పాపి కొండలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పాపికొండల మధ్య గోదావరి
పాపికొండల వద్ద సూర్యాస్తమయం

పాపికొండలు, తూర్పు కనుమలలోని దట్టమైన అడవులతో కూడిన ఒక పర్వత శ్రేణి. ఇవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల నడుమ ఉన్నాయి. ఈ ప్రాంతం 1,012.86 కి.మీ2 (391.07 చ. మై.) విస్తీర్ణంలో వ్యాపించివుంది. ఇది అంతరించడానికి చేరువలో వున్న వివిధ మొక్కలు, పక్షులు, జంతువులతో జీవవైవిధ్యం గల ప్రదేశం. రాజమండ్రి నగరానికి సుమారు 60 కిలోమీటర్లు, తెలంగాణ లోని భధ్రాచలం పట్టణం నుండి సుమారు 60 కిలోమీటర్లు దూరంలో వున్న ఈ ప్రాంతం జాతీయ వనంగా గుర్తించబడింది. [1]

ఈ ప్రాంతంలో సాధారణంగా చెట్లు ఆకులు రాల్చవు. ఇది ప్రశాంతమైన, సుందరమైన, రమణీయమైన, ఆహ్లాదకరమైన ప్రదేశము. ఇక్కడి కొండలు, జలపాతాలు, గ్రామీణ వాతావరణము కారణంగా ఆంధ్రా కాశ్మీరం అని పిలుస్తారు. ఈ ప్రాంత అడవుల్లో పెద్ద పులులు, చిరుతపులులు, నల్లపులులు, అడవిదున్నలు (గొర్ర గేదెలు), జింకలు, దుప్పులు, నక్కలు, తోడేళ్ళు, కొండచిలువలు, వివిధ రకాల కోతులు, ఎలుగుబంట్లు, ముళ్ళ పందులు, అడవి పందులు, వివిధ రకాల పక్షులు, విష కీటకాలు మొదలైన జంతుజాలం వుంది. అలాగే వేలాది రకాల ఔషధ వృక్షాలు, మొక్కలు వున్నాయి. [1]

సీతారామయ్యగారి మనవరాలు, అంజి, గోదావరి, గోపి గోపిక గోదావరి వంటి సినిమాలు ఈ ప్రాంతంలోనే తీశారు. [1]

భౌగోళికం[మార్చు]

పాపికొండ జాతీయ ఉద్యానవనం, రాజమండ్రి నుండి పాపికొండలు విహారయాత్ర మార్గం OSM పటం

రాజమండ్రి నగరానికి సుమారు 60 కిలోమీటర్లు, తెలంగాణ లోని భధ్రాచలం పట్టణం నుండి సుమారు 60 కిలోమీటర్లు దూరంలో ఉన్న ఈ ప్రాంతం జాతీయ వనంగా గుర్తించబడింది.

నది మార్గం[మార్చు]

రాజమహేంద్రవరం నుండి పాపికొండల విహార యాత్ర దేవిపట్నం మండలంలోని పోశమ్మగండి గుడి వరకు రోడ్డు మార్గంలో సాగుతుంది. అక్కడినుండి లాంచి లో పూడిపల్లి, సిరివాక, కొల్లూరు మీదుగా పేరంటాలపల్లి ఈశ్వరాలయం వరకు సాగుతుంది. ఈ యాత్రలో గోదావరి చాలా తక్కువ వెడల్పుతో కొండల మధ్య ప్రవహిస్తూ మరింత రమణీయంగా వుంటుంది.[2][3]

భద్రాచలం నుండి తూర్పుగోదావరి జిల్లా లోని వి.ఆర్‌.పురం మండలం శ్రీరామగిరి గ్రామం నుంచి సుమారు మూడు గంటల పాటు గోదావరి నదిలో ప్రయాణం చేసి పేరంటాలపల్లికి చేరవచ్చు. [4]

ఆంధ్రప్రదేశ్ పర్యాటకశాఖ పాపికొండల పర్యాటకం విహారయాత్రలకు 2021 జూలై 1 నాడు, 2019 సెప్టెంబరులో దుర్ఘటన జరిగిన 21 నెలల తర్వాత మరల అనుమతించింది[5]

రహదారి మార్గం[మార్చు]

పాపికొండల వెనుక భాగానికి పశ్చిమ గోదావరి జిల్లాలో కొయ్యలగూడెం, కన్నాపురం, పోలవరం, శింగన్నపల్లి, వాడపల్లి, ఛీడూరు మీదుగా కొరుటూరుకు ఘాట్ రోడ్డు మార్గం కూడా ఉంది. పోలవరం వద్ద కట్టుతున్న ఇందిరా సాగర్ పోలవరం ప్రాజెక్టు వలన ఈ ఘాట్ రోడ్డు మార్గం కనుమరుగు అవబోతున్నది.

రైలు[మార్చు]

దగ్గరి రైల్వే స్టేషన్ రాజమండ్రిలో వున్నది.

వాయుమార్గం[మార్చు]

దగ్గరి విమానాశ్రయం రాజమండ్రిలో వున్నది.

రాజమండ్రి నుండి విహారయాత్ర విశేషాలు[మార్చు]

రాజమండ్రినుండి రోడ్డు మార్గంలో పురుషోత్త పట్నం చేరి అక్కడనుండి లాంచీలో ప్రయాణం మొదలవుతుంది. [3]

గండి పోసమ్మ ఆలయం[మార్చు]

ఇక్కడ యాత్రికుల ఆలయ సందర్శన కోసం లాంచి ఆగుతుంది.

పూడిపల్లి గ్రామం[మార్చు]

త్రిశూలం, బంగారు బుల్లోడు చిత్రాలకు చిత్రీకరణ ఇక్కడే జరిగింది.

దేవీపట్నం[మార్చు]

దేవీపట్నం పోలీస్ స్టేషన్ లో ప్రయాణీకుల వివరాలు అందచేయటానికి లాంచి ఆగుతుంది. దీని తరువాత మొబైల్ ఫోనులు పనిచేయవు, రోడ్డు రవాణా ద్వారా అత్యవసర సేవలు అందుబాటులో వుండవు. ఇక్కడ సీతారామరాజు ముట్టడించిన పాత పోలీస్ స్టేషన్ చూడవచ్చు.

కొల్లూరు[మార్చు]

రెండు రోజుల యాత్ర చేసేవారు బసచేయడానికి కొల్లూరు లో దిగుతారు. ఇక్కడ వెదురుగుడిసెలున్నాయి.

పేరంటాలపల్లి[మార్చు]

పశ్చిమగోదావరి జిల్లాలోని పేరంటాలపల్లి దగ్గర గోదావరి ప్రవాహం చాల ఇరుకుగా ఎంతో లోతుగా ఉంటుంది. శివలింగం అలంకారం, ఆలయం చుట్టూ ఫలవృక్షాలు, పూలమొక్కలు, అమాయక కొండరెడ్ల గిరిజనుల అప్యాయత ఆదరణ నవనాగరిక సమాజానికే తలమానికం. ఇక్కడ శ్రీరాముని వాకిటం అనే ఆశ్రమం ఉంది. ఇందులోనే శివాలయం కూడా ఉంది. 1800 శతాబ్దంలో రాజమహేంద్రవరం నుంచి ఒక మునీశ్వరుడు లాంచీపై బయలు దేరి భద్రాచలం వస్తూ పేరంటాలపల్లి వద్ద రాత్రి కావడంతో అక్కడ బస చేశారు. ఆయన కలలో భగవంతుడు కనిపించి ఇక్కడ ఆలయాన్ని నిర్మించమని ఆదేశించడంతో అందుకు అనుగుణంగా ఆయన ఇక్కడే నివాసం ఉండి ఆ ఆలయాన్ని నిర్మించినట్లు ఈ ప్రాంతవాసులు చెబుతారు. ఈ ప్రాంత గిరిజనులకు విద్యా బుద్ధులు, వైద్య సౌకర్యం కల్పించిన మునిశ్వేరుడిని వారు ఆరాధ్యదైవంగా భావిస్తారు. ఈ శివాలయంలో కొండలపై నుంచి జలపాతం చుట్టూ పనస, పొక చెక్క వంటి అనేక మొక్కలతో ఆ ప్రాంతం ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది.

భద్రాచలంనుండి విహారయాత్ర విశేషాలు[మార్చు]

శ్రీరామగిరి పుణ్యక్షేత్రం[మార్చు]

భద్రాచలం నుండి పాపికొండల యాత్ర చేసేవారు తూర్పు గోదావరి జిల్లాలో శ్రీరామగిరి గ్రామం లో శ్రీరామగిరి పుణ్యక్షేత్రం సందర్శించవచ్చు. ఎతైన కొండలు గుట్టల మధ్య సుమారు 170 మెట్లు ఎక్కిన తర్వాత కనులు పరవశింపజేసే సుమారు 500 సంవత్సరాల క్రితం మాతంగి మహర్షిచే ప్రతిష్ఠింపబడిన శ్రీ సీతారామలక్ష్మణ, ఆంజనేయ సుందర విగ్రహాలను భక్తులు దర్శిస్తారు. పక్కనే ఎత్తైన రెండు పర్వతాలు వాలి, సుగ్రీవుల గుట్టలు భక్తులకు కనువిందు చేస్తాయి. ఈ కొండల నుండి మరో పర్లాంగు దూరంలో చొక్కనపల్లి గోదావరి రేవులో ఝటాయువు పక్షి పడిపోయిన గుర్తులు కనిపిస్తుంటాయి. అక్కడే శ్రీరాముడు ఝటాయువుకు పిండ ప్రదానం చేసాడని పురాణాలు వెల్లడిస్తున్నాయి.

గత దుర్ఘటనలు[మార్చు]

సెప్టెంబర్ 2019 లో పోలవరం నుండి పాపికొండలుకు బయలు దేరిన రాయల్ వశిష్ట పడవ కచులూరు సమీపంలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 26 మంది సురక్షితంగా బయటపడగా 45 పైగా ప్రయాణికులు చనిపోయారు. [6] చాలా ప్రయత్నాల తరువాత, నెలరోజులకు ధర్మాడి సత్యం నేతృత్వంలోని బృందం మునిగిపోయిన బోట్ ను వెలికీతీయటంలో విజయం సాధించింది. [7]


Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 "పాపికొండలు". Government of AP. Retrieved 2021-07-01.
  2. "పాపికొండల్లో పర్యాటకుల సందడి". ఈనాడు. Retrieved 2021-07-05.
  3. 3.0 3.1 "పాపికొండలు విహారయాత్ర". Punnami Tours and Travels. Retrieved 2021-07-02.
  4. http://www.suryaa.com/features/article.asp?subcategory=4&contentId=130937[dead link]
  5. "పాపికొండలు విహారయాత్ర పున:‌ప్రారంభం". hmtv. 2021-07-02.
  6. "పాపికొండలు యాత్రలో ఘోర విషాదం". మనతెలంగాణ. 2019-09-16. Retrieved 2021-07-02.
  7. "కచ్చులూరు వద్ద బోటు వెలికితీత". సాక్షి. 2019-10-22. Retrieved 2021-07-02.

బయటిలింకులు[మార్చు]