గులాం రసూల్ ఖాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గులాం రసూల్ ఖాన్ కర్నూలు నవాబులు పాలకవంశానికి చెందిన ఆఖరి పరిపాలకుడు. గులాం రసూల్ ఖాన్ కర్నూలు నవాబుల్లో మూడవ పరిపాలకుడైన ఆలూఫ్‌ఖాన్ కట్టకడపటి కుమారుడు. ఇతనిపై అలూఫ్‌ఖాన్‌కు ఉన్న ప్రేమ కారణంగా మొదట ఆయన జన్మించివుండగానే కర్నూలుకు నవాబును చేసుకున్నారు.

రాజకీయ నేపథ్యం[మార్చు]

గులాం రసూల్ ఖాన్ 1792 నుంచి కర్నూలును పాలించిన నవాబు అలూఫ్‌ఖాన్ కుమారుడు. అలూఫ్‌ఖాన్ తండ్రి మునవర్ ఖాన్ మరణానంతరం రాజ్యాన్ని పొందగా అప్పటికి రాజ్యం మైసూరు నవాబుల పరిపాలనలో ఉండేది. అలూఫ్ ఖాన్ పరిపాలన కాలంలో జరిగిన మూడో మైసూరు యుద్ధం కారణంగా ఈ ప్రాంతం నిజాం నవాబు పాలనలోకి వచ్చింది. 1799లో నిజాం నవాబు, ఈస్టిండియా పాలకులు కలిసి మరో మారు శ్రీరంగపట్నాన్ని ముట్టడించి టిప్పుసుల్తాన్ను చంపేశారు. ఈ పరిణామానంతరం సైనిక ఖర్చుల కింద నిజాం నుంచి కడప, బళ్ళారి వంటి ప్రాంతాలతో పాటు కర్నూలు కూడా తిరిగి తీసుకున్నారు. దాంతో అలూఫ్ ఖాన్ పరిపాలన కాలంలోనే కర్నూలు నవాబులు ఈస్టిండియా కంపెనీకి సామంతులు అయ్యారు.

రాజ్యాధికారం[మార్చు]

గులాం రసూల్ ఖాన్ చివరి కొడుకు కావడం, సంప్రదాయసిద్ధంగా తండ్రి మొదటి కుమారుడికే రాజ్యం సిద్ధించడం వంటి కారణాలతో ఇతనికి అంత తేలికగా రాజ్యం రాలేదు. అలూఫ్ ఖాన్ తన ఆరుగురు కొడుకుల్లో చివరవాడైన గులాంరసూల్‌ఖాన్ మీద ఉన్న ప్రేమ వల్ల తన బదులుగా అతడిని నవాబును చేసేందుకు అంగీకరించమని గవర్నర్ మింటోను ప్రార్థించారు. నవాబు తమకు చేసిన సహాయాలు, అతని విశ్వాసం పరిగణించి ఆ ప్రకారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ నేపథ్యంలో గులాం రసూల్‌ఖాన్ కర్నూలు నవాబు అయ్యారు. మళ్ళీ అతనికి మారుగా కొంతకాలం మునవర్‌ఖాన్, ఆపైన ముజఫర్‌ఖాన్ నవాబులు అయ్యారు. సా.శ.1815లో అలూఫ్‌ఖాన్ మరణించడంతో కంపెనీ ప్రభుత్వాధికారులు ముజఫర్ ఖాన్‌ని తొలగించి మునవర్ ఖాన్‌నే నవాబు చేశారు. 1823 సంవత్సరంలో గులాం రసూల్‌ఖాన్ నవాబు అయ్యారు.

కంపెనీ పాలనకు వ్యతిరేకంగా కుట్ర[మార్చు]

గులాంరసూల్ ఖాన్ పరిపాలన కాలంలో ఈస్టిండియా కంపెనీకి ఆఫ్ఘనిస్థాన్ చక్రవర్తికి యుద్ధం వచ్చింది. ఈ యుద్ధంలో ఆఫ్ఘనిస్తాన్ సుల్తాను విజయం సాధిస్తారని, అలా బలహీనపడివున్న సమయంలోనే ఉపఖండంలో కూడా ఈస్టిండియా కంపెనీపై తిరుగుబాటు చేసి పోరాడితే కంపెనీ పాలన అంతరించి తాము స్వతంత్ర పాలకులమవుతామని కొందరు ముస్లిం పరిపాలకులు భావించారు. వారిలో నిజాం తమ్ముడు, కర్నూలు నవాబు గులాం రసూల్ ఖాన్ కూడా ఉన్నారు. పైగా దేశంలో చాలా ప్రాంతాల్లో విస్తరించిన ఈ కుట్రకు ప్రధాన కేంద్రంగా కర్నూలును ఎంచుకుని ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ రహస్యం చిత్రంగా బయటపడింది. 1839 వేసవి కాలంలో హైదరాబాద్ నగరంలో ఒక బీద ముస్లిం స్త్రీ మరణించడానికి సిద్ధంగా ఉన్న స్థితిలో ఒక వ్యక్తికి తానొక రహస్యం చెప్పదలిచాననీ, తనకొక పనిచేసిపెట్టాలనీ కోరింది. ఆ పెద్దమనిషి అందుకంగీకరించగా ఒక రక్షరేకు (తాయెత్తు) చేతికిచ్చి మూసీనదిలో పారవెయ్యమన్నది. దీనిలో ఏదో రహస్యం వుందని అనుమానించి బ్రిటీష్ వారైన పై అధికారులకు తీసుకువెళ్లి ఇచ్చారు. దాన్ని వారు పరిశీలించి నిజాం నవాబు సోదరుడు కర్నూలు నవాబుకు రాసిన ఉత్తరమనీ, రక్షరేకుల్లో ఉన్న మతపరమైన విషయాల ద్వారా భారీ తిరుగుబాటుకు ప్రయత్నాలు పంపుకుంటున్నారని తెలుసుకున్నారు. ఆపైన కర్నూలు నవాబు వద్దకు వెళ్ళి అతని వద్ద ఉండకూడని భారీ ఆయుధాగారం ఉందన్న అనుమానం మీద సోదా చేశారు. అన్ని విధాలుగానూ, ధైర్యంగా నవాబు సహకరించారు. మొదట ఎంత సోదా చేసినా పెద్దసంఖ్యలోని ఆయుధాలేవీ దొరకలేదు. ఇంగ్లీష్ అధికారులు పట్టువదలక సోదా చేస్తే జనానాలోని మైదానం వద్ద కోట గోడల్లో బోలుగా తయారుచేసి లోపల గొప్ప ఆయుధాగారాన్ని సిద్ధం చేసినట్టు బయటపడింది.

మరణం[మార్చు]

నవాబు తలపెట్టిన కుట్ర 1839లో భగ్నమయ్యాకా అతని రాజ్యాన్ని తాము లాక్కుని, రాజకీయ ఖైదీగా తరలించి విచారణ ప్రారంబించారు. రాజకీయఖైదీగా తిరుచునాపల్లి జైలులో ఉండగా ఆయన ఇస్లాం నుంచి క్రైస్తవానికి ఆకర్షితులయ్యారు. అతను క్రమంతప్పకుండా చర్చికి వెళ్తూ క్రైస్తవాభిమాని కావడం సహించలేని ఓ మహమ్మదీయుడు ఫకీరు వేషంలో వచ్చి 1840లో పొడిచి చంపాడు.

పరిపాలన విధానాలు[మార్చు]

పుణ్యక్షేత్రాలు[మార్చు]

కర్నూలు నవాబుల్లో చివరి వాడైన గులాం రసూల్ ఖాన్ ప్రజాకంటకమైన పరిపాలన చేశారు. ఇతని కాలంలోనే కాశీయాత్రలో భాగంగా రసూల్ ఖాన్ నవాబు కింద ఉన్న గ్రామాలు, పట్టణాలు, పుణ్యక్షేత్రాల్లో విడిసిన యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య అతని పరిపాలన గురించి తన కాశీయాత్రచరిత్రలో భాగంగా సవివరంగా వ్రాసుకున్నారు.
రసూల్ ఖాన్ కాలంలో తన పరిపాలనలో ఉన్న అహోబిలం, శ్రీశైలం వంటి హిందూ పుణ్యక్షేత్రాల నుంచి భారీగా డబ్బు రాబట్టుకుని కనీస సౌకర్యాల కల్పనలో కూడా శ్రద్ధ వహించేవారు కాదు. శ్రీశైలంలో శివరాత్రి ఉత్సవాలకు వచ్చే సాధారణ భక్తులకు ఒక్కొక్కరికీ రూ.7, గుర్రానికి రూ.5, అభిషేకానికి రూ.3, వాహనోత్సవం చేయిస్తే ఉత్సవపు సెలవులు కాక రూ.43, దర్పణసేవోత్సవానికి రూ.3 ప్రకారం నవాబుకు చెల్లించాల్సివచ్చేది. అహోబిలంలో ఫాల్గుణమాసంలో బ్రహ్మోత్సవాలు జరిగే రోజుల్లో 400 వరహాల హాశ్శీలు ఆదాయం వస్తూండేదని, దానిని కందనూరి నవాబు తీసుకుని గుడికి చేయాల్సిన సౌకర్యాల గురించి మాత్రం పట్టించుకునేవాడు కాదని వివరించారు. వీటన్నిటికీ పరాకాష్ఠగా శ్రీశైల మల్లికార్జునుడికి, భ్రమరాంభాదేవికీ ఎవరైనా ఆభరణాలు, వస్త్రాలు సమర్పిస్తే వాటి ఖరీదుకు తగ్గ హాశ్శీలు తీసుకోవడమే కాక కొన్ని రోజులు గడిచాకా వాటిని తాను అపహరిస్తున్నాడన్న విషయం వ్రాసుకున్నారు.[1]

గ్రామపరిపాలన[మార్చు]

గ్రామ పరిపాలన గురించి వ్రాస్తూ తిరుపతి మొదలు ఆ యూరి వరకు (హైదరాబాదు రాజ్య సరిహద్దుయైన సంగమేశ్వరం) ప్రతి గ్రామమునకున్ను ఒక రెడ్డిన్నీ, ఒక కరణమున్ను ఉన్నారు. ఆ కరణాలు కొందరు నందవరీకులు, కొందరు ప్రథమ శాఖలు, కొందరు నియోగులు. ఈ రీతిగా బ్రాహ్మణులు ఆ యుద్యోగమును చూచుచున్నారు. కట్టుబడి బంట్రాతులని జీతానికి బదులుగా భూమిని అనుభవంపుచు కావలి కాచుకొని గ్రామాదుల సకల పని పాటలున్ను చూచుచున్నారు. పరువు కలిగిన ముసాఫరులకు కావలసిన సరంజామా సహాయసంపత్తు ఆ రెడ్డి కరణాలగుండా కావలసినది. ఆ యుద్యోగస్థుల నిద్దరినిన్ని నయభయములచేత స్వాధీనపరచుకొంటేగాని మార్గవశముగా వచ్చే పరువుగల వారికి పనులు సాగవు. పరువు గలిగిన ముసాఫర్లు అధికారపు చిన్నెకొంత వహించితేనే బాగు. నిండా సాత్వికగుణము పనికిరాదు. మార్గము చూపించడమునకున్ను, దిగిన తావున కావలసిన సామానులు తెప్పించి యివ్వడమునకున్ను రెడ్డి కరణాల యొక్క ఉత్తరువు ప్రకారము ఆ కట్టుబడి బంట్రౌతులు పనికివచ్చుచున్నారు. అన్నారు. అలాగే ‘‘తాలూకా నాలుగు మేటీలుగా పంచి ఒక్కొక్క మేటీకి ఒక్కొక్క అమలుదారుని ఏర్పరిచాడు. ఈ అములుదారులందరిపైన అక్బరునవీసు అనే అధికారిని నియమించాడు. నవుకర్లకు జీతానికి జాగీరు లిచ్చాడు. కుంఫినీవారికి సాలుకు లక్షరూపాయిలు కప్పం కడతాడు. అతని రాజ్యము బళ్ళారి జిల్లా కలెక్టరు ఆజ్ఞకు లోబడినది. కలెక్టరు తరఫున ఒక వకీలు కందనూరులో కాపుర మున్నాడు. నవాబు కాజీకోర్టు పెట్టి న్యాయవిచారణ చేస్తాడు. కుంఫినీ కోర్టులకు నిమిత్తంలేదు. నవుకర్లకు జీతాలు స్వల్పము-సరిగా ఇవ్వడం లేదని వాడుక’’ అని వ్రాశారు.[1]

ఆర్థిక వ్యవహారాలు[మార్చు]

నవాబు ప్రజలను పీడించి రకరకాల పద్ధతుల్లో సొమ్ము రాబట్టుకునేవారు. పన్నుల వసూలులో క్రమపద్ధతి లోపించింది. నవాబులు నిర్దేశించిన పన్నులు గ్రామాధికారులు వసూలుచేసి యిచ్చే స్థితి నుంచి గ్రామాధికారులే తమకు తోచిన పన్నులు వేసి వసూలుచేయడం వరకూ వచ్చింది. గ్రామాధికారులకు గ్రామాలను గుత్తకు యిచ్చి ఇంతకు తక్కువ వసూలుచేయరాదన్న నియమాలు విధించడంతో వారు ఇచ్ఛకు వచ్చిన పన్నులు వేసి, పీడించడం ప్రారంభమైంది. శిస్తువసూలుకు గ్రామస్థులు కాక గ్రామాధికారులే జవాబుదారులైనందువల్ల వారు నిరంకశులై అక్రమాలు చేయడం మొదలుపెట్టారు. పంటలు పండకపోయినా గ్రామాధికారులు పూర్తిస్థాయిలో పన్నువసూళ్ళు చేసుకునేవారు. పంటలు బాగా పండితే నవాబు సైన్యాలు వచ్చిపడి ఆ ధాన్యాన్ని బలవంతంగా ఎత్తుకుపోయేవి. పండితే సైన్యం పెట్టే బాధలు పడలేక నంద్యాల ప్రాంతంలో రైతులు ఏకంగా మూడేళ్ళు వ్యవసాయమే మానుకున్నారంటే పరిస్థితి ఊహించవచ్చు.[2]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 వీరాస్వామయ్య, యేనుగుల (1941). కాశీయాత్రా చరిత్ర (PDF) (మూడవ ముద్రణ ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. Retrieved 26 November 2014.
  2. వెంకట శివరావు, దిగవల్లి (1944). కథలు-గాథలు (కందనూరు నవాబు రాజరికం) (1 ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. pp. 127–140. Retrieved 1 December 2014.


ఇంతకు ముందు ఉన్నవారు:
అలూఫ్‌ఖాన్
కర్నూలు నవాబులు
1839
తరువాత వచ్చినవారు:
ఈస్టిండియా కంపెనీ (రాజ్యం విలీనమైంది)