Jump to content

వి. శాంత

వికీపీడియా నుండి
The President, Shri Pranab Mukherjee presenting the Padma Vibhushan Award to Dr. V. Shanta, at a Civil Investiture Ceremony, at Rashtrapati Bhavan, in New Delhi on April 12, 2016.jpg
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతులమీదుగా పద్మ విభూషన్ అందుకుంటున్న వి. శాంత

డా. వి. శాంత వైద్యరంగ పరిశోధకురాలు. రాచపుండు పై రణభేరి మోగించిన శాస్త్రజ్ఞురాలు. ఈమె చెన్నై నందుగల ఆదిత్య కేన్సర్ ఇనిస్టిట్యూట్ లో చైర్ పర్సంగానూ, కేన్సర్ స్పెషలిస్టు గానూ యున్నారు. ఈమెకు వైద్యరంగంలో చేసిన కృషికి గాను పద్మశ్రీ అవార్డు, రామన్ మెగసెసె అవార్డులు వచ్చాయి. మదర్ థెరెస్సా అవార్డును కూడా పొందారు.[1] వైద్య రంగానికి వీరు చేసిన కృషికిగాను కేంద్ర ప్రభుత్వం వీరిని పద్మ విభూషణ్ పురస్కారంతొ సత్కరించింది.

జివిత విశేషాలు

[మార్చు]

డా. వి. శాంత మార్చి 11 1927 న చెన్నైలో గల మైలాపూర్ లో జన్మించారు. ఆమె కుటుంబంలో ప్రఖ్యాత నోబెల్ బహుమతి గ్రహీతలైన "సి.వి.రామన్", "సుబ్రహ్మణ్య చంద్రశేఖర్" వంటివారు ఉన్నారు.

ఆమె ప్రాథమిక విద్యను నేషనల్ నేషనల్ గర్ల్స్ పాఠశాలలో ( ప్రస్తుతం పి.ఎస్. శివస్వామి హయ్యర్ సెకండరీ స్కూల్) చదివారు. ఆమె ఒక వైద్యురాలు కావాలను కోరుకున్నారు. ఆమె మద్రాసు యూనివర్శిటీ నుండి 1949 లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తరువాత ప్రసవ శాస్త్రం (Obetetrics) లో, గైనకాలజీ (స్త్రీ జననేంద్రియ వ్యాధుల శాస్త్రం) లలో డిప్లొమా తీసుకున్నారు. 1955 లో ఎం.డిని పూర్తి చేసి పరిశోధనలు చేశారు. ఆమెకు స్ఫూర్తిదాతలు ఎవరూ లేనప్పటికీ ఆమె అన మేనమామ అయిన ఎస్.చంద్రశేఖర్ గారిని, ఆమె తాతగారి సోదరుడైన సి.వి.రామన్ గార్ల సేవలకు ప్రభావితమైనది.

సేవలు

[మార్చు]

ఆమె తన 13 వ యేట నుంచే వైద్య వృత్తి చేపట్టి రోగులకు సేవలు చేయాలని కలలు కనేవారు. 1955 లో కాన్సర్ ఇనిస్టిట్యూట్ ప్రారంభించిన నాటి నుండి క్యాన్సర్ రోగులకు తన సేవలను అందిస్తున్నారు. ఆమె వైద్యాన్ని ఓ వృత్తిగా ఏనాడూ భావించలేదు. మనిషిలోని బాధల్ని మానవీయ కోణంలో దర్శించి, మానవతా దృక్పథంతో స్పందించి వైద్య వృత్తిని వ్యాపార కళ నుంచి వేరుచేశారు. ఆరు దశాబ్దాలకు పైగా కీలకమైన శస్త్రచికిత్సలను పర్యవేక్షిస్తూ కేన్సర్ చికిత్సా పరిశోధనా రంగంలో సరికొత్త మార్పులను ఆవిష్కరించారు. అడయార్ (చైన్నై) కాన్సర్ హాస్పటల్ నిర్వాహకురాలిగా నేటికీ లక్షలాది క్యాన్సర్ పీడితులకు ప్రాణదానం చేస్తున్నారు. అణగారిన ప్రజల పట్ల అంకితభావం, ప్రతి వ్యక్తికి వైద్యసేవలు అందుబాటులో ఉండాలన్న ఆదర్శం, ఎంత సాధించినా సాటి వ్యక్తి మేలు కోసమేనన్న సమున్నత లక్ష్యం, వెరసి తన జీవిత సర్వస్వాన్ని వ్యాధి పీడితుల కోసం ధారపోసిన మహామనిషిగా డాక్టర్ శాంత గారు నీరాజనాలు అందుకున్నారు.

అడయార్ క్యాన్సర్ ఆసుపత్రి

[మార్చు]

ఇది చైన్నై లోని మహోన్నత వైద్యాలయం. దీనికి అంకురార్పణ చేసిన వ్యక్తి ముత్తులక్ష్మీ రెడ్డి. మన దేశంలో వైద్య శాస్త్రంలో మొట్టమొదటగా పట్టా పుచ్చుకున్న మహిళ ఆమె. తన తోబుట్టువుకు క్యాన్సర్ సోకి, సరైన వైద్యం లభించక మృతి చెందడంతో ఆ విషాదం నుంచి అమె ఓ పట్టాన తేరుకోలేకపోయారు. కాస్త కుదుట పడిన తర్వాత అలా మరెవ్వరికీ జరగకూడదనే ఉద్దేశంతో "క్యాన్సర్ ఆసుపత్రి" ప్రారంభించారు. ఉమెన్స్ ఇండియన్ అసోషియేషన్ (WIA) ద్వారా సేకరించిన నిధులతో ఇన్‌స్టిట్యూట్ కు శ్రీకారం చుట్టారు. 1954, జూన్ 18 న కేవలం ఇద్దరు గౌరవ వైద్యాధికారులు, ఓ టెక్నీషియన్, ఇద్దరు ఆక్జిలరీ నర్స్ లతో చిన్న చిన్న గుడిసెల్లో 12 పడకల ఆసుపత్రిని ప్రారంభించారు.

ప్రస్తుతం చికిత్స, పరిశోధన, రోగుల పునరావాసం వంటి అంశాలతో సమగ్ర క్యాన్సర్ నిరోధక కేంద్రంగా పనిచేస్తున్న ఈ ఛారిటబుల్ ఇన్‌స్టిట్యూత్ ను స్వంతంత్ర ప్రతిపత్తిగల గవర్నింగ్ బాడీ నడుపుతోంది. సంస్థ వ్యవస్థాపకురాలైన డా. ముత్తులక్ష్మీ రెడ్ది కుమారుడు డాక్టర్ కృష్ణమూర్తి ఎగ్జిక్యూటివ్ డైరక్టర్గా, డాక్టర్ శాంతగారు ఛైర్మన్ గా ఉన్నారు. సంస్థను భారత ప్రభుత్వం 1975 లో దక్షిణ భారతదేశ ప్రాంతీయ క్యాన్సర్ కేంద్రంగా ప్రకటించింది. ఒక ప్రైవేటు సంస్థకు కేంద్ర ప్రభుత్వం ఈ విధమైన గుర్తింపునివ్వడం ఇదే ప్రథమం.

వైద్య సేవలు

[మార్చు]

డాక్టర్ శాంత గారు ఈ ఆసుపత్రిలో క్యాన్సర్ కు సంబంధించిఅన్ అధూనతనమైన వైద్య సౌకర్యాలు ఆల్ట్రా సోనోగ్రఫీ, కంప్యూటరైజ్డ్ బయోగ్రఫీ లను మూడు దశాబ్దాల క్రితమే ప్రవేశపెట్టారు. నూక్లియర్ మెడికల్ అంకాలజీ, సైటాలజీ, లింపాంజియోగ్రఫీ, మమోగ్రఫీ, ఫైబర్ ఆప్టిక్ గ్యాస్ట్రో ఎండోస్కొపీ వంటి ఆధునిక పరికరాలనూ, రేడియో థెరపీ విభాగాలను ఏర్పాటు చేశారు.

ఈ తరహాలో ఆధినిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోనికి తీసుకుని వచ్చినా క్యాన్సర్ విషయంలో కొత్త సమస్యలు పుట్టుకొస్తూనే ఉన్నాయని డాక్టర్ శాంతగారు గ్రహించారు. వాటిని అధికమించడానికి క్లినికల్ రీసెర్చ్ బయో కెమిస్ట్రీ, ఇమ్యూనాలజీ ట్యూమర్, మైక్రో బయాలజీ తదితర పరిశోధనా కేంద్ర విభాగాలను ఏర్పాటు చేశారు. రొమ్ము క్యాన్సర్ ల మీద ఈమె చేసిన పరిశోధనలు శస్త్రచికిత్సలకు బాగా ఉపకరించాయి.

అవార్డులు

[మార్చు]

పరిశోధనా కార్యక్రమాలలోనూ, సంస్థతోనూ దాదాపు 55 సంవత్సరాల అనుబంధం ఉన్న డాక్టర్ శాంత గారికి 2005 లో ప్రతిష్ఠాత్మకమైన "రామన్ మెగసెసె అవార్డు" లభించింది.తద్వారా అంతర్జాతీయ ఖ్యాతినార్జించారు. తమిళనాడు లోని వివిధ ప్రాంతాల్లో క్యాన్సర్ పై అవగాహన సదస్సులు నిర్వహించి ఈమె పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈమె ఆసుపత్రి అభివృద్ధికీ, రోగుల సేవలకు అంకితమై అవివాహితగా మిగిలిపోయారు. తన సేవలకు గుర్తింపుగా "పద్మశ్రీ"తో పాటు మొత్తం 32 అవార్డులు వరించినా - "స్వస్థత పొందిన రోగి మొహం లోని చిరునవ్వును మించిన అవార్డు ఉండదు" అంటారీమె. క్యాన్సర్ వ్యాధికి సంబంధించిన అన్ని విభాగాల్లోనూ విశేషమైన అనుభవం గల డాక్టర్ శాంత తాను 85 వ యేటకు అడుగిడినా ఇప్పటికీ ఉత్సాహంగా వైద్యం చేస్తుంటారు."[2]

డాక్టర్ శాంత క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ కు చేసిన సేవలు మాటల్లో చెప్పలేనివి. ఒకసారి ప్రధాని నెహ్రూ కూడా ఈమె సేవలను అభినందించారు. రామన్ మెగసెసె అవార్డు వల్ల వచ్చిన బహుమతి మొత్తాన్ని క్యాన్సర్ ఆసుపత్రికి ఇచ్చివేసారు. 2005 లో దేశవ్యాప్తంగా నోబెల్ బహుమతికి నామినేట్ చేయబడిన మహిళ ఈమె. జాతీయ, అంఅర్జాతీయ మెడికల్ జర్నల్స్ లో, ప్రముఖమైన మెడికల్ జర్నల్స్ అన్నీంటిలోనూ ఈమె వ్యాసాలు ప్రచురించారు. తీరిక దొరికినప్పుడు సంగీతం వినడానికి ఇష్టపడతారు. ఆత్మవిశ్వాసమే తన బలమని పూర్తినమ్మకంతో ఉంటారు.వైద్య రంగానికి వీరు చేసిన కృషికిగాను కేంద్ర ప్రభుత్వం వీరిని పద్మ విభూషణ్ పురస్కారంతొ సత్కరించింది.

మూలాలు

[మార్చు]
  1. మదర్ థెరెస్సా అవార్డు పొందిన వి. శాంత - హిందూ పత్రిక లో
  2. "Citation Description". Archived from the original on 16 జూలై 2012. Retrieved 1 November 2012.

ఇతర లింకులు

[మార్చు]
  • Interview with Dr Shanta - Frontline Volume 22 - Issue 17, Aug 13 - 26, 2005 [1]
  • The 2005 Ramon Magsaysay Award for Public Service-CITATION for Dr V. Shanta [2]
"https://te.wikipedia.org/w/index.php?title=వి._శాంత&oldid=3377753" నుండి వెలికితీశారు