లేపాక్షి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లేపాక్షి
గ్రామం
వీరభద్రస్వామి ఆలయం
లేపాక్షి is located in Andhra Pradesh
లేపాక్షి
లేపాక్షి
లేపాక్షి is located in India
లేపాక్షి
లేపాక్షి
నిర్దేశాంకాలు: 13°49′N 77°36′E / 13.81°N 77.60°E / 13.81; 77.60Coordinates: 13°49′N 77°36′E / 13.81°N 77.60°E / 13.81; 77.60
Countryభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఅనంతపూర్
జనాభా
(2011)[1]
 • మొత్తం10,042
భాష(లు)
 • అధికారతెలుగు
కాలమానంUTC+5:30 (IST)
పిన్‌కోడ్
515331
వాహనాల నమోదు కోడ్AP 02
ఏకశిలా నంది

లేపాక్షి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, అనంతపురం జిల్లాలో ప్రధాన శైవక్షేత్రం, పర్యాటక కేంద్రం, ఇదే పేరుతో ఉన్న మండల కేంద్రము. ఇక్కడ వున్న వీరభద్రస్వామి ఆలయం, లేపాక్షి నంది ప్రధాన పర్యాటక ఆకర్షణలు.

యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా "లేపాక్షి గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్"కు గుర్తింపు పొందడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చొరవ తీసుకుంటున్నది.[2] [3]

ఇతిహాసం[మార్చు]

రావణాసురుడు మహాసాధ్వియగు సీతను అపహరించుకోని యా ప్రంతములో వేళ్ళుతూ వుంటే ఈ కూర్మ పర్వతం పైన జటాయువు అడ్డగిస్తుంది. రావణుడు ఆ పక్షి యొక్క రెక్కలు నరికివేయగ ఈ స్థలములో ఆ పక్షి పడిపోయింది. ఆ పిమ్మట సీతాన్వేషణలో ఈ స్థలమునకు వచ్చిన శ్రీరాముడు జటాయువును తిలకించి జరిగిన విషయమును పక్షి నుండి తెలుసుకోని తర్వాత ఆ జటాయువు పక్షికి మోక్షమిచ్చి ’లే-పక్షి’ అని ఉచ్చరిస్తాడు. లే-పక్షి అను పదమే క్రమ క్రమముగా లేపాక్షి అయనట్లు ఇక్కడి ప్రజలు అంటున్నారు.

మరో కథ ప్రకారం చూస్తే... అచ్యుతరాయలు కోశాధికారి విరూపణ్ణ రాజు అనుమతి లేకుండా ప్రభుత్వ ధనంతో ఆలయ నిర్మాణం చేపట్టాడు. నిర్మాణం చాలా వరకూ పూర్తయి, కళ్యాణ మంటపం నిర్మాణం జరుగుతున్న సమయంలో రాజుగారికి ఈ విషయాన్ని విరూపణ్ణ వ్యతిరేకులు చేరవేసారు. దీంతో విరూపణ్ణ ముందుగానే రాజు విధించబోయే శిక్షను తనకు తానుగా విధించుకుని రెండు కళ్లనూ తీసివేసి కళ్యాణ మంటపం దక్షిణవైపున ఉండే గోడకు విసిరి కొట్టాడట. అలా కళ్లు విసిరికొట్టిన ఆనవాళ్ళుగా అక్కడి గోడపైనుండే ఎర్రటి గుర్తులను స్థానికులు చూపుతుంటారు కూడా. అలా లోప- అక్షి (కళ్లు లేని) అనే పదాల ద్వారా ఏర్పడిందే లేపాక్షి అని చెబుతారు.

పూర్వపు చరిత్ర[మార్చు]

ఈ ఊరు శ్రీకృష్ణ దేవరాయల కాలమున మిక్కిలి ప్రశస్తి గన్నది. విరుపణ్ణ నాయక, వీరణ్ణ నాయకులను ఇరువరు గొప్ప వ్యక్తులు ఆ రాయల ప్రతినిధులుగ ఈ ఊరిలో ఉండి ఈ వైపు ప్రాంతమును ఏలినారు. ఈ ఊరి పక్కన ఒక గుట్ట ఉంది. దాని పేరు కూర్మశైలం. ఇక్కడ పాపనాశేశ్వరుడను శివుడు ప్రతిష్ఠితుడైయున్నాడు. అగస్త్యుడు ఇతనిని ప్రతిష్ఠించెను. మొదట ఇది గర్భగుడి మాత్రము ఉండెడిది. మన ఋషులు అరణ్యములలో తపమునకై వచ్చి ఇట్టి పట్టుల ప్రశాంతముగ డేవుని కొలిచెడివారు. దండకారణ్యమును తాపసోత్తమ శరణ్యమని కృష్ణ దేవరాయల కాలమునకు ముందు వాడగు పోతనామాత్యుడు వర్ణించి యున్నాడు. ఈ లేపాక్షి దండకారణ్యము లోనిది. ఇచ్చట జటాయువు పడియుండెననీ, శ్రీరాముడు ఆతనిని "లే పక్షీ" అని సంబోధించిరని, అందుచేతనే దీనికి లేపాక్షి అని పేరు కలిగినని కొందరు అంటారు. ఇది నమ్మదగినది కాదు. శ్రీరాముడు కిష్కింధకు రాకముందు జటాయువు సంస్కారము జరిగింది. శ్రీరాముడు ఉత్తరమునుండి దక్షిణమునకు వచ్చాడు.

పట్టణ ప్రవేశంలో ఉన్న ఒక తోటలో ఉన్న అతిపెద్ద ఏకశిలా నంది విగ్రహం ఠీవిగా కూర్చున్న భంగిమలో ఉంటుంది. ఇక్కడికి 200 మీ. దూరంలో మధ్యయుగం నాటి నిర్మాణ కళతో కూడిన ఒక పురాతన శివాలయం ఉంది. ఇక్కడకూడా దాదాపు ముప్పై అడుగుల ఎత్తున, పాము చుట్టుకొని ఉన్నట్లున్న శివలింగం ఆరుబయట ఉంటుంది. చక్కటి శిల్పచాతుర్యంతో కూడిన స్తంభాలు, మండపాలు, అనేక శివలింగాలతో కూడిన ఈ గుడిలో ఇప్పటికీ పూజలు జరుగుతున్నాయి. ఈ దేవాలయము పెద్ద ఆవరణ కలిగి మధ్యస్థంగా గుడితో సుందరముగా ఉంటుంది.

ఇచ్చటి వీరభద్రుని ఆలయాన్ని సా. శ 15, 16 వ శతాబ్ది మధ్యకాలములో విజయనగర ప్రభువు అచ్యుతరాయల కాలంలో పెనుకొండ సంస్థానంలో కోశాధికారిగా వున్న విరూపణ్ణ కట్టించాడని ప్రతీతి. ఇతడు రాజధనం వెచ్చించి రామదాసుకు చాలాముందే ఈవీరభద్రాలయము కట్టించాడు. అచ్యుతరాయలు విజయనగరానికి రమ్మని తాకీదు పంపగా,రాజు విధించే శిక్ష తానే చేసుకోవాలనీ కళ్ళు తీయించుకున్నాడట.ఆలయ నిర్మాణము మూడింట ఒక వంతు ఆగిపోవడము ఇందువల్లనే అంటారు.ఈ ఆలయ నిర్మాణం జరుగత ముందు ఈ స్థలం కూర్మ శైలము అనే పెరుగల ఒక కోండగా ఉండేది. ఈ కొండపైన విరూపణ్ణ పెనుకొండ ప్రభువుల ధనముతో ఏడు ప్రాకారములగల ఆలయము కట్టించగా ఇప్పుడు మిగిలియున్న మూడు ప్రాకారములు మాత్రమే మనము చూడగలము. మిగిలిన నాలుగు ప్రాకారములు కాలగర్భమున కలసిపోయనవని అంటారు. ప్రాకారం గోడులు ఎత్తేనవిగా ఉన్నాయ. గోడలపైనా, బండలపైనా కన్నడ భాషలో శాసనములు మలచారు. ఈ శాసనముల ద్వారా ఈ దేవాలయ పోషణకు ఆనాడు భూదానము చేసిన దాతల గురిచిన వివరాలు తెలుస్తాయ్. ఇక్కడి గుడికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇక్కడి మూలవిరాట్టు వీరభధ్ర స్వామి. గుడి లోపల ఒక స్తంభానికి దుర్గా దేవి విగ్రహము ఉంది. మాములుగా దేవుడు మనకు గుడి బయటినుండే కనపడుతారు . వీరభధ్ర స్వామి ఉగ్రుడు కాబట్టి, అతని ఛూపులు నేరుగా ఊరి మీద పదకూడదు అని గుడి ద్వారం కొంచం ప్రక్కకు వుంటుంది. గుడి లోని పైకప్పు మీద కలంకారి చిత్రాలు అద్భుతంగా వేయబడ్డాయి. ఈ గుడికి ముఖ్య ఆకర్షణ వేలాడే స్తంభం. ఈ స్తంభం కింద నుంచి మనము ఒక తువ్వాలుని అతి సులువుగా తీయవచ్చును. ఇది అప్పటి విశ్వబ్రాహ్మణ శిల్పుల యొక్క కళాచాతుర్యానికి ఒక మచ్చుతునక.లేపాక్షి ఒక మంచి దర్షనీయ ప్రదేశం. అక్కడ కొలువైఉన్న వీరబద్రస్వామి చాలా మహిమ కలవాడు.

వీరభద్ర స్వామి దేవాలయం[మార్చు]

లేపాక్షి దేవాలయంలోని 16వ శతాబ్దపు వర్ణచిత్రం

లేపాక్షి దేవాలయం చక్కని ఎరుపు, నీలిమ, పసుపుపచ్చ, ఆకుపచ్చ, నలుపు, తెలుపు లను ఉపయోగించి అబ్ధుతమగు చిత్రములు గీయించిరి. కృష్ణదేవరాయల కాలపు చిత్రలేఖనము యొక్క గొప్పదనము- అంటే లేపాక్షి చిత్రలేఖనపు గొప్పదనమును కూడా చూడవచ్చును. సమకాలికుడగు పింగళి సూరన్న ప్రభావతీ ప్రద్యుమ్నమున కొంత సూచించాడు. అందు ప్రభావతీ వర్ణన " కన్నుల గట్టినట్లు తెలికన్నుల నిక్కను జూచినట్ల, తోబలుక కడంగినట్ల, భావ గంభీరత లుట్టి పడన్ శివ వ్రాసినట్టి ఈ చిత్తరవు" అని శుచిముఖిచేత వర్ణించాడు.శివ, వీరభద్ర, వైష్ణవాలాయములకు సమానమైన ముఖమండపము పైకప్పు లోభాగమున మహాభారత, రామాయణ పౌరాణిక గాథల పెక్కుగా వ్రాసినను, వీరభద్ర దేవాలయపు గోడలమీదను, శివాలయపు అర్ధపంటపమున శివకథలు అచ్చెరెవు గొల్పునట్లు అలంకరించారు. పార్వతీ పరిణయము, పార్వతీ పరమేశ్వరుల పరస్పరానురాగ క్రీడలు, త్రిపుర సంహారము, శివ తాండవము లోనిఆఖ్యాయికలు గాథా విషయములుగ చేర్చబడినవి. గౌరీ ప్రసాద శివుడను చిత్తరువున పద్మములు మీసములతో జటాజూటము నుండి ప్రవహించు గంగను మరుగుపరుపజూచుచు శివుడు పార్వతి చిబుకములపై చేయుడి బుజ్జగించుట, పార్వతి ప్రణయ కోపము, పరిణయమునకు ముందు పార్వతీ అలంకారము, పార్వతీ పరమేశ్వరులు చదరంగమాడుట, శివుడు అంధకాసుర సంహారమొనర్చుట ముఖమున శాంతి, కరమున శూలము పెట్టి రుద్రుడు మొఖము, శివుని భిక్షాటనము, నటేశుని ఆనందతాండవము, దక్షిణామూర్తి మొదలగు చిత్రములు చూచువారిని ముగ్ధులు గావించెను. విష్ణువాలయమున మధ్య విష్ణువును, చుట్టు దశావతారములను చిత్రించిరి. లేపాక్షి శిల్పములు అనల్పములు. 60 కాళ్ళ ముఖ మంటపములోని స్తంభముల మీద పూర్ణకృతులగు సంగీతకారులయ, నటులయ మూర్తులను విజయనగర కీర్తిని తీర్చారు. బ్రహ్మ మద్దెలను, తుంబురుడు వీణెను, నందికేశ్వరుడు హుడుక్కను మరియొక నాట్యచార్యుడు తాళమును వాయింప రంభ నాట్య మాడుట ఒకచోట చిత్రించెను.

ఇచ్చట గుట్టవంటి రాతి నిచ్చట బసవేశ్వరుడుగా తీర్చిదిద్దినారు. ఇంత పెద్ద బసవడు మనికెన్ని చోట్లలనో దొరకడు.ఈగుడిని ఉద్ధేసించి "లేపాక్షి రామాయణము" అను హరికథ కూడాకలదు.దేవాలయాలకు కల్యాణమండపాలుండడము మన మెరుగుదుము. ఈ ఆలయములో కల్యాణమండపము ఉన్నది (అసంపూర్ణము) ఉన్నదీ,లతా మండపమున్నది.పాతికకు మించిన శిలా స్తంభాలు, నాలుగు వైపులా లతలను చెక్కిపెట్టినవి, చేరి లతా మండప మేర్పరచినవి.ఇలాంటి మండపము ఇతరచోట్ల సామాన్యముగా కానరాదు. నాలుగు కాళ్ళ మండపము విజయనగరపు ఆలయాలలో దేవాలయానికి బయట కనిపిస్తుంది. కాని ఈ ఆలయంలో ప్రాకరములో వైపున పశ్చిమ భాగంలో ఉంది.

శిల్పాలంకారములు-ముఖ్యముగా చెట్లను పెకలించబోయే ఏనుగులను-పరిశీలిస్తే శ్రీశైలం దేవాలయ ప్రాకరశిల్పాల పోలిక చాలా కనబడుతుంది. పంచముఖ బ్రహ్మ ఇక్కడి ప్రత్యేకత.శిల్పరూపాలు- స్తంభాలకు చేరా చెక్కినవి, ఇంచుమించు నాలుగైదు అడుగులవి ఇక్కడ కనబడుతాయి.రెడ్డిరాజులు కోరుకొండ, దక్షరామము, పలివెల దేవాలయములలోని స్తంభాలతో తమ శిల్పాకృతులను చెక్కించారు. తాడిపత్రి రామలింగేశ్వరాలయపు గోపురముమీద శిల్పి విగ్రహమూ, తిమ్మరసు విగ్రహమూఉన్నాయి.అయితే, మందవ స్తంభాలకు చేరా చెక్కించిన విగ్రహాలు ఇంత పెద్దవి ఇతరచోట్ల కానరావు.ఈ ఉదాహరణమును చూచి అహోబిల దేవాలయ మండపములో తిరుమల దేవరాయలూ, సోమపాలెము చావడిలో పెద్ది నాయకుడూ పెద్ద విగ్రహాలూ చెక్కించారు, మధుర మీనాక్షి దేవళములో తిరుమల నాయకుడు ఈ అలవాటును బ్రహ్మాండంగా పెంచాడు. లేపాక్షి ఆలయములోని నాగలింగమంతటిదీ, లేపాక్షి నంది అంతటిదీ భారతదేశములో మరిలేవు. అజంతా తరువాత లేపాక్షి మండపాలలో కప్పులమీద చిత్రించిన రూపాలంతటి బృహద్రూపాలు మరిలేవు. లేపాక్షి అర్ధ మండపములో కప్పుమీది వీరభద్రుదంతటి పెద్ద వర్ణ చిత్రము భారతదేశములో మరిలేదు. కళాకారులు జైనులే అయినా, శిల్పమూ చిత్రకళా బృహద్రూపాలలో కోడము విజయనగర కళా ప్రభావమే.కళాకారులు జైనులనుటకు పలు నిదరసనములు కనబడుతున్నవి. లేపాక్షి వర్ణ చిత్రకారులు వర్ణలేపనములో, విన్యాసాలలో, దీర్ఘచిత్రాలలో, వస్త్రాలంకార సామాగ్రులలో జైన చిత్ర కళాసంప్రదాయాల్నే పాటించారు.శిల్పులు దేవతల వాహనాల్ని జైన తీర్ధంకురుల చిహ్నాల సైజులో చెక్కారు. స్త్రీల నగ్నత్వము చాలా అరుదు లేపాక్షిలో. పెనుకొండ పెద్ద జైన విద్యాస్థానము.ఈనాటికీ రెండు జైన ఆలయములు పూజలందుకుంటున్నవి.విరుపణ్ణ పెనుగొండ నాయంకరము పొందినవాడు.కళాకారులు అక్కడివారే కావడము వింతకాదు.లేపాక్షిలో శిల్పమూ చిత్రకళా సమ సంప్రదాయాలతోనే నడచినవి.మూడుకాళ్ళ భృంగీ, ఆరుచేతుల స్నానశివుడూ అవుననే తార్కాణ.

లేపాక్షి వర్ణచిత్రాలలో ఆనాటి ఆచారాలు ప్రతిబింబిస్తాయి.అవి కేవలము సంప్రదాయక చిత్రాలేకావు.సమకాలిక చిత్రాలని అనవచ్చును.స్త్రీల పాపిటసరములూ, శిరోజములలో విడిపోవులూ, రెండు పొరల పైటలూ, కైవార హస్తములూ, ఉద్యోగుల, నాయకులూ-,శిల్పాలూ-, చిత్రకారులూ-,ఉష్ణీషాలూ, దుస్తులూ ఆనాటివే.

వరుపణ్ణి తండ్రిపేరు నంది లక్కిసెట్టి.లేపాక్షిలో ఒక రాతిగుట్టను 30 అడుగుల పొడవూ, 18 అడుగుల ఎత్తూ గల నందిని చెక్కించాడు.విరుపణ్ణ ఆతని సోదరుడు వీరణ్ణ గొరవనహళ్ళిలో లక్ష్మీ ఆలయము కట్టించాడు.విరుపణ్ణ వీరభద్రాలయము అర్ధ మండపము ఈశాన్యమూల తమ కులమునకు మూల పురుషుడైన కుబేరుని కొడుకు కోడలుని- రంభా నలకుబేరులను చెక్కించాడు.రంభ నట్టువరాలు దుస్తులతో ఉంది.నలకుబేరుడు విష్ణు ధ్రమోత్తరములో చెప్పినట్లు కోరలతో ఉన్నాడు. ఇటువంటి శిల్పాలు అరుదు.

భౌగోళికం[మార్చు]

Map

ఇది సమీప పట్టణమైన హిందూపురం నుండి 14 కి. మీ. దూరంలో ఉంది. బెంగుళూరు నుండి 120 కి.మీ. దూరంలో ఉంటుంది. హైదరాబాదు, బెంగుళూరు రోడ్డుకు ఎడమ వైపు నుండి 11 కి.మీ. దూరంలో ఉంటుంది.

జనగణన గణాంకాలు[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2133 ఇళ్లతో, 10042 జనాభాతో 1891 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 5373, ఆడవారి సంఖ్య 4669.[4]

విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 12, ప్రైవేటు ప్రాథమిక పాఠశాల ఒకటి, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు మూడు, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు రెండు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాలలు రెండు ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉంది.ఒక ప్రైవేటు వృత్తి విద్యా శిక్షణ పాఠశాల ఉంది. సమీప ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల హిందూపురంలో ఉన్నాయి. సమీప వైద్య కళాశాల అనంతపురంలోను, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు హిందూపురంలోనూ ఉన్నాయి. సమీప అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల సేవామందిర్ లో ఉన్నాయి.

నవోదయ పాఠశాల[మార్చు]

గ్రామీణ ప్రాంతాలలో విద్యా ప్రమాణాల అభివృద్ధికి, బీదరికం అడ్డుకాకుండా వుండటానికి ఉన్నత ప్రమాణాలతో కూడిన అధునాతన విద్యను ఉచితంగా అందచేయడానకి ప్రారంభించిన జవహర్ నవోదయ విద్యాలయం పథకం క్రింద 1987లో ఈ విద్యాలయాన్ని ప్రారంభించారు. విశాలమైన క్రీడామైదానం, గ్రంథాలయంతో పాటు ఉపాధ్యాయులు అందుబాటులో లేని సమయం లోను విద్యార్థులకు పాఠాలు బోధించేలా పనిచేసే ఇంటరాక్టివ్ బోర్డు, కంప్యూటర్ శిక్షణ వంటి సౌకర్యాలు ఉన్నాయి. సంగీతం, చిత్రలేఖనం లోనూ తర్ఫీదు ఇస్తారు. ఆరో తరగతి నుంచి 12వ తరగతి వరకు నేషనల్ కౌన్సిల్ఆఫ్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ సిలబస్‌లో బోధన జరుగుతుంది. 10, 12 తరగతుల విద్యార్థులు సెంటర్‌బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) నిర్వహించే పరీక్షలకు హాజరవుతారు.

భూమి వినియోగం[మార్చు]

లేపాక్షిలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

 • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 378 హెక్టార్లు
 • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 2 హెక్టార్లు
 • తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 12 హెక్టార్లు
 • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 321 హెక్టార్లు
 • బంజరు భూమి: 781 హెక్టార్లు
 • నికరంగా విత్తిన భూమి: 395 హెక్టార్లు
 • నీటి సౌకర్యం లేని భూమి: 1077 హెక్టార్లు
 • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 421 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు[మార్చు]

లేపాక్షిలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

 • బావులు/బోరు బావులు: 417 హెక్టార్లు
 • చెరువులు: 4 హెక్టార్లు

ప్రధాన పంటలు[మార్చు]

వేరుశనగ, మొక్కజొన్న, వరి

చిత్ర మాలిక[మార్చు]

మూలాలు[మార్చు]

 1. Census 2011 The Registrar General & Census Commissioner, India. Accessed 26 July 2014
 2. "The Lepakshi heritage". Business Line.
 3. Voice, Amaravati. "Lepakshi May Get World Heritage Status". amaravativoice.com. Archived from the original on 4 December 2017. Retrieved 4 December 2017.
 4. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
"https://te.wikipedia.org/w/index.php?title=లేపాక్షి&oldid=3313418" నుండి వెలికితీశారు