భూటాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
འབྲུག་ རྒྱལ་ཁབ་
'బ్రుగ్ ర్గ్యాల్-ఖాబ్
ద్రూ గఖప్
భూటన్ రాజ్యము
Flag of భూటాన్ భూటాన్ యొక్క చిహ్నం
భూటాన్ యొక్క స్థానం
భూటాన్ యొక్క స్థానం
రాజధానిథింపూ
అధికార భాషలు డ్జోంగ్ఖా, ఇంగ్లీషు
ప్రభుత్వం ప్రజాస్వామ్య రాచరికం
 -  చక్రవర్తి జిగ్మే ఖేసార్ నాంగ్యాల్ వాంగ్‌ఛుక్
 -  ప్రధానమంత్రి కింజాంగ్ దోర్జీ
స్థాపన 17వ శతాబ్దం తొలినాళ్ళు 
 -  వాంగ్‌ఛుక్ వంశం 1907, డిసెంబరు 17 
 -  జలాలు (%) అత్యల్పం
జనాభా
 -   అంచనా 672425 (2005) 
 -  జన సాంద్రత 45 /కి.మీ² (149వ)
117 /చ.మై
జీడీపీ (PPP) 2005 అంచనా
 -  మొత్తం $3.007 బిలియన్ (160వది)
 -  తలసరి $1,400 (117వది)
మా.సూ (హెచ్.డి.ఐ) (2004) Increase 0.538 (medium) (135వది)
కరెన్సీ గుల్ట్రమ్ (BTN)
కాలాంశం BTT (UTC+6:00)
 -  వేసవి (DST) పాటించరు (UTC+6:00)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .bt
కాలింగ్ కోడ్ +975
1 The population of Bhutan had been estimated based on the reported figure of about 1 million in the 1970's when the country had joined the United Nations and precise statistics were lacking [1]. Thus using the annual increase rate of 2-3%, the most population estimates were around 2 million in the year 2000. A national census was carried out in 2005 and it turned out that the population was 672,425 [2]. Consequently, United Nations Population Division had down-estimated the country's population in the 2006 revision [3] for the whole period from 1950 to 2050.

భూటాన్ రాజ్యం దక్షిణాసియాలోని భూపర్యవేష్టిత (ల్యాండ్ లాక్) దేశం. ఇది హిమాలయాల తూర్పు వైపు ఆఖరు భాగంలో హిమాలయ పర్వత శ్రేణుల మధ్య ఉంది. భూటాన్‌కు దక్షిణ, తూర్పు, పడమట సరిహద్దులలో భారత భూభాగము, ఉత్తర సరిహద్దులలో చైనా దేశంలో భాగమైన టిబెట్ ఉన్నాయి. భూటాన్‌ను నేపాల్ నుండి భారతదేశంలోని రాష్ట్రమైన సిక్కిం వేరుచేస్తుంది. భూటానీయులు తమ దేశాన్ని డ్రక్ యూ (ఉరుముల డ్రాగన్ భూమి) అని పిలుస్తారు.

భూటాన్ ఒకప్పుడు ప్రంచానికంతటికీ దూరంగా ఏకాంతంగా ఉండే దేశాలలో ఒకటి. కానీ ప్రస్తుతం దేశంలో సాంకేతిక, ఇతర అభివృద్ధి కారణంగా ప్రపంచానికి భూటాన్ ద్వారాలు తెరవబడ్డాయి. ఇంటర్‌నెట్ (అంతర్జాలం), మొబైల్ ఫోన్లు, కేబుల్ టీవి కార్యక్రమాలు, అంతర్జాతీయ విమానసేవలు భూటాన్‌ను ప్రపంచంతో అనుసంధానం చేయడంలో ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. సనాతన ధర్మాలు సంస్కృతిని కాపాడుతూ అధునికతకు మారుతూ సమతూకాన్ని కాపాడుతూ భూటాన్ అభివృద్ధి పధంలోకి నడుస్తూ ఉంది. భూటాన్ పరిసరాలకు కీడు కలిగించే కార్యాలకు అనుమతి లభించదు. భూటాన్ ప్రభుత్వం సంస్కృతి రక్షణ, పరిసరాల రక్షణ, తమ ప్రత్యేకత కాపాడటానికి ప్రాముఖ్యత నిస్తుంది. 2000లో భూటాన్ వ్యాపార వారోత్సవాల (బిజినెస్ వీక్) తరువాత భూటాన్ అత్యంత ఆనందకరమైన దేశంగా వరల్డ్ మ్యాప్ ఆఫ్ హ్యాపీనెస్ 2000 సంవత్సరపు పరిశీలన ద్వారా గుర్తించబడింది.

భూటాన్ భూభాగం దక్షిణంలో సమశీతోష్ణ మండల మైదానాలు, ఉత్తరాన ఉన్న హిమాలయ శిఖరాలు వీటి ఎత్తు సముద్ర మట్టానికి 7,000 మీటర్లు (23,000 అడుగులు) ఉంటుంది. భూటాన్ దేశం యొక్క మతం వజ్రయాన బౌద్ధం. బుద్ధమతస్థుల సంఖ్య అధికం. రెండవ స్థానంలో హిందూ మతం ఉంది. రాజధాని పెద్దనగరం థింఫూ. దీర్ఘ కాలిక రాజపాలన తరువాత 2008మార్చిలో మొట్టమొదటగా ప్రజా ప్రభుత్వం అమలు చేయడానికి కావలసిన ఎన్నికలు నిర్వహించింది. అంతర్జాతీయ సమాఖ్యలలో ఐక్యరాజ్య సమితి లోనూ, ఆసియా అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్లో భూటాన్‌కు సభ్యత్వం ఉంది. రాజుల పరిపాలనలో ఎక్కువ రోజులు ఉన్న దక్షిణాసియా దేశాలలో భూటాన్ ఆఖరుది. అసియాలో ఎప్పుడూ కాలనీ ఆధీనంలో లేని కొన్ని దేశాలలో భూటాన్ ఒకటి. పొగాకు వినియోగంతోపాటు వివిధ రకాల ఉత్పత్తుల్నీ నిషేధించిన మొట్టమొదటి దేశంగా భూటాన్ చరిత్ర సృష్టించింది.

పేరు చరిత్ర

[మార్చు]

భూటాన్ అనే పేరు సంస్కృతం నుండి వచ్చిందని అంచనా. భో-ఉత్థన్ అంటే హిమాలయాల ఉన్నత భూభాగమని అర్ధం. ఇంకొక అంచనా భోత్స్-అంత్ అంటే టిబెట్ ఆఖరి భాగము. టిబెట్‌కు ఇది దక్షిణ సరిహద్దులో ఉన్నందున ఈ పేరు వచ్చిందని అంచనా.
చారిత్రకంగా భూటాన్‌కు అనేక నామాలు ఉన్నాయి. ల్హోమాన్ (దక్షిణ చీకటి భూభాగము ), ల్హో త్సెన్‌డెన్జోంగ్ (సైప్రస్ యొక్క దక్షిణభూభాగము), ల్హోమన్ ఖజీ (నలుదిక్కుల దక్షిణ భూభాగం) ఇంకా ల్హోమెన్ జఁగ్ (మొక్కల దక్షిణ భూభాగం) వీటిలో కొన్ని.

చరిత్ర

[మార్చు]
భూటాన్ ప్రభుత్వ కార్యాలయం

భూటాన్‌లో ఉన్న రాతి పనిముట్లు, ఆయుధాలు, ఏనుగులు, పెద్దపెద్ద శిల్పాల అవశేషాలు ఇక్కడ క్రీ.పూ 2000లకు మునుపే మానవులు నివసించినందుకు సాక్ష్యాలు. అయినా రాతపుర్వాకంగా చారిత్రకాధారాలు ఏమీ లేవు. భూటాన్ గురించి తెలుసుకోవడానికి 747 సంవత్సరంలోని బుద్ధ సన్యాసి పద్మసంభవు (గురు రిన్‌పోచ్) ని గురించిన సమాచారం మొదటిది. భూటాన్ పురాతన చరిత్ర అస్పష్టమే. 1827లో రాజధాని పునఖలో జరిగిన అగ్నిప్రమాదం కారణంగా ఆధారాలు నాశనమైనట్లు అంచనా, అయినా అంతకు ముందు ప్రాచీన చరిత్ర భద్రపరచిన ఆధారాలు కూడా చాలినంత లభించలేదు. 10వ శతాబ్ద కాలంలో రాజకీయాలపై మతాధిక్యము అధికంగా ఉండేది. మంగోల్ ప్రభువులచే అవలంబింపబడిన వివిధ బౌద్ధమత శాఖలు అవతరించాయి. 14వ శతాబ్దంలో మంగోలీయుల పతనం తరువాత ఈ ఉపశాఖలు ఒకరిపై ఒకరు మతపరమైన రాజకీయపరమైన ఆధిక్యత ప్రదర్శించారు. చిట్టచివరకు 16వ శతాబ్దానికి దృక్పా ఉపశాఖ ఆధిక్యంలోకి వచ్చింది.

17వ శతాబ్దానికి ముందు భూటాన్‌ చిన్న చిన్న మండలాలుగా మాత్రమే ఉంది. టిబెటన్ లామా మతపరమైన సమస్యల కారణంగా దేశం నుండి పారిపోయి ఇక్కడకు వచ్చి అక్కడక్కడా కోటలను నిర్మించి ఈ ప్రదేశాన్ని సమైక్యం చేయడం మొదలు పెట్టాడు. తరువాత కొన్ని చట్ట పరిమితులను అమలు పరచి ప్రాంతీయ ప్రభువులను కేంద్రీకృత అధికారంలోకి తీసుకు వచ్చాడు. డ్జోంగ్‌లనబడే ఈ కోటలు అనేకం ఇంకా సజీవంగా ఉన్నాయి. అవి ప్రస్తుతం మతపరమైన, జిల్లా నిర్వాహపరమైన కేంద్రాలుగా ఉపయోగ పడుతున్నాయి. 1651లో నమ్‌గ్యోల్ మరణానంతరం భూటాన్లో అంతర్యుద్ధాలు ప్రారంభం అయ్యాయి. ఇది అనుకూలంగా తీసుకుని టిబెటన్లు 1710, 1730లలో మంగోలీయుల సహాయం తీసుకుని భూటాన్‌పై యుద్ధానికి దిగారు. రెండు యుద్ధాలను విజయవంతంగా ఎదుర్కొని 1759లో టిబెట్‌తో సంధి కుదుర్చుకున్నారు.
18వ శతాబ్దంలో భూటాన్ దక్షిణ ప్రాంతంలోని కూఁచ్ బిహార్ రాజ్యాన్ని 1772లో దండెత్తి వశ పరచుకున్నారు. కూఁచ్ బిహార్ ఈ వ్యవహారాన్ని బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ వరకూ తీసుకు వెళ్ళారు. వారి సారథ్యంలో కూఁచ్ బిహార్ భూటానీయుల్ని తమ సరిహద్దుల నుండి తొలగించారు. 1774లో భూటాన్ బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందం కారణంగా తిరిగి తమ పాత సరిహద్దులను ధ్రువపరచుకున్నారు. అయినప్పటికీ సరిహద్దు ఉద్రిక్తతలు అలాగే 1 శతాబ్ద కాలం కొనసాగాయి. పర్యవసానం ఇరు దేశాల మధ్య దుర్ వార్ యుద్ధానికి దారితీసింది. ఇది 1864 నుండి 1865 వరకు కొనసాగి భూటాన్ అపజయం తరువాత ట్రీటీ ఆఫ్ సించులా పేరుతో ఒప్పందంతో ముగింపుకు వచ్చింది. 50,000 రూపాయల బాడుగ కుదుర్చుకుని బ్రిటన్ దురాస్ మీద అధికారం భూటాన్‌కు వదిలింది. ఈ ఒప్పందంతో బ్రిటిష్ ఇండియా భూటాన్‌ల మధ్య పగలు చల్లారాయి.

1870లో పారో, తోంగ్సాల మధ్య ఉన్న పరస్పర వైరం కారణంగా ఏర్పడిన పేచీలు తీవ్రరూపందాల్చి అంతర్యుద్ధానికి దారితీశాయి. ఎట్టకేలకు తోగ్సా గవర్నర్ (పన్‌లాప్) వుగ్‌యెన్ వాంగ్‌చుక్ తన రాజకీయ ప్రత్యర్థులను ఓడించి ఆధిక్యతను నిరూపించుకుని దేశాన్ని సమైక్యం చేసాడు. 1882 నుండి 1885ల మధ్య జరిగిన అంతర్యుద్ధాలు తిరుగుబాట్లను సమర్ధవంతంగా అణచివేయడానికి ఈ సమైక్యత ఎంతో తోడ్పడింది.

1907 సంవత్సరం భూటాన్ చరిత్రలో ఒక మైలురాయి. వుగ్‌యెన్ వాంగ్‌చుక్ మనస్ఫూర్తిగా సన్యాసులు, ప్రభుత్వాధికారులు, దేశ ప్రముఖుల సమక్షంలో వంశపారంపర్య పాలనాధికారం ఇస్తూ భూటాన్‌ను పాలించడానికి రాజుని ఎన్నుకుని అతనికి రాజ్య పాలనాధికారాన్ని ఇచ్చాడు. వెంటనే బ్రిటిష్ ప్రభుత్వంచే ఈ రాజ్యం గుర్తించబడింది. 1910 బ్రిటన్, భూటాన్‌ల మధ్య కుదిరిన ఒప్పందంతో భూటాన్ చరిత్ర మరొక మలుపు తిరిగింది. భూటాన్ విదేశీ వ్యవహారాలకు మార్గదర్శిగా ఉండటానికి గ్రేట్ బ్రిటన్కు అనుమతి ఇచ్చింది. ఇది భూటాన్ ఏంకాంతానికి, టిబెట్‌తో సాంస్కృతిక సంబంధాలు పునరుద్ధరించడానికి కారణం కాకపోయినా భూటాన్ సంపూర్ణ సార్వభౌమ్యత్యం లేని రాజ్యం అని ప్రంపంచం గుర్తించడానికి తోడ్పడింది.

1947 ఆగస్టు 15న భారతదేశానికి యునైటెడ్ కింగ్‌డమ్ నుండి స్వాతంత్ర్యం లభించిన తరువాత భారతీయుల స్వాతంత్ర్యాన్ని గుర్తించిన మొదటి దేశం భూటాన్. స్వతంత్ర దేశంగా అవతరించిన భారతదేశంతో 1949 ఆగస్టు 8న భూటాన్ 1910లో జరిగినలాంటి ఒప్పందాన్ని చేసుకుంది. 1953లో భూటాన్‌ను ప్రజాప్రభుత్వ పునరుద్ధరణ దిశగా అడుగులు వేయడం మొదలుపెట్టింది ఇందులో భాగంగా రాజు జిగ్మె డోర్జి వాంగ్‌చుక్ 130 నేషనల్ అసంబ్లీ సభ్యులతో దేశానికి లెజిస్లేచర్ సభను స్థాపించాడు.1968లో మంత్రి మండలి ఏర్పాటు జరిగింది. 1971లో ఐక్యరాజ్యసమితికి భూటాన్‌ను 3 సంవత్సరాల కాలం పరిశీలించడానికి కావలసిన అనుమతి లభించింది. 1972లో డ్రోజీ వాంగ్‌చుక్ మరణాంతరం 16 సంవత్సరాల జిగ్మి సింఘే వాంగ్‌చుక్ అలంకార ప్రాయంగా మారిన సింహాసనాన్ని అధిష్టించాడు.

1980లో భూటాన్ ప్రత్యేకత బలపరచడానికి ప్రజల మధ్య ఐక్యత సాధించడానికి ఒకే రాజ్యం ఒకే ప్రజ నినాదంతో తీవ్ర ప్రయత్నాలు ఆరంభమయ్యాయి. "డ్జోంఖా" అధికార భాషగా నిర్ణయించబడింది. అదే సమయంలో నిర్వహించబడిన జనాభా లెక్కలు దక్షిణ భాగంలో నేపాలీ పూర్వీకులు అధికంగా నివసిస్తుండటాన్ని ధ్రువపరిచాయి. తరువాతి కాలంలో ఇది భూటాన్ ప్రభుత్వం, భూటాన్ శరణార్ధుల మధ్య చెలరేగిన అసమ్మతి యుద్ధానికి దారి తీసింది.

ప్రభుత్వం

[మార్చు]

చట్ట వ్యతిరేకంగా నివసిస్తున్న నేపాలీలను దేశంనుండి తొలగించాలని భూటాన్ ప్రభుత్వం చేపట్టిన ప్రయత్నాలు అనేక రూపాలలో తీవ్రవాదం చెలరేగడానికి కారణమైంది. తీవ్రవాదులు స్కూల్స్, వైద్యశాలలు, కార్యాలయాలు, దక్షిణప్రాంత ప్రకృతి వనరులపై తమ ప్రభావం చూపెట్టారు. పరిస్థితులను అదుపులోకి తీసుకు రావడానికి యువకులను, దృఢగాత్రులైన ప్రభుత్వోద్యోగులను బలవంతంగా సైన్యంలోకి తీసుకోవడం ప్రారంభించారు. ఈ ప్రయత్నాలు చట్టవ్యతిరేక నేపాలీ నివాసితులతో చేరి చాలా మంది దక్షిణ ప్రాంత భూటానీయులు రాజకీయ చరిత్ర ఉన్నవాళ్ళు కూడా నేపాల్‌కు శరణార్ధులుగా పారిపోయారు. అలా పారిపోయిన వారు ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో నడప బడుతున్న శరణార్ధుల నిలయాలలో అనుమతించ బడ్డారు.

శరణార్ధులు

[మార్చు]

భూటాన్ జనాభా లెక్కలు దక్షిణంలో అధిక్యంలో నేపాలీలను వారి తిరుగుబాటును అదుపులోకి తీసువచ్చే ప్రయత్నాలు విజయవంతం కాకపోవడంతో నేపాలీ పూర్వీకుల పౌరహక్కును రద్దు చేసి వారిని తిరిగి నేపాల్‌కు పంపడం ప్రారంభించారు.

భూటాన్ ప్రభుత్వం ప్రయత్నాలు వారితో చేరి వెలుపలి నుండి భారత్, ఐక్యరాజ్యసమితి, యూరేపియన్ యూనియన్, యునైటెడ్ స్టేట్స్ సమస్య పరిష్కారం కోసం చేసిన ప్రయత్నాలు సరైన ఫలితాలు ఇవ్వలేదు.

1998లో రాజు జిగ్‌మి సింగెవాంగ్‌చుక్ రాజకీయ సంస్కరణలను చేపట్టాడు. రాజాధికారాలలో అధికభాగం మంత్రి మండలికి మార్చబడింది. అవసరమైతే మూడింట రెండు భాగాల ఆధిక్యతతో కౌన్సిల్ సభ్యులు రాజును కూడా పదవినుండి తొలగించ కలగడం దీనిలోని భాగమే. 2003లో భూటాన్ సైనిక దళం భారత్‌కు ప్రతికూలంగా భూటాన్‌లో శిక్షణ పొడుతున్న శిబిరాలను తొలగించే ప్రయత్నాలు తీవ్రతరం చేసి వాటిలో విజయం సాధించాయి. 1999లో భూటాన్ ప్రభుత్వం దూరదర్శన్‌, ఇనంటర్ నెట్ పై నిషేధాన్ని తొలగించింది. దూరదర్శన్‌ కార్యక్రమాలను ప్రజలకు అందించడంలో భూటాన్ ప్రపంచంలో కడపటి స్థానంలో ఉంది. భూటాన్‌ను ఆధుకనికరణీయం చేయడంలో దూరదర్శన్ పరిచయం ఒక మలుపు లాంటిదని కాని దానిని దుర్వినియోగం చేస్తే భూటాన్ సంస్కృతికి భంగం రావచ్చని అభిప్రాయపడ్డారు.

ప్రభుత్వ విధానాలు

[మార్చు]

భూటాన్ సంపూర్ణ రాజ్యాధికారం నుండి మిశ్రిత పాలనలోకి మారింది. 1999లో భూటాన్ రాజుచే మంత్రి మండలి స్థాపించబడింది. 2005 డిసెంబర్ 17న భూటాన్ 4వ రాజు తన పెద్ద కుమారునికి అధికారం బదిలీ చేస్తానని ప్రకటించాడు. 2005 డిసెంబరులో తండ్రి అధికారాన్ని పెద్ద కుమారుడు జగ్మి కేసర్ నమ్‌గ్యాల్ వాంగ్‌చుక్ చేపట్టాడు. అలాగే 2008 డిసెంబర్ 17 న జనరల్ ఎన్నికలు జరుగుతాయని ప్రకటించాడు.

దేశ రక్షణ వ్యవస్థ , విదేశీ సంబంధాలు

[మార్చు]

భూటాన్ రక్షణవ్యవస్థ పేరు రాయల్ భూటాన్ ఆర్మీ. ఇందులో రాయల్ బాడీ గార్డ్, రాయల్ భూటాన్ పోలిస్ అనే రెండు విభాగాలు ఉన్నాయి. 18 వయసు పైబడిన వారు స్వచ్ఛందంగా ఇందులో చేరవచ్చు. ప్రస్తుత సభ్యుల సంఖ్య 6,000 .వీరికి భారత సైనిక దళం శిక్షణ ఇచ్చింది. ఇందు కోసం భూటాన్ ప్రభుత్వం 1.37 కోట్ల అమెరికా డాలర్లు వెచ్చిస్తుంది. భూటాన్ భూపర్య వేష్టిత దేశం కనుక నావికాదళం అవసరం లేదు. భూటాన్‌కు భారత్‌కు మధ్య 1949లో చేసుకున్న ఒప్పందం కొన్ని సమయాలలో అపార్ధానికి గురి అయింది. భూటాన్ విదేశీ వ్యవహారాలను భారత్ అదుపు చేసున్నట్లు కొన్ని సమయాలలో భావించబడింది. కానీ భూటాన్ విదేశీ సంబంధాలు చైనాతో ఉన్న సరిహద్దు సమస్యలతో సహా స్వయంగానే నిర్వహిస్తుంది. 2007లో భూటాన్ భారత్‌ల మధ్య జరిగిన ఒప్పందం 1949 ఒప్పందాన్ని అధిగమించింది. భూటాన్ విదేశీ వ్యవహారాలపై సంపూర్ణ అధికారం పొందింది. భూటాన్‌కు 22 దేశాలతో దౌత్య సంబంధాలున్నాయి. యురేపియన్ యూనియన్, భారత్, తాయ్‌లాండ్, కువైట్ వాటిలో కొన్ని భారత్, బంగ్లాదేశ్ మాత్రమే భూటాన్‌లో దౌత్య కార్యాలయాలను నడుపుతున్నాయి. తాయ్‌లాండ్ ఆలోచనా కేంద్రం భూటాన్‌లో ఉంది.

దీర్ఘకాల ఒప్పందం ఇరు దేశాల మధ్య ఉన్న సత్సంబంధాల కారణంగా భూటాన్, భారత్ పౌరులు పాస్‌పోర్ట్, వీసా లాంటి అనుమతి లేకుండా వారి జాతీయ గుర్తింపు కార్డూల సహాయంతో ఇరుదేశాలలో ప్రయాణించవచ్చు. భూటాన్ పౌరులు భారత్‌లో పనిచేయడానికి ఎలాంటి చట్ట పరమైన నిబంధనలు లేవు. భూటాన్‌కు ఉత్తర సరిహద్దుల్లో ఉన్న చైనాతో దౌత్య సంబంధాలు లేవు. సమీప కాలంలో ఇరు దేశాల ప్రముఖులు ఒకరి దేశానికి ఒకరు విచ్చేయడం గుర్తించ తగినంత అధికం అయింది. 1998లో చైనా మొదటి భూటాన్‌ల మధ్య మొదటి ఒప్పదం జరిగింది. భూటాన్ మాక్యూ, హాంగ్‌ కాంగ్‌లలో ఆలోచనా కార్యాలయాలను ఏర్పాటు చేసింది. చైనా, భూటాన్ సరిహద్దుల నిర్ణయంలో ఇంకా వివాదాలు చెలరేగుతున్నాయి.[1]2005 అక్టోబరు 13న పరిస్థితులను కారణం చూపుతూ చైనా సైనికులు భూటాన్ సరిహద్దులను దాటారు. మానవతా దృక్పధంతో భూటాన్ ప్రభుత్వం ఇందుకు అంగీకారం తెలిపింది. ఆ తరువాతి కాలంలో చైనీయులు భూటాన్ భూభాగంలో భవనాలు, వంతెనలు, రోడ్ల నిర్మాణం చేపట్టారు. ఈ విషయం భూటాన్ ప్రభుత్వం చైనా ప్రభుత్వ దృష్టికి తీసుకు వెళ్ళారు. ఇరు దేశాల మధ్య సమస్య అపరిష్కతంగానే ఉంది.

భౌగోళికం

[మార్చు]
భూటాన్ భౌగోళిక చిత్రం
గంగ్ఖార్ పూసమ్

భూటాన్ ఉత్తరభాగంలో ఎత్తైన పర్వత శిఖరాలు ఉంటాయి. వాటి ఎత్తు దాదాపు సముద్ర మట్టానికి 23,000 ఉంటుంది. అత్యంత ఎత్తైన శిఖరంగా గుర్తింపబడిన కుల కంగ్రి ఎత్తు సముద్ర మట్టానికి 24,780 అడుగులు. కానీ చైనీయుల కొలపరిమాణంలో గాంగ్ఖర్ శిఖరం ప్యున్‌సమ్ ప్రకటింప బడని ప్రపంచ ఎత్తైన శిఖరమని భావన. దాని ఎత్తు సముద్ర మట్టానికి 24,835 అడుగులు. హిమపాతం వలన లభించే నీటితో ఇక్కడ కొండ చరియలు పచ్చగా ఏపుగా పెరిగి జంతువుల పెంపకానికి అనువుగా ఉండటంతో గొర్రెల కాపరులు ఇక్కడికి వలస వస్తూ ఉంటారు.

భూటాన్ మధ్యభాగంలో ఉన్న నల్ల పర్వతాల నుండి ప్రవహించే మోచూ, డ్రాంగ్మి చూ నదులు దేశానికి ముఖ్య జనవనరులు. నల్ల పర్వత శిఖరాల ఎత్తు సముద్ర మట్టానికి 4,900 నుండి 8,900 అడుగులు. పర్వత దిగువ భాగంలో వేగంగా ప్రవహించే నదుల ప్రవాహం బాగా లోతుగా ఉంటుంది. భూటాన్ మధ్య భాగపు అడవులు భూటాన్ ఆటవిక ఉత్పత్తుల అవసరాన్ని తీరుస్తాయి. తోర్సా, రైడాక్, సంకో, మానాక్ భూటాన్ యొక్క ప్రధాన నదులు. ప్రజలు అధికంగా మధ్య ప్రాంతపు కొండలలో నివసిస్తుంటారు.

భూటాన్ లోని జకరండా చెట్లు
పున్ఖా వెల్లీలో గోధుమ పంట

భూటాన్ దక్షిణ భూభాగం షివాలిక్ పర్వతలోయలు దట్టమైన సుందరవనాలతో కప్పబడి ఉంటుంది. దిగువలో ఉన్న లోయలు నదీ ప్రవాహిత ప్రాంతాలలో ఉన్న పర్వత శిఖరాలు సముద్ర మట్టానికి 4,900 అడుగులు. పర్వత దిగువ భాగంలో దురాస్ మైదానాలు ఉన్నాయి. దురాస్ మైదానాలలో ఎక్కువ భాగం భారత భూభాగంలో ఉన్నాయి. ఇందులో 6-7 మైళ్ళ దూరం ఏటవాలు ప్రాంతం మాత్రం భూటాన్ భూభాగంలో ఉంది. భూటాన్ భూభాగంలోని దురాస్‌ను ఉత్తర, దక్షిణ అనే భాగాలు. ఉత్తర దురాస్‌లో భూమి రాతితో, పొడి మట్టితో దట్టంగా ఉన్న మొక్కలతో ఆటవిక జంతువులు నివాసయోగ్యంగా ఉంటుంది. దక్షిణంలో ఉన్న సారవంతమైన భూమిలో దట్టమైన గడ్డి, పలుచని, దట్టమైన అడవులతో, సెలయేళ్ళు, నదీ ప్రవాహాలతో ఉంటుంది. ఈ నదులు మంచు కరగటం, వర్షపు నీరు కారణంగా నిరంతరం ప్రవహిస్తూ బ్రహ్మపుత్రానదిలో కలసి భారత భాగంలో కలుస్తాయి. 2005లో భూటాన్ వ్యవశాయ మంత్రిత్వ శాఖ అంచనా ప్రకారం భూటాన్‌లో 64% అడవులు ఉన్నాయి.

భూటాన్ దక్షిణ ప్రాంతం సమశీతోష్ణ మండల వాతావరణం, శిఖరాలలో సంవత్సరమంతా మంచుతో అతిశీతల వాతావరణం, ఉత్తర భూటాన్‌లో వేసవి కాలం, వర్షాకాలం, ఆకురాలు కాలం, చలికాలం, వసంత కాలం కలిగిన అయిదు భిన్న వాతావరణం కలిగి ఉంటుంది. పడమట అధిక వర్షపాతం, దక్షిణ భూటాన్ ఉష్ణమైన వేసవి కాలం, శీతల చలికాలలతో ఉంటుంది. మధ్య భూటాన్ కొంచం పొడిగా వెచ్చని వేసవి, శీతల చలికాలాలతో ఉంటుంది.

హిమాలయాల కేంద్రభాగంలో భూటాన్, టిబెట్ మధ్యలో స్నోమాన్ ట్రేక్గా పిలువబడే ఘాట్ రోడ్ ప్రపంచంలో అత్యంత కష్టమైన ఘాట్ రోడ్‌గా గుర్తించబడింది. ఈ మార్గాలు సముద్ర మట్టానికి 16000 అడుగుల నుండి 17,600 అడుగుల వరకూ ఉంటుంది. ఈ మార్గం మొత్తం ప్రయాణం చేసింది కొన్ని వందల విదేశీయులు మాత్రమే.

ఆర్ధికం

[మార్చు]

భూటాన్ ఆర్థికరంగం వ్యవసాయం, ఆటవీ సంపద, పర్యాటకం, జల విద్యుత్ ఉత్పత్తులను భారత్‌కు అమ్మడం మీద ఆధారపడి ఉంటుంది. 80% ప్రజలు వ్యవసాయం మీద లభించే ఆదాయంతో జీవనం సాగిస్తున్నారు. వ్యవసాయదారునికి జీవితావసరాలకు చాలినంత ఆదాయం మాత్రమే వ్యవసాయం, జంతు పెంకం ద్వారా లభిస్తుంది. కుటీర పరిశ్రమ ద్వారా నేత ఉత్పత్తులు, మత సంబంధిత ఉత్పత్తులు చేస్తుంటారు. భూ పరిస్థితులు రహదార్లు, ఇతర నిర్మాణాలకు అనుకూలించని కారణంగానూ వాటికి అధికంగా ఖర్చు చేయవలసిన కారణంగానూ, సముద్ర మార్గాలు లేని కారణంగానూ ఇక్కడి ఉత్పత్తులకు తగినంత ప్రతిఫలం లభించదు. భూటాన్‌లో రైలు మార్గాలు లేవు. భారత ప్రభుత్వం దక్షిణ ప్రాంతాన్ని రైలు మార్గంతో అనుసంధించాలని ప్రయత్నాలలో భాగంగా 2005లో ఇరు దేశాల మధ్య ఒక ఒడంబడిక జరిగింది. 2008లో ఇరు దేశాల మధ్య జరిగిన ఒప్పందం స్వేచ్ఛాయుత వాణిజ్యానికి మార్గం సుగమమైంది. ఈ ఒప్పందం సుంకం లేకుండా ఇతర దేశాలకు భారత్ భూభాగం ద్వారా ఎగుమతి దిగుమతి చేసుకునే వసతి కల్పిస్తుంది. భూటాన్ ఎగువ భాగంలో టిబెట్ భారత్‌లను కలుపుతూ ఉన్న చారిత్రాత్మక వాణిజ్య మార్గం దేశ రక్షణ కారణంగా సైనిక వ్యవస్థ ఆధీనం చేసుకుని 1959లో మూసివేసింది. (అయినప్పటికీ స్మగ్లింగ్ ద్వారా చైనా వస్తువులు భూటాన్‌లోకి ప్రవేశిస్తూనే ఉంది).

పారిశ్రామిక రంగం ఇంకా బాల్యదశలో ఉన్న కారణంగా దేశంలో భూటాన్ కటీర పరశ్రమదే ఉత్పుత్తులలో ఆధిక్యం .సిమెంట్, స్టీల్, ఫెర్రో అల్లాయ్ సంస్థకు ప్రోత్సాహం లభిస్తున్నా రహదారి నిర్మాణం లాంటి అభివృద్ధి పనులలో భారత్ ఒప్పంద శ్రామికులు పనిచేస్తున్నారు. వ్యవసాయం ద్వారా బియ్యం, గోదుమలు, మొక్కజొన్నలు, బార్లీ, పాల ఉత్పత్తులు (కొంత యాక్, ఎక్కువగా ఆవులు), మిరపకాయలు, దుంపలూ, ఆఫిల్ మొదలైనవి దిగువ ప్రాంతంలో ఉత్పత్తి చేస్తుంటారు. సిమెంట్, కలప సామాన్లు, మత్తు పానీయాలు, పక్వం చేయబడిన పండ్లు, కాల్షియం కార్బేట్ అదనపు ఉత్పత్తులు.

భూటాన్ విద్యుత్, యాలికులు, జిప్సమ్, టింబర్, కలప, సిమెంట్, పండ్లు, సువాసనాద్రవ్యాలు ఎగుమతి ద్వారా 12.8కోట్ల యూరోలు. దిగుమతులు 16.4 కోట్ల యూరోలు. ఇది లోటు బడ్జెట్‌కు దారితీస్తుంది. భూటాన్ ఎగుమతులు చమురు, చమురు ఉత్పత్తులు, ధాన్యము, యంత్రాలు, వాహనాలు, బట్టలు, బియ్యం. భూటాన్ ఎగుమతులను భారత్‌‌ 87.9%, బంగ్లాదేశ్ 4.6%, ఫిలిప్పైన్‌కు 2% దిగుమతి చేసుకుంటాయి. టిబెట్ మార్గం మూసివేత చైనాతో వాణిజ్యాన్ని నిలిపివేసింది. భూటాన్ 71.3% భారత్‌ నుండి, జపాన్ నుండి 7.8%, ఆస్ట్రియా నుండి 3% దుగుమతి చేసుకుంటుంది.

జిల్లాలు

[మార్చు]

భూటాన్ డ్జోంగ్‌డేగా విభజించి పాలనా నిర్వహణ చేస్తారు. వీటిని డ్జోంగ్‌ఖాంగ్ (జిల్లాలు) లుగా విభజిస్తారు. భూటాన్లో 20 డ్జోంగ్‌ఖాంగ్లు ఉన్నాయి. పల్లెల (జివాగ్) ను ప్రజలచే ఎన్నుకోబడిన గప్ పాలనలో ఉంటుంది.

జనసంఖ్య

[మార్చు]
చిరునవ్వు చిందిస్తున్న భూటానీ పౌరుడు

భూటాన్ ప్రజలలో సంప్రదాయక సమూహాలదే పైచేయి. రెండవ స్థానంలో భూటాన్ పడమటి ప్రాంతాలలో బుద్ధులలో ఒక శాఖ అయిన ఎన్గాలోప్స్ ఉన్నారు. వారి సంస్కృతి టీబెట్ దేశస్తులను పోలి ఉంటుంది. అలాగే తూర్పున ఉండే వాళ్ళను షార్చోప్స్ అంటారు. అధునిక కాలంలో వీరిద్దరి మధ్య జాత్యంతర వివాహాలు జరుగుతున్నాయి. 1970 ఆరంభంలో భూటాన్ ప్రభుత్వం లోత్షమ్పాశ్, భూటాన్ ప్రధాన సంప్రదాయుకుల జాత్యంతర వివ్వాహాలను ప్రోత్సహించింది.

దేశీయ భాష డ్జోన్ఖా, ఇది టిబెట్‌లోని 53 భాషలలో ఒకటి. అక్షరాలను ఛోకే (ధర్మ భాష) అంటారు. ఇది గుర్తింపు పొందిన టిబెట్ సంప్రదాయిక భాష. పాఠశాలలలో ఆంగ్ల మాధ్యమంతో పాఠాలు బోధిస్తూ డ్జోన్ఖా దేశీయ భాషగా నేర్పుతారు. అంతర్జాతీయ భాషా సంస్థ భూటాన్‌లో టిబెట్, బర్మా దేశభాషలకు చెందిన 24 భాషలు మాట్లాడే వారు ఉన్నారని గుర్తించింది. వీరు కాక నేపాల్, ఇండో ఆర్యన్ భాషలు మాట్లాడే వారు ఉన్నారు. 1980 వరకు ప్రభుత్వం దక్షిణ భూటాన్‌లో నేపాలీ భాషను బోధించే ఏర్పాటు కలిగించింది. తరువాతి కాలంలో దేశంలో రాజకీయ వాతావరణంలో జరిగిన మార్పులు నేపాలీ భాషా బోధను విడిచి పెట్టేలా చేశాయి. ఏది ఏమైనా భూటాన్ భాషలు ఇంకా క్రమబద్దీకరింపబడలేదు.

దేశీయ అక్షరాస్యత 59.5%. సరాసరి వివాహ వయో పరిమితి 22.3 సంవత్సరాలు. సరాసరి వయో పరిమితి 62.2 సంవత్సరాలు. స్త్రీల వయో పరిమితి 61 సంవత్సరాలు. సమీపకాల ప్రపంచ బ్యాంకు గణాంకాలను అనుసరించి పురుషుల వయో పరిమితి 64.5 సంవత్సరాలు. దేశంలో 1000 మంది స్త్రీలకు 1,070 మంది పురుషులు ఉన్నారు.

దేశంలో మూడింట రెండు భాగాలు లేక నాల్గింట మూడు భాగాలు భాగం ప్రజలు దేశీయ మతమైన వజ్రయాన బుద్ధిజం అవలంబీకులని అంచనా. మూడవ లేక నాల్గవ భాగం ప్రజలు హిందూ ధర్మ అవలంబీకులని అంచనా. ముస్లిములు ఇతరులు 1% ఉన్నారు. ప్రస్తుతం మతావలంబన స్వేచ్ఛ ఉంది. మత మార్పిడులకు రాజరీకం ప్రోత్సాహం లభించడం కష్టం. మత ప్రచార సంస్థల ప్రవేశంపై దేశంలో నిషేధాలున్నాయి. బౌద్ధేతర కట్టడాలకు అనుమతి లభించదు.

సంస్కృతి

[మార్చు]
19వ శతాబ్ద బౌద్ధ విశ్వం

సంస్కృతి భూటాన్‌ది. ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ దేశంలో సజీవంగా ఉన్న సంస్కృతి సంప్రదాయాలకే పెద్దపీట. బౌద్ధ మతము ఇక్కడి ప్రజలలో లోతుగా పాతుకు పోయింది. హిందూమతం రెండవ స్థానలోనూ, దక్షిణ ప్రాంతంలో అధికంగానూ ఉంది. రెండు మతాలు చక్కగా ఒకదానితో ఒకటి సంఖ్యంగా ప్రశాంతంగా సజీవంగా దీనికి ప్రభుత్వ సహకారం లభిస్తూ ఉంది. ప్రజలు ప్రభుత్వ సహకారానికి ఆనందిస్తున్నారు. ప్రభుత్వం సంస్కృతీ సంప్రదాయాలను సురక్షితంగా ఉంచే ప్రయత్నాలపై అధిక దృష్టి కేంద్రీకరిస్తున్నారు. ఇక్కడి కలుషితం కాని ప్రకృతి సౌందర్యం సాస్కృతిక వారసత్వం పర్యాటకుల మనసులో చెరగని ముద్ర వేయడం సహజం.

భూటాన్ పౌరులకు విదేశీ మార్గం సుగమమే అయినా విదేశియులకు భూటాన్ పర్యటన కొంచం కష్టమే భూటాన్ పర్యాటకుల వీసాలపై పరిమితులున్నట్లు ప్రచారంలో ఉంది. కానీ భూటాన్ ప్రభుత్వం వీసాలపై ఎలాంటి పరిమితులు విధించలేదు. వాస్తవంగా భూటాన్ పర్యాటకరంగం విశ్వసనీయమైంది. పర్యాటకులను ప్రోత్సహించే విధంగా అనుకూలమైన సేవలనందింస్తుంది. పర్యాటకుల కోరికపై ఖరీదైన సేవలందిస్తాయి.

నేషనల్ స్టేడియమ్లో పేరేడ్ ప్రదర్శన

వస్త్ర ధారణ

[మార్చు]

భూటాన్ పురుషుల సంప్రదాయ వస్త్రాలను ఘో అని అంటారు. మోకాలు వరకు ఉండే ఈ దుస్తులు ధరించినప్పుడు నడుము భాగంలో కెరా అనే బెల్టుణూ ధరిస్తారు. స్త్రీలు పాదల వరకు ఉండే సంప్రదాయ దుస్తులను ధరిస్తారు వీటిని కిరా అంటారు. దుస్తులకు ఉండే చిత్రాలు, రంగులూ, అలంకరణలూ పై దుస్తులూ వారి వారి అంతస్తుకు, తరగతులకు తగిన విధంగా మారుతుంటాయి. మత సంబంధిత ఉత్సవాలు ప్రజలులు ఒకచోట కూడే సమయాలలో ఆభరణాలను ధరిస్తారు. భూటాన్ ప్రభుత్వం ప్రజలను దైనందిక జీవితంలో బహిరంగ ప్రదేశాలలలో ప్రజలు దేశీయ వస్త్రాలను ధరించమని చట్టరీతిగా కోరుతుంది.

ఆహారం

[మార్చు]

బియ్యము, బక్ వీట్ (ఒక విధమైన గోధుమ), మొక్కజొన్నలు భూటాన్ ప్రజల ప్రధాన ఆహారం. పంది మాంసము, పశు మాంసము, యాక్ మాంసము, కోడి మాంసము, మటన్ భూటాన్ ప్రజల ఆహారంలో చోటు చేసుకుంటాయి. సూపులు వాటితో పచనం చేసిన మాంసం, కారం చేర్చిన ఎండపెట్టిన కూరకాలతో ఆహారం తయారు చేయబడుతుంది. చీజ్, ఘాటైన మసాలాలతో చేర్చి వండిన ఎమా దాట్షి భూటానీయుల జాతీయ ఆహారం. దీనిని భూటానీయులు గర్వకారణంగా భావిస్తారు. యాక్, పశువుల నుండి లభించే పాల ఉత్పత్తులైన వెన్న, చీజ్ కూడా ప్రధానాహారాలే. దాదాపు పాలంతా వెన్న, చీజ్‌గా మారుస్తారు. దేశంలో బట్టర్ టీ, టీ ప్రబలమైన పానీయాలు. దేశీయంగా తయారు చేసే రైస్ వైన్, బీర్ ఇక్కడి మత్తు పానీయాలు. ప్రపంచంలో పొగాకు ఉత్పత్తులను నిషేధించిన ఏకైక దేశం భూటాన్ మాత్రమే.

సంప్రదాయ క్రీడలు

[మార్చు]

భూటాన్ సంప్రదాయ క్రీడ విలువిద్య అన్ని ఊర్లలో పోటీలు క్రమ పద్ధతిలో జరుగుతూ ఉంటాయి. ఒలింపిక్ పోటీలలో చోటుచేసుకునే విలువిద్యకు దీనికీ తేడాలుంటాయి. 100 మీటర్లకంటే అధికమైన లక్ష్యంలో ఉన్న లక్ష్యాన్ని ఒక్కొక్క బృందంలోని సభ్యులు ఒక్కొక్కరు రెండు సార్లు లక్ష్యాన్ని ఛేదించే అవక్శం ఇస్తారు. పోటీలు గ్రామాల, టౌన్ల, అమెచ్యూర్ బృందాల మధ్య నిర్వహించ బడతాయి. డిగార్ భూటాన్ దేశీయ క్రీడలలో ఒకటి. ఇది షాట్ పుట్ క్రీడను పోలి ఉంటుంది. ఈ క్రీడలో గుర్రపు నాడాను చేర్చి విసరడం సంప్రదాయం. ఇక్కడి ప్రజల అభిమానాన్ని చూరగిన్న క్రీడలలో క్రికెట్ ఒకటి. భారత్ దూరదర్శన్ కార్యక్రమాలు ఇక్కడ అధికంగా ప్రసారం కావడం ఇందుకు కారణం. ఫుట్ బాల్ ప్రజలలో ప్రబలమౌతున్న క్రీడలలో ఫుట్‌బాల్ కూడా ఒకటి.

ఇతర సంప్రదాయాలు

[మార్చు]
ప్రదర్శనలో ఉపయోగించే ముసుగు

భూటాన్‌లో అధికంగానే సెలవు దినాలుంటాయి. దేశీయంగా కొన్ని మతపరమైనవి కొన్ని. జనవరి ఆరంభంలో చంద్రయానాన్ని అనుసరించి వింటర్ సాల్టిస్, చంద్రయాన క్రొత్త సంవత్సరారంభం. రాజు పుట్టినరోజు, మకుట ధారణ రోజు, సెప్టెంబరు 22న అధికారపూర్వక వర్షాకాల దినం, డిసెంబర్ 17న జాతీయ దినం, బౌద్ధ, హిందూ పర్వదినాలు ఇవి దేశంలోని సాదారణ సెలవు దినాలు.

ఉత్సవ సమయాలలో సంప్రదాయ సంగీతంతో కూడిన నృత్యాలు, నృత్యనాటికలు ప్రదర్శించబడతాయి. వివిధ రంగుల వస్త్రాలతో అలంకరించిన కొయ్య, ఇతర ముసుగులను ధరించి నాట్యాలు చేస్తారు. కావ్యనాయకుల పాత్రలు, ప్రతినాయకుల పాత్రలు, దయ్యాలు, దుష్ట పాత్రలు, పుర్రెలు, దేవుళ్ళు, జంతువులు, సామాన్యుల హాస్య రూపాలు (కారికేచర్స్) ను ప్రతిబించేలా ఈ ముసుగులను తయారు చేస్తారు. రాజరిక, ఆదివాసుల, మతపెద్దల పాత సంప్రదాయాన్ని ప్రతిబింబించే కళాత్మక ముసుగుల తయారీ నృత్యకారులను సహితం ఆనందింప చేస్తుంది. భూటాన్‌లో వారసత్వ ఆస్తులు మగవారికన్నా ఆడవారికి అధికంగా చేరుతాయి. పెద్దల ఆస్తులకు స్త్రీలు హక్కుదారులు ఔతారు. పురుషులు వారి భవిష్యత్తును వారే చూసుకోవాలని ఇక్కడి ప్రజల భావన. ఈ కారణంగా తరచుగా భార్య ఇంట్లో స్థిర పడుతుంటారు. నగర ప్రాంతాలలో ప్రేమ వివాహాలు సాధారణం. పెద్దలచే నిర్ణయించిన వివాహాలకే పల్లెటూర్లలో ముఖ్యత్వం. కుటుంబ ఆస్తులు చెదరకుండా ఉండటానికి, కుటుంబ ఐకమత్యానికి ఉపయోగిస్తుందని బహు భార్యత్వం, బహు భర్తత్వం భూటాన్ ప్రజల అంగీకారానికి పాత్రమైనవే.

ఇవీ చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Kuensel". Archived from the original on 2011-05-15. Retrieved 2008-10-15.
"https://te.wikipedia.org/w/index.php?title=భూటాన్&oldid=4052227" నుండి వెలికితీశారు