Jump to content

అమరకోశము

వికీపీడియా నుండి
(అమరకోశం నుండి దారిమార్పు చెందింది)
అమరకోశము పుస్తక ముఖచిత్రం.

అమరకోశము అనేది ఒక ప్రాచీన సంస్కృత నిఘంటువు. ఒకనాటి జాతీయ పాఠ్యపుస్తకం. అమరాన్ని రచించినది అమరసింహుడనే నిఘంటుకారుడు. ఆయన ఏ కాలీనుడో, ఏ ప్రాంతీయుడో, ఏ కులస్థుడో నిర్ధారించడానికి తోడ్పడే వివరాలేవీ ఆ గ్రంథంలో లేవు. బ్రిటీషువారు భారతదేశానికి రాకముందు మన ప్రాచీన గురుకుల పాఠశాలల వ్యవస్థలో పై తరగతుల పిల్లలకి అమరకోశంతో పాటు రఘువంశం, కుమారసంభవం, మేఘసందేశం, కిరాతార్జునీయం, శిశుపాలవధ అనే ఈ అయిదు పుస్తకాలూ తప్పనిసరి వాచకాలుగా నిర్దేశించబడ్డాయి. ఇవి కాక ఆంధ్రదేశ పాఠశాలల్లో మఱో అయిదు తెలుగు కావ్యాల్ని కూడా ఆంధ్ర పంచకావ్యాలుగా భావించి పిల్లల చేత చదివించేవారు. మహాకవులుగా పేరుపడ్డ గుఱ్ఱం జాషువా, శ్రీశ్రీ, విశ్వనాథ సత్యనారాయణ మొదలైన ఆధునిక కాల కవులతో సహా అందరూ తమ చిన్నప్పుడు అమరకోశ పాఠకులే.[1]

ఎన్.టి. రామారావు కూడా ఆయన హయాంలో కొంతకాలం పాటు దాన్ని ఒక పాఠ్యపుస్తకంగా అమలు జఱిపారు. కానీ ఆ ప్రయోగాన్ని కొనసాగించలేకపోయాడు.

పేరు

[మార్చు]

దీనికి గ్రంథకర్త పెట్టిన అసలు పేరు ’నామలింగానుశాసనమ్’. కానీ అమరసింహుణ్ణి బట్టి దీనికి జనంలో అమరకోశమనే పేరు ఖాయమైంది. నామమంటే పదం. పదాల్ని వాటి లింగాలతో సహా నిర్దేశించి (అనుశాసించి) చెప్పేది కనుక రచయిత దీన్ని ’నామలింగానుశాసన’మన్నాడు.

అమరాన్ని రచించినది అమరసింహుడనే నిఘంటుకారుడు. ఆయన ఏ కాలీనుడో, ఏ ప్రాంతీయుడో, ఏ కులస్థుడో నిర్ధారించడానికి తోడ్పడే వివరాలేవీ ఆ గ్రంథంలో లేవు. కానీ బౌద్ధుడనే వ్యవహారం పరంపరాగతంగా వస్తున్నది. దీని మీద ఒక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. భారతదేశంలో బౌద్ధం క్షీణిస్తూ వైదికమతం మళ్ళీ పుంజుకుంటున్న దశలో ఒక వైదిక రాజు తన రాజ్యంలో వైదికానికి మారడానికి ఇష్టపడని మొండిబౌద్ధు లందఱినీ నఱికించేస్తున్నాడట. అలా ఒకరోజున అలాంటివాళ్ళు 1,500 మందిని పట్టుకొని తెచ్చి నిలబెట్టి వరసగా నఱికేస్తున్నారట. ఆ వరసలో మొట్టమొదటివాడు అమరసింహుడు. ’నఱకండి’ అని ఆజ్ఞ అయినాక తలారి అమరసింహుడి దగ్గఱికొచ్చి ఖడ్గం ఎత్తబోతే అమరసింహుడు ’అట్నుంచి నఱుక్కురా’ అని కోరాడట. తలారి ’సరే’ నని అటు వెళ్ళాక, తన వంతు వచ్చేలోపు అమరసింహుడు ఆశువుగా 1, 500 శ్లోకాల్లో నామలింగానుశాసనం చెప్పాడంటారు. ’అట్నుంచి నఱుక్కురావడం’ అనే తెలుగు జాతీయం అప్పట్నుంచే ప్రచారంలోకి వచ్చిందని కూడా అంటారు. ఆ వధ్యస్థలిలో అతడు చెప్పిన వందలాది శ్లోకాల్ని ఎవరు అంత ధారణాశక్తితో జ్ఞాపకం ఉంచుకొని పొల్లుపోకుండా లోకానికి వెల్లడి చేశారో తెలియదు.

విషయం

[మార్చు]
అమరకోశము 1951 రాయలు అండ్ కో వారి పుస్తక ముఖచిత్రం.

అమరకోశాన్ని ’వర్గీకృత సంస్కృత పదజాలం’గా అభివర్ణించవచ్చు. ఈ రకమైన పుస్తకాలు ఈ రోజుల్లో ఆంగ్ల భాషక్కూడా లభిస్తున్నాయి. అయితే ఇది ఈనాడు పాశ్చాత్య పద్ధతిలో రచించబడుతున్న నిఘంటువుల్లా అకారాది (alphabetical order) గానో, వచనంలోనో కాక, విషయక్రమాన్ని దృష్టిలో ఉంచుకొని ధారణ కనుగుణమైన చిన్నిచిన్ని అనుష్టుప్ శ్లోకాలుగా వ్రాయబడింది.కారణం – ఇది పాశ్చాత్య నిఘంటువుల్లా ఆచూకీ (reference) కోసం కాక, విద్యార్థులు ధారణ చేయడం కోసం, వారు భాష మీద అతితక్కువ కాలంలో పట్టు సాధించడం కోసం ఉద్దేశించబడింది.

వ్యాఖ్యానాలు

[మార్చు]

అమరసింహుడు పర్యాయపదాలను చెప్పడంతో పాటు, వాటి లింగాలను కూడా స్పష్టీకరించి ఉండడం చేత దీనికి 'నామలింగానుశాసనం' అనే పేరు పెట్టాడు. మూడు కాండల ఈ గ్రంథములో 1500 శ్లోకాలలో 10,000 పద్యలు కూర్చి వాటికి ప్రామాణికములైన అర్థాలు ఇచ్చిన అమరసింహుని ప్రతిభ అనన్యసామాన్యము. అందుచేతనే ఈనాటికి కూడా దీనిలో శ్లోకాలైనా కంఠస్థం చేయని సంస్కృత విద్యార్ధి ఉండడనడంలో సందేహం లేదు. దీనికి దాదాపు 61 వ్యాఖ్యానాలున్నాయి. వీటిసంఖ్యను పట్టి దీనికి ఎంత ప్రచార ప్రాధాన్యాలున్నాయో మనం ఊహించుకోవచ్చును. ఇన్ని వ్యాఖ్యానాలున్నా అనగా ఈ వ్యాఖ్యానాలన్నింటిలోనూ క్రొత్త క్రొత్త విష్యాలేవో ఉంటాయని అర్ధం కాదు. ఈ గ్రంథం ఆసేతుహిమాచలమూ ప్రసిద్ధమై ఉండడంచేత ప్రతిప్రాంతంలోనూ ఆయా పండితులు, తమ తమ విద్యార్ధులు మొదలైనవారికి ఉపకరించే విధంగా వ్యాఖ్యలు వ్రాసినారు. ఆ వ్యాఖ్యానాల పేర్లు:

  • అచ్యుతోపాధ్యాయుని వ్యాఖ్యా ప్రదీపము
  • ఆశాధరుని క్రియాకలాపము
  • కాశీనాధుని కాశిక
  • క్షీరస్వామిఅమరకోశోద్ఘాటనము
  • గోస్వామి బాలబోధిని్్*నయనానంద రామచంద్రుని అమరకౌముది
  • నారయణశర్మ అమరకోశ పారిజాతము
  • నారాయణవిద్యావినోదుని శబ్దార్ధదీపిక
  • నీలకంఠుని సుబోదిని
  • పరమానందుని అమరకోశమాల
  • బృహస్పతి అమరకోశపంజిక
  • భరతమల్లికుని ముగ్ధబోధము
  • భానూజీదీక్షుతిని వ్యాఖ్యా సుధ
  • మంజుభట్టు 'గురుబాలబోధిని
  • మధురేశ విద్యాలంకారుని సారసుందరి
  • మల్లినాధుని అమరపదపారిజాతము
  • మహాదేవతీర్ధుని బుధమనోహర
  • మహేశ్వరుని అమరవివేకము
  • ముకుందశర్మ అమరబోధిని
  • రఘునాథచక్రవర్తి త్రికాండచింతామణి
  • రాఘవేంద్రుని అమరకోశవ్యాఖ్య
  • రామనాధుని త్రికాండవివేకము
  • రామప్రసాదుని వైషమ్యకౌముది
  • రామాశ్రముని అమరకోశవ్యాఖ్య
  • రామస్వామి అమరవృత్తి
  • రామేశ్వరశర్మ ప్రదీపమంజరి
  • రాయముకుటుని పదచంద్రిక
  • లక్ష్మణశాస్త్రి అమరవ్యాఖ్య
  • లింగభట్టు అమరబోధిని
  • లోకనాథుని పదమంజరి
  • శంకరుని వ్యాఖ్యామృతము
  • శ్రీధరుని అమరటీకా
  • సర్వానందుని టీకాసర్వస్వం
  • రంగాచార్యుని అమరపద్యమకుటము
  • బృహదృత్త
  • అప్పయ్యదీక్షుతిని -వ్యాఖ్యా
  • లింగయసూరి-వ్యాఖ్య
  • అమరకోసపదవివృతి
  • కామధేను
  • విష్ణుపండితుని-వ్యాఖ్య
  • భిక్షాపతేగిరి అమరసూచిక
  • ఆచార్యకృష్ణమిత్రుని అమరకోశటీక
  • తిరువెంకటాచార్యుని నామలింగాను శాసనవ్యాఖ్య
  • రవివర్మరాజు నామలింగానుశాసనవ్యాఖ్య
  • జాతవేదదీక్షితుని నామలింగానుశాసనవ్యాఖ్య
  • కన్నడభాషలో రెండువ్యాఖ్యలు.
  • తెలుగులో రెండువ్యాఖ్యలు.
  • రామచంద్రవర్మ తెలుగువ్యాఖ్య
  • వమడ వెంకటరాయుని తెలుగు వ్యాఖ్య
  • రామచంద్రధీవర్మ తెలుగు వ్యాఖ్య
  • కస్తూరి మల్లకవి తెలుగు వ్యాఖ్య
  • వెంకటేశ్వరుని తమిళవ్యాఖ్య
  • వైద్యనాధాధి వర్మ తమిళవ్యాఖ్య
  • నామలింగానుశాసనపదవివరణము
  • వెంగల లింగయసూరి అమరకోశపదవివృత్తి
  • రవివర్మరాజు నామలింగాను శాసనవ్యాఖ్య
  • సుభూతి చంద్రుని నామలింగాను శాసనవ్యాఖ్య

చివరి పదిహేడు వ్యాఖ్యల ప్రతులు మద్రాసు ప్రాచ్యలిఖితగ్రంథాగారంలో కలవు

మన ఆంధ్రదేశములో తాళ్ళపాక తిరువేంకటాచార్యులు రచించిన గురుబాల ప్రబోధిక అనేగ్రంథం పండితామోదము పొంది బహుళప్రచారములో ఉన్నది. ఇది లింగభట్టీయాది సంస్కృత వ్యాఖ్యానాలనుంచి వ్యుత్పత్త్యర్ధాలు సేకరించి తెలుగులో వ్రాసిన నామలింగానుశాసనవ్యాఖ్య చాలాకాలంక్రిత్రం ముద్రితమైనది. దీని ప్రతులు దుర్లభమవటంతో చలమచర్ల వేంకట శేషాచార్యులు గారు గురుబాలప్రబోధిక పునర్ముద్రణ చేసారు.అయితే గురుబాలప్రబోధికా కారుడు వ్యుత్పత్యర్ధాలు చూపకుండా వదిలివేసినచోట్ల శ్రీఆచార్యులు గారు ఇతరమైన ప్రామాణిక వ్యాఖ్యానాలనుండి ఆవిషయాలు గ్రహించి ఈగ్రంథంలో ఇచ్చినారు.

విభాగాలు

[మార్చు]

ఇందులో మూడు కాండలున్నాయి.

  1. ప్రథమకాండ - మంగళాచరణము, పరిభాష, స్వర్గవర్గం, వ్యోమవర్గం, దిగ్వర్గం, కాలవర్గం, ధీవర్గం, వాగ్వర్గం, శబ్దాదివర్గం, నాట్యవర్గం, పాతాళవర్గం, భోగివర్గం, నరకవర్గం, వారివర్గం అనే విభాగాలున్నాయి. మొత్తం శ్లోకాల సంఖ్య రమారమి 330.
  2. ద్వితీయకాండ - భూవర్గం, పురవర్గం, శైలవర్గం, వనౌషధివర్గం, సింహాదివర్గం, మనుష్యవర్గం, బ్రహ్మవర్గం, వైశ్యవర్గం, శూద్రవర్గం. మొత్తం శ్లోకాల సంఖ్య రమారమి 750.
  3. తృతీయకాండ - విశేష్యనిఘ్నవర్గం, సంకీర్ణవర్గం, నానార్థవర్గం, అవ్యయవర్గం, లింగాదిసంగ్రహవర్గం, పున్నపుంసకలింగశేషం, త్రిలింగశేషం. మొత్తం శ్లోకాల సంఖ్య రమారమి 483.

పూర్తిపాఠం

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "పుస్తకం.నెట్ లో తాడేపల్లి లలితా బాలసుబ్రమణ్యం రాసిన వ్యాసం నుంచి".

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=అమరకోశము&oldid=4306260" నుండి వెలికితీశారు