మురళీధర్ దేవదాస్ ఆమ్టే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మురళీధర్ దేవదాస్ ఆమ్టే
Baba Amte (1914-2008).jpg
బాబా ఆమ్టే
జననం (1914-12-26) 1914 డిసెంబరు 26 [1]
హింగన్‌ఘాట్, ప్రస్తుత మహారాష్ట్ర
మరణం 2008 ఫిబ్రవరి 9 (2008-02-09)(వయసు 94)
ఆనంద్‌వన్, మహారాష్ట్ర
జాతీయత Indian
జీవిత భాగస్వామి సాధనా ఆమ్టే
పిల్లలు వికాస్ ఆమ్టే
ప్రకాష్ ఆమ్టే
సంతకం
BabaAmte Autograph(Eng).jpg

బాబా ఆమ్టే (Baba Amte) (Marathi: बाबा आमटे) (డిసెంబర్ 26, 1914 - ఫిబ్రవరి 9, 2008) సంఘసేవకుడు. అతని అసలు పేరు మురళీధర్ దేవదాస్ ఆమ్టే. ప్రముఖ సంఘసేవకుడిగా ప్రసిద్ధిగాంచిన బాబా ఆమ్టే ముఖ్యంగా కుష్టు రోగుల పాలిట దేవుడిగా మారినాడు. కుష్టురోగుల సేవలకై చంద్రాపూర్ జిల్లాలో ఆనంద్‌వన్ ఆశ్రమాన్ని స్థాపించి అతను కూడా వారితోపాటే అక్కడే జీవితాన్ని గడిపి 2008, ఫిబ్రవరి 9న తన ఆశ్రమంలోనే మృతి చెందిన మహనీయుడు. ఉన్నత కుటుంబంలో జన్మించి భోగభాగ్యాలను వదిలి అణగారిన వర్గాల మేలు కొరకై జీవితాంతం కృషిసల్పిన అతని కృషి మరవలేనిది. అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అతడు చేసిన సేవలకు గుర్తింపుగా లభించాయి.

తొలి జీవితం[మార్చు]

డిసెంబర్ 26, 1914లో మహారాష్ట్రలోని వార్థా జిల్లా హింగన్‌ఘాట్‌లో ఒక ఉన్నత బ్రాహ్మణ జాగిర్దార్ కుటుంబంలో జన్మించాడు. అతని అసలు పేరు మురళీధర్ దేవదాస్ అమ్టే కాగా చిన్నతనంలోనే అతన్ని బాబా అని పిలిచేవారు. బాబా అనేది ఎవరో ప్రధానం చేసిన బిరుదు కాదు అది తల్లిదండ్రులు పెట్టిన ముద్దుపేరు.[2] న్యాయశాస్త్రంలో శిక్షణ పొందిన తరువాత వార్థాలో న్యాయ అభ్యాసం ప్రారంభించాడు. అదే సమయంలో భారత జాతీయోద్యమ పోరాటం జరుగుతుండేది. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో అరెస్ట్ కాబడిన జాతీయ నేతల తరఫున కోర్టులలో వాదించేవాడు. క్రమక్రమంగా మహాత్మా గాంధీ వైపు ఆకర్షితుడైనాడు. గాంధీజీతో పాటు కొంత కాలం సేవాగ్రం ఆశ్రమంలో గడిపినాడు. ఆ తరువాత జీవితాంతం వరకు గాంధీజీ సిద్ధాంతాలకే కట్టుబడినాడు. వేషధారణలో కూడా గాంధీజీ వలె ఖద్దరు దుస్తులనే వాడేవాడు. గాంధీజీ వలె జీవితాంతం అణగారిన వర్గాల కృషికై పాటుపడ్డాడు.

వివాహం[మార్చు]

1946లో బాబాఆమ్టే సాధన గులేశాస్త్రిని వివాహం చేసుకున్నాడు. తరువాతి కాలంలో ఆమె సమాజ సభ్యులచే సాధనతాయ్ (మరాఠీలో తాయ్ అనగా పెద్దక్క) గా పిలువబడింది. వారికి వికాస్ మరియు ప్రకాష్ అనే ఇద్దరు కుమారులున్నారు. ఆ ఇద్దరు కూడా తండ్రి వలె సమాజసేవకై పాటుపడుతున్నారు.[3]

ఆనంద్‌వన్[మార్చు]

బాబా ఆమ్టే స్థాపించిన మూడు ఆశ్రమాల్లో ఆనంద్‌వన్ మొదటిది. కుష్టురోగుల సంక్షేమానికి మహారాష్ట్రలోని చంద్రాపుర్ జిల్లాలో ఈ ఆశ్రమాన్ని 1951లో స్థాపించాడు. ఆనంద్‌వన్ అనగా అర్థం ఆనందపు అడవి (Forest of Joy). వరోరాకు దగ్గరలోని అటవీ ప్రాంతంలో 50 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని ప్రారంభించాడు. అది క్రమక్రమంగా పెద్దదై నేడు 500 ఎకరాలకు విస్తరించింది. ఆ రోజులలో కుష్టురోగులకు సమాజం నుంచి వెలివేసేవారు. అలాంటి వారి కొరకు ఆశ్రమాన్ని స్థాపించి కుష్టురోగులను చేరదీసి వారితో పాటు అతడు కూడా అక్కడే వారి సంక్షేమం చూస్తూ గడపటం గొప్పవిషయం. కుష్టువ్యాధి ఒక అంటురోగమని, కుష్టురోగులను తాకినా ఆ వ్యాధి వస్తుందనే ప్రచారంలో ఉన్న సమయంలో బాబాఆమ్టే ఆ వదంతులను త్రిప్పికొట్టడానికి స్వయంగా ఒక కుష్టురోగి నుంచి బాసిల్లి క్రిములను తన శరీరంలో ఇంజెక్షన్ ద్వారా ఎక్కించుకున్నాడు.[4] కుష్టురోగులకై బాబాఆమ్టే తదనంతరం సోమనాథ్ మరియు అశోకవన్ ఆశ్రమాలను కూడా స్థాపించాడు. సమాజసేవ విషయంలో ఆనంద్‌వన్ ఆశ్రమం ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధిగాంచింది. ఆనంద్‌వన్ కై బాబాఆమ్తేకు 1983లో డేమియన్ డట్టన్ లెప్రసీ సంస్థనుంచి డేమియన్ డట్టన్ అవార్డు కూడా లభించింది. ప్రస్తుతం ఆనంద్‌వన్ రెండు ఆసుపత్రులను, ఒక విశ్వవిద్యాలయాన్ని, ఒక అంధుల కొరకు పాఠశాలను, ఒక అనాథశరణాలయాన్ని కలిగిఉంది. ఈ ఆశ్రమంలో ప్రస్తుతం 5000కు పైగా నివసిస్తున్నారు.[2]

బాబా ఆమ్టే మరియు గాంధీజీ సిద్ధాంతాలు[మార్చు]

బాబాఆమ్టే గాంధీజీ సిద్ధాంతాలను నమ్మిన వ్యక్తి మాత్రమే కాడు, ఆ సిద్ధాంతాలను పూర్తిగా ఆచరించిన మహనీయుడు. ఇటీవలి కాలంవరకు గాంధీజీ సిద్ధాంతాను పూర్తిగా ఆచరించిన వ్యక్తులలో ఇతడే చివరివాడు. గాంధీజీతో పరిచయమైన తరువాత అతనితో పాటు కొద్ది రోజులు సేవాగ్రామ్ ఆశ్రమంలో గడిపి గాంధీజీ శిష్యుడిగా మారి, ఆయన సిద్ధాంతాలను పూర్తిగా వంటపట్టించుకున్నాడు. ఆ సమయంలోనే గాంధీజీ బాబాఆమ్టేకు అభయసాధక్ అనే బిరుదు ఇచ్చాడు. కుష్టురోగులకు భయపడక వారి సంక్షేమానికి ఇతను చేస్తున్న కృషి ఫలితమే ఆ బిరుదు. ఆ తరువాత బాబా ఆమ్టే సిద్ధాంతాలపై కూడా గాంధీజీ ప్రభావం చాలా పడింది. శేషజీవితం అణగారిన వర్గాల కొరకే గడపడమే కాకుండా, వస్త్రధారణలో ఖద్దరు బట్టలనే ధరించడం ఇత్యాది విషయాలలో ఆ ఇద్దరిలో సామ్యముంది. అంతేకాదు ఆశ్రమాల్లో గడుపుతూ పూర్తి శాకాహార భోజనం చేస్తూ జీవనం గడిపినాడు. గాంధీజీ వలెనే స్వయంసమృద్ధి గ్రామాలు ఉండాలని ఆకాంక్షించాడు. గాంధీజీ బ్రిటీష్ వారిపై అహింసా పోరాటం జరిపినట్లే బాబా ఆమ్టే కూడా నర్మదా బచావో ఉద్యమంలో కూడా ప్రభుత్వ నిర్ణయానికి విరుద్ధంగా అహింసాయుత పోరాటం కొనసాగించాడు.

మరణం[మార్చు]

2008, ఫిబ్రవరి 9 ఉదయం 4.15 గంటలకు తన ఆశ్రమం ఆనంద్‌వన్‌లో బాబా ఆమ్టే కన్నుమూశాడు. 94 సంవత్సరాల వయస్సు ఉన్న బాబా ఆమ్టే చాలా కాలం నుంచి వెన్నుపూస సమస్యతో బాధపడేవాడు. కొంతకాలంగా రక్తకాన్సర్‌తో బాధపడ్డాడు. అయిననూ తుదిశ్వాస వదిలే వరకు తాను నమ్మిన సిద్ధాంతాలకే పాటుపడి, తన ఆశయమే లక్ష్యంగా కృషిసల్పినాడు. ఆయన భౌతిక కాయానికి ఫిబ్రవరి 10న అధికార లాంఛనాలతో మహారాష్ట్ర ప్రభుత్వం అంత్యక్రియలు నిర్వహించింది. ఆయన అంతిమ కోరిక భౌతికకాయాన్ని దహనం చేయడానికి బదులు మేరకు ఖననం చేశారు.

అవార్డులు[మార్చు]

అనేక దశాబ్దాల పాటు దీనజన ప్రజల కోసం కృషిసల్పిన బాబా ఆమ్టేకు అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులు లభించాయి. అవార్డులతో పాటు లభించిన నగదును సాంఘిక కార్యకలాపాల కోసమే వినియోగించాడు.[5]

 • 1971 : భారత ప్రభుత్వపు పద్మశ్రీ అవార్డు.[6]
 • 1974 : మహారాష్ట్ర ప్రభుత్వపు దళిత్ మిశ్రా అవార్డు.
 • 1978 : రాష్ట్రీయ భూషణ్ అవార్డు.
 • 1979 ; జమన్‌లాల్ బజాజ్ అవార్డు.
 • 1983 : అమెరికాకు చెందిన డామియెన్ డట్టన్ అవార్డు (కుష్టువ్యాధి పీడితుల కోసం కృషిసల్పిన వారికిచ్చే ప్రపంచంలో అత్యున్నత అవార్డు).
 • 1985 : రామన్ మెగ్సేసే అవార్డు.
 • 1985 : మధ్య ప్రదేశ్ ప్రభుత్వపు ఇందిరా గాంధీ స్మారక అవార్డు.
 • 1986 : భారత ప్రభుత్వపు పద్మవిభూషణ్ అవార్డు.
 • 1986 : రాజారాం‌మోహన్ రాయ్ అవార్డు.
 • 1988 : ఐక్యరాజ్య సమితి మానవహక్కుల అవార్డు.
 • 1988 : జి.డి.బిర్లా అంతర్జాతీయ అవార్డు.
 • 1988 : ఫిక్కి అవార్డు.
 • 1989 : అంతర్జాతీయ జిరాఫీ అవార్డు.
 • 1990 ; టెంపుల్టన్ అవార్డు.
 • 1991 : రైట్ లివ్లీహుడ్ అవార్డ్ (ఈ అవార్డు ప్రత్యమ్నాయ నోబెల్ బహుమతిగా పేరుపొందింది) [7][8]
 • 1991 : ఆదివాసీ సేవక్ అవార్డు.
 • 1992 : మహారాష్ట్ర ప్రభుతపు అంబేద్కర్ దళిత్ మిత్ర అవార్డు
 • 1997 : మహాత్మా గాంధీ చారిటేబుల్ ట్రస్ట్ అవార్డు.
 • 1999 : గాంధీ శాంతి బహుమతి.
 • 1999 : అంబేద్కర్ అంతర్జాతీయ అవార్డు.
 • 2008 : భారత్‌వాసా అవార్డు.

సంతకము[మార్చు]

BabaAmte Autograph(Eng).jpg

బయటి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]