుంది. గయ నుండి పాట్నా వరకు నాలుగు లైన్ల రహదారిని నిర్మించాలని యోచిస్తున్నారు.

విమానాశ్రయం

[మార్చు]

బీహార్ మరుయు ఝార్ఖండ్ రాష్ట్రాలలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం గయ బోధ్ గయ మద్యలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం ఒక్కటే. ఇక్కడి నుండి కొలంబో, శ్రీలంకలకు ఒక మార్గం అలాగే బాంకాక్, థాయ్‌లండ్, సింగపూర్, భూటాన్ మరిక మార్గంలో విమానాలు నడుపబడుతున్నాయి. గయ విమానాశ్రయం నుండి ఇండియన్ ఎయిర్ లైన్ దేశీయవిమానాలు, శ్రీలంకన్ ఎయిర్ లైన్స్, మహిన్ లంక, డ్రక్ ఎయిర్, జెట్ ఎయిర్వేస్, థాయ్ ఎయిర్వేస్,, ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానాలు, రోజువారీగా నడుపబడుతున్నాయి. ఈ విమానాశ్రయం నుండి ఢిల్లి, కొలకత్తా, వారణాసి నగరాలకు విమానాలు నడుపబడుతున్నాయి.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. వెంకట శివరావు, దిగవల్లి (1944). కథలు-గాథలు (1 ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. pp. 127–140. Retrieved 1 December 2014.

వెలుపలి లంకెలు

[మార్చు]

మూస:బీహార్ లోని జిల్లాలు

"https://te.wikipedia.org/w/index.php?title=గయ&oldid=3946706" నుండి వెలికితీశారు