కాలువ బుగ్గ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గ గ్రామంలో వెలసిన శ్రీ బుగ్గ రామేశ్వరస్వామి కొలిచిన భక్తుల కొంగుబంగారమై పూజలందుకుంటున్నాడు. ఇది కర్నూలు నుండి నంద్యాల వెళ్ళే రహదరిలో మనకు కనిపిస్తుంది. ఇక్కడ శివుడు బుగ్గరామేశ్వరునిగా మనకు దర్శనమిస్తాడు. పరశురాముని చే ప్రతిష్ఠించ బడుటచే ఈ స్వామి శ్రీ రామేశ్వరస్వామిగా పూజలందుకుంటున్నాడు. పరశురాముడు మాతృహనన పాతక నివృత్తి కోసం (తల్లిని చంపిన పాపాన్ని పోగొట్టు కోవడం కోసం) పలు తీర్థాల్లో స్నానాలు చేస్తూ, పలు ఋష్యాశ్రమాలను సందర్శిస్తూ, పలు దేవతా మూర్తులను ఆరాథిస్తూ, దేశ సంచారం చేస్తూ, ఈ ప్రదేశానికి వచ్చాడు. ఈ ప్రదేశం యొక్క ప్రశాంతత, పావనత్వాలకు ముగ్థుడై, ఇక్కడ పంచ శివలింగాలను ప్రతిష్ఠించి పూజించినట్లు, తరించినట్లు స్థలపురాణం చెపుతోంది. ఆలయం ప్రశాంత వాతావరణంలో విలసిల్లుతోంది. ముఖమండపం, అంత్రాలయం గర్భాలయం అనే మూడుభాగాలుగా నిర్మించ బడింది. ప్రాచీన నిర్మాణాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. గర్భగుడిలో రామలింగేశ్వరుడు కొలువుతీరి ఉంటాడు. శ్రీ స్వామి వారి ఎడమవైపు ఉపాలయంలో శ్రీ భవానీ మాత నిండైన మూర్తితో భక్తులను కరుణిస్తూ దర్శనమిస్తుంది. ప్రాకారమండపాలున్నాయి.

ఇక్కడ ఒక కోనేరు సహజ సిద్దంగా భూమి నుండి ఉబికి వచ్చిన నీటి ఊట ‘బుగ్గ’ వలన ఏర్పడి నీరు కాలువలా ప్రవహించటం వలన ఈ ప్రదేశానికి కాలువ బుగ్గ అనే పేరు వచ్చింది. ఇక్కడి కోనేరులో నీరు అత్యంత శుభ్రంగా పారదర్శకంగా ఉంటుంది.అక్కడి నుంచి వెలుపలికి వస్తే కోనేటి మథ్యలో ప్రక్కనే ఉన్న బుగ్గ రామేశ్వరుడు కొలువుతీరి ఉన్నాడు. అందంగా నిర్మించిన మెట్ల కోనేటి మథ్యలో శివలింగం, ఆ శివలింగం శిరస్సు నుండి పైకి ఉబికి వచ్చే నీటిధారనును మనం స్పష్టంగా చూడవచ్చు. ఇది అద్భుతమైన దృశ్యాన్ని ఆవిష్కరిస్తుంది

నీరు నిర్మలంగా ఉండి. రామేశ్వరుని శిరస్సు నుండి బుగ్గ వెలుపలికి ప్రవహించడం దర్శనీయమైన రమణీయదృశ్యమే. గర్బగుడిలో శ్రీ స్వామివారి పై నీటి బిందువులు పడతాయని చెపుతారు. కోనేటిలో అన్నికాలాల్లోను శివలింగం నుండి నీరు వస్తూనే ఉంటుందట. కాని కోనేటి లోని నీటి మట్టం మాత్రం పెరక్కుండా ఏర్పాట్లు చేయబడ్డాయి.ఇదే విధానం మహానంది లోను, యాగంటి లోను కూడా మనం చూడవచ్చు. ఈ ఆలయ ప్రాంగణం లోనే మరి మూడు శివాలయాలను కూడా మనం దర్శించుకోవచ్చు.ఇచ్చట పంచముఖేశ్వరుని విశ్వేశ్వరుని సేవించుకోవచ్చు . మహా శివరాత్రి నుండి మాస శివరాత్రి ఎన్నో ఉత్సవాలు శ్రీ స్వామికి అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆలయంలో నిత్యాన్నదాన పథకం నిర్వహించబడుతోంది. శివరాత్రి రోజున ఇక్కడ విశేషంగా పూజలు జరుగును.


కర్నూలు నుండి NH 18 మీద 33 కి. మీ . దూరములో కాలవబుగ్గాను చేర వచ్చు