ప్రకాష్ ఆమ్టే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డా.ప్రకాష్ ఆమ్టే
లోక్ బిరదారీ ప్రకల్ప్

ప్రకాష్ ఆమ్టే మహారాష్ట్రకు చెందిన ఒక వైద్యుడు, సుప్రసిద్ధ సంఘ సేవకుడు. జీవన సహచరియైన మందాకినితో కలిపి సంయుక్తంగా 2008లో రామన్ మెగసెసే అవార్డు పొందాడు.[1][2] ఈయన తండ్రి బాబా ఆమ్టే కూడా సంఘసేవలో మెగసెసే అవార్డును పొందాడు. తండ్రి స్థాపించిన లోక్ బిరదారీ ప్రకల్ప్ అనే సంస్థను సేవా వారసత్వంగా స్వీకరించాడు. మడియా గోండులు అనే ఆదివాసీల జీవితాల్లో వెలుగులు నింపిన సంస్థ ఇది. ప్రకాష్ చిన్నప్పటి నుంచి తండ్రి కుష్టు రోగుల కోసం స్థాపించిన పునరావాస కేంద్రమైన ఆనంద వనం అనే ఆశ్రమంలో పెరిగాడు. 1974లో ప్రకాష్ నాగ్పూర్ లో ఉన్నత వైద్య విద్య నభ్యసిస్తున్నపుడు మడియా గోండుల జీవితాలలో వెలుగును నింపడం కోసం తండ్రి ఒక పథకాన్ని ప్రారంభించాడు. తండ్రి నుంచి అరుదైన సేవా వారసత్వాన్ని పుచ్చుకొన్న ప్రకాష్ తన భార్య మందాకినితో కలిసి మారు ఆలోచన లేకుండా అప్పటిదాకా పట్టణాల్లో నిర్వహిస్తున్న తమ వైద్య సేవలను విడిచిపెట్టి ఎక్కడో మారుమూలన ఉన్న హేమల్ కాసాకు పయనమయ్యారు. మహారాష్ట్రలోని గఢ్ చిరోలి జిల్లాలో "హేమల్ కసా" అనే గిరిజన గ్రామం దట్టమైన అడవిలో ఉంది. అక్కడే ఆ డాక్టర్ దంపతులు 1974లో, రెండు గుడిసెలు వేసుకొని వైద్యాన్ని ప్రారంభించారు. ఇప్పుడీ వైద్యశాలను (లోక్ బిరాదరి హాస్పిటల్) ఏడాదిలో సుమారు 40,000 మంది రోగులు సందర్శిస్తుంటారు. బిరాదరి ప్రకల్ప్[permanent dead link]

సేవా భాగ్యం

[మార్చు]
గోండు కుటుంబం

అప్పటి దాకా సకల సౌకర్యాలతో పట్టణంలో జీవించిన యువ దంపతులు ఒక్కసారిగా విద్యుత్తు, టెలిఫోన్, సౌకర్యాలు లేని ఒక తలుపు లేని గుడిసె లోకి మారారు. రోడ్డు పక్కనే వైద్య సేవలు చేసేవారు. రాత్రివేళ చలి వేస్తే కట్టెలతో మంట వేసుకుని చలి కాసుకునే వారు. గోండులు కొత్తవాళ్ళని అసలు నమ్మేవారు కాదు. నాగరికులంటే వారికి అకారణమైన భయం. దానికి తోడు వాళ్ళ మాట్లాడుకునే మడీయా భాషకు లిపి లేదు. ఈ భాషకు హిందీ, మరాఠీ భాషకు పోలికే లేదు. కొన్ని పదాలను మాత్రం తెలుగు భాషనుంచి అరువు తెచ్చుకున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలాకాలం నుంచి పనిచేస్తున్న అటవీ శాఖ ఉద్యోగుల సాయంతో లోక్ బిరదారీ ప్రకల్ప్ కార్యకర్తలు కొన్ని పదాలు నేర్చుకున్నారు. అవి వారితో మాటలు కలపడానికైతే సరిపోయాయి గానీ వారి మనసులు గెలవడం మాత్రం కుదరలేదు.

కొద్ది రోజుల తర్వాత జరిగిన ఒక సంఘటన గిరిజనులకు వీరిపై నమ్మకం కుదిరేలా చేసింది. ఒక గిరిజన యువకుడు అగ్నిప్రమాదంలో ఒళ్ళు కాల్చుకున్నాడు. దాదాపు ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చింది. ఆ సంగతి తెలిసి ప్రకాష్ తనే స్వంతంగా వారి దగ్గరకు వెళ్ళి వైద్యం చేశాడు. కొద్ది రోజులకు అతను కోలుకుని మళ్ళీ మామూలు మనిషిగా తిరగసాగాడు. మెల్లగా మిగతావారు కూడా ఆస్పత్రికి వెళ్ళసాగారు.

ప్రకాష్ ఆమ్టే, మందాకినీ ఆమ్టేలు ముంబాయిలో వైద్యవిద్యను అభ్యసించి, 1972లో వివాహమాడారు. మడియా గోండులు అమాయకులు, నిరక్షరాస్యులు. వారిని ఫారెస్ట్ గార్డులు, గిరిజనేతరుల నుండి రక్షించాలంటే, వారికి విద్య ఎంతో అవసరం అని ప్రకాష్ ఆమ్టే, అతని సహచరులు గుర్తించారు. అలా ఒక బడిని ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు దాంట్లో సుమారు 600 మంది విద్యార్థులు చదువుకొంటున్నారు. ఈ స్కూల్లో చదివిన ఇద్దరు మడియా గోండు విద్యార్థులు ఇప్పుడు వైద్యులయ్యారు.

గుర్తింపులు

[మార్చు]
పద్మశ్రీపురస్కారం

ప్రకాష్ ఆమ్టే తన సేవలకు గుర్తింపుగా పలు అవార్డులు పొందినాడు.

  • మెగసెసె అవార్డు.
  • పద్మశ్రీ అవార్డు.
  • వేణు మీనన్ అవార్డు.
  • దివాలీబెన్ మెహతా అవార్డు.

అవీ ఇవీ

[మార్చు]
  • 1995లో ఓ ఫ్రెంచి భార్యాభర్తలు, హేమల్ కాసాను సందర్శించి, చాలా ప్రభావితమయ్యి, మొనాకో రాజుకు ఉత్తరం వ్రాశారు. మొనాకో ప్రిన్స్ ప్రకాష్ ఆమ్టే, మందాకినీ ఆమ్టేల గౌరవార్థంగా వీరి బొమ్మలున్న ఓ తపాలా బిళ్ళను విడుదల చేశారు.

మూలాలు

[మార్చు]
  1. http://timesofindia.indiatimes.com/Cities/Magsaysay_Award_for_Baba_Amtes_son/articleshow/3312446.cms
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2008-08-27. Retrieved 2008-08-28.