ఎం. హరికిషన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎం. హరికిషన్
హరికిషన్
పుట్టిన తేదీ, స్థలం (1972-05-19) 1972 మే 19 (వయసు 51)
కర్నూలు జిల్లా పాణ్యం
వృత్తిఉపాధ్యాయుడు
భాషతెలుగు
జాతీయతభారతీయుడు
విద్యశ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్
పూర్వవిద్యార్థిశ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం
రచనా రంగంసాహితీ వ్యాసంగం
కథా రచయిత
బాల సాహితీవేత్త
చరిత్రకారుడు
గుర్తింపునిచ్చిన రచనలుకర్నూలు కథ
ప్రభావంతుమ్మల రామకృష్ణ
పురస్కారాలుబాలసాహితీ రత్న (2011)
చురుకుగా పనిచేసిన సంవత్సరాలు1997 నుండి
తండ్రిహుసేనయ్య
తల్లికృష్ణవేణమ్మ
2011 లో బాలసాహితీ పురస్కార గ్రహీత - ఎం.హరికిషన్

ఎం. హరికిషన్‌ తెలుగు బాలసాహిత్యంలో ఒక నూతన ఒరవడికి కృషిచేస్తున్న రచయిత. అతను పిల్లలు మాట్లాడుకునే భాషలో అత్యంత సరళంగా, పిల్లలు తమంతట తామే చదవుకొనేలా కథలు రాయడంలో సిద్ధహస్తుడు. కర్నూలు జిల్లాలో అంతరించిపోతున్న జానపద బాల సాహిత్యాన్ని వెలికితీస్తూ ఠింగురుబిళ్ళ, కిర్రు కిర్రు లొడ్డప్ప ఒకటి తిందునా... రెండు తిందునా, నక్కబావ-పిల్లిబావ. నల్లకుక్క, నలుగురు మూర్ఖులు, కోటకొండ మొనగాడు... ఇలా అనేక పుస్తకాలు వెలువరించాడు. అప్పుడప్పుడే అక్షరాలు దిద్దుతూ, చదవడం నేర్చుకుంటున్న చిన్నారుల కోసం ఏమయినా చేయాలనే తపనతో "ఒత్తులు లేని గేయాలు, బొమ్మలతో సామెతలు, పిల్లల గేయాలు, సంయుక్త అక్షరాలు లేని కథలు" సృష్టించాడు.[1]

జీవిత విశేషాలు[మార్చు]

హరికిషన్ 1972 మే 19 న కర్నూలు జిల్లా పాణ్యం లో హుసేనయ్య, కృష్ణవేణమ్మ దంపతులకు జన్మించాడు. అతను "కేతు విశ్వనాథ రెడ్డి కథలు - సామాజిక దర్శనం" అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్‌ పట్టాను పొందాడు. ప్రస్తుతం తెలుగు ఉపాధ్యాయుడుగా ఆదోనిలో పనిచేస్తున్నాడు.

రచయితగా[మార్చు]

కోడుమూరు మండలంలోని ఆమడగుంట్లలో ఉపాధ్యాయునిగా ఉద్యోగం చేస్తున్న హరికిషన్‌ పోస్టుగ్రాడ్యుయేషను చేస్తున్నప్పుడు తన అధ్యాపకుడు, కథా రచయితా అయిన డా| తుమ్మల రామకృష్ణ సాహచర్యంతో సాహిత్య రచనపట్ల ఆసక్తి పెంపొందించుకున్నాడు. కర్నూలులో కథాసాహిత్యాన్ని, సామాజిక స్పృహ గలిగిన రచయితల్ని పెంపొందించాలనే ఆశయంతో ఆవిర్భవించిన సాహితీసంస్థ కథాసమయంలో సభ్యునిగా చేరాడు. రాప్తాడు గోపాలకృష్ణ, శ్రీనివాసమూర్తి, వెంకటకృష్ణ, శేఖర్‌, ఉమామహేశ్వర్‌ వంటి సాహితీమిత్రుల సహకారంతో, చర్చాగోష్ఠులతో కథారచనలో మెళకువలను అందిపుచ్చుకున్నాడు. 1997లో ఫ్యాక్షన్‌కు వ్యతిరేకంగా రాసిన తొలికథ పడగనీడ ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురితమైంది. ఆ తరువాత తనను నిరంతరం ఘర్షణకు లోను చేస్తున్న అనేక సామాజిక సమస్యలపట్ల స్పందిస్తూ 13 కథలతో మాయమ్మ రాచ్చసి అనే కథా సంపుటిని, అలాగే కర్నూలు జనజీవితాన్ని ప్రతిబింబించే 22 కథలతో "కందనవోలు కథలు" అనే కథా సంపుటినీ ప్రచురించాడు. మతాలలోని లోపాలను ఎత్తిచూపుతూ నయాఫత్వా, మూడు అబద్దాలు అనే పుస్తకాలు ప్రచురించడం ద్వారా సాహితీ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.

చిన్నారుల పట్ల అత్యంత ప్రేమ కలిగిన హరికిషన్‌ కార్పొరేట్ పాఠశాలల్లో విద్యార్థులు పడుతున్న బాధల్ని, మార్కుల ప్రపంచంలో కనుమరుగవుతున్న పిల్లల హక్కుల్ని, ప్రయివేట్ పాఠశాలలు కొనసాగిస్తున్న దోపిడీని నిరసిస్తూ, బాలల స్వేచ్ఛా ప్రపంచాన్ని కలగంటూ ఒక చల్లని మేఘం అనే కథాసంపుటిని ప్రచురించాడు. ఆ తరువాత చదువరుల మనస్సులు ఆర్ద్రమయ్యేలా, భర్తను కోల్పోయిన తన తల్లి చేసిన జీవిత పోరాటాన్ని, తన బాల్యాన్నీ కలిపి కథలుగా మలచి నేనూ మా అమ్మ అనే పుస్తకాన్ని రచించాడు.[2] కర్నూలు జిల్లాలో వుండే కథకుల్ని, వారి కథలను పరిచయం చేస్తూ కర్నూలు కథ అనే బృహత్‌ సంకలనాన్ని సంపాదకుడిగా వెలువరించాడు. కర్నూలు బుక్‌ ట్రస్ట్‌ పేరుతో ఒక ప్రచురణ సంస్థను నెలకొల్పి అనేక పుస్తకాలు ప్రచురించాడు.

కర్నూలు జిల్లాలో వున్న కథకులను, వారి కథలను సాహితీ లోకానికి పరిచయం చేసిన బృహత్‌ సంకలనం "కర్నూలు కథ" ఇతని సంపాదకత్వంలోనే వెలువడింది.[3] బాలసాహిత్యమే గాక సామాజిక స్పృహ గలిగిన ఇతర రచనలు గూడా అనేకం చేశాడు. మాయమ్మ రాచ్చసి. నయాఫత్వా, నేనూ మాయమ్మ, 3 అబద్ధాలు ఇతని సామాజిక నిబద్ధతను తెలియజేసే ఇతర కథా సంపుటాలు.

జానపద బాల సాహిత్యం[మార్చు]

తరతరాలుగా ఒకరినుంచి మరొకరికి మౌఖికంగా సంక్రమిస్తున్న జానపద బాలసాహిత్యం అంతరించి పోగూడదని, హరికిషన్‌ అనేక పల్లెటూళ్ళు తిరుగుతూ అమ్మమ్మల్ని, తాతయ్యల్ని పలకరిస్తూ వారినుంచి కథల్ని సేకరించాడు. అనేక వ్యయ ప్రయాసలకు ఓర్చి, పట్టుదలతో పలు జానపద కథలను సేకరించాడు. అంతే కాకుండా తెలుగు బాల సాహిత్యంలో ప్రస్తుత తరానికి అందుబాటులో లేకుండా పోయిన పలు కథలను పుస్తకాలుగా వెలువరించాడు. ఇంకా తెలుగు బాల బాలికల కోసం పలు గేయాలు రచించాడు.[4] అతను పిల్లలు మాట్లాడుకొనే భాషలో అత్యంత సరళంగా, పిల్లలు తమంతట తాము చదువుకునేలా రాయడంలో సిద్ధహస్తుడు. సరళమైన కర్నూలు మాండలికంలో కొనసాగుతూ, ఇతని జానపద కథలు పిల్లల్ని సమ్మోహితుల్ని చేస్తున్నాయి. ఠింగురుబిళ్ళ, కిర్రుకిర్రులొడ్డప్పా, ఒకటి తిందునా రెండు తిందునా, నక్కబావ - పిల్లిబావ, కుందేలు దెబ్బ, నల్లకుక్క, నలుగురు మూర్ఖులు, నాకుమూడు నీకురెండు ఇలా అనేక సంపుటాలు ప్రచురించాడు. విశాఖపట్టణం జిల్లా పాడేరు ప్రాంతంలోని ఆదివాసీ భాష "కొండ" కు లిపిలేదు. ఆ భాషలోని జానపద కథలు కొన్ని సేకరించి "బంగారు చేప - గంధర్వకన్య" పేరుతో తెలుగువారికి అందించాడు. 2017 లో 121 జానపద కథలతో "కర్నూలు జిల్లా జానపద కథలు" అనే పెద్ద సంపుటాన్ని ప్రచురించాడు.

ప్రయోగాలు[మార్చు]

తెలుగు భాషలో అప్పుడప్పుడే అక్షరాలు దిద్దుతూ, చదవడం నేర్చుకుంటున్న చిన్నారులు కూడా పుస్తకాలు చదవాలనే తపనతో హరికిషన్‌ ఒత్తులులేని గేయాలు, సంయుక్తాక్షరాలు లేని కథలు, బొమ్మలతో సామెతలు, జానపద గేయాలు సృష్టించాడు. రేపటి వెలుగులు, మెరుపుల వాన[5] తెలుగుభాషలో వచ్చిన మొట్టమొదటి[ఆధారం చూపాలి] ఒత్తులులేని గేయాల పుస్తకాలు. తిక్క కుదిరిన నక్క, మూతిపగిలిన పిల్లి, పిండిబొమ్మ వీరుడు, కందిరీగ తేనెటీగ అనే పుస్తకాలను సంయుక్తాక్షరాలే లేకుండా రంగురంగుల బొమ్మలతో ఆకర్షణీయంగా ప్రచురించాడు. సంయుక్తాక్షరాలు లేకుండా తెలుగులో మొట్టమొదటిసారిగా "మిన్ను" అనే బాలల నవల రచించాడు. సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వశిక్షా అభియాన్‌ వారి బాలసాహిత్య బృందంలో సభ్యునిగా పనిచేసిన అతను, కర్నూలు జిల్లాలో బాలసాహిత్య రూపకల్పనకు మార్గదర్శకుడిగా ఉండి అనేక పుస్తకాలు రూపొందించాడు. కర్నూలు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలన్నింటిలోనూ ఇతను రచించిన పుస్తకాలు కనబడతాయి.

చరిత్ర పుస్తకాలు[మార్చు]

కర్నూలు జిల్లా చరిత్రను - ఆదిమానవులు ఈ జిల్లాలో అడుగు పెట్టినప్పటినుంచి, 1956 లో ఆంధ్ర రాజధాని కర్నూలు నుండి హైదరాబాదుకు తరలిపోయేదాకా - పిల్లల నుంచి పెద్దలవరకు అందరికీ అర్థమయ్యే రీతిలో, 250 ఫోటోల సహాయంతో వివరించాడు. అలాగే ఇంతవరకు వెలుగు చూడని కొండారెడ్డి బురుజు పాత ఫోటోలను సేకరిస్తూ కొండారెడ్డి బురుజు చరిత్ర వెలువరించాడు. కర్నూలు జిల్లా మహనీయులు అనే పేరుతో 20 మంది మొదటి తరానికి చెందిన గొప్పవారి ఫొటోలను చిత్రకారులతో వేయించి వారి గురించి వివరిస్తూ పుస్తకాన్ని రూపొందించాడు.

పుస్తకాలు[మార్చు]

ఇప్పటిదాకా ప్రచరించిన పుస్తకాల సంఖ్య 60 కాగా, వాటిలో సామాజిక అంశాలపై 8, చరిత్రపై 3, బాలసాహిత్యం 49 ఉన్నాయి.

సామాజిక రచనలు[మార్చు]

1.మాయమ్మ రాచ్చసి 2.నయాఫత్వా 3. నేనూ మా అమ్మ 4. మూడు అబద్దాలు 5. ఒక చల్లని మేఘం 6. కందనవోలు కథలు 7. టీచర్ చెప్పిన కథలు

చరిత్ర[మార్చు]

1. కర్నూలు జిల్లా చరిత్ర 2. కొండారెడ్డి బురుజు 3. కర్నూలు జిల్లా మహనీయులు

సంపాదకత్వం[మార్చు]

 1. కర్నూలు కథ
 2. రాయలసీమ ప్రేమ కథలు
 3. రాయలసీమ రచయిత్రుల కథలు

బాల సాహిత్యం[మార్చు]

 1. ఠింగురుబిళ్ళ
 2. నక్కబావ - పిల్లిబావ
 3. చిన్నారి గేయాలు
 4. జానపద గేయాలు
 5. తేనెటీగ - కందిరీగ
 6. బంగారు చేప - గంధర్వకన్య
 7. మెరుపుల వాన
 8. పావురం దెబ్బ
 9. చెప్పుకోండి చూద్దాం
 10. బొమ్మలతో సామెతలు - 1
 11. బొమ్మలతో సామెతలు - 2
 12. తిక్క కుదిరిన నక్క
 13. నమ్మొద్దురా నాయనా దొంగ నక్కల్ని
 14. మూతి పగిలిన పిల్లి
 15. రాముటోపి
 16. కుందేలు దెబ్బ
 17. ఒక వీరుని కథ
 18. పుచ్చకాయ తపస్సు
 19. సముద్రంలో చిన్నచేప
 20. కోటకొండ మొనగాడు
 21. బూర
 22. తేనె చినుకులు
 23. పిండిబొమ్మ వీరుడు
 24. పిల్లలు కాదు పిడుగులు
 25. నాకు మూడు - నీకు రెండు
 26. కిర్రు కిర్రు లొడ్డప్పా
 27. ఒకి తిందునా  రెండు తిందునా
 28. నలుగురు మూర్ఖులు
 29. కమ్మని ఊహలు
 30. చిలుక ముక్కు వూడిపాయ
 31. రేపటి వెలుగులు
 32. నల్లకుక్క
 33. రెక్కల ఎలుక
 34. టక్కరికోతి
 35. అమ్మో దయ్యం
 36. మంచిమాట చెబుతా
 37. చేయి చేయి కలుపుదాం
 38. చందమామలో కుందేలు
 39. మూడు కోరికలు
 40. గాడిద మెచ్చిన పాట
 41. భం... భం... చుక చుక
 42. లబో దిబో
 43. గొడవపడకు - దెబ్బ తినకు
 44. మిన్ను
 45. చిటికెల పందిరి
 46. సోమరిపోతు మహావీరుడు
 47. చింతపండు - జాంపండు
 48. రాయలసీమ జానపద హాస్యకథలు[6]
 49. కర్నూలు జిల్లా జానపద కథలు[7]

పురస్కారాలు[మార్చు]

 • ఎం. హరికిషన్‌ బాలసాహితీ రంగానికి చేస్తున్న సేవలను, వివిధ ప్రయోగాలను గమనించిన బాలసాహిత్య పరిషత్‌, 2011లో వీరి "మెరుపుల వాన" పుస్తకాన్ని ఆవిష్కరించి బాలసాహితీ రత్న బిరుదుతో హైదరాబాద్‌ త్యాగరాయ గానసభలో సత్కరించింది.

చిత్రమాలిక[మార్చు]


బయటి లంకెలు[మార్చు]

 • ఆర్కైవ్.ఆర్గ్ లో రచయిత పేజీ
 • "Harikishan Kurnool". YouTube. Retrieved 2018-06-05.
 • ఫేస్‌బుక్ లో ఎం. హరికిషన్
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.

మూలాలు[మార్చు]