అనుగ్రహ నారాయణ్ సిన్హా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డా. అనుగ్రహ నారాయణ్ సిన్హా
అనుగ్రహ నారాయణ్ సిన్హా


బీహారు రాష్ట్ర ఉప ప్రధాని, ఆర్థిక మంత్రి

రాజ్యాంగ సభ సభ్యుడు
నియోజకవర్గం ఔరంగాబాదు

బీహారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థికమంత్రి

కేంద్ర శాసన మండలి సభ్యుడు

కేంద్ర శాసన మండలి సభ్యుడు

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెసు
సంతానం ఇద్దరు కుమారులు
పూర్వ విద్యార్థి పాట్నా యూనివర్సిటీ
కలకత్తా ప్రెసిడెన్సీ కళాశాల
వృత్తి లాయరు
రాజకీయ నాయకుడు
జూలై 12, 2006నాటికి

డా.అనుగ్రహ నారాయణ్ సిన్హా (1887 జూన్ 18 - 1957 జూలై 5), స్వాతంత్ర్య సమర యోధుడు, రాజనీతిజ్ఞుడు, గాంధేయవాది. అతన్ని బీహార్ విభూతి అని అంటారు. సిన్హా చంపారన్ సత్యాగ్రహంలో పాల్గొన్నాడు. ఆధునిక బీహార్ వాస్తుశిల్పులలో [1] అతనొకడు. బీహారుకు తొలి ఉప ముఖ్యమంత్రి, [2] ఆర్థికమంత్రి (1946-1957). [3] రాజ్యాంగం రాయడానికి ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ పరిషత్లో అతను సభ్యుడు. స్వతంత్ర భారత దేశపు మొదటి పార్లమెంటులో కూడా అతను సభ్యుడిగా పనిచేసాడు. కార్మిక, స్థానిక స్వపరిపాలన, పబ్లిక్ వర్క్స్, సరఫరా & ధర నియంత్రణ, ఆరోగ్యం, వ్యవసాయం వంటి అనేక మంత్రిత్వ శాఖలను నిర్వహించాడు.

బాబు సాహెబ్ అని పిలిచే అనుగ్రహ నారాయణ్ సిన్హా, మహాత్మాగాంధీకి అత్యంత సన్నిహితుడు స్వాతంత్ర్య పోరాట ఉద్యమ సమయంలో బీహార్ కేసరి డాక్టర్ శ్రీ కృష్ణ సిన్హాతో కలిసి బీహార్‌లో గాంధీ ఉద్యమానికి నాయకత్వం వహించాడు. [4] అతను రాష్ట్ర శాసనసభలో కాంగ్రెసు పార్టీ [5] ఉప నాయకుడిగా ఎన్నికయ్యాడు. స్వాతంత్ర్యానంతర బీహార్లో మొదటి ఉప ముఖ్యమంత్రిగా, ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు. 1952 లో జరిగిన మొట్టమొదటి [6] సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ భారీ ఆధిక్యతతో విజయం సాధించినపుడు సిన్హా తిరిగి ఎన్నికయ్యాడు.

తొలి జీవితం[మార్చు]

సిన్హా 1887 జూన్ 18 న బీహార్‌లోని పూర్వపు గయ జిల్లా (నేడు ఔరంగాబాద్) పోయివాన్ గ్రామంలో విశ్వేశ్వర్ దయాళ్ సింగ్‌కు జన్మించాడు. అతను రాజపుత్ర కులానికి చెందినవాడు. [7] [8] [9] అతని చిన్న కుమారుడు సత్యేంద్ర నారాయణ్ సిన్హా బీహార్ ముఖ్యమంత్రి అయ్యాడు. కుర్రవాడిగానే అతనిలో దేశభక్తి లక్షణాలు అంకురించాయి. చదువులో అతను తెలివైన విద్యార్థి. గ్రామ పాఠశాల లోనే ప్రాథమిక విద్యను పొందారు. జూనియర్ పాఠశాల నుండి గ్రాడ్యుయేషన్ వరకు ప్రతి పరీక్షలోనూ అతను అగ్రస్థానంలో నిలిచాడు, 1914 లో ప్రతిష్టాత్మక కలకత్తా విశ్వవిద్యాలయం నుండి MA (చరిత్ర) పట్టా పొందాడు. అతను రాజేంద్ర ప్రసాద్ స్థాపించిన బీహార్ స్టూడెంట్స్ కాన్ఫరెన్సుకు కార్యదర్శి అయ్యాడు. పాట్నా కాలేజీ లోని చాణక్య సొసైటీకి ఎన్నికయ్యాడు. పాట్నా కాంగ్రెస్‌లో వాలంటీర్‌గా పనిచేశాడు. 1915 లో భాగల్పూర్ TNB కళాశాలలో చరిత్ర ప్రొఫెసరుగా నియమితుడయ్యాడు. అక్కడ 1916 వరకు పనిచేసాడు. [10] భాగల్పూర్ వరదలతో అతలాకుతలమైనప్పుడు సిన్హా సహాయక కార్యక్రమాలను నిర్వహించాడు. పాట్నా హైకోర్టులో న్యాయవాద వృత్తిని చేపట్టాడు.

స్వాతంత్ర్యోద్యమం[మార్చు]

(ఎడమనుండి) రాజేంద్ర ప్రసాద్, జవహర్‌లాల్ నెహ్రూ, అనుగ్రహ నారాయణ్ సిన్హా, శ్రీ కృష్ణ సిన్హా -అనుగ్రహ బాబు నివాసంలో

1917 లో, మహాత్మా గాంధీ జాతికి పిలుపు నందుకుని అతను చంపారన్ సత్యాగ్రహ ఉద్యమంలో చేరాడు. అందుకోసం తన న్యాయవాద వృత్తిని విడిచిపెట్టాడు. [11] [12] చంపారన్ ప్రయోగం భారతదేశంలో గాంధేయ పద్ధతిని అభివృద్ధి చేయడంలో కీలక అధ్యాయమైంది. సిన్హా జాతీయ స్థాయి నాయకుడయ్యాడు. ప్రతిభావంతులైన యువకులను చైతన్యపరిచేందుకు డాక్టర్ రాజేంద్రప్రసాద్ స్థాపించిన బీహార్ విద్యాపీఠంలో ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. [12] అతని మొదటి విద్యార్థులలో యువ జయప్రకాష్ నారాయణ్ ఒకడు. 1922 లో అతను గయ కాంగ్రెస్‌ను నిర్వహించాడు. తరువాతి సంవత్సరంలో అతను ఆల్ ఇండియా కాంగ్రెసు కమిటీ (AICC) ప్రధాన కార్యదర్శులలో ఒకడయ్యాడు. పాట్నా మున్సిపాలిటీ ఛైర్మనుగా రాజేంద్ర ప్రసాద్ ఎన్నికైనప్పుడు, డాక్టర్ అనుగ్రహ నారాయణ్ సిన్హా వైస్ చైర్మనుగా ఎన్నికయ్యాడు. ఆ వెంటనే సిన్హా, గయ జిల్లా బోర్డు ఛైర్మన్‌గా ఎన్నికవడంతో, ఉప చైర్మను పదవికి రాజీనామా చేసాడు. భారత జాతీయవాద చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిగా పరిగణించే 1930 సంవత్సరంలో, మహాత్మా గాంధీ నేతృత్వంలోని శాసనోల్లంఘన ఉద్యమం వెనుక అతను కీలక శక్తిగా పనిచేసాడు. [10]

బ్రిటిషు ప్రభుత్వం 1933–34లో అతనికి 15 నెలల కఠిన కారాగార శిక్ష విధించింది. 1934 జనవరి 15 న నేపాల్ – బీహార్ భూకంపం సంభవించినప్పుడు, జనవరి 17 న డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన బీహార్ సెంట్రల్ రిలీఫ్ కమిటీని ఏర్పాటు చేసారు. సిన్హా దానికి ఉపాధ్యక్షుడయ్యాడు. అతను నిధుల సేకరణ పనిని తీసుకున్నాడు.

1935 లో సహబాద్-కమ్-పాట్నా నియోజకవర్గం నుండి సెంట్రల్ కౌన్సిల్ సభ్యుడిగా భారీ ఆధిక్యతతో ఎన్నికయ్యాడు. అతను 1936 లో బీహార్ శాసనసభ సభ్యుడయ్యాడు. 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం, బ్రిటిషు వారు మంజూరు చేసిన ప్రాంతీయ స్వయంప్రతిపత్తిలో భాగంగా, మొదటి కాంగ్రెసు మంత్రివర్గం 1937 జూలై 20 న ప్రమాణ స్వీకారం చేసింది. అతను బీహార్ ప్రావిన్స్ డిప్యూటీ ప్రధాని, ఆర్థిక మంత్రి అయ్యాడు. రాజకీయ ఖైదీల విడుదల విషయంలో ఆయన, ప్రధాని డాక్టర్ శ్రీ కృష్ణ సిన్హా ఇద్దరూ అప్పటి గవర్నర్ మారిస్ గార్నియర్ హాలెట్‌తో విభేదించారు. ఇద్దరూ రాజీనామా చేశారు. దాంతో గవర్నర్ వారి డిమాండుకు ఒప్పుకున్నాడు. వారు మళ్లీ తమ పదవులను కొనసాగించారు. కానీ వారు 1939 లో, దేశంలోని అన్ని కాంగ్రెసు ప్రభుత్వాలు చేసినట్లుగానే, రెండవ ప్రపంచ యుద్ధంలో భారత ప్రజల సమ్మతి లేకుండా భారతదేశాన్ని ఇరికించిన అంశంపై రాజీనామా చేశారు. [12]

1940-41లో సత్యాగ్రహం ఉదయంలో పాల్గొన్నాడు. [10] బ్రిటిషు అధికారులు అతనిని అరెస్టు చేసి, [12]1942 లో హజారీబాగ్ కేంద్ర కారాగారంలో బంధించారు. 1944 లో అతను విడుదలయ్యాడు. అంటువ్యాధి పీడిత ప్రజలకు సేవ చేయడానికి అంకితమయ్యాడు.


1937, 1946 లలో శ్రీ కృష్ణ సిన్హా, అనుగ్రహ బాబుల నేతృత్వంలో బీహార్‌లో ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. వారు బీహార్‌లో ఆదర్శప్రాయమైన ప్రభుత్వాన్ని నడిపారు. [13] బీహార్ రాష్ట్రంలో అనేక అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టారు. కోషి, అఘౌర్, సక్రి వంటి నదీలోయ ప్రాజెక్టులు చేపట్టారు. మొదటి పంచవర్ష ప్రణాళిక కాలంలో వ్యవసాయ రంగానికి, గ్రామీణాభివృద్ధి పనుల అభివృద్ధికీ ప్రధన్యత నిచ్చారు. వాస్తవానికి, దేశంలో మొదటి పంచవర్ష ప్రణాళిక అమలు చెయ్యడంలో బీహార్ అగ్ర స్థానంలో ఉంది. ఈ విషయాన్ని శాసనసభలో ప్రకటించాడు. అప్పటి భారత ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ రాష్ట్రాలలో పరిపాలనను అంచనా వేయడానికి పాల్ హెచ్. యాప్లేబీని నియమించాడు. బీహారులో అత్యున్నతమైన పరిపాలన ఉందని అతడు నివేదించాడు. [14]

రెండవ పంచవర్ష ప్రణాళిక కాలం నుండి, బీహార్లో పారిశ్రామికీకరణ ప్రక్రియ వేగవంతమైంది. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం అనేక పరిశ్రమలను ఏర్పాటు చేసారు. నేపాల్‌కు వెళ్ళిన భారత ఆహార, వ్యవసాయ ప్రతినిధి బృందానికి నేతృత్వం వహించాడు.కెనడా, స్విట్జర్లాండ్‌లోని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ILO) కు వెళ్ళిన భారత ప్రతినిధి బృందానికి కూడా నాయకత్వం వహించాడు. అతను భారతదేశంలోను, విదేశాలలోనూ అనేక ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థలకు నాయకత్వం వహించాడు. [10]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. 'Aim to develop institute into university' HARD TALK/ DM Diwakar. Telegraphindia.com (7 November 2011). Retrieved on 7 December 2018.
  2. Nalin Verma. (10 April 2014) Goodbye to good life for heirloom. Telegraphindia.com. Retrieved on 7 December 2018.
  3. "Members of the Constituent Assembly Bihar". Parliament of India. Retrieved 20 May 2005.
  4. "Great freedom Fighters". Kamat's archive. Archived from the original on 20 February 2006. Retrieved 25 February 2006.
  5. Shankar Dayal Singh (1994). Surabhita smr̥tiyāṃ. Prabhāta Prakāśana. pp. 403–. ISBN 978-81-7315-034-0.
  6. Shree Shankar Sharan (13 December 2005). "The Better Man Has Won". India Rights Online. Archived from the original on 27 May 2013.
  7. F. Tomasson Jannuzi (2014). Agrarian Crisis in India: The Case of Bihar. University of Texas Press. ISBN 9781477300145. Retrieved 6 January 2019.
  8. Arun Sinha (2011). Nitish Kumar and the Rise of Bihar. Penguin Books, India. p. 31. ISBN 9780670084593. Retrieved 6 January 2019.
  9. "Rajputs fume as Anugrah Narayan Sinha's kin out of Aurangabad poll race | Patna News - Times of India". The Times of India.
  10. 10.0 10.1 10.2 10.3 "Anugrah babu-first Bihar Deputy CM". Indian Post. Retrieved 16 December 2004.
  11. "SATYAGRAHA LABORATORIES OF MAHATMA GANDHI". aicc.org.in. Archived from the original on 6 December 2006. Retrieved 8 December 2006.
  12. 12.0 12.1 12.2 12.3 Dr. Rajendra Prasad's Letters (1984). First Finance cum Labour Minister. Rajendra Prasad's archive. p. 123. ISBN 9788170230021.
  13. S. Sharan (20 December 2005). "CHANGE IN BIHAR: The Better Man Has Won (Editorial)". The Statesman. India. Archived from the original on 3 October 2011.
  14. Bihar Vibhuti's Legacy Drifting into Oblivion? Archived 2012-01-25 at the Wayback Machine. PatnaDaily (6 January 2012). Retrieved on 7 December 2018.