అక్షాంశ రేఖాంశాలు: 17°32′56″N 82°51′00″E / 17.549°N 82.85°E / 17.549; 82.85

ఎలమంచిలి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పట్టణం
పటం
Coordinates: 17°32′56″N 82°51′00″E / 17.549°N 82.85°E / 17.549; 82.85
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఅనకాపల్లి జిల్లా
మండలంఎలమంచిలి మండలం
విస్తీర్ణం
 • మొత్తం10.36 కి.మీ2 (4.00 చ. మై)
జనాభా
 (2011)
 • మొత్తం27,265
 • జనసాంద్రత2,600/కి.మీ2 (6,800/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1040
ప్రాంతపు కోడ్+91 ( 08931 Edit this on Wikidata )
పిన్(PIN)531055 Edit this on Wikidata
WebsiteEdit this at Wikidata

ఎలమంచిలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అనకాపల్లి జిల్లా, ఎలమంచిలి మండలం లోని పట్టణం. ఇది అనకాపల్లి జిల్లాలోని పురపాలక సంఘం.

పేరు వ్యుత్పత్తి

[మార్చు]
ఎలమంచిలి వద్ద పంట పొలాలు

ఎలమంచిలి అసలు పేరు "ఎల్ల - మజలీ" అని, పూర్వపు కళింగ దేశానికి గోదావరి మండలపు ఆంధ్ర రాజ్యానికి అది సరిహద్దు అని, ఉభయ రాజ్యాలవారు పన్ను వసూలుకు యలమంచిలి ఒక మజలీ కేంద్రంగా వాడుకొనుట వల్ల దానికి ఆ పేరు వచ్చిన వచ్చిందని తెలుస్తోంది. ఏనుగుల వీరాస్వామయ్య తన" కాశీ యాత్ర (1831)" లో దీనిని ఒక మజలీ ఊరుగా పేర్కొన్నారు.

చరిత్ర

[మార్చు]
ఎలమంచిలి రైలు సముదాయం

యలమంచికి కొంత దూరంలో పశ్చిమంగా నున్న రెనూకొండ వద్ద, తూర్పున కల కొత్తూరుగెడ్డ ప్రాంతంలో జరిగిన అన్వేషణలో శిలాయుగం నాటి పనిముట్లు కొన్నిబయలుపడ్డాయి. యలమంచిలికి పంచదార్లకు నడుమన నవీన శిలాయుగం నాటి సాధనాలు, మట్టిపాత్రల శకలాలు దొరికాయి. వీటిలో కొన్నింటిని ఆంధ్ర విశ్వవిద్యాలయం చరిత్ర-పురావస్తు శాఖ మ్యూజియంలో భద్రపరచారు. విశాఖ జిల్లా “బొజ్జన్నకొండ” వద్ద లభ్యమయిన ఆధారాల వలన ఈ ప్రాంతం కూడా ఆంధ్ర శాతవాహనుల ఏలుబడిలో ఉన్నట్లు తెలుస్తుంది.

ఆంధ్రశాతవాహనుల కాలంలో జైనమతం బాగా వర్ధిల్లిన వర్ధిల్లిందని డేవోకొండ పరిసరాల్లో ఉన్న పెదపాడు, చింతలపాడు, సాలేపాడులలో దొరికిన ఆధారాల వల్ల తెలుస్తుంది. కొక్కిరాపల్లి ప్రాంతం ఒకనాటి జైనఅగ్రహారం అని తెలుస్తుంది. అయితే శాతవాహనుల కాలం నుండి బౌద్దమతం విలసిల్లింది. కొత్తూరువద్ద శారదా నది తీరంలో పాండవుల గుహ గా నేడు పిలవబడుతున్న ప్రదేశం ఒకనాటి బౌద్ద స్థావరం. సా.శ. 360 సముద్రగుప్తుని దక్షిణాపద జైత్రయాత్రలో ఈ ప్రాంతం కూడా అతని తాకిడికి గురైందని చరిత్ర కారుల అభిప్రాయం. సముద్రగుప్తుని ప్రయాగశాసనంలో దీనిని దేవరాష్ట్రం అని పేర్కొన్నారు.

చారిత్రిక యుగాల్లో ఈ ప్రాంతంలో వాసికెక్కిన ప్రముఖ వాణిజ్య రేవుపట్నం ‘దివ్వెల’ యే యలమంచిలికి 6 కి.మీ.ల దూరంలో కుగ్రామంగా నున్న నేటి దిమిలి. నౌకలకు సంకేతం సూచికంగా ఎత్తైన దీప స్తంబాలపై దివ్వెలనుపయోగించుటచే ఈ ప్రదేశానికి ఆ పేరు వచ్చింది. ఆనాడు సముద్రయానానికి ముందు ఆరాధించబడే దైవం”రత్నాకరస్వామి” ఆలయం నేటికి దిమిలి సమీపాన గల తెరువుపల్లి గ్రామంలో ఉంది.

ఈ విధంగా చరిత్రపుటల్లో వేరువేరు కాలాల్లో ఈ ప్రాంతం ప్రస్తావనకు వచ్చినప్పటికి దీనికొక ప్రాముఖ్యతను చేకూర్చిన ఘనత ఆంధ్రదేశాన్ని పాలించిన చాళుక్యులకే దక్కుతుంది. యలమంచిలికి సమీపంలో 10 కి.మీ. దూరంలో నున్న’సర్వసిద్ది’ని తొలి వేంగీచాళుక్య రాజైన కుబ్జవిష్ణువర్ధనుని పేరిట అతని కుమారుడైన జయసింహవల్లభుడు సా.శ. 615 సం.లో నిర్మించి ఉంటాడని చరిత్రకారులు భావిస్తున్నారు. ఇతనికి విషయసిద్ది అనే బిరుదు ఉంది. దండి మహాకవి దశకుమార చరిత్రలో వర్ణించిన ఆంధ్రనగరం నేటి సర్వసిద్ది అని చరిత్ర కారుల అభిప్రాయం. రాజ్యాధికారానికై తరచూ జరిగే అంతహకలహాలలో యలమంచిలి ఒక సురక్షిత స్థావరంగా రూపొందింది. వేంగీ సామ్రాజ్యాన్ని పోగొట్టుకొన్న కొక్కిలి విక్రమాదిత్యుడు ఈ ప్రాంతంలో దాగుకొన్నాడని, కొక్కిరాపల్లి గ్రామం అతను నిర్మిచినదందేనని గుర్తించారు. కళింగ పాలకులైన పూర్వగంగరాజులు ఈ కొక్కిలిరాజు వారసుల నుంచి ఈ ప్రాంతాన్ని స్వాధీన పరచుకోవడం, తిరిగి గుణగ విజయాదిత్యుని కాలంలో చాళుక్యరాజులు మరల యలమంచిలి సీమను ఆక్రమించుకొని 'త్రికళింగాధిపతులమని' ప్రకటించుకోవడం లాంటివి ఈ ప్రాంతపు అస్థిర రాజకీయ స్థితిని చూపే చారిత్రిక వాస్తవాలు. ప్రథమ చాళుక్యభీముని కసింకోట శాసనం ప్రస్తావించబడిన విధానాన్ని బట్టి సా.శ. తొమ్మిది, పది శతాబ్దాలలో ఈ ప్రాంతాన్ని 'ఎలమంచి కళింగదేశ' 'దేశరాష్ట్రవిషయ' అని పిలిచేవారు. ఏడవ విజయాదిత్యుని శాసనం ఒకటి యలమంచిలి లోనే దొరకడం వల్ల వారిపాలన చివర వరకూ కొనసాగినట్లు తెలుస్తుంది.

చాళుక్యుల పాలన అంతరిచిన అనంతరం అనేక సామ్రాజ్యాల ప్రభావం యలమంచిలి మీద పడింది. వెలనాటి ప్రభువుల కాలంలో వారికి మంత్రిగా నున్న నండూరి కొమ్మనామాత్యుడు ఎలమంచిలి, చోడవరం, శ్రీకూర్మం తదితరి ప్రాంతాలలో 32 వైష్ణవాలయాలను నిర్మించినట్లు ‘కేయురబాహుచరిత్ర’ చెపుతోంది. ఈమేరకు ఎలమంచిలి కొండ పైనున్న ‘వేణుగోపాలస్వామి’ఆలయం, బస్సుస్టాండు ప్రక్కననున్నకొలను ’కొమ్మయ్యగుండం’ కొమ్మనామాత్యుడు నిర్మించినవే. కొమ్మయ్యగుండం మధ్యలోనేటికి చెక్కు చెదరక నున్నమండపంలో కుమారస్వామి ఆలయం ఉండేదని తెలుస్తోంది .అయితే ఎన్ని సామ్రాజ్యాలు వచ్చి పోయినా ఎలమంచిలి నగరానికి రాజకీయంగా స్వయంప్రతిపత్తి 13 శతాబ్ది తొలిదశ వరకు ఏర్పడలేదు. ఈ ప్రాంతాన్ని సాంస్కృతిక, ఆర్దికంగా సుసంపన్నం చేసిన ఘనత ఎలమంచిలి చాళుక్యరాజులకు దక్కుతుంది. వేంగీచాళుక్య వారసులమని చెప్పుకొనే ఈ వంశస్థులు ఎలమంచిలిని తమ ఇంటిపేరుగా మార్చుకొని సా.శ. 13వ శతాబ్ది ప్రారంభం నుండి 16వ శతాబ్ది ద్వితీయార్దం వరకు ఎలమంచిలి, సర్వసిద్ది ప్రాంతాలను పరిపాలించినట్లు పంచదార్ల, సింహాచల శాసనాలు, కావ్యాలంకార చూడామణి అనే గ్రంథం తెలియజేస్తోంది. సా.శ. 1402 లో పంచదార్ల వద్ద జరిగిన యుద్ధంలో వీరు గంగారాజుల తోడ్పాటుతో తెలుగు చోడుల తోనూ, కొప్పుల పతులతో తలపడడం జరిగింది. తెలుగుచోళులు, వెలమ నాయకులు, కళింగ గజపతుల వత్తిడుల మధ్య మాండలిక పాలకులుగా ఈ ప్రాంతంలో తమ ఆధిక్యతను కాపాడుకొంటూ వీరు చూపిన నేర్పు ప్రశంనీయం. వరహానది నుండి సింహాచలం వరకు వీరి ఆధీనంలో ఉండేది. ఈ పాలకుల్లో ఎర్రమ, ఉపేంద్రదేవ, విశ్వేశ్వరదేవ, నృసింహదేవులు ప్రముఖులు. వీరు తమ పేర్లు కలసివచ్చేలా ఊరిపేర్లు పెట్టడం విశేషం. కొప్పరాజునారయణుని పేర ‘కొప్పాక’ ఉపెంద్రుని పేర’ఉప్మాక’ ఎర్రమనాయకుడి పేరా ’ఎర్రవరం’ అతని భార్య సింగమాంబ పేరిట సింగవరం హరినరేంద్రుని పేర హరిపాలెం వెలిశాయి. వీరికాలంలో తెలుగు భాషకు ఉన్నతమైన సేవలందించారు. తెలుగులో మొదటిసారిగా ఛందోగ్రంధాలను, శాస్త్రగ్రంధాలను అందించారు. దోనయామాత్య కవి’సస్యానంద’ అనే గ్రంధాన్ని విన్నకోట పెద్దయ ’కావ్యాలంకార చూడామణి’ అనే ఛందోగ్రంధాన్ని రచించి, యలమంచిలి ప్రాంతానికి ఒక విశిష్టతను చేకూర్చారు. వీరి ఆధ్వర్యంలోనే పంచదార్ల వద్దనున్న ‘ధర్మలింగేశ్వరాలయం’అనే ప్రసిద్ధ శైవక్షేత్రం వెలిసింది. 16వ శతాబ్ది చివరలో ముస్లింలతో జరిగిన యుద్ధంలో చాళుక్యులు ఓడిపోవడంతో ఈప్రాంతం ముస్లిం రాజుల పాలనలోకొచ్చింది. ఐరోపా వారు భారతదేశానికి వచ్చిన తర్వాత 18వ శతాబ్దంలో జరిగిన ఫ్రెంచ్- ఆంగ్లేయ యుద్ధాలలో ఫ్రెంచివారు ఓడిపోవడంతో విశాఖపట్నం జిల్లా ఈస్టిండియా కంపెనీ వశమయింది. డచ్ వారు నిర్మిచిన కట్టడాలు ఉండడంవల్ల వారి ఉనికి ఇక్కడ ఉన్నట్లు అర్ధమవుతోంది. యలమంచిలి చరిత్రకు సాక్షీభూతంగా పంచదార్ల ధర్మలింగేశ్వర ఆలయం,యలమంచిలి వీరభద్రస్వామి, వేణుగోపాలస్వామి ఆలయాల గోడల్లోని క్షిప్తమైన అనేక శాసనాలు నేటికి కానవస్తాయి. బ్రిటిష్ వారి సర్కార్ జిల్లాలలో ఒకటైన నాటి విశాఖపట్నం జిల్లా, పార్వతీపురం నుండి పాయకరావుపేట వరకు విస్తరించి ఉండేది. అప్పటి విశాఖపట్నం జిల్లా నేడు విశాఖ జిల్లాగా పిలువ బడుతున్న ప్రాంతమంతా నాడు సర్వసిద్ది తాలూకాగా పిలువబడేది.

విశాఖపట్నం జిల్లా, నర్సీపట్నం రెవెన్యూ డివిజన్ లోని అతిపెద్ద తాలూకా అయిన యలమంచిలి తాలూకాను 1970లో యలమంచిలి, నక్కపల్లి తాలూకాలు గాను మరల 1984లో యలమంచిలి తాలూకాను యలమంచిలి, అచ్యుతాపురం, రాంబిల్లి, ఎస్. రాయవరం మండలాలుగా విభజించుట జరిగింది. నేడు కొన్ని ప్రభుత్వ శాఖలులో మినహా ఎలమంచిలికి బదులు యలమంచిలి అనే పేరు ఎక్కువ వాడుకలో ఉంది.

స్వాతంత్ర్యోద్యమంలో ఎలమంచిలి

[మార్చు]

స్వాతంత్ర్యోద్యమంలో పలువురు యలమంచిలి ప్రాంతవాసులు తుదివరకూ పాల్గొని జైలు శిక్షను అనుభవించారు. వారిలో స్త్రీలు ఉండడం విశేషం. స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నందుకు దిమిలికి చెందిన మంతా అనంతరావు 1932లొ ఆరు నెలలు, సేనాపతి అప్పలనాయుడు మూడు నెలలు, ఎల్లాయి అప్పలనరసింహం 1932 ఫిబ్రవరి నుండి 1942 ఫిబ్రవరి వరకు జైలు శిక్ష అనుభవించారు. అదే గ్రామానికి చెందిన శిష్టా లింగమ్మ 1932 లో ఆరు నెలలు, మిస్సుల లక్ష్మీనరసమ్మ ఆరు నెలలు కాలనాధబట్ల మహాలక్ష్మమ్మ 1933 మార్చిలో, శిష్ట్లా కామేశ్వరరావు 1942 ఆగస్టు నుండి 1944 డిసెంబరు వరకు జైలు శిక్ష అనుభవించారు. పెనుగొల్లుకు చెందిన ఇంద్రగంటి కామేశ్వరరావు స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నాడు. మంగవరానికి చెందిన గాదె నారాయణమ్మ శాసనోల్లంఘనోద్యమంలో పాల్గొని కారాగార శిక్ష అనుభవించింది. మిస్సులసూర్య నారాయణ మొహనదాసు, శిష్ట్లా రామదాసులు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని, నిర్బంధించబడ్డారు. యల్లాయి నారాయణరావు, మారేపల్లి రామచంద్రరావులు బెర్హంపూర్ జైలులో శిక్ష ననుభవించారు .సిగిరేద్ది పోతన్న శిష్ట్లా పురుషోత్తాలు 1932 ఫిబ్రవరిలో కారాగారంలో నిర్బంధించబడ్డారు. దిమిలికి చెందిన మిస్సుల చిరంజీవి జిల్లాలో మొదటి స్వాతంత్ర్యోద్యమ సత్యాగ్రహి. రాష్ట్రపతి వి.వి.గిరి, తెన్నేటి విశ్వనాథంలతో కలసి స్వాతంత్ర్యోద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. తామ్రపత్ర గ్రహీత సత్యవరానికి చెందిన కాకర్లపూడి పాయకరావు అండమాను జైలులో శిక్ష ననుభవించి అసువులు బాసిన అమరజీవి. ఇరువాడ (సబ్బవరం)కు చెందిన పేరిచెర్ల అగ్గిరాజ, అల్లూరి సీతారామరాజు అనుయయునిగా మన్యం తిరుగుబాటులో పాల్గొని బ్రిటిష్ వారి తుపాకి గుళ్ళకు నేలకొరిగిన అమరవీరుడు.

ఇతరాలు

[మార్చు]

సబ్ కోర్ట్ :యలమంచిలి న్యాయస్థానానికి నూట ముప్పై సంవత్సరాల చరిత్ర ఉంది. 1860 సంవత్సరానికి పూర్వం ఎస్. రాయవరంలో ఏర్పాటుచేయబడిన కోర్ట్ 1879 సం.లో యలమంచిలికి మార్చబడింది. కోర్ట్ శతాబ్దిఉత్సవాలు 1981 లో నిర్వహించబడ్డాయి. ఒకప్పుడు ఊరంతా వకీళ్ళు, కక్షిదారులు, కన్యాశుల్కం నాటకంలో రామప్పపంతులు వంటి కోర్టు పక్షులతో సందడిగా ఉండేది. గతానికి గుర్తుగా ఇప్పటికి ఒక వీధి పేరు కోర్ట్ పేట మరొక వీధిపేరు కోర్ట్ ప్యూనుల పేటగా పిలవబడుతున్నాయి. కోర్ట్ లో సీనియర్ సివిల్ జడ్జి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ (పి.డి.ఎం) అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ (ఏ.డి.ఎం) బెంచీలు ఉన్నాయి..

భౌగోళికం

[మార్చు]

ఇది విశాఖపట్నం నుండి ఇది 64 కి.మీ. దూరంలో ఉంది. యలమంచిలి పట్టణం 17.33N, 82.52E అక్షాంశ రేఖాంశాలవద్ద ఉంది. ఇది సముద్రతలం నుండి 7 మీటర్లు (26 ఆడుగులు) సగటు ఎత్తులో ఉంది.

జనాభా గణాంకాలు

[మార్చు]

2011 భారత జనాభా లెక్కలు ప్రకారం  ఎలమంచిలి జనగణన పట్టణ జనాభా  మొత్తం 27,265 ఉండగా, ఇందులో 13,365 మంది పురుషులు, 13,900 మంది మహిళలు  ఉన్నారు. 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 2587, ఇది ఎలమంచిలి (సిటి) మొత్తం జనాభాలో 9.49%. ఎలమంచిలి  పట్టణం లింగ నిష్పత్తి రాష్ట్ర సగటు 993 కు వ్యతిరేకంగా 1040 గా ఉంది. అంతేకాక ఎలమంచిలిలో బాలల లైంగిక నిష్పత్తి 926 వద్ద ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సగటు 939 తో పోలిస్తే ఇది ఎక్కువ.ఎలమంచిలి పట్టణ అక్షరాస్యత రాష్ట్ర సగటు 67.02% కంటే 77.14% ఎక్కువ . ఎలమంచిలిలో పురుషుల అక్షరాస్యత 83.52% కాగా, మహిళా అక్షరాస్యత రేటు 71.07% వద్ద ఉంది. ఎలమంచిలి పట్టణ  పరధిలో మొత్తం 7,375 ఇళ్లున్నాయి.[2]

2011 జనగణన ప్రకారం పట్టణంగా ప్రకటించిన తరువాత జనాభా 70,553.

2001 జనాభా లెక్కల ప్రకారం జనాభా 68480. స్త్రీల సంఖ్య-33663 పురుషుల సంఖ్య-33817

పరిపాలన

[మార్చు]

గ్రామ పంచాయతి 1-3-1886 లో ఏర్పడింది. ఎలమంచిలి గ్రామపంచాయితీని మున్సిపాలిటీగా మార్చుతూ రాష్ట్రప్రభుత్వం తేది 28.12.2011 న ఉత్తర్వు జారీ చేసింది. ఎలమంచిలిని మున్సిపాలిటీగా ఏర్పాటు చేయు సందర్భంలో పరిసర గ్రామాలైన సోమలింగపాలెం, రామారాయుడిపాలెం, పెదపల్లి, ఎర్రవరం, కట్టుపాలెం, కొక్కెరపల్లి, తెరువుపల్లి, కొత్తూరు గ్రామాలను ఎలమంచిలిలో విలీనం చేసారు.

రవాణా సౌకర్యాలు

[మార్చు]

జాతీయ రహదారి 16, హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గం లపై ఈ పట్టణం వుంది.

సౌకర్యాలు

[మార్చు]

పట్టణంలో 2 ప్రభుత్వ కళాశాలలు, 4 ప్రైవేటు జూనియర్ కళాశాలలు, 4 డిగ్రీ కళాశాలలు, పి.జి. సెంటర్ ఉన్నాయి. 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి, పశువుల ఆసుపత్రి, ఆర్.టి.సి కాంప్లెక్స్, 3 సినిమా హాళ్ళున్నాయి.

సంస్కృతి

[మార్చు]

సాంస్కృతిక వేదికలు

[మార్చు]
  • శ్రీ.శ్రీ పఠన మందిరం (శాఖా గ్రంథాలయం)
  • ఆరుద్ర సమావేశ మందిరం
  • ఘంటసాల కళామందిరం

సమీప పర్యాటక ఆకర్షణలు

[మార్చు]
కొత్తూరు ధనదిబ్బలు బౌద్ధ స్తూపం
పెంజేరువు

యలమంచిలి నుంచి సైతారు పేటకి వెళ్లే దారిలో ఈ చెరువు వుంది. ఈ చెరువుకి ఆనుకొని ఉన్న కొండ పై దుర్గాదేవి అమ్మవారి ఆలయం కూడా ఉంది.

కొండకర్ల ఆవ

యలమంచిలికి ప్రక్కన ఉన్న అచ్యుతాపురం మండలంలో సహజసిద్దంగా ఏర్పడిన మంచినీటి సరస్సు’ కొండకర్ల ఆవ.’ ఇది రాష్ట్రంలో కొల్లేరు సరస్సు తర్వాత రెండవ పెద్ద మంచినీటి సరస్సు. ఒక వైపు కొండలు, వేరొక వైపు కొబ్బరిచెట్లు ఆవకు ప్రత్యేక అందాన్ని చేకూర్చుతున్నాయి. సరస్సు లోని వివిధ రకాల నీటి మొక్కలు, రకరకాల పక్షులు, ప్రకృతివీక్షకులకు కనువిందు కలగజేస్తాయి. నవంబరు, డిసెంబరు నెలలలో సైబీరియా మొదలగు అనేక దేశాల నుండి పక్షులు ఇక్కడకు వలస వస్తాయి. అందమైన విదేశీ పక్షులు సందర్శకులను ఆకట్టుకొంటాయి. ఈ సరస్సు అందానికి ముగ్ధులైన ఫ్రెంచి వారు ఆవకు సమీపంలో ‘ప్రెంచ్ భవనాన్ని’నిర్మించారు. స్వాతంత్ర్యం రాకముందు విజయనగరం మహారాజులు వారాంతరపు విడిది గా ( holiday resort) ఇక్కడకు వచ్చేవారు. ఆవలో దోనె షికారు ఎంతో ఉషారుగా ఉంటుంది. ప్రకృతి రమణీయత నవంబరు నుండి ఫిబ్రవరి వరకు బాగుంటుంది. ఆవకు దగ్గర లో నున్న చూచికొండ గ్రామం వరకు రోడ్డు సౌకర్యం ఉన్నది.

లక్కబొమ్మల ఏటికొప్పాక

యలమంచిలి కి 20 కి.మీ.దూరంలో వరాహనది ఎడమ ఒడ్డున ఉన్న గ్రామం ఏటికొప్పాక. బొమ్మల తయారీలోఆంధ్రప్రదేశ్ లోకొండపల్లి తర్వాత అత్యంత ప్రాచుర్యం పొందిన గ్రామం ఏటికొప్పాక. ఈ గ్రామానికి కొయ్యబొమ్మల తయారీ లో200 సం.ల చరిత్ర ఉన్నది. స్థానిక హస్తకళా నిపుణులు దగ్గరలో నున్న కొండలలో దొరికే ‘ అంకుడుకర్ర ‘అనే మెత్తని కర్రను ముక్కలుగా నరికి ఎండబెట్టి, శుభ్రంచేసి చేతి అడ్డలపై (ఒక పెద్ద చక్రానికి, దానికి కొంతదూరంలో ఒకచిన్నచక్రాన్నిఉంచి రెండింటికి ఒక బెల్టు బిగించి పెద్దచక్రాన్ని ఒక వ్యక్తి త్రిప్పుతుంటే, కళాకారుడు చిన్న చక్రానికి కొయ్య బిగించి చిత్రిక పట్టే సాధనం) ఉలి, బాడిత వంటి సాధారణ పనిముట్లతో కర్రముక్కలను చిత్రికపట్టి, నునుపుగా చేసి, పిల్లలు ఆడుకొనే బొంగరాలు, గిలకలు, లక్కపిడతలు మొదలగు ఆట బొమ్మలు చేసి వాటికి వివిధ లక్క రంగులు పట్టించి స్థానిక సంతలలోఅమ్మేవారు. కాని ఈ లక్క బొమ్మలకు ప్రాచుర్యం కలిగించిన వ్యక్తి విజయనగరానికి చెందిన పద్మనాభరాజు. ఈయన ఈ గ్రామానికొచ్చి 1911 లో లక్కబొమ్మలతో వ్యాపారం మొదలు పెట్టారు. అతని తర్వాత ఆయన వారసుడు చిట్టిరాజు హస్త కళాకారులను సంఘటిత పరచి కొత్త డిజైన్లతో రకరకాల బొమ్మలు చేయించి అమ్మేవారు.ప్రస్తుతం ఈతని మేనల్లుడు చింతలపాటి వెంకటపతి రాజు ఏటికొప్పాక కొయ్యబొమ్మలకు ప్రపంచఖ్యాతి తేవాలనే ఉద్దేశంతో స్థానిక కళాకారులతో పద్మావతి అసోసియేషన్ అనే హస్తకళాకారుల సహకార సంఘాన్ని 1984 లోస్థాపించి, వారికి ఆంధ్రా యూనివర్సిటి, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫేషన్ టెక్నాలజీ వంటి సంస్థల సహకారంతో కొత్త డిజైన్లు చేయడం. లక్కలో రసాయనిక రంగులు కలపడం మొదలగు మెళుకువలు నేర్పుతున్నారు. వివిధ ప్రాంతాల హస్తకళా నిపుణులను రప్పించి ఇక్కడ వారికి శిక్షణనివ్వడం, ఇక్కడ వారిని దేశంలో వివిధ హస్తకళాప్రదర్శనలకు తీసుకువెళ్ళడం వంటివి చేస్తున్నారు. ఆకర్షణీయమైన రంగులలతో, వివిధ ఆక్రుతలతో తయారయ్యే కొయ్యబొమ్మలు మనల్ని ఎంతగానో ఆకట్టుకొంటాయి. వినాయకుడు, వెంకటేశ్వరస్వామి మొదలగు దేవతామూర్తుల బొమ్మలు, కొంగలు, చిలకలు మొ|| గు పక్షులు, కుందేళ్ళు,గాజులస్టాండు,పెన్ను స్టాండు, లక్కపిడతలు, గిలిగిచ్చికాయలు, చదరంగపు పావులు, భరెణలు,తల్లి-పిల్ల, బజాజ్ స్కూటర్ మొ|| బొమ్మలు రాష్ట్రంలోని లేపాక్షి ఎంపోరియం, దేశంలోని అనేక హస్తకళా కేంద్రాలకు, అమెరికా, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్సు మొ|| విదేశాలకు ఎగుమతి అవుతాయి. కళాకారులు అనేకజాతీయ బహుమతులు గెలుచుకొన్నారు. ఇతర ప్రాంతాల హస్తకళా నిపుణులు బస చేయడానికి గెస్ట్ హౌస్ ఉంది.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]
పంచదార్ల ధర్మలింగేశ్వరాలయం

పంచదార్ల ధర్మలింగేశ్వరాలయం:యలమంచిలికి 10 కి.మీ. దూరం నున్న పంచదార్ల గ్రామంలో చారిత్రిక విశిష్టత కల అతి ప్రాచీన శైవక్షేత్రం ధర్మలింగేశ్వరాలయం ఉంది. ఇక్కడ ఎల్లవేళలా భూగర్భం నుంచి పైకి వచ్చే ఐదు నీటి ధారలు (పంచ ధారలు) భక్తులకు కనువిందు కలిగిస్తాయి. ఇక్కడ స్వయం భూయుక్తమైన లింగం ఉండేదని కాల గతిలో అది మరుగున పడగా నారదుని సూచన మేరకు యమధర్మరాజు తన కుష్టువ్యాధి నివారణ నిమిత్తం మరొక వర్ధమాన లింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించేడని యమధర్మరాజు చే పునఃప్రతిస్టించ బడిన లింగం కనుక ధర్మలింగేశ్వర ఆలయంఅని పేరు వచ్చినట్టు స్థల పురాణం. ఇక్కడ పురాతన శివలింగాన్ని సముద్రగుప్తుని కాలంలో దేవరాష్ట్రాన్ని పాలించే కుభేరుడు ప్రతిష్ఠించాడని చరిత్రకారుల భావన. ఈ క్షేత్రంలో ముందుగా బయట మనకు కనిపించేది ’రాధామాధవ స్వామి’ నిలయం, ఒక మండపం. ఈ మండపాన్ని హరినరేంద్రుడు సా.శ..1538 లో నిర్మించాడు. ఆలయానికి దక్షిణ దిశలో తటాకం ఉంది. నీటి ధారలన్నీ దీనిలో కలుస్తాయి. ఈ తటాకాన్ని, తూర్పుదిశలో నున్న ఆస్థాన మండపాన్ని చాళుక్య నృసింహదేవుని భార్య వీరాంబికచే నిర్మితమయ్యాయి. ఇక్కడ ఆలయ సమూహంలో విశ్వేశ్వరస్వామి ఆలయం, అనేక లింగాకృతులు, దేవతామూర్తుల విగ్రహాలు, నందీశ్వర విగ్రహాలు, శిథిల శిల్పాలు కనిపిస్తాయి. ఇక్కడ ప్రధానమైన ధర్మలింగేశ్వరాలయం, అన్ని ఆలయాల కన్న ఎత్తులో నున్నది. గర్భగుడి లోపల నున్న మండపం క్రి.శ.1432 లో కుమార ఎర్రమనాయకునిచే నిర్మించ బడినదని, దేవుని కళ్యాణ ఉత్సవాల కై నిర్మించబడ్డ మండపం 1407 లో యలమంచిలి విశ్వేశ్వర దేవుని చే నిర్మిచబడినదని చెపుతారు. ఆలయాన్ని పురాతన రక్షిత కట్టడంగా గుర్తిస్తూ పురావస్తు శాఖ వారు పెట్టిన బోర్డు ఇక్కడ ఉంది. కార్తీక మాసం, శివరాత్రి, విజయదశమి రోజుల్లో ఈ పుణ్యక్షేత్రం భక్తులతో కళకళ లాడుతోంది.

ఉపమాక వెంకన్న: ఉత్తరాంధ్రవాసుల ఆరాధ్య దైవమైన ' ఉపమాక వెంకన్న' 'గా పిలువ బడే వేంకటేశ్వరస్వామి ఆలయం యలమంచిలికి 20 కి.మీ.దూరంలో కల ఉపమాక గ్రామంలో వెలిసింది. ఈ దేవాలయం తిరుపతి వెంకేశ్వరస్వామి దేవాలయాన్ని పోలి ఉంటుంది. ఈ క్షేత్రం క్రీ..శ. ఆరవ శతాబ్దంలో వెలిసినట్లు తెలస్తుంది. వెంకటేశ్వర స్వామి వెలసిన పర్వతాన్ని గరుడాద్రి పర్వతమని పిలుస్తారు. గరుక్మంతుడు, విష్ణుమూర్తిని ఎల్లవేళలా తన వీపు పై కూర్చుండునట్లు వరం కోరగా, దక్షిణ సముద్ర తీరమందు నీవు కొండగా ఆవిర్భవిస్తే, తిరుపతి నుండి వచ్చి నీ పై అవతరించి పూజలందుకొంటానని విష్ణుమూర్తి తెలపగా గరుక్మంతుడు గరుడాద్రి పర్వతంగా వెలిశాడని స్థలపురాణం. ఇక్కడ ఆలయంలో స్వామి గుర్రం పై కూర్చున్నట్టు లక్ష్మిదేవి క్రింద వెలసినట్లు దర్శనమిస్తారు. కొండ దిగువన విశాలమైన మరొక ఆలయంలో శ్రీ పద్మావతి సమేత వెంకేశ్వరస్వామి దర్శనమిస్తాడు. ఆలయాన్ని ఆనుకొని రెండు పుష్కరుణులు క్షేత్రానికి ప్రత్రేక శోభను చేకూర్చుతున్నాయి. ఎత్తయిన పర్వతం, సుందరమైన ఆలయ బేడామండపం, ఇతర కట్టడాలు ఆనాటి శిల్పకళా నైపుణ్యాన్ని చాటి చెపుతాయి. ఏటా ఫాల్గుణ శుద్ధ ఏకాదశి నాడు స్వామివారి కల్యాణ ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ప్రస్తుతం దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆధీనంలో ఆలయం నడుస్తోంది.

వీరభద్రస్వామి ఆలయం: యలమంచిలిలో గల ప్రాచీన దేవాలయాలలో వీరభద్రస్వామి దేవాలయం ఒకటి. సా.శ. 15 వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయాన్ని. చాళుక్య రాజులు గాని యాదవరాజులు గాని నిర్మించి ఉంటారని భావించ బడుచున్నది. ఈ శైవక్షేత్రంలో వీరభద్రస్వామి ఐదు అడుగుగుల ఎత్తుగల విగ్రహ రూపంలో దర్శనమిస్తారు. ఎత్తయిన ఆలయ గాలి గోపురం గ్రామమంతా కనిపిస్తుంది. గాలి గోపురం క్రింద బ్రహ్మి,వరాహ, గణేశ, మహిషాసురమర్దని, కుమారస్వామి, సదాశివుని రాతి శిల్పాలు, కొన్నిశాసనాలు చెక్కబడి ఉన్నాయి. ఆలయంలో భద్రకాళి, కుమారస్వాములకు వేరు గదులున్నాయి. ఆలయ ప్రహారి గోడ పై చెక్కబడిన వివిధ శిల్పాలు సందర్శకులను ఆకట్టుకొంటాయి.

వేణుగోపాలస్వామి ఆలయం:దీనిని కూడా చాళుక్యులే నిర్మించారని భావించబడుతోంది. ఈ ఆలయ కొండశిఖరం మీద నేటికి శిథిల ఆలయ ముఖద్వారం ఒకటి కనబడుచున్నది. స్థానికులు దానిని ‘యాదవరాజుల’ కథలలో చెప్పబడే కాటమరాజు చెల్లెలైన "నూకిపాప" మేడగా పేర్కొంటారు. కాని అక్కడ ఉన్న నంది విగ్రహపు శిథిలాన్ని, అక్కడ ఉండే గుండ్రాయి మీద చెక్కబడ్డ 11 వ శతాబ్దపు చాళుక్య విజయాదిత్యుని చే సమర్పించ బడిన దానాన్ని సూచించే శాసనాన్ని బట్టి అది ఒక శివాలయం అని తెలుస్తోంది.

ప్రముఖులు

[మార్చు]

ఇవీ చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. ఆంధ్ర ప్రదేశ్ జిల్లాల జనగణన దత్తాంశ సమితి - పట్టణాలు (2011), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q58768667, archived from the original on 15 March 2018
  2. "Yelamanchili Census Town City Population Census 2011-2021 | Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2021-06-15.

ఆధార గ్రంథాలు

[మార్చు]

ప్రాచీన చరిత్ర భాగం - ఆచార్య కొల్లూరి సూర్యనారాయణ పంచదార్ల శాసనాలు"

వెలుపలి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=ఎలమంచిలి&oldid=3955820" నుండి వెలికితీశారు