తళ్ళికోట యుద్ధం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తళ్ళికోట యుద్దం

యుద్దము వివరాలు తెలిపే పటము
కారణము: భారతదేశ ముస్లిం దండయాత్ర
తేదీ: జనవరి 23, 1565
స్థలము: ప్రస్తుత కర్ణాటకలోని రాక్షసి-తంగడి
పరిణామము: దక్కన్ సల్తనత్ల విజయము
ప్రత్యర్ధులు
విజయనగర సామ్రాజ్యము దక్కన్ సల్తనత్‍లు
సేనాధిపతులు
రామ రాయలు దక్కన్ సుల్తానులు & సేనానులు
సైనిక బలములు
140,000 పదాతి, 10,000 అశ్విక, 100కు పైగా యుద్ధ గజములు 80,000 పదాతి, 30,000 అశ్విక, కొన్ని డజన్ల ఫిరంగులు
ప్రాణనష్టము
నిర్దుష్ట సంఖ్య తెలియదు కానీ రామ రాయలుతో సహా తీవ్ర ప్రాణ నష్టము. నిర్దుష్ట సంఖ్య తెలియదు కానీ ఒక మోస్తరు నుండి తీవ్ర ప్రాణ నష్టము.

తళ్ళికోట యుద్ధము లేదా రాక్షసి తంగడి యుద్ధం (1565 జనవరి 26[1] ) (జనవరి 23[2]) న విజయనగర సామ్రాజ్యానికి, దక్కన్ సుల్తానుల కూటమికి మధ్య జరిగింది. భారత చరిత్ర గతిని మార్చిన ప్రసిద్ధ యుద్ధాల్లో ఇది ఒకటి. ఈ యుద్ధం దక్షిణ భారతదేశాన చివరి హిందూ సామ్రాజ్యమైన విజయనగర సామ్రాజ్యపు పతనానికి దారితీసింది. శ్రీకృష్ణదేవరాయల పాలనలో ఉచ్ఛస్థితికి చేరుకున్న విజయనగర సామ్రాజ్యాన్ని ఆ తరువాతి కాలంలో అచ్యుత రాయలు, ఆ తరువాత సదాశివ రాయలు పరిపాలించారు. అయితే సదాశివరాయలు నామమాత్రపు రాజు. వాస్తవంలో పూర్తి అధికారాలు అళియ రామరాయలు వద్ద ఉండేవి. అతడే దైనందిన పరిపాలనను నిర్వహించేవాడు.

యుద్ధ నేపథ్యం

[మార్చు]

ఈ యుద్ధానికి దారితీసిన పరిస్థితులు ఒక్కసారిగా ఉత్పన్నమైనవి కావు. దశాబ్దాలుగా విజయనగరానికి, సుల్తానులకు మధ్యగల వైరం తరచూ యుద్ధాలకు కారణభూతమవుతూనే ఉండేది. దాదాపు ప్రతి దశాబ్దంలోనూ ఒక పెద్ద యుద్ధం సంభవించింది. ముఖ్యంగా సంపదలతో తులతూగే కృష్ణా, తుంగభద్ర నదుల మధ్యన ఉన్న రాయచూరు అంతర్వేది ప్రాంతం వీరి వైరానికి కేంద్రంగా ఉండేది. 1509 నుండి 1565 వరకు విజయనగరంపై విజయం సుల్తానులకు అందని పండే అయింది. అంచేత, సహజంగానే విజయనగరాన్ని ఓడించాలనే కాంక్ష వారిలో బలపడింది.

శ్రీకృష్ణదేవరాయలు 1520 మే 19న బీజాపూరు సుల్తాను ఇస్మాయిల్ ఆదిల్షాను చిత్తుగా ఓడించి రాయిచూరును స్వాధీనం చేసుకున్నాడు. ఆ తరువాత సుల్తాను విజయనగరాన్ని గెలుచుకోవాలనే కలను మర్చిపోయి, తన పొరుగున ఉన్న ముస్లిం రాజ్యాలతో స్నేహ సంబంధాల కొరకు ప్రయత్నించాడు. రాయచూరు ఓటమి దక్కను సుల్తానుల ఆలోచనలలో మార్పుతో పాటు సమైక్యంగా ఉండాలనే తలంపును తీసుకువచ్చింది.[3]

ఈ సుల్తానులు ఒకరంటే ఒకరికి పడేది కాదు. అహ్మద్‌నగర్, బీజాపూర్ సుల్తానుల మధ్య పచ్చగడ్డి చేస్తే భగ్గుమనేంత వైరం ఉండేది. తమ తగాదాల పరిష్కారం కోసం వారు రామరాయల సహాయం అడగడం, రామరాయలు ఎవరో ఒకరి పక్షం వహించడం జరుగుతూ వచ్చింది. మొదట్లో నిజాంషాతో కలిసి ఆలీ ఆదిల్‌షాను ఓడించాడు. కొంతకాలానికే ఆదిల్‌షా రామరాయలుతో మైత్రి నెరపి నిజాంషాపై యుద్ధం చేసాడు. మరో సమయంలో హుసేన్‌ నిజాంషా, ఇబ్రహీం కుతుబ్‌షా కలిసి అలీ ఆదిల్‌షా పైకి దండెత్తినపుడు, అతడు రామరాయల సాయం కోరాడు. ఆదిల్‌షా, రామరాయల సంయుక్త సైన్యాన్ని కళ్యాణి వద్ద ఎదుర్కోడానికి సిద్ధపడ్డాక, సరిగ్గా యుద్ధం మొదలు పెట్టబోయే ముందు, కుతుబ్‌షా నిజాంషాను ఏకాకిని చేసి, తాను రామరాయలుతో చేరిపోయాడు. చేసేది లేక హుసేన్‌షా అహ్మద్‌నగర్‌కు పారిపోయాడు. ఒక పరస్పర నమ్మకంతో కూడిన, కాలపరీక్షకు నిలిచిన స్నేహాలు ఎవరి మధ్యనా లేవు.

సైనికపరంగా సుల్తానులపై తనది పైచేయిగా ఉండడంతో రామరాయలు వారితో చులకనగా వ్యవహరించేవాడు. తన సభలో వారి రాయబారులకు తగు గౌరవం ఇచ్చేవాడు కాదని చరిత్రకారులు చెబుతారు. ఐతే, ఈ విషయం మీద చరిత్రకారులలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొందరు చరిత్రకారుల ప్రకారం రామరాయలు ముస్లిములు నివసించే ప్రాంతాలను ఆక్రమించుకున్నపుడు ముస్లిము మతాచారాలను అవమానించేవాడని చెబుతారు. కాని కొందరు ఇది సరికాదనీ, రామరాయల వద్ద అనేక మంది ముస్లిములు పనిచేసేవారనీ, రామరాయలు వారి కొరకు ప్రత్యేకంగా నివాసస్థలాలు, ప్రార్థనా స్థలాలు కట్టించి ఇచ్చేవాడనీ అంటారు.

విజయనగర సామ్రాజ్యం చాలా విశాలంగా ఉండేది. అంతేకాకుండా సిరి సంపదలతో తులతూగుతూ అపారమైన సైనిక సంపత్తి కలిగి ఉండేది. ఇంతటి బృహత్తరమైన సామ్రాజ్యాన్ని జయించగలిగే శక్తి ఏ ఒక్క ముస్లిము రాజ్యానికీ అప్పట్లో లేదు. దక్కన్ సుల్తానులందరూ కలిసి ఒక కూటమిగా ఏర్పడితేనే విజయనగరాన్ని జయించే అవకాశం ఉంది. విజయనగరాన్ని జయించడానికి కూటమి ఏర్పాటుకు పూనుకోవాలని ఆదిల్‌షా సన్నిహితులు, సలహాదారులు ఆదిల్‌షాకు చెప్పారు. ఇంకో గమనించవలసిన విషయం ఏమిటంటే ఆ సమయంలో ఆలీ ఆదిల్‌షాకు, రామరాయలకు మధ్య మైత్రి ఉండేది. అయినప్పటికీ అతడు గోల్కొండ సుల్తాను ఇబ్రహీం కుతుబ్‌షాతో మంతనాలు చేశాడు. ఇబ్రహీం దానికి ఒప్పుకోవడమే కాక, ఆదిల్‌షా బద్ధ విరోధియైన అహ్మద్‌నగర్ సుల్తానుకు రాయబారం పంపి, ఆలీ ఆదిల్‌షా, హుస్సేన్‌షా లకు సంధి కుదిర్చాడు. ఈ సంధిలో భాగంగా హుసేన్‌షా కూతురు, చాంద్ బీబీ సుల్తానును ఆలీ ఆదిల్‌షా పెళ్ళి చేసుకోగా, ఆలీ ఆదిల్‌షా చెల్లెలు, బీబీ హదియా సుల్తానును హుసేన్‌షా కొడుకు, మూర్తజా పెళ్ళి చేసుకున్నాడు.[4][5]

విజయనగరాన్ని పతనం చేయడానికి రామరాయలతో తన చెలిమిని తుంచుకొనే ఎత్తుగడను ఆలీ ఆదిల్‌షా వేశాడు. ఈ ఎత్తుగడలో భాగంగా తన వద్ద నుండి తీసుకున్న కొన్ని ప్రాంతాలను తిరిగి ఇచ్చివేయవలసిందిగా కోరుతూ రామరాయలు వద్దకు ఒక రాయబారిని పంపాడు. ఆదిల్‌షా ఊహించినట్లు గానే రామరాయలు ఆ రాయబారాన్ని తిరస్కరించాడు. రాయబారం తిరస్కరించడంతో యుద్ధం మొదలు పెట్టేందుకు ఒక కారణం కూడా సమకూరింది.

యుద్ధ భూమి

[మార్చు]
తళ్లికోట యుద్ధం ఈ పటములో చూపించిన వివిధ ప్రదేశాలలో జరిగినది భిన్నాభిప్రాయాలు ఉన్నవి [2] (వికీమాపియాలో ఈ ప్రాంతం)

ఈ యుద్ధం జరిగిన ప్రదేశంపై అనేక వాదనలు ఉన్నాయి. ఈ యుద్ధం రాక్షసి, తంగడి అనే రెండు గ్రామాల మధ్య జరిగిందని కొందరు, కాదు తళ్ళికోట వద్ద జరిగిందని మరి కొందరు వాదిస్తారు. అయితే ఈ రెండు ప్రదేశాలు కాదని మరో రెండు వాదనలు ఉన్నాయి. రామరాజ్ఞ బఖైర్, కైఫియత్‍ల వంటి సాంప్రదాయక హిందూ రచనలు, మూలాలూ, యుద్ధము రాక్షసి తంగడి[6] వద్ద జరిగిందని, ఫరిస్తా మొదలగు ముస్లిం చారిత్రికులు తళ్లికోట వద్ద జరిగిందని అభిప్రాయపడ్డారు.

దుర్గా ప్రసాదు అభిప్రాయం
విజయనగర సైన్యం రాక్షసి, తంగడి అనే రెండు గ్రామాల మధ్య మైదానంలో విడిది చేసింది. సుల్తానుల సమైక్య సైన్యం తళ్ళికోట అనే గ్రామం వద్ద విడిది చేసింది. యుద్ధం మాత్రం కృష్ణానదికి దక్షిణాన మస్కి, హుక్కేరి నదుల సంగమ ప్రదేశములోని బన్నిహట్టి అనే ప్రదేశంలో జరిగింది;[7] రాబర్ట్ సెవెల్ అభిప్రాయం:తళ్ళికోట కృష్ణకు 25 మైళ్ళు ఉత్తరాన ఉంది. కానీ యుద్ధం, కృష్ణకు దక్షిణాన రామరాయలు విడిది చేసిన ముద్గల్ నుండి పది మైళ్ల దూరంలో జరిగింది. సుల్తానుల కూటమి కృష్ణానది వంపులో ఇంగల్గి గ్రామం వద్ద దాటి ఉండవచ్చు. కాబట్టి యుద్ధం ఇంగలిగి గ్రామం నుండి ముద్గల్ పోయే దారిలో భోగాపూర్ (బాయాపూర్) అనే గ్రామం వద్ద జరిగి ఉండవచ్చు.

యుద్ధ వివరణ

[మార్చు]

నలుగురు సుల్తానులు తమ సైన్యాలను బీజాపూరు సమీపంలోని ఒక మైదాన ప్రాంతంలో కలిపారు. 1564 డిసెంబర్ 25న ఈ కూటమి సైన్యాలు దక్షిణ ముఖంగా ప్రయాణించి కృష్ణానదికు 25 మైళ్ళ దూరంలోని తళ్ళికోట గ్రామం వద్దకు చేరుకున్నాయి. కూటమి సైన్యాలు చాలా రోజుల పాటు అక్కడే విడిది చేశాయి.

అక్కడ విజయనగరములో రామరాయలు కూడా యుద్ధ సన్నాహాలు ప్రారంభించాడు. తన తమ్ముళ్ళు తిరుమల రాయలు, వెంకటాద్రి రాయలుల సమేతంగా కృష్ణకు దక్షిణ భాగాన రాక్షసి, తంగడి గ్రామాల మధ్యన సైన్యాన్ని మోహరించాడు. సుల్తాను సైన్యం నదిని దాటే అవకాశం గల అన్ని చోట్ల కాపలాను, పహారాను ఏర్పాటు చేశాడు.

అయితే సుల్తానుల సైన్యం నది దిగువగా ప్రయాణం చేస్తున్నట్లుగా రామరాయల సైన్యాన్ని నమ్మించి, ఒకరాత్రి వేళ నదిని దాటడం ప్రారంభించింది. తెల్లవారేసరికి సైన్యమంతా దక్షిణ తీరానికి చేరుకుంది. ఆ మరుసటి రోజున - 1565 జనవరి 23 (యుద్ధం జరిగిన తేదీని ఫరిష్తా జనవరి 23గా గుర్తించాడు. రాబర్ట్ సెవెల్ కూడా తన పుస్తకంలో అదే తేదీని తీసుకున్నాడు.) - రెండు పక్షాల సైన్యాలు ఒకదానికొకటి ఎదురుపడ్డాయి. రెండు వైపులా సైన్యం లక్షల్లో ఉంది. రామరాయలు సైన్యాన్ని మూడు భాగాలుగా విభజించాడు. ఎడమ వైపున తిరుమల రాయలు ఆలీ ఆదిల్‌షాను, మధ్యన రామరాయలు హుసేన్ నిజాంషాను, కుడివైపున వెంకటాద్రి రాయలు ఇబ్రహీం కుతుబ్‌షా, ఆలీ బరీద్‌లను ఎదుర్కొనే విధంగా యుద్ధ వ్యూహ రచన చేశాడు. దక్కన్ సుల్తానుల కూటమి సైన్యం ఫిరంగులను మోహరించింది. ఈ ఫిరంగులను కప్పిపుచ్చుతూ రెండువేలమంది సైనికులు విజయనగర సైన్యంపై బాణాల వర్షం కురిపించారు. విజయనగర సైన్యం వీరిపైకి దాడి చేసే సమయానికి వీరు లాఘవంగా తప్పుకుని ఫిరంగులకు దారినిచ్చారు. విజయనగర సైన్యం సరిగ్గా ఫిరంగులకు ఎదురుగా వచ్చింది. హఠాత్తుగా మొదలైన ఫిరంగి దాడులతో విజయనగర సైన్యం వెనకడుగు వేసింది.

పల్లకీ ఎక్కి పర్యవేక్షిస్తున్న రామరాయలు పల్లకీ దిగి ఒక ఎత్తైన సింహాసనమెక్కి బంగారు నాణేలు విరజిమ్ముతూ సైన్యాన్ని ఉత్సాహపరచాడు. విజయనగర సైన్యం కూడా కూటమి సైన్యంపై దాడులు చేసి బాగా నష్టం కలిగించడంతో కూటమి సైన్యం వెనక్కు కొంచెం తగ్గింది. మధ్యభాగంలోని కూటమి సైన్యం ఫిరంగులలో రాగి నాణేలను కూరి విజయనగర సైన్యంపై పేల్చింది. ఈ రాగి నాణాల దాడికి వేలాది సైనికులు బలయ్యారు. సైన్యం అంతా చెల్లాచెదురయింది. ఈ హడావుడిలో రామరాయలు గద్దె దిగి, మళ్ళీ పల్లకి ఎక్కబోయాడు. సరిగ్గా అదే సమయానికి ఫిరంగుల మోతలకు బెదిరిన కూటమి సైన్యంలోని ఓ ఏనుగు పరిగెత్తుకుంటూ రామరాయల పల్లకీ వైపు వచ్చింది. అదిచూసి భయపడిన బోయీలు పల్లకీని వదిలేసి పరుగెత్తారు. కిందపడిపోయిన రామరాయలు తేరుకుని లేచి గుర్రమెక్కేలోగా హుసేన్ నిజాం షా సైన్యం రామరాయలను పట్టుకుని బంధించి, సుల్తాను ముందు హాజరు పరచింది. హుసేన్‌షా స్వయంగా రామరాయల తల నరికి యుద్ధభూమిలో పైకెత్తి ప్రదర్శించాడు.

తమ రాజు మరణం చూసిన విజయనగర సైన్యం దిక్కుతోచని స్థితిలో పరుగులు తీసింది. కూటమి సైన్యం వారిని వెంటాడి హతమార్చింది. కనీసమాత్రపు ఆత్మరక్షణను కూడా ఆలోచించే పరిస్థితిలో లేని సైన్యం చెల్లాచెదురైంది. వెంకటాద్రి రాయలు మరణించాడు. తిరుమలరాయలు ఒక కన్ను కోల్పోయి వెనక్కి, నగరానికి పారిపోయాడు. రామరాయల కుమారుడు తన బంధువులతో సహా ఆనెగొంది నుండి మూడు కోసుల దూరములో ఉన్న ఒక లోతైన గుహలో తలదాచుకున్నాడు.[8]

విజయనగర సైన్యం ఓటమికి కారణాలు

[మార్చు]
  • హిందూ సైన్యములో వేగంగా కదిలే అశ్వాలు తక్కువ. మెల్లగా కదిలే ఏనుగులపై ముఖ్య సేనాధిపతులుండగా సుల్తానుల సైన్యములో పారశీక అశ్వములపై సుశిక్షుతులైన యోధులున్నారు. ఇది సహజంగా సుల్తానులకు లాభించింది.
  • సుల్తానుల సేనాధిపతులు యువకులు కాగా విజయనగర సైన్యాధిపతులు ముగ్గురూ వయసు మీరిన వారు -రామరాయలతో సహా.
  • హిందూ సైనికుల వద్ద వెదురు బద్దలతో చేసిన ధనుస్సులుండగా ముస్లింలవద్ద లోహముతో చేసిన ధనస్సులున్నాయి. వీటివల్ల బాణములు వేగంగా, గురి తప్పకుండా ఛేదిస్తాయి.
  • విజయనగర సైనికుల వద్ద ఏడు అడుగుల బల్లేలు, ఈటెలూ ఉన్నాయి. సుల్తానుల అశ్వ సైనికుల వద్ద పదిహేను అడుగుల పొడవున్న బల్లేలున్నాయి.
  • సుల్తానుల సైన్యములో తుర్కిస్తాన్ నుండి వచ్చిన సుశిక్షితులైన తుపాకిధారులుండగా విజయనగర సైన్యములో సరైన శిక్షణలేని యూరోపియను కూలి సిపాయిలు ఉన్నారు.
  • అన్నింటికన్నా ముఖ్య కారణం, వేలాది హిందూ సైనికులకు నాయకత్వము వహించుతున్న జిలాని సోదరుల వెన్నుపోటు. గతంలో అదిల్ షా వద్దనుండి పారిపోయి వచ్చి రామరాయల ఆశ్రయము పొందిన ఈ సోదరులు కీలక సమయములో యుద్ధరంగాన్ని వదలి పోవటం [9].

పర్యవసానాలు

[మార్చు]

ఈ యుద్ధంతో భారత్‍లో హిందూ సామ్రాజ్యాలకు ప్రమాదఘంటికలు మోగించింది. దక్షిణభారతంలో చిట్టచివరి హిందూ మహా సామ్రాజ్యానికి తెరపడింది. అయితే గెలిచిన సుల్తానుల మధ్య కూడా శాశ్వత శాంతి నెలకొనలేదు. తమలోతాము కలహించుకోవడంతో వారు బలహీనపడి చివరికి మొగలులకు, ఆ తరువాత బ్రిటిషు వారికీ లొంగిపోయారు.

మూలాలు

[మార్చు]
  1. ఈ తేదీ ఇంగ్లీషు వికీపీడియా నుండి స్వీకరించబడింది.
  2. యుద్ధం జరిగిన తేదీ జనవరి 23గా రాబర్ట్ సీవెల్ తన విస్మృత సామ్రాజ్యం పుస్తకంలో రాసాడు. ఆ పుస్తకంలో రిఫరెన్సు 327 వద్ద అలా ఎందుకు తీసుకున్నాడో కూడా రాసాడు.
  3. విస్మృత సామ్రాజ్యం - రాబర్ట్ సెవెల్ రచన[permanent dead link]
  4. Vijayanagara: History and Legacy S. Krishnaswami Aiyangar (ed.) Aryan Books International (2000) పేజీ.248
  5. యుద్ధ సమయములో అలీ ఆదిల్‌షా వద్ద మంత్రిగా పనిచేసిన రఫీయుద్దీన్ షిరాజీ చెప్పిన వృత్తాంతము. మీర్జా ఇబ్రహీం జుబిరీ రాసిన బసతిన్-ఉస్-సలాతీన్ నుండి అనువదించబడినది
  6. Patvardhan (The battle of Raksas Tangadi), Chanderkar (The destruction of Vijayanagara), Father Heras (Aravidu dynasty of Vijayanagara)[1]
  7. "1565 వరకు ఆంధ్రుల చరిత్ర- జె.దుర్గా ప్రసాదు పేజీ.257" (PDF). Archived from the original (PDF) on 2007-03-13. Retrieved 2007-06-30.
  8. Krishnaswami Aiyangar et.al,(2000) పేజి.254
  9. History of South India, Prof. K.A.N. Sastri, pp 267 and Dr. S.U. Kamath, A Concise History of Karnataka, pp 172-73

బయటి లింకులు

[మార్చు]