కొండారెడ్డి బురుజు
కొండారెడ్డి బురుజు | |
---|---|
కర్నూలు, ఆంధ్రప్రదేశ్ | |
భౌగోళిక స్థితి | 15°50′1.46″N 78°2′55.04″E / 15.8337389°N 78.0486222°E |
రకము | కోట |
స్థల సమాచారం | |
సాధారణ ప్రజలకు ప్రవేశానుమతి | అవును |
పరిస్థితి | శిథిలాస్థితి |
స్థల చరిత్ర | |
కట్టిన సంవత్సరం | 12వ శతాబ్దం |
కట్టించింది | దేవరాయ II, అచ్యుతరాయ |
వాడుకలో ఉందా | రాయి |
వాడిన వస్తువులు | మట్టి, రాయి |
కొండారెడ్డి బురుజు అనేది కర్నూలు నగరంలో ఉన్న ఒక కోట. ఇది కర్నూలు నగరానికి నడిబొడ్డులో ఉంది. కందనవోలు కోటకు నాలుగువైపుల ఉన్న బురుజులలో కొండారెడ్డి బురుజు ఒకటి, కానీ మిగతా మూడు బురుజులు శిథిలమైపోయాయి.[1] శిథిలమైన ఆ మూడు బురుజులలో ఒకటి కర్నూలులోని విక్టరీ టాకీస్ ప్రక్కన ఉంది. దీనిని "ఎర్ర బురుజు" అంటారు. ఎర్రని ఇసుకరాయితో నిర్మిచడం వలన దానికి ఆపేరు వచ్చింది. అందులో చిన్న ఎల్లమ్మ, పెద్ద ఎల్లమ్మ దేవాలయాలు ఉన్నాయి. ఎర్రబురుజు గోడల రాళ్లపై అనేక చిన్న చిన్న బొమ్మలను మనం గమనించవచ్చు. మిగిలిన రెండు బురుజులు తుంగభద్రానదిని ఆనుకొని ఉన్నాయి. వాటిలో ఒకటి కుమ్మరి వీధి చివర, మరొకటి సాయిబాబా గుడి ముందున్న బంగ్లా ప్రక్కన ఉన్నాయి. నదిని దాటి శత్రువులెవ్వరూ కర్నూలు నగరంలోకి రాకుండా సైనికులు ఎప్పుడూ ఇక్కడ పహరా కాస్తుండేవారు. 1930లో భారతి పత్రికలో కర్నూలులోని కుమ్మరి వీధి ప్రక్కన ఉన్న బురుజు దస్త్రాన్ని ప్రచురించి, దాని క్రింద "రామానాయుడు బురుజు" అని రాశారు. పూర్వం ఆ పేరు ఉందని దీని ద్వారా తెలుసుకోవచ్చు. కొండారెడ్డి బురుజు చరిత్ర గూర్చి ఎటువంటి శాసనాలు లభ్యమవలేదు.[2]
చరిత్ర
[మార్చు]సా.శ. 1505-1509 మధ్య విజయనగరం సామ్రాజ్యాన్ని పరిపాలించిన తుళువ వీర నరసింహరాయలు కందనవీడు కోటను అరవీడు రామరాజుకు బహూకరించినట్లు "ఎ హిస్టరీ ఆఫ్ సౌత్ ఇండియా" అనే పుస్తకం ద్వారా తెలుస్తూ ఉంది. ఈ తుళువవీర నరసింహారాయలను ఇమ్మడి నరసనాయకుడు అని కూడా పిలుస్తారు. "కందనవోలు" కోట చరిత్ర గురించి ఇక్కడ కొన్ని ఆనవాళ్ళు ఉన్నాయి. బీజాపూర్ సుల్తాను అయిన యూసుఫ్ ఆదిల్ ఖాన్ తుంగభద్రానదిని దాటుకొని కందనవోలు కోటపై దండెత్తాడు. ఆ సమయంలో తుళువవీరనరసింహునికి అండగా అరవీడు రామరాజు నిలబడి బీజాపూర్ సుల్తానును పారద్రోలి కందనవోలు కోటతో పాటు ఆదోనిని కూడా ఆక్రమించడానికి సహాయపడ్డాడు. దానితో విజయనగర ప్రభువైన వీరనరసింహుడు రామరాజును మెచ్చుకొని కందనవోలు కోటను అతనికి బహుమానంగా ఇచ్చాడు. అతడే కర్నూలు కోటను పటిష్ఠం చేసి, కొండారెడ్డి బురుజును నిర్మించి ఉండవచ్చునని కొందరి అభిప్రాయం.[3] కానీ అనేక మంది చరిత్రకారులు ఏమి చెబుతున్నారంటే కర్నూలులో 1529-49 మధ్య శ్రీకృష్ణదేవరాయలు సోదరుదైన అచ్యుతదేవరాయలు విజయనగర రాజుగా ఉన్నప్పుడు ఈ కోటను కట్టించినట్లు అభిప్రాయపడుతున్నారు. కొండారెడ్డి బురుజును నిర్మించినది కూడా అతనేనని దీనిఅసలు పేరు అత్యుత దేవరాయ బురుజు అని తెలియజేస్తున్నారు. కొండారెడ్ది బురుజును విజయనగర సామ్రాజ్య కాలంలో నిర్మించారని ఒక ప్రతీతి. ఈ బురుజు గోడలపై రంధ్రాలున్న ప్రదేశాల దగ్గర విజయనగర రాజచిహ్నాలైన సంబంధించిన సింహం, ఏనుగు, గుర్రం వంటి బొమ్మలు కనబడతాయి.కందనవోలు కోట మొత్తం మూడు చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో, ఆరు అడుగుల ఎత్తుతో శత్రువుల నుండే కాక, తుంగభద్ర, హంద్రి నదుల వరదల నుండి కాపాడేటట్లు నిర్మించబడింది. ఈ కోట చుట్టూ ఒక లోతైన కందకం కూడా ఉండేది. నగర విస్తరణలో భాగంగా బ్రిటిష్ కాలంలో ఈ కోట గోడలన్నీ తొలగించారు. తుంగభద్ర నదివైపు ఇప్పటికీ తీరం వెంట ఎత్తైన కోట గోడను గమనించవచ్చు.[4]
కొండారెడ్ది బురుజుగా నామం
[మార్చు]సా.శ. 1602-1618 మధ్య కాలంలో బీజాపూరు సుల్తాను ప్రతినిధి అయిన అబ్దుల్ వహాబ్ కందవోలును పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ సమయంలో నందికొట్కూరు తాలూకాలోని పాతకోట పాలెగాడైన కొండారెడ్డి ఇతని అధికారాన్ని ధిక్కరించడంతో అబ్దుల్ వహాబ్ కొండారెడ్డిని ఓడించి ఈ బురుజులోని కరాగారంలో బంధించాడు. ఆ కొండారెడ్డి ఆ బురుజులోనే మరణించడంతో అతని పేరుమీద దీనికి కొండారెడ్డిబురుజు అనే పేరు వచ్చి ఉంటుందని చాలామంది అభిప్రాయం. మరికొందరి అభిప్రాయం ప్రకారం ఆంగ్లేయుల పరిపాలనా కాలంలో అలంపూర్ ప్రాంతంలోని కోండారెడ్డి అనే దేశభక్తుడు వాళ్ల అధికారాన్ని ఎదిరించడంతో ఆంగ్లేయులు అతనిని పట్టుకొని ఇక్కడ బంధించారనీ, దానితో అతని పేరుమీద దీనికి "కొండారెడ్డి బురుజు" అని వచ్చిందని చెబుతారు. ఇలాగే మరికొందరు కల్లూరు ప్రాంతానికి చెందిన కొండారెడ్డి అనే అతని పేరు మీద కూడా దీనికి ఆపేరు వచ్చిందంటారు. ఏదేమైనా నందికొట్కూరు పాలెగాడైన "కొండారెడ్డి" మరణించడం వల్ల ఈ పేరు వచ్చిందని అత్యధికుల విశ్వాసం. 1930 జనవరిలో భారతి పత్రికలో కర్నూలు జిల్లా గురించి ఫోటోలతో సహా పెద్ద పరిశోధనాత్మక వ్యాసాన్ని గన్నవరపు సుబ్బరామయ్య గారు ప్రచురించారు. అందులో అనేక కట్టడాల ఫోటోలు వాటి పేర్లు ఇచ్చారు. కర్నూలు గురించి చెప్పగానే మనందరి మదిలోన కదిలే కొండారెడ్డి బురుజు ఫోటో క్రింద మాత్రం ఎటువంటి పేరు ఇవ్వకుండా "ఇది ఒక పాత బురుజు, ఇందులో నల్లమందును దాచి పోలీసులు కాపలా కాస్తున్నారు" అని రాసారు. అలాగే దాదాపు 40 సంవత్సరాలు కర్నూలు ప్రాంతంలో నివసించిన విలియం ఆర్థర్ స్టాంటన్ 1950లో అమెరికాలో ప్రచురించిన " ది అవేకనింగ్ ఆఫ్ ఇండియా" అనే పుస్తకంలో కూడా కొండారెడ్డి బురుజు చిత్రం క్రింద "బాస్టియన్ టు ద ఓల్డ్ ఫోర్ట్" అని రాసారే గానీ కొండారెడ్డి బురుజు అని రాయలేదు. వీటిని పరిశీలించిన కొందరు అసలు 1950కి ముందు దీనికి కొండారెడ్డి బురుజు అనే పేరు ఉందా?లేదా? ఉంటే వారెవరూ పుస్తకాలలో దానినెందుకు పేర్కొనలేదు? అని అభిప్రాయపడుతున్నారు.
నిర్మాణం
[మార్చు]దీనిని నగరానికి దగ్గరలో ఉన్నటువంటి జగన్నాథగట్టునుండి రాళ్లతో నిర్మించారు. ఇసుక, సున్నం, బెల్లం కలిపిన మిశ్రమంతో అతికిస్తూ నిర్మించినట్లు చారిత్రక ఆనవాళ్ళు కనపడితున్నాయి. ఈ కొండారెడ్డి బురుజు మొత్తం నాలుగు భాగాలుగా ఉంది. క్రింది భాగంలో తూర్పువైపు కాపలాదారు ఉండటానికి ఒక చిన్న గది, ఆగ్నేయంవైపు మొదటి అంతస్తుకు చేరుకోవడానికి వీలుగా విశాలమైన మెట్లు ఉన్నాయి. మధ్య భాగంలో నాలుగు స్తంభాలు ఈ బురుజుకు సపోర్టుగా ఉన్నాయి. వీటిని నవాబుల కాలంలో బురుజు పడిపోకుండా నిర్మించినట్లు చెబుతారు. మొదటి అంతస్తులో కుడి, ఎడమలవైపు గుంపుగా కాకుండా ఒక్కొక్కరు చొప్పున వరుసగా ఎక్కడానికి ఇరుకైన మెట్లు కొంచెం నిట్ట నిలువుగా ఉన్నాయి. అంటే శత్రువులెవరైనా దాడి చేసినపుడు ఒక్కసారిగా పైకి రాకుండా ఇవి అడ్డు పడతాయి. ఆ పై భాగంలో సైనికులు ఉండటానికి ఐదు పెద్ద పెద్ద గదులు, ఖైదీలను బంధించడానికి రెండు చిన్న గదులు ఉన్నాయి. అదే విధంగా మధ్యలో అవసరం పడినపుడు తప్పించుకొవడానికి వీలుగా ఒక సొరంగ మార్గం కూడా ఉంది. ఈ సొరంగ మార్గం అలంపూర్ వరకు ఉందని ఇక్కడి ప్రజల అభిప్రాయం[5]. తుంగభద్రానది క్రింద నుండి సొరంగ మార్గం నిర్మిచడం అప్పట్లో అసాధారణమైనది. కాబట్టి ఈ సొరంగ మార్గం కోట బయట తుంగభద్రానది ఒడ్డువరకు గానీ, ఎస్.పి. కార్యాలయం వరకు గానీ ఉండి ఉండవచ్చని అంచనా. శత్రువులనుండి తప్పించుకొవలసిన సందర్భాలలో ఈ సొరంగ మార్గం ద్వారా వాళ్ళు అక్కడి వరకు వెళ్ళి అలాగే తుంగభద్రానదిని దాటి వెళ్ళిపోవచ్చు. రెండవ అంతస్తు అర్థ వలయాకారంలో చిన్న మార్గంలో ఉంటుంది. ఇందులో పడమరవైపు సైనికుల కోసం నిర్మిచిన ఏడు గదులున్నాయి. వాటికి ఎదురుగా శత్రువులను ఎదుర్కోవడానికి వీలుగా చిన్న చిన్న రంధ్రాలు గల మనిషి పట్టేంత నిర్మాణాలున్నాయి. ఈ రంధ్రాల ద్వారా సైనికులు అవతల వారికి కనబడకుండా తమని తాము రక్షించుకుంటూ, కోటపైకి వచ్చినటువంటి శత్రువులపై దాడి చేయడానికి వీలవుతుంది. ఇక్కడి నుండి తుపాకుల ద్వారా క్రిందివారిని కాల్చవచ్చు. అంతే కాకుండా కొటపైకి ఎగబాకుతున్న వాళ్ళకు పై నుంచి రాళ్ళుగానీ, వేడి వేడి పదార్థాలు కానీ గుమ్మరించడానికి వీలుగా ఉంటుంది. మూడవ అంతస్తులో ఇటుకలతో నిర్మించిన 7 సైనిక గదులు వాటి ముందు విశాలమైన స్థలం ఉన్నాయి. స్థలం మధ్యలో 168 ఎత్తు గల పొడవైన స్తూపం ఉంది. ఇది బ్రిటిష్ వారి కాలంలో వారి జెండా ఎగరవేయటం కోసం నిర్మిచినట్లు తెలుస్తుంది. అంతేకాగ దీని పైకెక్కి సుదూరంగా వస్తున్న శత్రువులను కూడా పసిగట్టవచ్చు. ఒకప్పుడు ఈ స్తూపంపైకి ఎక్కడానికి వీలుగా ఒక ఇనుప నిచ్చెన ఉండేది. కానీ ప్రమాదాలు జరగకుండా దానిని తరువాత తొలగించారు. భారత జాతీయ పతాకాన్ని నిరంతరం ఎగరవేయటం కోసం దేశమంతా కొన్ని ఎత్తైన స్తూపాలను ఎన్నిక చేయగా కొండారెడ్డి బురుజు ఐదవ స్థానంపొందింది.
విజయనగర సామ్రాజ్యం యొక్క పాలకులు ఒక యుద్ధ తంత్రంగా శత్రువులను గమనించేందుకు ఈ బురుజును ఎత్తుగా నిర్మించారు. కర్నూలు పట్టణం నుండి 52 కి.మీ ఉన్న గద్వాల్ కి ఈ బురుజు నుండి సొరంగ మార్గం ఉంది. తుంగభద్ర నది క్రింద నుండి వెళుతూ నల్లా సోమనాద్రి (రాజ సోమ శేఖర ఆనందరెడ్డి) నిర్మించిన గద్వాల్ కోటను అనుసంధానం చేయటం దీని ప్రత్యేకత. ముస్లిం దురాక్రమణదారుల నుండి తప్పించుకొనటానికి 17వ శతాబ్దంలో గద్వాల్ సంస్థానాదీశుడు ఈ సొరంగాన్ని ఉపయోగించేవాడని వినికిడి. 1901 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సొరంగ మార్గాన్ని మూసివేసినది[6].
ఇతర విషయాలు
[మార్చు]బురుజు దీని పరిసర ప్రాంతాలు స్థానిక చలన చిత్ర నిర్మాణాలకు ప్రసిద్ధి చెందాయి.
చిత్రమాలిక
[మార్చు]-
సెపియా టోన్ లో బురుజు
-
కొండారెడ్డి బురుజు పై నుండి కర్నూలు పట్టణం కనిపించే తీరు
-
బురుజు వెనుక వైపు రాజవిహార్ కూడలికి వెళ్ళే రోడ్డు
-
బురుజుకు కుడి వైపు
-
బురుజు మొదటి అంతస్తు పై ఉన్న ఆకృతులు
-
శత్రువులని దూరం నుండే పసిగట్టేందుకు గోడలోనే నిర్మించిన నిగూఢ గవాక్షములు
-
కొండారెడ్డి బురుజు యొక్క మొదటి అంతస్తు
-
మొదటి అంతస్తు పై ఉండే సొరంగ మార్గము
-
బురుజు నేపథ్యంగా తెలుగు తల్లి విగ్రహము
మూలాలు
[మార్చు]- ↑ Murthy, Vydehi (2016-11-24). "కొండారెడ్డి బురుజు సెంటరు, కర్నూలు, చంద్రగిరికోట @ చిత్తూరు". KostaLife (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2017-02-01. Retrieved 2019-01-16.
- ↑ "Kondareddy Buruju - కొండారెడ్డి బురుజు by M.Harikishan". Archived from the original on 2019-03-28. Retrieved 2019-01-16.
- ↑ "About Kondareddy Buruju". HISTORICAL PLACES AND TEMPLES IN ANDHRA PRADESH (in ఇంగ్లీష్). 2016-10-01. Archived from the original on 2019-01-09. Retrieved 2019-01-16.
- ↑ కొండారెడ్డి బురుజు- ఎం.హరి కిషన్. కర్నూలు: కర్నూలు బుక్ ట్రస్టు.
- ↑ "కర్నూలు కొండారెడ్డి బురుజు చారిత్రక కట్టడము యొక్క విశిష్టత". www.dharuvu.com (in ఇంగ్లీష్). 2016-11-09. Retrieved 2019-01-16.[permanent dead link]
- ↑ "కర్నూలు 'కొండారెడ్డి బురుజు' కు ఆ పేరెలా వచ్చింది ?". 2016-10-06. Archived from the original on 2017-09-05. Retrieved 2019-01-16.
బయటి లింకులు
[మార్చు]- "కొండారెడ్డి బురుజు చరిత్ర - ఎం.హరికిషన్". www.youtube.com. Retrieved 2019-01-16.
- కొండారెడ్డి బురుజు చరిత్ర - మనతెలుగునేల