ముతుకూరి గౌడప్ప
ముతుకూరి గౌడప్ప దత్త మండలాలలో బ్రిటిష్ వారిపై తొలి తిరుగుబాటుకు నాయకత్వం వహించిన వీరుడు. రైతుల సంక్షేమం కోసం పెంచిన పన్నులను వ్యతిరేకిస్తూ ఎదురు తిరిగిన ధీశాలి. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం లోని తెర్నేకల్లు గ్రామ వాసి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డికన్నా 45 సంవత్సరాల ముందే బ్రిటిష్ వారు రాయలసీమలో అడుగుపెట్టిన తొలి సంవత్సరం లోనే ఆంగ్లేయుల నిరంకుశ పాలనను ఎదిరించి తిరుగుబాటు చేసినటువంటి వ్యక్తి ఇతను[1]. కానీ ఈ తిరుగుబాటుకు చరిత్రలో పెద్దగా ఎక్కడా గుర్తింపు రాలేదు. ముతుకూరు గౌడప్పపైనా, తెర్నేకల్లు పోరాటంపైనా ఎటువంటి పరిశోధనలు జరగలేదు.
తెర్నేకల్లు పోరాటం
[మార్చు]నిజాం నవాబు బ్రిటిష్ వారితో సైన్య సహకార పద్ధతికి ఒప్పుకొని వాళ్ల సైన్యాన్ని వారి రాజ్యంలో ఉంచుకొని ఒప్పందం ప్రకారం ప్రతీ యేటా కొంత సొమ్మును ఈస్టు ఇండియా కంపెనీకి అందించసాగాడు. కానీ కొంత కాలానికి ఆ సొమ్ము చెల్లించడం కష్టమై డబ్బుకు బదులు బళ్ళారి, అనంతపురం, కడప, కర్నూలు అనే నాలుగు ప్రాంతాలను వారికి దత్తత ఇచ్చి నిజాం నవాబు తాను ఇవ్వాల్సిన సొమ్మును ఆ ప్రాంతంలో వసూలు చేసుకొమ్మన్నాడు. అలా 1800 సంవత్సరం అక్టోబరు 12న ఈ ప్రాంతాలన్నీ బ్రిటిష్ వారి ఆధీనంలోనికి వెళ్ళిపోయాయి. అప్పటి నుండి వీటిని సేడెడ్ జిల్లాలు లేదా దత్త మండలాలు అంటున్నారు. తరువాత ఈ ప్రాంతాన్నే రాయలసీమగా 1900 నుంచి పిలుస్తున్నారు. దత్తమండలాలు మొత్తం ఒక కలక్టరేటుగా ఉండేది. హెడ్ క్వార్టరు అనంతపూరు. ప్రిన్సిపాల్ కలెక్టరుగా థామస్ మన్రో ఉండేవాడు. అతని క్రింద నలుగురు సబ్‌కలెక్టర్లు ఉండేవారు. ఆదోని సబ్‌కలెక్టరు విలియం థాకరే. కలెక్టరు అంటే తమ క్రింద ఉన్న గ్రామాల నుంచి పన్నును కలెక్టు చేసి పైన అధికారులకు పంపించే ఆధికారం కలవాడు. దత్త మండలాలు ఈస్టు ఇండియా పాలనలోకి వచ్చే సమయానికి వారు మైసూరుతో యుద్ధాలు చేసి ఆర్థికంగా దివళా తీసారు. దాంతో కొత్తగా తమ ఆధీనంలోనికి వచ్చిన ప్రాంతాల నుంచి ఎక్కువ ఆధాయాన్ని రాబట్టుకోవాలనుకున్నారు. దాంతో గ్రామాలపై ఎక్కువ పన్నును విధించి నిర్బంధంగా వసూలు చేయసాగారు. గ్రామాల్లో పన్నును వసూలు చేయాల్సిన బాద్యత రెడ్డి, కరణాలపై ఉండేది. ఎవరైనా ఎదురు తిరిగితే తమ సైనిక బలగంతో దాడిచేసి నిర్థాక్షిణ్యంగా అణచివేసి చంపి ఆ గ్రామాలను నాశనం చేసి చుట్టుప్రక్కల ప్రాంతాలు భయపడేలా ప్రవర్తించేవారు. ఆ సమయంలో రాయలసీమలో అనేక గ్రామాలు వరుస కరువులతో అల్లాడుతుండేవి. దత్తమండలాల నుంచి ఈస్టు ఇండియా కంపెనీ ఆశించిన మొత్తం కంటే తక్కువ పన్ను వసూలయింది. దాంతో వారు మరో యాభై శాతంపన్ను అదనంగా పెంచారు. తెర్నేకల్లు (తరిణెకల్లు) గ్రామం ఆదోని డివిజన్ లోని దేవనకొండ మండలంలోనిది. దానికి గ్రామపెద్ద ముతుకూరు గౌడప్ప అయితే రెడ్డిగా కర్రెన్న ఉండేవాడు. తెర్నేకల్లు గ్రామప్రజలు మొదటనుండి స్వతంత్రంగా పౌరుషవంతులై స్వేచ్ఛను కాంక్షిస్తూ ఉండేవారు. అనేక పోరాటాలలో పాల్గొన్న గ్రామమది. ఆంగ్లేయులు ఆదోనిలో జమాబందీకి వచ్చి భూమి శిస్తు చెల్లించాలని శ్రీనివాసరావు అనే అధికారితో చెప్పి పంపారు. తమ తెర్నేకల్లు గ్రామ విషయంలో ఆంగ్లేయ అధికారులు ప్రవేశించడం అక్కడి ప్రజలు సహించలేకపోయారు. అదీగాక అప్పటికే కరువు పరిస్థితుల వల్ల పంటలు పండక రైతులు చాలా బాధల్లో ఉన్నారు. ఆ సమయంలో ఆంగ్లేయులు భూమి శిస్తును మరింత పెంచడం వారికి ఏ మాత్రం రుచించలేదు. ఆ గ్రామపెద్ద ముతుకూరి గౌడప్ప అతని నాయకత్వం లోని రెడ్డి, కరణాలు కంపెనీ గుమస్తా శ్రీనివాసరావును కలసారు. శిస్తు చాలా ఎక్కువగా ఉందని పన్ను తగ్గిస్తే గానీ కట్టడం కుదరదని చెప్పారు. ఆ సమయంలో శ్రీనివాసరావు వెంట తెర్నేకల్లుకు మొదటనుంచి శత్రువులుగా ఉన్న గంజహళ్లి సుంకిరెడ్డి, పెసలదిన్నె నారప్ప బైలుప్పల రామిరెడ్డి ఉన్నారు. వారు ఆ మాటలకు అవహేళన చేస్తూ ఈ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడానికి ఇది నవాబుల పాలన కాదు. కంపెనీ పాలన. అంటూ నోటికొచ్చినట్లు దురుసుగా మాట్లాడారు. ఆ మాటలతో కోపోద్రిక్తుడైన గౌడప్ప కనుసైగ చేసిన వెంటనే గ్రామ ప్రజలంతా ఒక్కసారిగా కత్తులు దూసి శ్రీనివాసరావును తప్ప మిగిలిన ముగ్గురుని క్షణంలో చంపివేసి అక్కడికక్కడే పూడ్చిపెట్టారు. శ్రీనివాసరావు బ్రాహ్మణుడు కాబట్టి వదిలిపెట్టారు. కానీ అతనినివదిలివేస్తే అతను పోయి జరిగిన విషయమంతా పై అధికారులకు చెబుతాడని సందేహించి అతనిని కూడా నిర్బంధించారు. కానీ అతడు ఎవరికీ చెప్పనని ప్రమాణం చేసి బయటపడ్డాడు. జరిగిన విషయం ఎలాగైనా బయట పడుతుందని గ్రహించిన ముతుకూరి గౌడప్ప గ్రామ ద్వారాలన్నీ బాగుచేయించి కోట గోడలన్నీ పటిష్టం చేయించాడు. దాచిపెట్టిన ఆయుధాలన్నీ బయటికి తీసి సిద్ధం చేయించాడు. అతను ఊహించిన మాదిరిగానే శ్రీనివాసరావు ఆదోనికి చేరి అధికారులకు జరిగినదంతా వివరించాడు. అప్పుడు ఆదోని ప్రాంతానికి సబ్ కలెక్టరుగా ఆంగ్లేయ అధికారి థాకరే ఉండేవాడు. అతను జరిగింది తెలుసుకొని మండిపడి పెద్ద సైన్యంతో తెర్నేకల్లుకు బయలుదేరాడు. సైన్యాన్ని కడివెళ్ల గ్రామం వద్ద నిలిపి థాకరే తెర్నేకల్లు గ్రామ అధికారులను పిలిపించాడు. ఆదోనికి వచ్చి తక్షణమే పెంచిన శిస్తు కట్టేటట్లయితే వదిలివేస్తానని, లేకపోతే గ్రామం మొత్తం నాశనం చేస్తానని హెచ్చరించాడు. గ్రామ అధికారులు అలాగేనంటూ లోపలికి పోయి తలుపులు మూసివేసి యుద్ధానికి సిద్ధమే కానీ శిస్తు మాత్రం కట్టేది లేదని తెగేసి చెప్పారు. థాకరే తన ఫిరంగులతో, తుపాకులతో 400 మంది సైనికులతో కోటపై దాడి చేసాడు. లోపల నుంచి వడిసెలతో, విల్లంబులతో, సలసల కాగుతున్న నీరు,నూనెలతో ఎదురుదాడికి దిగారు గౌడప్ప నాయకత్వంలోని ప్రజలు. తూర్పు, పశ్చిమ ద్వారాల వద్ద యుద్ధం సుమారు 15 రోజులపాటు జరిగింది[2]. ఆంగ్లేయులు కోటను స్వాధీనం చేసుకోలేకపోయారు. చివరికి సంధి ప్రయత్నాలు చేసారు. పెంచిన శిస్తు విషయంలో గౌడప్ప పట్టుదలతో ఉండటంతో అవి విఫలమయ్యాయి. గుత్తి నుంచి వచ్చిన పెద్ద ఫిరంగులతో ఉత్తర ద్వారంపై విరుచుకుపడ్డారు. ఫిరంగి గుళ్ళ వర్షానికి ఆ ద్వారం బద్దలయింది. వెంటనే ఆంగ్లేయ సైన్యం తుపాకులతో లోపలికి దూరి కనబడినవారందరినీ కాల్చివేయసాగింది. తెర్నేకల్లు వీరులు కత్తులు, బాణాలతో గౌడప్ప నాయకత్వంలో వారిని ఎదుర్కొన్నారు. కానీ తుపాకుల ముందు నిలవలేకపోయారు. 40కి పైగా గ్రామస్థులు చంపబడ్డారు. ఆంగ్ల సైన్యాలు గౌడప్ప, రెడ్డి, కరణాలను బంధించి వేసారు. థాకరే వారి ముగ్గురినీ ఊరి వాకిలికి ఉరితీయించాడు. చనిఫోయిన గ్రాంస్థులందరినీ తీసుకుపోయి ఊరిబయట ఉన్న కుక్కల బావిలో వేసి పూడ్చిపెట్టించాడు. అంతటితో కక్ష తీరక గ్రామాన్నంతా సర్వనాశనం చేసి తగలబెట్టించి కోటగోడలన్నీ ధ్వంసం చేసి గ్రామాన్ని నామరూపాలు లేకుండా నాశనం చేయించాడు. ఈ విధంగా రాయలసీయలో బ్రిటిష్ వారు అడుగుపెట్టిన మొదటి సంవత్సరంలోనే వారికి వ్యతిరేకంగా రైతులతో తిరుగుబాటు చేయించిన ముతుకూరి గౌడప్ప చివరికి బ్రిటిష్ వారి చేతికి చిక్కిఊరివాకిలి ముందు ఉరి వేయబడ్డాడు. ఈ పోరాటాన్ని "తరిణెకంటి ముట్టడి" గా పిలుస్తారు. ఇది 1801లో జరిగింది.[3]
మూలాలు
[మార్చు]- ↑ "Free Books". www.sathyakam.com. Archived from the original on 2018-08-22. Retrieved 2019-01-16.
- ↑ "ఇతిహాసానికి రంగులద్దే చిత్ర (చరిత్ర)కారుడు అజీజ్ | Prajasakti::Telugu Daily". www.prajasakti.com. Retrieved 2019-01-16.[permanent dead link]
- ↑ తెరిణెకంటి ముట్టడి - చారిత్రక నవల, రచన- యస్.డి.వి.అజీజ్. బుధవార పేట, కర్నూలు. 2009. p. 72.
{{cite book}}
: CS1 maint: location missing publisher (link)
బయటి లంకెలు
[మార్చు]- "ముతుకూరి గౌడప్ప జివిత విశేషాలు-ఎం. హరికిషన్". www.youtube.com. Retrieved 2019-01-16.