ఆదోని

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆదోని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాకు చెందిన పట్టణం.[1] ఇది ఆదోని పురపాలక సంఘం, మండల ప్రధాన కేంద్రం. ఆదోని రైలుమార్గాన హైదరాబాదు నుండి 225 కి.మీ, మద్రాసు నుండి 494 కి.మీలు దూరంలో ఉంది. 2005 జనాభా అంచనా ప్రకారం పట్టణ జనాభా 1,64,000. రాష్ట్రంలోని అత్యంత పురాతమైన మున్సిపాలిటీలలో ఆదోని ఒకటి. ఆదోని ప్రజల కోరిక మేరకు 1865 మేలో మున్సిపాలిటీగా వ్యవస్థీకరించారు.[2] మధ్యయుగంలో విజయనగర సామ్రాజ్యములో ముఖ్య పట్టణమైన ఆదవోని నేడు వస్త్ర పరిశ్రమలకు పేరుపొందింది. కొండపైన జీర్ణావస్థలో ఉన్న కోట దుర్గం ముస్లింల పాలనలో ప్రభుత్వ కేంద్రంగా ఉంది. 18వ శతాబ్దపు ఆంధ్రదేశపు యుద్ధాలలో తరచూ ఆదోని కోట ప్రస్తావన ఉంది.[3]

జనాభా గణాంకాలు[మార్చు]

2011 భారత జనాభా జనాభా లెక్కలప్రకారం, ఆదోని పట్టణంలో మొత్తం 36,650 కుటుంబాలు నివసిస్తున్నాయి. అదోని మొత్తం జనాభా 184,625, అందులో 91,736 మంది పురుషులు కాగా, 92,889 మంది మహిళలు. సగటు లింగ నిష్పత్తి 1,013.[4]

అదోని పట్లణంలో 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 21967, ఇది మొత్తం జనాభాలో 12%. 0-6 సంవత్సరాల మధ్య 11203 మగ పిల్లలు, 10764 ఆడ పిల్లలు ఉన్నారు. బాలల లింగ నిష్పత్తి 961, ఇది సగటు లింగ నిష్పత్తి (1,013) కన్నా తక్కువ.

2011 భారత జనాభా జనాభా లెక్కల ప్రకారం ప్రకారం, ఆదోని అక్షరాస్యత 65.9%. ఈ విధంగా కర్నూలు జిల్లాలో 60% తో పోలిస్తే ఆదోని అక్షరాస్యత ఎక్కువ. ఆదోనిలో పురుషుల అక్షరాస్యత రేటు 74.24%, స్త్రీ అక్షరాస్యత రేటు 57.64% గా ఉంది.[4]

చరిత్ర[మార్చు]

నవాబ్ హాలు
ఆదోని పట్టణంలోని పేరొందిన చెరువు

రాయచూరు అంతర్వేదికి సమీపంలో ఉండటం వలన మధ్యయుగపు దక్కన్ చరిత్రలో ఆదోని కీలకపాత్ర పోషించింది. సాంప్రదాయం ప్రకారం ఆదోని క్రీ.పూ.1200లో బీదరు రాజు భీంసింగ్ పాలనలో చంద్ర సేనుడు స్థాపించాడని ప్రతీతి.[5] ఆ తరువాత విజయనగర రాజుల పాలనలో ఉంది. 1564లో తళ్ళికోట యుద్ధానంతరం ఆదోని ఆదిల్ షాహీ వంశ పాలకుల చేతిలోకి వచ్చింది. ఆదిల్ షాహీలు వెలుపలి ప్రాకారాలు, దిగువ కోటను నిర్మించి కోటను పటిష్ఠం చేశారు. అప్పట్లో ఆదోని కోట కేంద్రముగా ఉన్న ఆదోని సీమ ఆదాయము 675,900 పగోడాలు. కోటలో 4వేల మంది ఆశ్వికదళము, 8 వేల సైనికుల పదాతిదళము ఉండేది. 1690లో ఔరంగజేబు సేనానులు గట్టి పట్టుతో ఆదోనిపై దాడిచేసి దాన్ని వశపరచుకొని బీజాపూరు సుబాలో భాగంగా మొఘల్ సామ్రాజ్యంలో కలిపారు. దక్షిణాదిపై ఢిల్లీ పట్టుసడలటంలో ఆదోని అసఫ్‌జాహీల రాజ్యంలో భాగమై ఈ కుటుంబంలో చిన్న విభాగానికి సామంతరాజ్యమైంది. ఈ విధంగా 1748లో ముజఫర్ జంగ్ చేతిలో ఉండి 1752లో ఆయన మరణము తర్వాత ఆయన కుమారునికి సంక్రమించింది. 1756లో హైదరాబాదు నిజాం తన సోదరుడైన బసాలత్ జంగ్కు ఆదోనిని జాగీరుగా ఇచ్చాడు.[6] బసాలత్ జంగ్ ఆదోనిని రాజధానిగా చేసుకొని స్వతంత్రరాజ్యాన్ని స్థాపించే ప్రయత్నం చేశాడు. హైదర్ అలీ రెండుసార్లు ఆదోని కోటను ముట్టడించటానికి విఫలయత్నం చేశాడు. 1758లో ఈ కోట గోడల వద్దే హైదర్ అలీ మారాఠులను ఓడించాడు. ఆ మరు సంవత్సరం చుట్టుపక్కల ప్రాంతలనన్నింటినీ నేలమట్టంచేశాడు కానీ ఆదోని కోట వశం కాలేదు. 1782లో బసాలత్ జంగ్ మరణించాడు. ఆ వెనువెంటనే హైదర్ అలీ కూడా మరణించాడు. 1786లో టిప్పూ సుల్తాన్ నెలరోజులపాటు కోటపై ముట్టడి చేసి వశపరచుకొని కొల్లగొట్టాడు. సంధి జరిగిన తర్వాత ఆదోనిని నిజాంకు తిరిగి ఇచ్చేశాడు. 1799లో నిజాం ఆదోని కోటను ఆంగ్లేయులకు దత్తం చేశాడు.

16వ శతాబ్దంలో ఆదోని యాదవుల పాలనలో ఉంది. అప్పుడు దీనిపేరు యాదవగిరి. యాదవగిరి ముస్లింల పాలనలో ఆదవోని అయ్యింది. ఆదవోని కాలక్రమంలో ఆదోనిగా రూపాంతరం చెందింది. బ్రిటీషు పాలనలో ఆదోని మద్రాసు ప్రెసిడెన్సీలోని బళ్ళారి జిల్లాలో భాగంగా ఉండేది. అప్పట్లో దక్షిణాది యొక్క ధాన్యపు మార్కెట్టుగా ప్రసిద్ధి చెందింది. ఆదోని బట్టల, బంగారు మార్కెట్టుకు కూడా పేరొందినది. వందకు పైగా ప్రత్తి మిల్లులు, నూనె మిల్లులతో ప్రత్తివ్యాపారానికి ఆదోనికి ముఖ్యకేంద్రము. ఈ పట్టణానికి రెండో ముంబాయి అని కూడా పేరు. ప్రస్తుతం ఆదోనిలో ఎటువంటి ప్రత్తి మిల్లులు పనిచేయటం లేదు. భీమాస్ వారి ఆయిల్ మిల్లుకు మాత్రం ఇంకా చాలా పేరుంది. ఆ తరువాత జనత మిల్ జిన్ స్టోర్స్ వారు మొదటి సారిగా ఆదోనిలో ఒక మిల్ జిన్ స్టోర్ ఏర్పాటు చేసారు.

చూడ తగ్గ ప్రదేశాలు[మార్చు]

రణమండల వీరాంజనేయస్వామి ఆలయం[మార్చు]

రాష్ట్రంలోని ఆంజనేయస్వామి ఆలయాలలో యాదాద్రి శ్రీ వీరాంజనేయ భైరవ దేవస్వామి ఆలయం ఒకటి. చాలామంది, యాదాద్రి, యాదవగిరి అని పిలువబడే ఆ క్షేత్రాన్ని గురించి తెలియకపోవచ్చు. కానీ 'ఆదోని శ్రీ వీరాంజినేయభైరవదేవస్వామి ఆలయం' అంటే ఇట్టే తెలిసిపోతుంది. ఆదోని పట్టణంలో రెండు కొండలపైన వున్న ఈ పుణ్యస్థలం నిత్యం భక్త జనసందోహంతో కళకళలాడుతూంటుంది. ఆ స్వామి కరుణ కోసం భక్తులు వస్తూంటారు. విజయనగర సామ్రాజ్య సైనిక స్థావరంగా ఉన్న ఆదోని, ఆరోజుల్లో యాదవగిరి లేక యాదాద్రి అని పిలువబడుతుండేది. విజయనగర సామ్రాజ్య పతనానంతరం బీజాపూర్ సుల్తానుల ఆధీనంలోకి వచ్చింది. ఆయన కాలంలోనే ఆదోని కోట బాగా అభివృద్ధి చేయబడిందని అంటారు. అనంతరం మొగలాయిల పరిపాలనలో, ఆ తదనంతరం నిజాము నవాబుల పరిపాలనలో నున్న ఆదోని..ఈవిధంగా చారిత్రాత్మకంగా ఎంతో ఘనచరిత్రను కలిగి వుందని తెలుస్తోంది.సిద్ధిమసూద్ ఖాన్ కాలంలో ఆదోని కళల కాణాచిగా ఖ్యాతికెక్కింది. నవాబు సిద్ది మసూద్ ఖాన్ అన్ని మతాలను సమానముగా ఆదరించేవాడు. ఆవిధంగా నవాబుకు రాఘవేంద్రులు అంటే అమితమైన భక్తి ఏర్పడింది. రాఘవేంద్రులు మహాసమాధిని పొందబోతోన్న తరుణంలో తన కోసం మంచాలా గ్రామాన్ని (ప్రస్తుత మంత్రాలయం) దానం చేయమని అడగడమే ఆలస్యం, నవాబు ఆ గ్రామాన్ని ఇచ్చేసాడు. తానొక ముస్లిం అయినందున హిందూమందిరంలోకి అనుమతి లభించదు. ఈ వేదన కూడా నవాబును పట్టి పీడిస్తున్న విషయాన్ని గ్రహించిన రాఘవేంద్రులు, తాము మహాసమాధి అయిన తర్వాత నిర్మించే బృందావనం వంటి దానిని మందిరం పైనే నిర్మిస్తే, నవాబు మహాసమాధిని చూసినట్లవుతుందని చెప్పగా ఆయన శిష్యులు అలాగే నిర్మించారు. ఇప్పటికీ ఆ కట్టడాన్ని మంత్రాలయంలో దర్శించుకోగలము. ఈ విధంగా హిందూ ముస్లింల సఖ్యతకు ఆదోని ప్రాంతం ఓ చక్కని ఉదాహరణగా నిలుస్తోంది. నవాబు సిద్ధిమసూద్ ఖాన్ ఎన్నో హిందూ దేవాలయాలను పునరుద్ధరించాడు. రాఘవేంద్రుల వారి పూర్వావతారం అని చెప్పబడుతోన్న శ్రీగురువ్యాసరాయలు ఇక్కడ వశించారని, ఆయన తమ అమృతహస్తాలతో స్వయంభూమూర్తియైన శ్రీరణమండల వీరాంజనేయ భైరవస్వామి వారికి శ్రావణమాసంలో పూజా కార్యక్రమాలు నిర్వహించునట్లుగా ఆధారాలున్నాయి. అదేవిధంగా భక్త ప్రహ్లాదుని మునిమనుమడు, సాటిలేని దాతగా ఎనలేని కీర్తిప్రతిష్ఠలనందిన బలి చక్రవర్తికి ఈ పుణ్యప్రాంతంతో సంబంధం ఉందన్నది భక్తజనుల విశ్వాసం. ఒకే కొండపై మూడు కొండశిఖరాలు నెలకొని ఉండటం, ఆ మూడు శిఖరాలపై మూడు ప్రసిద్ధ దేవాలయాలు నెలకొని ఉండటం ఇక్కడి విశేషం. శ్రీరణమండల వీరాంజనేయ ఆలయం, శ్రీవామనతీర్థుల బృందావనం, శివమారుతీ ఆలయం అంటూ ఈ మూడు ఆలయాలు ఆదోని ఆధ్యాత్మిక వైభవాన్ని చాటి చెబుతున్నాయి. 'రణమండల' ఆంజనేయస్వామికి ఈ పేరు రావడం వెనుక ఓ ఉదంతం పేర్కొనబడుతోంది. పూర్వం ఈ ఆంజనేయునికి 'భైరవదేవుడు' అనే పేరు ఉండేదట. అయితే విజయనగర సామ్రాజ్యంలోని వీరభటులు ఇక్కడి నుండి యుద్ధానికి బయలుదేరే వేళల్లో "శ్రీరణమండల వీరాంజనేయ భైరవస్వామి" అంటూ నినాదాలు చేసుకుంటూ వెళ్ళేవారని నాటి శాసనాల ద్వారాట తెలుస్తోంది. కొండపైనున్న శ్రీరణమండల వీరాంజనేయస్వామివారి ఆలయాన్ని చేరుకునేందుకు సుమారు 600 మెట్లను ఎక్కాల్సి ఉంటుంది. అలా మెట్లెక్కుతున్నప్పుడు శివలింగానికి ప్రక్కనే నందీశ్వరుని దర్శించుకోగలం. అలా మెట్లెక్కుతూ ఇంకొంచెం దూరం పైకెలితే, ఓ చిన్న ఆలయంలో సంతాన ఆంజనేయస్వామి దర్శనమిస్తాడు. ఈ స్వామిని మ్రొక్కుకుంటే సంతానప్రాప్తి లేనివారికి సంతానం కలుగుతుందని భక్తజనుల విశ్వాసం. ఇంకొంచెము ముందుకు వెళితే ఇటీవలే ప్రతిష్ఠించబడిన వినాయకుని విగ్రహాన్ని చూడగలం. వినాయకుని దర్శించుకున్న తర్వాత ఇంకొంచెం ముందుకెళితే 'శ్రీరణమండల వీరాంజనేయస్వామి' వారి దివ్యదర్శనం లభిస్తుంది. అభయహస్తంతో భక్తులను దీవిస్తోన్న స్వామివారు సింధూరవర్ణంలో ఉంటారు. తులసి, తమలపాకు మాలలను ధరించి ఉత్తరదిశవైపు ముఖం చేసి తూర్పుదిక్కుకు చూస్తున్నట్లు దర్శనమిస్తాడు. స్వామివారికి గోపురముతో కూడిన ఆలయ నిర్మాణం లేదు. స్వామివారికి ఆలయాన్ని నిర్మించేందుకై గతంలో ఎన్నెన్నో ప్రయత్నాలు జరిగాయట. అయితే తనకు ఒకే ఒకరోజులో ఆలయాన్ని నిర్మించగలిగితే, ఆలయనిర్మాణానికి ఒప్పుకుంటానని, అలా కుదరనప్పుడు తనకు అసలు ఆలయమే వద్దని స్వామివారు ఓ భక్తునికలలో కనిపించి చెప్పారట. అప్పట్నుంచి స్వామివారికి ఆలయాన్ని నిర్మించే ప్రయత్నాలు జరగలేదు. అయితే ప్రస్తుతం స్వామి చుట్టూ చలువరాళ్ళతో గోడలను ఏర్పాటు చేసారు. భక్తులు స్వామివారికి సమర్పించుకునే నాణేలను స్వామివారి విగ్రహానికి వెనగ్గా వెళ్ళి వీపుకు అంటిస్తే, ఆ నాణేలు అయస్కాంతానికి అతుక్కుపోయినట్లుగా అతుక్కుపోతుండటం ఇక్కడి విచిత్రం. స్వామివారి వెనుక శివాలయం, శ్రీసీతారామలక్ష్మణఆంజనేయసమేత రామాలయం ఇటీవలే నిర్మించబడ్డాయి.

లక్ష్మమ్మ గుడి[మార్చు]

ఇంకొంచెం దూరం వెళితే అమ్మవారి సన్నిధి కనబడుతోంది. త్రినేత్రి అయిన ఈ అమ్మవారిని సంతానం లేనివారు కొలుచుకుంటుంటారు. ఈ తల్లి సన్నిధికి ప్రక్కన గణేశమందిరం ఉంది. అమ్మవారి ముందు రెండు పాదుకలు కనబడుతూంటాయి. అమ్మవారి సన్నిధికి ప్రక్కనున్న వృక్షానికి సంతానం లేనివారు సంతానప్రాప్తికోసం కట్టిన ముడుపులను చూడగలం. ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో శ్రీరణమండలవీరాంజనేయస్వామివారికి ఉత్సవాలు జరుగుతుంటాయి. శ్రావణమాసం ప్రారంభమైనది మొదలు మండలకాలంపాటు స్వామివారికి విశేషంగా అభిషేకాలు, ఆకు పూజలు జరుగుతూంటాయి. ప్రతి శనివారం విశేషపూజలు జరుగుతాయి. శ్రావణమాసంలో మూడవ శనివారం నాడు విశేష పూజలతో పాటూ అన్నదాన, రథోత్సవం కార్యక్రమాలు ఉంటాయి. మండలం రోజుల తర్వాత భాద్రపద పౌర్ణమినాడు మహాపూజను నిర్వహిస్తూంటారు. ఎత్తైన కొండపై ప్రకృతి అందాల మధ్య అలరారే ఈ కొండపైకి ఎక్కి, చుట్టుప్రక్కలా కలియజూసినప్పుడు, ప్రక్కనున్న కొండలపై శ్రీవేణుగోపాలస్వామి ఆలయం, శివమారుతీ ఆలయం, నవ తీర్థ హనుమాన్ ఆలయం అంటూ పలు ఆలయాలు దర్శనమిస్తూంటాయి. వేణుగోపాలస్వామివారి ఆలయాన్ని చేరుకునేందుకు మెట్లున్నాయి. కానీ, నవతీర్థ హనుమ ఆలయాన్ని చేరుకోవాలంటే కొండరాళ్ళపై పాక్కుంటూ చేరుకోవాల్సిందే ! ఆ కొండపైకి ఎక్కడం సులభం కాదు. ఆదోనికి అన్ని నగరాల నుంచి బస్సుల ద్వారా చేరుకోవచ్చు. ఆదోనికి దగ్గరలోనున్న రైల్వేస్టేషన్ మంత్రాలయం రోడ్డు. మంత్రాలయం దర్శించుకునే భక్తులు ఆదోని శ్రీరణమండల వీరాంజనేయస్వామిని దర్శించుకుంటుంటారు.

ఇంకా శ్రీ కోట మంగరాయ ఆంజనేయస్వామివారి ఆలయం ఈ ఆలయం ఆదోనిపట్టణ శివారులో ఉన్నది.

ఆదోని పట్టణంలోని విద్యా సౌకర్యాలు[మార్చు]

ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల.

ఆదోని పట్టణంలోని వైద్య సౌకర్యాలు[మార్చు]

టి.బి.యూనిట్ కేంద్రం.

ఆదోని పట్టణంలోని ఇతర సౌకర్యాలు[మార్చు]

జీవనజ్యోతి వృద్ధాశ్రమం[మార్చు]

ఆదోని పట్టణంలోని ఆస్పత్రి రహదారిలో ఉన్న ఈ అనాధ వృద్ధాశ్రమం, అనాధ వృద్ధులకు ఆశ్రయం కల్పించుచున్నది. శ్రీ విక్టర్ పాల్ ఫిలిప్స్, 2002లో ముగ్గురు అనాధ వృద్ధులతో దీనిని ప్రారంభించినారు. అప్పటినుండి దాతల సహకారంతో, ఈ ఆశ్రమాన్ని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం వృద్ధులు, సహాయకులతో కలిసి మొత్తం 65 మంది ఈ ఆశ్రమంలో ఆశ్రయం పొందుచున్నారు. ప్రత్యేక సందర్భాలలో ప్రజలు ఈ ఆశ్రమానికి వచ్చి, అనాధలకు అన్నదానం చేయుచున్నారు. దీనితోపాటు దుస్తులు, దుప్పట్లు అందజేయుచున్నారు. మరికొందరు వైద్యసేవలు అందించుచున్నారు. ఎక్కడైనా కష్టాలలో ఉన్న అనాధవృద్ధులెవరైనా ఉంటే,ఈ ఆశ్రమ నిర్వాహకులకు సమాచారం అందిస్తే, వారిని ఆశ్రమంలో చేర్చుకుంటారు.

మూలాలు[మార్చు]

  1. "Andhra Pradesh (India): Districts, Cities and Towns - Population Statistics, Charts and Map". www.citypopulation.de. Retrieved 2020-07-10.
  2. Southern India By Playne Wright Somerset Staff, Somerset Playne, J. W. Bond, Arnold Wright పేజి.738 [1]
  3. The Encyclopædia Britannica: A Dictionary of Arts, Sciences, Literature and General Information By Hugh Chisholm పేజీ.212 [2]
  4. 4.0 4.1 "Adoni Population, Caste Data Kurnool Andhra Pradesh - Census India". www.censusindia.co.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-07-10.
  5. The Imperial Gazetteer of India By William Wilson Hunter పేజీ.26-27
  6. Imperial Gazetteer of India, Provincial series - Madras (1908) పేజీ.453 [3]

గ్యాలరీ[మార్చు]

మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=ఆదోని&oldid=3502266" నుండి వెలికితీశారు