బసావన్ సింగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
2000 భారత స్టాంపుపై బసావన్ సింగ్

బసావన్ సింగ్ (1909 మార్చి 23 – 1989 ఏప్రిల్ 7) స్వాతంత్ర్య సమర యోధుడు. వెనుకబడిన వర్గాలు, పారిశ్రామిక కార్మికులు, వ్యవసాయ కార్మికుల హక్కుల కోసం ఉద్యమించినవాడు.

అతను స్వాతంత్ర్య సమర యోధుడిగా బ్రిటిష్ ఇండియాలోని జైళ్లలో మొత్తం 18న్నర సంవత్సరాలు గడిపాడు. అతను ప్రజాస్వామ్య సామ్యవాదానికి కట్టుబడి ఉన్నాడు.

యోగేంద్ర శుక్లాతో కలిసి అతను బీహార్‌లో కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీని స్థాపించాడు. [1] చాలా ఎత్తైన మనిషి కావడంతో అతని విప్లవ సహచరులు, స్నేహితులూ అతన్ని లంబాద్ అని పిలిచేవారు

జీవితం తొలి దశలో

[మార్చు]

బసావన్ సింగ్ 1909 మార్చి 23 న హాజీపూర్‌లోని జమాల్‌పూర్ (సుభాయ్) లో ఒక పేద వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు. [2] తల్లిదండ్రులకు అతను ఏకైక కుమారుడు. ఎనిమిదేళ్ల వయసులో తండ్రిని కోల్పోయాడు. పదేళ్ల వయసులో అతను మహాత్మా గాంధీని చూడటానికి, అతని ప్రసంగం వినడానికి హాజీపూర్‌కు పారిపోయాడు. అతను తెలివైన విద్యార్థి. ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలల్లో స్కాలర్‌షిప్‌లను పొందాడు. ఆ తర్వాత అతను డీఘీ హైస్కూల్లో చేరాడు. ఆహారానికి, బసకు అయ్యే ఖర్చులను సంపాదించడం కోసం అతను తనకంటే పెద్ద అబ్బాయిలకు పాఠాలు చెప్పేవాడు. అతని ఇతర పాఠశాల ఖర్చుల కోసం అతని తల్లి వెదురును విక్రయిస్తూండేది. [3]

సింగ్ 1926 లో మొదటి డివిజన్‌తో మెట్రిక్యులేషన్ పరీక్షలో ఉత్తీర్ణుడై, GBB కళాశాలలో చేరాడు. [3]

పాఠశాలలో గడిపిన చివరి రెండు సంవత్సరాలలో సింగ్, విప్లవకారులతో సన్నిహితంగా మెలిగాడు. హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీ (HSRA) అధిపతి యోగేంద్ర శుక్లా అతని గురువు. 1925 లో హెచ్‌ఎస్‌ఆర్‌ఏలో చేరిన వెంటనే సింగ్‌ను జిబిబి కాలేజీ నుండి బహిష్కరించారు. దాంతో అతని చదువు ముగిసింది. పాట్నాలోని సదాకట్ ఆశ్రమంలో అతను ఒక చిన్న సమూహంలో భాగమై, సైనిక శిక్షణ తీసుకున్నాడు. [3]

1929 లో లాహోర్ కుట్ర కేసు తర్వాత సింగ్ పరారయ్యాడు. అతను భూసావల్, కాకోరీ, టిర్హుట్, దేలువాహా కుట్ర కేసుల్లో సహ నిందితుడు. అతను చంద్రశేఖర్ ఆజాద్, కేశబ్ చక్రవర్తితో కలిసి ఉద్యమాన్ని కొనసాగించాడు. అతనికి ఏడేళ్ల జైలు శిక్ష విధించబడింది కానీ మూడు రోజుల తర్వాత 1930 జూన్ లో బంకీపూర్ కేంద్ర కారాగారం నుండి తప్పించుకున్నాడు. అతడిని మళ్లీ అరెస్టు చేసి భాగల్పూర్ సెంట్రల్ జైలుకు పంపారు. [4]

భాగల్పూర్‌లో ఉన్నప్పుడు, జైల్లో ఉన్న అమానవీయ పరిస్థితులకు నిరసనగా సింగ్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టాడు. దీక్ష 12 వ రోజున అతడిని గయ కేంద్ర కారాగారానికి తరలించారు. ఏకాంత ఖైదులో ఉంచారు. కానీ త్వరలోనే అతడిని జైలు ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. బలవంతంగా ఆహారం ఇవ్వడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి, అప్పటి బీహార్ మంత్రి సర్ గణేష్ దత్, ఉపవాసాన్ని విరమింపజేయావాలని అతని తల్లి దౌలత్ ఖేర్‌ని అడిగాడు. దీక్ష 50 వ రోజున, ఆమె అతడిని కలిసి ఆశీర్వదించింది. [3]

సింగ్ చనిపోతే అతని మృతదేహాన్ని స్వీకరించడానికి ప్రజలు ప్రతిరోజూ జైలు గేటు వద్ద వేచి ఉండేవారు. జైలులో ఉన్న రాజకీయ ఖైదీలందరూ కూడా ఆయనకు సంఘీభావంగా కొన్ని రోజుల పాటు నిరాహార దీక్షలో ఉన్నారు, 58 వ రోజు అతని డిమాండ్లు నెరవేర్చినట్లు గాంధీ అతనికి తెలియజేయడంతో నిరాహార దీక్ష విరమించాడు. అతని ఆరోగ్యం సరిగా లేని కారణంగా 1936 జూన్ లో జైలు నుండి విడుదలయ్యాడు. అతని కదలికలను పరిమితం చేయగా అతను ఆ ఆంక్షలను ఉల్లంఘించాడు. దాంతో అతన్ని మళ్లీ అరెస్టు చేసారు. [3]

రాజకీయాలు, కార్మికోద్యమం

[మార్చు]

సింగ్ 1936 నుండి 1989 లో మరణించే వరకు కార్మికోద్యమంలో చురుకుగా ఉన్నాడు. అతను 1936 డిసెంబరులో కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీలో చేరాడు. దాని కార్మిక కార్యదర్శిగా నియమితుడయ్యాడు. బీహార్‌లోని బొగ్గు క్షేత్రాలు, చక్కెర కర్మాగారాలు, మైకా గనులు, రైల్వేలలో కార్మిక సంఘాలను స్థాపించాడు. అతను 1937 లో జాప్లా కార్మిక సంఘం, 1937 లో బౌలియా లేబర్ యూనియన్లను ఏర్పాటు చేశాడు. శివనాథ్ బెనర్జీతో కలిసి జమాల్‌పూర్ వర్క్‌షాప్ కార్మికులను ఏకం చేసాడు. గయా కాటన్, జ్యూట్ మిల్ లేబర్ యూనియన్‌ను ఏర్పాటు చేశాడు. సుభాష్ చంద్రబోస్‌తో కలిసి టాటా కాలరీస్ లేబర్ అసోసియేషన్‌ను ఏర్పాటు చేశాడు. 1941 లో బోసు భారతదేశాన్ని విడిచిపెట్టినప్పుడు సంస్థకు అధ్యక్షుడయ్యాడు. అతను దుఖబంధు మిశ్రా (తాల్చేర్ బొగ్గు క్షేత్రాలలో HMS యూనియన్ వ్యవస్థాపక సభ్యుడు), రాజ్‌గంగ్‌పూర్ (ఒరిస్సా), సాత్నా (MP) ల సహకారంతో తాల్చేర్ బొగ్గు కార్మికులను ఏకం చేశాడు; మైకా వర్కర్స్ యూనియన్, గోమియా లేబర్ యూనియన్ (పేలుడు పదార్థాలు) స్థాపించాడు. తరువాత ఈ సంఘాలు HMS కి అనుబంధంగా మారాయి. అతను 1936 నుండి AIRF లో చురుకుగా ఉన్నాడు, ఆగ్రా లోని OT రైల్వే యూనియన్ అధ్యక్షుడిగా ఉన్నాడు. నేఫా, NE రైల్వే మజ్దూర్ యూనియన్లకు కూడా అధ్యక్షుడిగా పనిచేసాడు. [5]

స్వతంత్ర భారతదేశంలో

[మార్చు]

సింగ్, సోషలిస్ట్ పార్టీ జాతీయ కార్యనిర్వాహక సభ్యుడు. సోషలిస్టులకు అనుబంధంగా ఉన్న ఆరు జాతీయ సమాఖ్యలలో ఒకటైన HMS (హింద్ మజ్దూర్ సభ) వ్యవస్థాపకుడు. అతను కార్మికుల హక్కుల కోసం పోరాడుతూ 1965 లో గోమియా సమ్మెలో పాల్గొన్నాడు. [5]

సోషలిస్టు నాయకత్వం

[మార్చు]

1948 ఫిబ్రవరిలో, కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ కాంగ్రెస్ నుండి విడిపోయింది. సింగ్ 1977 లో ఇతర రాజకీయ పార్టీలతో విలీనమై జనతా పార్టీ గా ఏర్పడే వరకు అతడు సోషలిస్టు పార్టీలో ప్రముఖ నాయకుడు. అతను 1939 నుండి 1977 వరకు సోషలిస్ట్ పార్టీ జాతీయ కార్యనిర్వాహక సభ్యుడిగా ఉన్నాఅడు. అనేక సంవత్సరాల పాటు రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా ఉన్నాడు. [5]

1952 మొదటి సార్వత్రిక ఎన్నికలలో సింగ్, డెహ్రీ-ఆన్-సోన్ నుండి గెలిచాడు. 1952 నుండి 1962 వరకు ముఖ్యమైన ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు. 1962-68 వరకు బోహారు శాసన మండలి సభ్యుడుగా ఉన్నాడు. 1967 సంకీర్ణ ప్రభుత్వంలో అత్యంత శక్తివంతమైన కేబినెట్ మంత్రులలో (కార్మిక మంత్రివర్గం, ప్రణాళిక, పరిశ్రమలు) ఒకడు. 1975 ఎమర్జెన్సీ సమయంలో అతను 20 నెలల పాటు భూగర్భంలో ఉండి ఉద్యమం చేశాడు. అతని భార్యను ప్రభుత్వానికి "ముప్పు" గా భావించి అరెస్టు చేసి, మిసా కింద ఆమెకు జైలు శిక్ష విధించారు. [5]

1977 లో అతను డెహ్రీ-ఆన్-సోన్ నుండి ఎన్నికయ్యాడు. మళ్లీ రాష్ట్రంలో జనతా పార్టీ ప్రభుత్వంలో కార్మిక, ప్రణాళిక, పరిశ్రమల క్యాబినెట్ మంత్రి అయ్యాడు. సింగ్ 1989 ఏప్రిల్ 7 న మరణించాడు.

అతని భార్య కమలా సిన్హా, జన్ సంఘ్ వ్యవస్థాపకుడైన శ్యామ ప్రసాద్ ముఖర్జీ మనవరాలు[6] ఆమె రాజకీయవేత్త, దౌత్యవేత్త. 1990 నుండి 2000 వరకు ఆమె రెండుసార్లు రాజ్యసభకు ఎన్నికైంది. తరువాత సురినామ్, బార్బడోస్‌ లలో రాయబారిగా పనిచేసింది. ఐకే గుజ్రాల్ క్యాబినెట్‌లో విదేశీ వ్యవహారాల ఉపమత్రిగా పనిచేసింది. ఈ పదవిని నిర్వహించిన మొదటి మహిళ ఆమె. [7]

గుర్తింపు

[మార్చు]

23 మార్చి 2000 న భారత ప్రభుత్వం అతని పేరు మీద స్మారక ముద్రను విడుదల చేసింది. బీహార్‌లోని హాజీపూర్ నగరంలో బసవన్ సింగ్ ఇండోర్ స్టేడియం పేరుతో ఇండోర్ స్టేడియం ఉంది. [8] [9]

మూలాలు

[మార్చు]
  1. Mohan, Surendra (21 March 2009). "Dr Lohia's Life and Thought: Some Notes". Vol. XLVII, No 14. Mainstream. Retrieved 23 March 2009.
  2. Lalit, Kumar (2000). Shramikon Ke Hitaishi Neta, Itihas Purush: Basawon Singh. Patna: Bihar Hindi Granth Academy.
  3. 3.0 3.1 3.2 3.3 3.4 Jha, Sureshwar. Gems of Mithila (2014 ed.). Mithila Sanskrit Post Graduate Study & Research Institute (Publication Director – Dev Narain Yadav). p. 480 (at pages 439–445). OCLC 895247051.
  4. Jha, Sureshwar. Gems of Mithila (2014 ed.). Mithila Sanskrit Post Graduate Study & Research Institute (Publication Director – Dev Narain Yadav). p. 480 (at pages 439–445). OCLC 895247051.
  5. 5.0 5.1 5.2 5.3 Kumar, Lalit. Shramikon Ke Hitaishi Neta Itihas Purush Basawon Singh (2000 ed.). Government of Bihar, Bihar Hindi Granth Akademi, Patna, 2000. p. 138.
  6. "Kamala Sinha passes away". The Hindu. 2 January 2015. Retrieved 2 January 2015.
  7. "Former union minister Kamla Sinha dies in US away". Times of India. 1 January 2015. Retrieved 1 January 2015.
  8. "I am not corrupt, says Paswan". The Times of India. 17 March 2002. Archived from the original on 20 October 2012. Retrieved 3 April 2008.
  9. "Free-for-all at joint meeting of RJD, LJP". The Times of India. 8 June 2009. Archived from the original on 24 October 2012. Retrieved 8 June 2009.