కస్తూరిబాయి గాంధీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కస్తూరిబాయి మోహన్‌దాస్ గాంధీ
కస్తూరిబాయి గాంధీ
జననం
కస్తూరిబాయి మఖంజీ కపాడియా

(1869-04-11)1869 ఏప్రిల్ 11
పోర్‌బందర్, పోర్‌బందర్ రాష్ట్రం, కతియావార్ ఏజెన్సీ, బొంబాయి రాజ్యం, బ్రిటిష్ ఇండియా (ప్రస్తుతం గుజరాత్, భారతదేశం )
మరణం1944 ఫిబ్రవరి 22(1944-02-22) (వయసు 74)
ఆగాఖాన్ రాజమందిరం, పూణే, బొంబాయి రాజ్యం, (ప్రస్తుతం మహారాష్ట్ర)
ఇతర పేర్లుకస్తూరిబాయి మోహన్‌దాస్ గాంధీ
కస్తూరిబా మఖంజీ కపాడియా
వృత్తిఉద్యమకారిణి
జీవిత భాగస్వామి
(m. 1883; ఆమె మరణం 1944)
పిల్లలు

కస్తూరిబాయి మోహన్‌దాస్ గాంధీ (1869 ఏప్రిల్ 11 - 1944 ఫిబ్రవరి 22) భారత రాజకీయ కార్యకర్త, మహాత్మా గాంధీకి భార్య. ఆమె తన భర్త ప్రోత్సాహంతో, కుమారునితో పాటు భారత స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నది. ఆమె 62 సంవత్సరాల పాటు గాంధీతో కలసి జీవించింది. దక్షిణాఫ్రికా ప్రవాస భారతీయుల జీవన పోరాటంలోనూ, భారత స్వాతంత్ర్యోద్యమంలోనూ పాల్గొని నిర్బంధాలను కలిసి ఎదుర్కొన్నది. భారత దేశానికి స్వాతంత్ర్యం రాక పూర్వమే పూణే లోని ఆగాఖాన్ ప్యాలస్ లో 1944 ఫిబ్రవరి 22న కన్నుమూసింది.

బాల్యం

[మార్చు]

గుజరాత్ రాష్ట్రం కాఠియావాడ్ ద్వీపకల్పంలోని పోర్‌బందర్‌లో సంపన్న మోద్ బనియా వైశ్య కుటుంబంలో 1869 ఏప్రిల్ 11న జన్మించింది. ఆమె తల్లి వ్రజకున్వర్‌బా కపాడియా, తండ్రి గోకుల్ దాస్ మాకన్‌జీ కపాడియా.[1] కస్తూరిబా పూర్తిపేరు "కస్తూర్ గోకుల్ దాస్ మాకన్‌జీ కపాడియా". గోకుల్ దాస్ అనేది తండ్రి పేరు. మాకన్‌జీ అనేది తాత పేరు. కపాడియా అనేది వారి ఇంటి పేరు. అంతకు ముందు ఇద్దరు ఆడపిల్లలు పుట్టి చనిపోవడం వల్ల కపాడియా దంపతులు కస్తూర్‌ని చాలా శ్రద్ధ తీసుకొని పెంచారు. ఆమెకి ఒక అన్న, ఒక తమ్ముడు ఉన్నారు.[2] ఇరవై గదులతో కూడిన రెండు అంతస్తుల కపాడియాల ఇంటికి సొంతంగా ఒక మంచినీటి చెరువు కూడా ఉండేది.[3]

ఆడపిల్లలు చదువుకోవడం, మగ పిల్లలతో కలసి ఆడుకోవడం పోర్‌బందరు బనియాలలో చాలా దోషం. అంతే కాదు ఏడేళ్ళు దాటగానే పెళ్ళి చేయడం సంప్రదాయం. అందువల్ల ఆమె నిరక్షరాస్యురాలిలానే పెరిగింది. ఆమె తాత మాకన్‌జీ కపాడియా ఎగుమతి, దిగుమతుల వ్యాపారం చేసేవాడు. సూయజ్ కాలువ త్రవ్వకంతో ఐరోపా నుండి భారతదేశం రావడానికి నౌకల ప్రయాణ కాలం తగ్గడంతో ఐరోపా దేశాలతో వ్యాపారం పెరిగింది. గోకుల్‌దాస్ కపాడియా పోర్‌బందరుకు మేయర్ అయ్యాడు. అతని ఇంటి ప్రక్కనే దివాను కరంచంద్ గాంధీ ఇల్లు కూడా ఉండేది. పోర్‌బందర్ ను పాలించే "రానా విక్మత్‌జీ" సంస్థానానికి కరంచంద్ గాంధీ దివాన్ గా ఉండేవాడు. కరంచంద్ గాంధీ ఇల్లు 12 గదులతో మూడు అంతస్తుల భవనం. ఆ ఇంటికి సొంత మంచినీటి చెరువుతో పాటు ఆటస్థలం కూడా ఉండేది. ఆ ఆటస్థలంలో కస్తూర్బా, మోహన్‌దాస్ కరం చంద్ గాంధీలు బాల్యంలో ఆడుకొనేవారు. ఆ ఆట స్థలంలో వివాహానికి ముందే చిన్నప్పుడు కస్తూర్‌తో కలిసి ఆడుకున్న జ్ఞాపకాల గురించి గాంధీ తన శిష్యురాలు డా. సుశీలా నయ్యర్‌కి చెప్పారు.[4]

వివాహం

[మార్చు]

1876లో పదేళ్ళ వయసులో మోహన్‌దాస్ గాంధీ - కస్తూర్‌ కపాడియాల నిశ్చితార్థం జరిగింది. పిల్లలకు పదమూడో ఏట వివాహం జరిపాలని కపాడియా - గాంధీ కుటుంబాలు నిర్ణయించాయి.[3] 1882 లో వారి వివాహం సాంప్రదాయ హిందూ వివాహ పద్ధతిలో జరిగింది.[5][6] వారు భార్యా భర్తలుగా 62 సంవత్సరాల పాటు కలసి జీవించారు.[7]

కస్తూర్-మోహన్‌దాస్ నిశ్చితార్థం నాటికి కఠియావాడ్ రాజ్యాలను పర్యవేక్షించే బ్రిటిష్ పొలిటికల్ ఏజెంటు ఫెడరిక్ లెలో పోర్‌బందర్ దివాన్ పదవి నుంచి కరంచంద్ గాంధీని తొలగించారు. కరంచంద్ గాంధీ తన తమ్ముడు తులసీ దాస్‌ని పోర్‌బందర్ సంస్థానం దివాన్ పదవిలో ప్రవేశపెట్టి తాను రాజ్‌కోట్ సంస్థానానికి మకాం మార్చాడు. అక్కడ రెండేళ్ల పాటు సలహాదారుడిగా ఉంటూ తర్వాత దివాన్ పదవిలో కుదురుకున్నాడు. అందువల్ల గాంధీ కుటుంబం పోర్‌బందరు నుండి రాజ్‌కోట్ కు మారాల్సి వచ్చింది.

1902లో భర్త గాంధీతో పాటు కస్తూర్బా గాంధీ

వివాహానంతరం కస్తూర్బా గాంధీ అనే కొత్త పేరుతో రాజ్‌కోట్ లోని గాంధీల కొత్త ఇంట్లోకి ఆమె ప్రవేశించింది. పెళ్ళి తరువాత అమ్మాయిల పేరుకి భర్త ఇంటిపేరుతో పాటు "బా" అనే మాట చేర్చడం ఆనవాయితీ. "బా" అంటే గుజరాతీ భాషలో అమ్మ అని అర్థం.

ఆమె అత్తగారు పుత్లీబాయి "ప్రణామీ" సంప్రదాయానికి చెందిన భక్తురాలు. హిందూ-ముస్లిం ఉమ్మడి ప్రార్థనా మందిరానికి సంబంధించిన మత సంప్రదాయం పేరు "ప్రణామీ" సంప్రదాయం. సమాజికంగా పూర్వీకుల ఆచారాలూ కట్టుబాట్లూ కచ్చితంగా పాటించాలి అనీ, అంటరాని వారిని ఇళ్ళలోకి రానివ్వరాదు అనీ తమ ఇంటి పెద్దలు కస్తూర్బాకి తెలిపినట్టు గాంధీ తన శిష్యురాలు డా. సుశీలా నయ్యర్ కి చెప్పారు.[8]

కరం చంద్ గాంధీ ఆరోగ్య పరిస్థితి బాగులేనందున రాజ్‌కోట్‌ దివాన్ పదవి కోల్పోవలసి వచ్చింది. వారి కుటుంబానిని దివాన్‌గిరీ తప్ప వేరే వ్యాపారాలు ఏవీ లేకపోవడం వల్ల కరం చంద్ గాంధీని కుంగుబాటుకు గురిచేసాయి. వారి వారసత్వం ప్రకారం దివాన్‌గిరీ చేయడానికి ముగ్గురు కొడుకులున్నారు. కానీ ఆకాలంలో ప్రభుత్వ జీవోలు, గజెట్లు అర్థం చేసుకోవడానికి దివాన్ కు తప్పని సరిగా ఇంగ్లీషు రావాలనే నిబంధన విధించారు. గాంధీజీ సోదరులకు చదువు అబ్బక పోవడంతో ఇంగ్లీషు చదువు ద్వారా మోహన్‌దాస్ పోర్‌బందర్ దివాన్‌గిరీ పొందడమే ఏకైక లక్ష్యంగా ఆ కుటుంబానికి మారింది. కానీ భర్త ఏం చదువుతున్నదీ కస్తూర్‌కి తెలిసే పరిస్థితి లేదు. చదువు గురించి గానీ, లౌకిక వ్యవహారాల గురించి గానీ స్త్రీలకు పనిలేదని బనియా పురుషులే కాదు, స్త్రీలు కూడా భావించేవారు. పెళ్ళి అయిన కొత్తలో కస్తూర్‌కి తాను అక్షరాలు నేర్పించడానికి ఏకాంతంలో ప్రయత్నించినా ఆమె ఆసక్తి చూపలేదని 50 యేళ్ళ తరువాత గాంధీ తన ఆత్మకథలో పేర్కొన్నాడు.[9]

పెళ్లయిన కొత్తలో గాంధీజీ కూడా ఆమెపై దర్పం చూపించేవాడు. ఆమె తన చెప్పుచేతల్లో ఉండాలని కోరుకొనేవాడు.[7] తనకు చెప్పకుండా తన అనుమతి లేకుండా ఎక్కడికీ వెళ్లకూడదని మోహన్‌దాస్ పదే పదే భార్యకు ఆంక్షలు విధించేవాడు. "అత్తగారూ, తోడికోడళ్ళూ నన్ను తోడుకోసం పిలిచినప్పుడు నేను నా భర్త అనుమతి తీసుకోవాలి అని వాళ్ళతో చెప్పాలా? నేను అలా అన్నటికీ చెప్పను. వాళ్ళేమన్నా వాళ్ళ భర్తల దగ్గర అనుమతి తీసుకుంటున్నారా?" అని కస్తూర్ అనడం మోహన్‌దాస్ కోపం రావడానికి కారణమైంది. "కస్తూర్బా తీసుకున్న స్వాతంత్ర్యం నిజానికి దోష రహితం. మనస్సులో ఏ విధమైన దోషం లేని బాలిక దైవదర్శనానికో, మరెవరినైనా కలుసుకోవడానికో వెళ్లడాన్ని అంగీకరించక అధికారం చలాయిస్తే సహిస్తుందా! నేను ఆమె మీద దర్పం చూపిస్తే ఆమె కూడా నామీద దర్ప చూపించవచ్చుకదా! అయితే ఈ విషయం కాలం గడిచాక బోధపడింది. కాని అప్పుడో భర్తగా అధికారం చలాయించడమే నాపని" అని గాంధీజీ తన ఆత్మకథలో రాసాడు.[9]

1985 నవంబరు 16న కరంచంద్ గాంధీ మరణించాడు. ఇది జరిగిన నాలుగు రోజులకు మరో విషాదం గాంధీ కుటుంబాన్ని కమ్మేసింది. నవంబరు 20న కస్తూర్బాకి పుట్టిన మగ బిడ్డ నాలుగు రోజులు కూడా జీవించకుండా కన్ను మూసాడు.[10] తన క్రమశిక్షణా రాహిత్యం వల్లే ముందస్తు ప్రసవం జరిగి బిడ్డ చనిపోయినట్లు అనంతర కాలంలో మోహన్‌దాస్ గాంధీ ఆత్మకథలో పశ్చాత్తాపం వ్యక్తం చేసాడు. కానీ కస్తూర్బా గాంధీ ఎప్పుడూ కూడా ఆ ప్రస్తావన ఎవరి దగ్గరా తెచ్చేది కాదు అనీ నలుగురు కొడుకులు (హరిలాల్, మణిలాల్, రామదాస్, దేవదాస్) పుట్టిన తర్వాత కూడా ఆమెకు ఆ దుఃఖం తగ్గలేదు అని ఆమె మనవడు అరుణ్ గాంధీ రాసాడు.[11][12]

భర్త విదేశీ చదువుకోసం బంగారం త్యాగం

[మార్చు]

ఆమె మామగారు కరంచంద్ గాంధీ మరణం తర్వాత ఆమె కుటుంబంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. కరంచంద్ గాంధీ పెద్ద కుమారుడు లక్ష్మీదాస్ గాంధీ తన చిన్న తమ్ముడి చదువు మీద పూర్తి దృష్టి కేంద్రీకరించాడు. తమకు వంశపారంపర్యంగా వస్తున్న దివాన్ హోదాని తిరిగి పొందాలంటే చిన్న తమ్ముడు మోహన్‌దాస్ గాంధీ ఇంగ్లీష్ లో పట్టభద్రుడు కాక తప్పదు. అంతకు ముందు గాంధీజీ మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణుడయ్యాడు. గాంధీజీని ఐదేళ్ళ డిగ్రీ కోర్సులో చేర్పించారు. కానీ భారతదేశంలో ఈ విధంగా మరో ఐదేళ్ళపాటు చదివినప్పటికీ ఇంగ్లీష్ న్యాయశాస్త్రం తెలియకపోతే దివాన్‌గిరీ దక్కదు అని తెలిసింది. ఇంగ్లండ్‌లో మెట్రిక్యులేషన్ స్థాయిలో మూడేళ్ల న్యాయశాస్త్రం చదవాలని నిర్ణయించుకున్నారు. కానీ గాంధీ సముద్రం దాటి పరాయి దేశం వెళ్లటం వల్ల "మోద్ బనియా సమాజం" ధర్మబ్రష్టత్వాన్ని పొందుతుందనీ, అందువల్ల ఇంగ్లండ్ వెళ్ళే నిర్ణయం విరమించుకోవాలనీ మోద్‌బనియా పెద్దల పంచాయితీ తీర్మానించింది. కానీ గాంధీ ఇంగ్లండ్ ప్రయాణాన్ని మానుకోక పోవడంతో ఆ కుటుంబాన్ని వెలివేసారు.[13] 1888 నుండి 1891 వరకు పోర్‌బందరు బనియా సమాజం నుండి వెలివేసిన కారణంగా వారి కుటుంబం ఆర్థిక సంక్షోభంలోపడింది. వెలి వెసిన కారణంగా ఎవరూ గాంధీ కుటుంబానికి సహాయానికి రాలేదు. ఆ పరిస్థితులలో కస్తూర్బా తాను పుట్టింటి నగలను అమ్మి అతని చదువు కొనసాగడానికి దోహదపడింది.[14] "నా భార్య నగలపై నా దృష్టి పడింది. నా భార్య నగలు అమ్మితే రెండు మూడు వేల రూపాయలు వస్తాయనీ వాటిని అమ్మి ఇంగ్లండ్ వెళతానని" గాంధీజీ తన ఆత్మకథలో రాసాడు. భర్త విదేశీ విద్య కోసం తన పుట్టింటి వారు పెట్టిన నగలను కస్తూర్బా త్యాగం చేసింది. మిగిలిన డబ్బులు గాంధీ అన్న లక్ష్మీదాస్ సమకూర్చాడు. 1891 జూలై 5న గాంధీజీ విద్యాభ్యాసం ముగించుకుని భారతదేశానికి వచ్చాడు. దానితో గాంధీ కుటుంబం మళ్ళీ బనియా సమాజంలో కలిసింది. బారిష్టరు చదువు పూర్తి చేసినప్పటికీ గాంధీజీకి దివాన్ పదవి రాలేదు. కస్తూర్బా నగలు పోగా మూడేళ్ల లండన్ చదువు కోసం పెట్టిన 13వేల రూపాయల అప్పు మిగిలింది గాంధీకి. ఇక న్యాయవాద వృత్తిపై దృష్టి పెట్టాడు. 1992లో ముంబాయి కోర్టుకు వెళ్ళి ఆరు నెలల పాటు చెట్టు కింద ప్లీడరుగా గడిపాడు. 1992 అక్టోబరు 28న కస్తూర్బా దంపతులకు మణిలాల్ జన్మించాడు.[15] ఈ ఆర్థిక సంక్షోభానికి ఒక పరిష్కారంగా దక్షిణాఫ్రికాలో దాదా అబ్దుల్లా అనే గుజరాతీ వ్యాపారికి చెందిన ఒక కంపెనీకి న్యాయవాదిగా పనిచేసే అవకాశం రావడంతో 1993లో మళ్ళీ భారతదేశం వదిలి పెట్టాల్సి వచ్చింది. గాంధీజీ తన భార్య కస్తూర్బాను ఇద్దరు కొడుకులు హరిలాల్, మణిలాల్ లను రాజ్‌కోటలోని ఉమ్మడి కుటుంబంలో వదిలిపెట్టి ఒంటరిగా దక్షిణాఫ్రికా వెళ్ళాడు. అక్కడ న్యాయవాద వృత్తి బాగా సాగడంతో వరుసగా మూడేళ్లపాటు ఉండిపోయాడు.

దక్షిణాఫ్రికా ప్రయాణం

[మార్చు]

ఇక దక్షిణాఫ్రికాలో ఎంతకాలమైనా జీవనం కోసం ఏ కష్టాలు పడనక్కరలేదు అని భరోసా కలగడంతో భార్యా పిల్లలను కూడా తీసుకుని రావడానికి గాంధీజీ 1896 జూలైలో భారతదేశం వచ్చాడు. ఐదు నెలల తర్వాత భార్యా బిడ్డలతో, పదేళ్ళ మేనల్లుడు గోకుల్‌దాస్ తో కలసి దక్షిణాఫ్రికాకు తిరుగు ప్రయాణమయ్యాడు. 1915 జనవరిలో భారతదేశానికి వచ్చే వరకూ దక్షిణాఫ్రికలోని దర్బన్, జోహన్నస్‌బర్గ్ లలో నివసించింది కస్తూర్బా గాంధీ. 1997లో రామదాస్, 1900లో దేవదాస్ ఇద్దరు కుమారులు జన్మించారు. దక్షిణాఫ్రికాలో జోహన్నస్‌బర్గ్ వద్ద 1100 ఎకరాల "టాల్‌స్టాయ్ ఫార్మ్",[16] దర్బన్ వద్ద వంద ఎకరాలకు పైగా "ఫీనిక్స్ ఫార్మ్"[17] లతో గాంధీ ఆర్థికంగా బాగా స్థిరపడిన తర్వాత ఆమె తరచుగా భారతదేశంలో ఉంటున్న బావగారు లక్ష్మీదాస్ చేసిన అప్పు తీర్చివెయ్యవలసినదిగా భర్తను ఒత్తిడి చేస్తూ ఉండేది. చివరకు తన చదువుకు తన సోదరుడు చేసిన అప్పును గాంధీజీ తీర్చాడు.

పిల్లల విద్యాభ్యాసం

[మార్చు]

ఆనాడు దక్షిణాఫ్రికాలో వర్ణవివక్షలో భాగంగా నల్లజాతి వారికి "బంటూ విద్యా విధానం",[18] శ్వేత జాతి వారికి "హోం స్కూలింగ్ విధానం" ఉండేది. నలుపూ, తెలుపూ కాని బ్రౌన్ భారతీయులు బంటూ స్కూలుకు వెళ్ళరు. వీళ్ళ ఇళ్ళకు శ్వేత జాతి ఉపాధ్యాయులు రారు. వాళ్ళ పిల్లలకు వాళ్ళే చదువు చెప్పుకోవాలి. లేదా క్రైస్తవ మత విద్యను బోధించే మిషనరీ పాఠశాలలకి వెళ్ళాలి. ఎక్కువ మంది భారతీయులు మతమార్పిడికి సిద్ధపడి తమ పిల్లలను ఈ మిషనరీ స్కూల్స్ కి పంపే వాళ్ళు. ఈ నేపథ్యంలో కస్తూర్బా- గాంధీ పిల్లలు అందరూ పాఠశాల విద్యకు దూరం అయ్యారు. కొంత కాలం హోం స్కూలింగ్ పద్ధతిలో చదువు చెప్పించారు. నెలకు ఏడు పౌండ్ల జీతంతో ఒక ఆంగ్ల వనిత పాఠాలు చెప్పడానికి అంగీకరించినా ఎక్కువ కాలం కొనసాగలేదు. ఈ విధంగా పాఠశాల విద్యకూ, గృహ విద్యకూ దూరమయ్యారు. కస్తూర్బా కూడా బడికి వెళ్లని నిరక్షరాస్యురాలే. అదే విధంగా తన పిల్లలు కూడా నిరక్షరాస్యులు గానే మిగిలారు. ఈ విషయంలో ఆమె ఆందోళనగా ఉండేది. వారికి సరైన విద్యా బోధన అందించనందుకు గాంధీజీతో గొడవ పడేది. డాక్టర్ ప్రాణ్ జీవన్ దాస్ మెహతా స్వయంగా ఉపకారవేతనం ఇచ్చి ఇంగ్లండ్ లో చదివించడానికి హరిలాల్‌ను పంపించండి అని అడుగుతున్నా గానీ గాంధీజీ ఎందుకు అంగీకరించడంలేదు అని కస్తూర్బా ప్రశ్నించేది. బారిష్టరు చదువుకోవడానికి గాంధీజీ అంగీకరించనందున తన పెద్ద కుమారుడు హరిలాల్ గాంధీ తీవ్ర నిరాశా నిస్పృహలకు లోనయ్యాడు.[19] తన చదువు కోసం తల్లి చేసిన సత్యాగ్రహం ఫలించక పోవడంతో తండ్రికి లేఖ రాసి 1911 మే 8 న ఎవరికీ చెప్పకుండా ఇంటి నుండి వెళ్ళిపోయాడు.[20] ఆనాటి నుండి తిరిగి ఇంటికి రాని కుమారుని గూర్చి మనోవేదన ఆమెను వెంటాడుతూనే ఉండేది. మిగిలిన కుమారులు మణిలాల్, రామదాస్, దేవదాస్ లు కూదా పాఠశాలకు గానీ, కళాశాలకు గానీ వెళ్ళక పోయినప్పటికీ డిగ్రీలు లేనప్పటికీ స్వయంకృషి వల్ల జర్నలిస్టులుగా రాణించారు. మణిలాల్, రామదాస్ లు దక్షిణాఫ్రికాలో తండ్రి స్థాపించిన "ఇండియన్ ఒపీనియన్" ఆంగ్ల పత్రిక సంపాదక వర్గంలో ఉండేవాళ్ళు. దేవదాస్ గాంధీ భారతదేశంలో హిందూస్తాన్ టైమ్స్ ఆంగ్ల దినపత్రిక సంపాదకునిగా పనిచేసాడు.[21]

ప్రిటోరియాలో ఒక ఇంగ్లీష్ బార్బర్ "బ్రౌన్ కలర్" అనే కారణంగా తనను సెలూన్ లోకి రానివ్వకపోవడంతో సొంతంగా క్షౌరం చేయడం నేర్చుకున్నాడు గాంధీ. తన కుమారులకు కూడా కత్తెర-దువ్వెన ఉపయోగించి తానే స్వయంగా క్షౌరం చేసేది కస్తూర్బా. ఈ విధంగా దక్షిణాఫ్రికాలో నల్ల జాతికీ, శ్వేత జాతికీ మధ్య ఎటూ గాని బ్రౌన్ భారతీయులుగా నిత్యం ఒడిదుడుకులను ఎదుర్కొంటూ వచ్చింది కస్తూర్బా - గాంధీ కుటుంబం.

భారతీయుల హక్కుల కోసం సత్యాగ్రహం

[మార్చు]

1908లో మొదటి సారి "సత్యాగ్రహం" ఉద్యమంలో గాంధీ అరెస్టు అయ్యాడు. 1913లో దక్షిణాఫ్రికా ప్రభుత్వాం ప్రవాస భారతీయులపై "క్రిస్టియన్ మేరేజ్ యాక్ట్" తెచ్చింది. దీని ప్రకారం భారతదేశంలో భార్యా భర్తలైన వారి వివాహాన్ని ప్రభుత్వం గుర్తించదు. వాళ్ళు క్రిస్టియన్ పద్ధతిలో వివాహితులు కాకపోతే వారి సహజీవనాన్ని అక్రమ సంబంధంగా పరిగణించి జరిమానా లేదా జైలు శిక్ష విధిస్తారు. దీనికి వ్యతిరేకంగా పార్శీ, ముస్లిం, హిందూ భారతీయులందరూ ఏకం కాక తప్పలేదు. భర్తలతో బాటు భార్యలు కూడా బయటికి రావాలని నిర్ణయించారు. స్త్రీలు కూడా కలవడంతో మూడు పౌండ్‌ల పన్ను ఆసియాటిక్ రిజిస్ట్రేషన్ బిల్లు ఉద్యమాలకు మించి ఈ వివాహ చట్టానికి వ్యతిరేకంగా అపూర్వమైన ప్రతిస్పందన వచ్చింది.[22] అప్పుడు కస్తూర్బా గాంధీ నాయకత్వంలో పదహారు మంది స్త్రీలు 1913 సెప్టెంబరు 23 న ఫీనిక్స్‌ స్టేషన్‌లో రైలు ఎక్కి గుర్తిపు కార్డులు లేకుండా ట్రాన్స్‌వాల్ సరిహద్దు దాటడానికి ప్రయత్నించి అరెస్టు అయ్యారు. ఆ స్త్రీలు ఎవ్వరూ తమ పేర్లు కూడా చెప్పకుండా సత్యాగ్రహం పాటించారు. ఈ స్త్రీలందరినీ అరెస్టు చేసి పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. అందరికీ మూడు నెలల కఠిన కారాగార శిక్ష విధించి నేటల్‌లోని పీటర్స్ మారిట్జ్‌బర్గ్ జైలుకి పంపింది కోర్టు. అప్పటి వరకూ కూడా అరెస్టు అయిన స్త్రీలలో గాంధీ భార్య కూడా ఉందని ఎవరికీ తెలియదు. కస్తూర్బా గాంధీ పీటర్స్ మారిట్జ్‌బర్గ్ జైలులో సత్యాగ్రాహిగా ఉన్న విషయం బయటికి పొక్కడంతో ఉద్యమం మరింతగా ఊపు అందుకుంది. ఆ విధంగా మొదటి మహిళా సత్యాగ్రహంలో ఒకరిగా కస్తూర్బా చరిత్రకు ఎక్కింది.[23]

భారత జాతీయోద్యమంలో

[మార్చు]
1940 లో బెంగాలీ రచయిత రవీంద్రనాథ్ ఠాగూర్‌ను శాంతినికేతన్ లో కలసిన మహాత్మా గాంధీ, కస్తూర్బా గాంధీ

కస్తూర్బా- గాంధీ కుటుంబం మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో దక్షిణాఫ్రికా నుంచి భారత దేశానికి తిరిగి వచ్చేసింది. 1915 జనవరి మొదటి వారంలో కుటుంబంతో పాటు గాంధీజీ భారతదేశంలోకి అడుగు పెట్టాడు.[24] ఆ తర్వాత బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా సాగిన భారతదేశ స్వాతంత్ర్య సంగ్రామంలో గాంధీ నాయకత్వంలో మూడు పెద్ద ఉద్యమాలు జరిగాయి. 1920-22 సంవత్సరాలలో సహాయ నిరాకరణ ఉద్యమం, 1930-32 సంవత్సరాలలో ఉప్పు సత్యాగ్రహం, 1940-42 సంవత్సరాలలో క్విట్‌ఇండియా ఉద్యమం కాంగ్రెస్ పార్టీ - గాంధీ నాయకత్వంలో జరిగాయి. భారతదేశంలో సత్యాగ్రహ ఉద్యమంలో భాగంగా బహిరంగ నిరాహార దీక్ష ప్రయోగాన్ని మొదటిసారి 1917 మార్చిలో గుజరాత్ లోని అహ్మదాబాద్‌లో గాంధీ ప్రారంభించాడు. ఆనాటి నుండి 1918 వరకు 30 యేళ్ళలో 17 సార్లు గాంధీ నిరాహార దీక్ష చేసాడు. గాంధీ అనేక సార్లు అరెస్టు కాగా, కస్తూర్బా ఆరు సార్లు అరెస్టు అయింది. 1931-33 మధ్య కాలంలో మూడు సార్లు అరెస్టు అయింది. చివరిసారి ఏకంగా 18 నెలల పాటు పూనాలోని ఆగాఖాన్ ప్యాలస్ లో నిర్భంధంలో ఉంది.[25]

1942 ఆగస్టు 8 తేదీన ముంబాయిలో జరిగిన ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సమావేశం దేశవ్యాప్తంగా క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభిస్తూ తీర్మానం చేసింది. ఆ ఉద్యమాన్ని ఆపడంలో భాగంగా గాంధీని, అతని కార్యదర్శి మహదేవ్ దేశాయ్, సహాయ కార్యదర్శి ప్యారేలాల్ నీ ముంబాయిలోని బిర్లా హౌస్ లో అరెస్టు చేసి పూనాలోని "ఆగాఖాన్ ప్యాలస్" భవనంలో నిర్బంధంలో ఉంచారు. ఆ రోజే కస్తూర్బా గాంధీని కూడా అరెస్టు చేసి "ఆగాఖాన్ ప్యాలస్" భవనంలోకి తీసుకు వచ్చారు.[26]

క్విట్ ఇండియా ఉద్యమంలో అరెస్టు

[మార్చు]
1930లలో మహాత్మా గాంధీతో కస్తూర్బా గాంధీ

ముంబాయిలోని బిర్లా హౌస్ నుండి గాంధీజీ అరెస్టు చేసిన వార్తతో ప్రజలు బిర్లా హౌస్ కి రావడం మొదలు పెట్టారు. ఆరోజు సాయంకాలం శివాజీ పార్క్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో గాంధీజీ ప్రసంగించాల్సి ఉంది. గాంధీ అరెస్టు కావడంతో ఆయన బదులు ఆ బహిరంగ సభలో తాను ప్రసంగించబోతున్నట్టు కస్తూర్బా ప్రకటించింది. ఈ విషయం ప్రజలలో ఎంత సంచలనం రేకెత్తించడంతో ప్రభుత్వం కూడా అంతే జాగ్రత్త పడింది. పోలీసులు 73 ఏళ్ళ కస్తూర్బాను అరెస్టు చేయడానికి సిద్ధం అవుతున్నారనే వార్త తెలియడంతో ఆమెకు తోడుగాఉండేందుకు సిద్ధమై ఆమెకు అవసరమైన మందులు కూడా సిద్ధం చేసింది డాక్టర్ సుశీలా నయ్యర్. అప్పుడు కస్తూర్బా బ్రాంకో న్యూమోనియా వ్యాధితో బాధపడుతోంది. ప్రజలకు తాను చెప్పదలచుకున్న రెండు సందేశాలను కస్తూర్బా ముందుగా డాక్టర్ సుశీలా నయ్యర్ కు డిక్టేట్ చేసింది. ఎందుకంటే తాను అరెస్టు అయిన పక్షంలో ఆ సందేశాలు ఏదో విధంగా బహిరంగ సభకు చేరాలని, ఆ రెండు సందేశాలలో ఒకటి ప్రత్యేకంగా స్త్రీలకు ఉద్దేశించింది. అందులో సారాంశం ఇదీ: భారతదేశంలోని స్త్రీలు తమ శక్తిని ప్రదర్శించాల్సిన సమయం వచ్చింది. జాతి మతం అనే తేడాలు లేకుండా స్వాతంత్ర్య సమరంలో పురుషులకు తీసిపోని విధంగా స్త్రీలు గడప దాటాలి అని కస్తూర్బా చెప్పింది. సాయంత్ర సభాస్థలి వద్దకు వచ్చిన కస్తూర్బాను, సుశీలా నయ్యర్ లను పోలీసులు అరెస్టు చేసారు. వారిని ఆర్డర్ రోడ్ జైలుకి మళ్ళించారు. రెండు రోజులు ఆ జైలులో ఉంచి పూణేకు తరలించారు. 1942 ఆగస్టు 10 న ఆగాఖాన్ ప్యాలస్ లో నిర్బంధించారు.

ఆగాఖాన్ ప్యాలస్ లో నిర్భంధంలో ఉన్న బాపూ వద్దకు కస్తూర్బాను కూడా చేర్చారు. అప్పటికే కస్తూర్బా బ్రాంకో న్యూమోనియా వ్యాధితో బాధపడుతోంది. డా. సుశీలా నయ్యర్ వైద్యం చేసింది. రెండు మూడు రోజులలో ఆమె కోలుకొని రోజువారీ పనులు చేసుకుంటూ ఉండేది. ఆమెకు తోడుగా సరోజినీ నాయుడు కూడా ఉండేది. ఆ ప్యాలస్ లో గాంధీతో పాటు కస్తూర్బా, సరోజినీ నాయుడు, మహదేవ్ దేశాయ్, డా. సుశీలా నయ్యర్ ఉండేవారు. 1942 ఆగస్టు 15న ఆ ప్యాలస్ లో గాంధీజీ కార్యదర్శి మహదేవ్‌దేశాయ్ గుండె పోటుతో మరణించాడు.[27] ఈ సంఘటన కస్తూర్బాను కూడా కలచి వేసింది. ఆ తర్వాత కస్తూర్బా ఆరోగ్యం కూడా క్షీణించడం మొదలు పెట్టింది.

తీరని కోరిక

[మార్చు]

ఆగాఖాన్ ప్యాలస్ లో ఉండగా "ఏమైనా తీరని కోరిక ఉండిపోయిందా?" అని గాంధీ అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ "బడికి వెళ్ళి చదువుకోవడం" తన తీరని కోరికని తెలియజేసింది. అదే తడవుగా ఆగాఖాన్ ప్యాలస్ బడిగా మారిపోయింది. భర్త గాంధీజీ ఉపాధ్యాయుడు అయ్యాడు. అప్పటి వరకూ కొంచెం కొంచెం కూడి కూడి చదవడం వచ్చు గానీ కస్తూర్బాకు వరుసగా అక్షరమాల రాదు. వరుసగా గుణింతాలు రావు. వాక్యంలో పదాల మధ్య విరామం ఉంచాలని తెలియదు. అందువల్ల 5వ తరగతి గుజరాతీ భాష బోధిని తెప్పించి గాంధీజీ ఒక టైం టేబుల్ ప్రకారం గుజరాతీ భాష, చరిత్ర, భూగోళశాస్త్రం, గణితం వంటి విషయాలను చెప్పడం మొదలు పెట్టాడు. అయితే జ్ఞాపక శక్తి సాధన చెయ్యడానికి చిన్న పిల్లలకు ఉన్నట్టుగా ఆరోగ్యంగానీ, ఉత్సాహం గానీ ఆమెలో లెవు. పైగా చీటికి మాటికీ ఉపాధ్యాయులు(గాంధీజీ) కోపగించుకోవడంతో త్వరలోనే ఆమెకు చదువు అంటే ఇష్టం పోయి కంగారు మొదలయింది. ప్రతీరోజూ చెప్పిన పాఠాల మీద మరుసటి రోజు గాంధీజీ ప్రశ్నలు అడగడం ఉండేది. అందుకని ఆ పాఠాన్ని డాక్టర్ సుశీలా నయ్యర్ దగ్గర పదే పదే చెప్పించుకొనేది. ఆమెకు చదవడం వచ్చినంత సులభంగా రాయడం రాదు. ఆమెకు గబగబా నేర్చుకొని నోట్‌బుక్స్ మీద పెన్‌తో రాయాలని ఉండేది. కానీ విడిగా ఉండే తెల్ల కాగితాల మీద మాత్రమే పెన్సిల్ తో అక్షరాలు దిద్దిస్తూ ఉండేవాడు గాంధీ. ఒకరోజు అందరికీ నోట్‌బుక్స్ తెప్పించినప్పుడు చిన్నపిల్లలా తాను కూడా ఒక నోట్‌బుక్ తీసుకుంది కస్తూర్బా. కానీ ఆమె చేతిలో నుండి ఆ నోట్‌బుక్ ను లాగేసుకొని - నీ రాతకి ఈ కాగితాలు చాలు అని మూడు తెల్ల కాయితాలు ఇచ్చాడు గాంధీ. కానీ గాంధీ మాటతో కస్తూర్బా అభిమానం తీవ్రంగా దెబ్బ తిన్నది. గాంధీ ఇచ్చిన తెల్ల కాగితాలు ఆమె తీసుకోలేదు. వెంటనే గాంధీజీకి తాను చేసిన పొరబాటు తెలిసి వచ్చింది. కానీ అప్పటికే మించిపోయింది. ఆ తర్వాత గంధీజీ, సరోజినీ నాయుడు, సుశీలా నయ్యర్ ఎంత మంది బతిమలాడి నోట్ బుక్ ఇచ్చినా ఆమె తీసుకోలేదు. ఆమెకు చదువుకోవాలనే ఉత్సహం చల్లారిపోయింది. మళ్ళీ ఆమె చదువుకోలేదు.[28]

చివరి రోజులు

[మార్చు]
ఆగఖాన్ ప్యాలస్ ప్యాలస్ లో ఎడమ వైపున మహదేవ్ దేశాయ్ సమాధి, కుడి వైపున కస్తూర్బా సమాధి.

1943 మార్చి 16న ఆమెకు మొదటి సారి గుండెపోటు వచ్చింది. పదిరోజుల తర్వాత మార్చి 25న మళ్ళీ గుండెపోటు వచ్చింది. డిసెంబరు నెలలో ఆమె ఆరోగ్యం మరింత దిగజారింది. ప్రతీ రోజూ ఆమె "హరిలాల్ హరిలాల్" అని కలవరిస్తూ ఉండేది. హరిలాల్ ఆమె మొదటి కుమారుడు. 1911లో ఇల్లు విడిచి వెళ్ళిపోయిన కొడుకును చూడాలని ఆమె పరితపించేది. హరిలాల్ కోసం అన్వేషించడం ప్రారంభించారు. 1944 ఫిబ్రవరి 20 తేదీన హరిలాల్ ఆచూకీ తెలిసింది. ఫిబ్రవరి 21వ తేదీన మరణ శయ్యపై ఉన్న తల్లిని చూడడానికి ఆగాఖాన్ ప్యాలస్ కి హరిలాల్ వచ్చాడు. కొడుకు ముఖాన్ని దగ్గరకు తీసుకున్న కస్తూర్బాకు మద్యం వాసన గుప్పుమంది. తాగుబోతుగా మారిన కొడుకును చూసి ఆ తల్లి గుండె పగిలింది.

అగాఖాన్ ప్యాలస్ లో అనారోగ్యంతో బాధపడుతున్న కస్తూర్బాకు 1944 ఫిబ్రవరి 22న పెనిసిలిన్ ఇంజెక్షన్ ఇవ్వాలని డాక్టర్లు నిర్ణయించారు. "పెనిసిలిన్ ఇవ్వడం వల్ల ఆమె ఆరోగ్యం మెరుగుపడుతుందని మీరు ఖచ్చితంగా చెప్పగలరా?" అని గాంధీజీ డాక్టర్లను ప్రశ్నించాడు. తర్వాత ఆమెకు పెనిసిలిన్ వద్దు అని నిరాకరించాడు. కొడుకులు రామదాస్, దేవదాస్ లు వచ్చారు. అప్పుడే ఆమె తమ్ముడు మాధవదాసు కూడా ఆమెను చూడడానికి వచ్చాడు. తమ్ముడ్ని పలకరించడానికి ఆమె రెండు మూడు సార్లు నోరు తెరిచింది. తర్వాత నిశ్చలంగా అయిపోయింది. 1944 ఫిబ్రవరి 22న సాయంత్రం 7:35కు ఆమె కన్నుమూసింది.[29] గాంధీజీ కస్తూర్బా అరవై రెండేళ్ళ సహజీవనం ముగిసింది.[30]

మూలాలు

[మార్చు]
 1. Gandhi, Arun and Sunanda (1998). The Forgotten Woman. Huntsville, AR: Zark Mountain Publishers. pp. 314. ISBN 1-886940-02-9.
 2. Arun Gandhi. "Kastur – Wife of Mahatma Gandhi" (PDF). Archived from the original (PDF) on 2020-02-23.
 3. 3.0 3.1 150 సంవత్సరాల కస్తూర్బా గాంధీ. హైదరాబాదు: సౌదా అరుణ. 2018. p. 83. ISBN 978-81-930163-4-3.
 4. పేజీ 40, కస్తూర్బా - వైఫ్ ఆఫ్ గాంధీ
 5. "Mahatma Gandhi Ashram at Sabarmati, Ahmedabad, Gujarat". www.gandhiashramsabarmati.org (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2020-02-23.
 6. "Life Sketch of Kasturba". Archived from the original on 2020-01-27.
 7. 7.0 7.1 Tarlo, Emma (1997). "Married to the Mahatma: The Predicament of Kasturba Gandhi". Women: A Cultural Review. 8 (3): 264–277. doi:10.1080/09574049708578316.
 8. Sushila Nayyar. Kasturba: Wife of Gandhi. Literary Licensing, LLC, 2013. p. 72. ISBN 9781258882747.
 9. 9.0 9.1 వేమూరి రాధాకృష్ణమూర్తి (1993). మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ ఆత్మకథ లేక సత్యశోధన. అహ్మదాబాద్: నవజీవన్ పబ్లిషింగ్ హౌస్. p. 428. ISBN 81-7229-054-3.
 10. Tarlo, Emma (1997). "Married to the mahatma: The predicament of Kasturba Gandhi". Women: A Cultural Review. 8 (3): 264–277. doi:10.1080/09574049708578316. ISSN 0957-4042.
 11. October 9, Judith M. Brown; October 9, 2000 ISSUE DATE:; December 5, 2000UPDATED:; Ist, 2012 15:22. "Book review: 'Kasturba: A Life' by Arun Gandhi". India Today (in ఇంగ్లీష్). Retrieved 2020-02-22. {{cite web}}: |first4= has numeric name (help)CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)
 12. Gandhi, Arun (14 October 2000). Kasturba: A Life. Penguin UK. ISBN 9780140299717.
 13. Mahoney, Ellen (2016-08-01). Gandhi for Kids: His Life and Ideas, with 21 Activities (in ఇంగ్లీష్). Chicago Review Press. ISBN 978-1-61373-125-3.
 14. Apr 10, Ahmedabad Mirror | Updated:; 2019; Ist, 06:16. "Kasturba: The woman behind the Mahatma". Ahmedabad Mirror (in ఇంగ్లీష్). Retrieved 2020-02-23. {{cite web}}: |last2= has numeric name (help)CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)
 15. "Manilal Gandhi | South African History Online". www.sahistory.org.za. Retrieved 2020-02-23.
 16. "Gandhi's Tolstoy Farm". tolstoyfarm.com. Retrieved 2020-02-23.
 17. "ADDRESS BY PRESIDENT THABO MBEKI OF SOUTH AFRICA AT THE OPENING CEREMONY OF THE PHOENIX SETTLEMENT, February 27, 2000". mkgandhi-sarvodaya.org. Retrieved 2020-02-23.
 18. "bantu education act" (PDF).{{cite web}}: CS1 maint: url-status (link)
 19. Manzoor, Sarfraz (2007-08-10). "Mahatma Gandhi is seen as a saintly, almost godlike figure by many Indians. But as a new film and biography reveal, he was far from perfect when it came to parenting". The Guardian (in బ్రిటిష్ ఇంగ్లీష్). ISSN 0261-3077. Retrieved 2020-02-23.
 20. "The Prodigal Who Didn't Return". outlookindia.com/. Archived from the original on 2020-02-23. Retrieved 2020-02-23.
 21. Kuhn, Betsy (2010-07-01). The Force Born of Truth: Mohandas Gandhi and the Salt March, India, 1930 (in ఇంగ్లీష్). Twenty-First Century Books. ISBN 978-0-7613-6354-5.
 22. My Life : Kasturba Gandhi (in ఇంగ్లీష్). జనరల్ ప్రెస్. 2019-10-11. ISBN 978-93-89440-72-0.
 23. "Kasturba Gandhi and the Satyagraha in South Africa - its roots and examples - Articles : On and By Gandhi". www.mkgandhi.org. Retrieved 2020-02-23.
 24. "Return to India - Mahatma Gandhi Pictorial Biography". www.mkgandhi.org. Retrieved 2020-02-23.
 25. "Kasturba Gandhi - Indian political activist". Encyclopedia Britannica (in ఇంగ్లీష్). Retrieved 2020-02-23.
 26. Dutta, Prabhash K (October 2, 2018). "Why Mahatma Gandhi said Kasturba stood above him". India Today (in ఇంగ్లీష్). Retrieved 2020-02-23.
 27. "Life Sketch of Kasturba". www.gandhi-manibhavan.org. Archived from the original on 2020-01-27. Retrieved 2020-02-23.
 28. "Kasturba Gandhi, the larger than life shadow of Mahatma Gandhi - Articles On and By Gandhi". www.mkgandhi.org. Retrieved 2020-02-23.
 29. "Chronology 1944". GandhiServe Foundation (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2020-02-23. Retrieved 2020-02-23.
 30. "Kasturba Gandhi death... wife of Mahatma Gandhi". www.rarenewspapers.com. Retrieved 2020-02-23.

ఇతర పఠనాలు

[మార్చు]

బాహ్య లంకెలు

[మార్చు]