కార్ల్ మార్క్స్

వికీపీడియా నుండి
(మార్క్స్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
కార్ల్ మార్క్స్
1875లో కార్ల్ మార్క్స్
జననంకార్ల్ హెన్రిక్ మార్క్స్
(1818-05-05)1818 మే 5
ట్రయర్, ప్రష్యన్ రాజ్యం, జర్మన్ సమాఖ్య
మరణం1883 మార్చి 14(1883-03-14) (వయసు 64)
లండన్, ఇంగ్లాండ్, యునైటెడ్ కింగ్‌డమ్
నివాసంజర్మనీ, ఫ్రాన్స్, బెల్జియం, యునైటెడ్ కింగ్‌డమ్
జాతీయతజర్మన్
యుగం19వ శతాబ్ది తత్త్వశాస్త్రం
ప్రాంతంపాశ్చాత్య తత్త్వశాస్త్రం, జర్మన్ తత్త్వశాస్త్రం
మతంలేదు (నాస్తికుడు; కొన్నేళ్ళు లూథరానిజం)
తత్వ శాస్త్ర పాఠశాలలుమార్క్సిజం, కమ్యూనిజం, సామ్యవాదం, భౌతికవాదం
ప్రధాన అభిరుచులురాజకీయం, ఆర్థికశాస్త్రం, తత్త్వశాస్త్రం, సామాజిక శాస్త్రం, కార్మిక సంబంధాలు, చరిత్ర, వర్గ పోరాటాలు, ప్రకృతిశాస్త్రం
ప్రసిద్ధ ప్రసిద్ధ ఆలోచనలుCo-founder of Marxism (with Engels), surplus value, contributions to the labour theory of value, class struggle, alienation and exploitation of the worker, The Communist Manifesto, Das Kapital, materialist conception of history
ప్రభావితులు
ప్రభావితమైనవారు
సంతకం

కార్ల్ మార్క్స్ [4] (మే 5, 1818 - మార్చి 14, 1883) జర్మన్ శాస్త్రవేత్త, తత్త్వవేత్త, ఆర్థికవేత్త, సామాజికవేత్త, పాత్రికేయుడు, సోషలిస్టు విప్లవకారుడు. ప్రస్తుత జర్మనీలోని ట్రయర్ పట్టణంలో ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన మార్క్స్, రాజకీయ ఆర్థికశాస్త్రం, హెగెలియన్ తత్త్వశాస్త్రం చదువుకున్నారు. యుక్తవయస్సులో మార్క్స్ ఏ దేశపు పౌరసత్వం లేని స్థితిలో, లండన్లో జీవితం గడిపాడు. లండన్లోనే మరో జర్మన్ ఆలోచనాపరుడైన ఫ్రెడెరిక్ ఏంగెల్స్ తో కలిసి తన చింతన అభివృద్ధి చేసుకుంటూ, పలు పుస్తకాలు ప్రచురించాడు. 1848 నాటి కరపత్రమైన కమ్యూనిస్ట్ మేనిఫెస్టో వాటన్నిటిలోకీ సుప్రసిద్ధమైంది. తదుపరి కాలపు మేధో, ఆర్థిక, రాజకీయ చరిత్రను అతని రచన ప్రభావితం చేసింది.

సమాజం, ఆర్థిక శాస్త్రం, రాజకీయాలు వంటివాటిపై మార్క్స్ సిద్ధాంతాలను కలగలిపి మార్క్సిజంగా పిలుస్తున్నారు. మార్క్సిజం ప్రధానంగా మానవ సమాజాలు వర్గ పోరాటాల ద్వారా అభివృద్ధి చెందాయని, పెట్టుబడిదారి వ్యవస్థలో ఇది సహజంగా పాలక వర్గాలకీ (బూర్జువాలుగా పేరొందాయి, ఉత్పత్తి సాధనాలను అదుపుచేస్తూంటాయి), శ్రామిక వర్గాలకీ (ప్రొలెటరేట్ గా పేరొందిన ఈ వర్గాలు తమ శ్రమశక్తిని వేతనం కోసం అమ్ముకుంటూంటాయి) నడుమ ఘర్షణగా పరిణమిస్తుంది. పరాయీకరణ, విలువ, వస్తు పూజ, మిగులు విలువ వంటి తన సిద్ధాంతాల ద్వారా మార్క్స్ పెట్టుబడిదారి వ్యవస్థ వినియోగదారి మనసత్తత్వం అభివృద్ధి చేయడం, సామాజిక అంతరాలు, శ్రమశక్తిని దోపిడీ చేయడం ద్వారా సామాజిక సంబంధాలు, విలువలను ఏర్పరుస్తోందని వాదించాడు. చారిత్రిక భౌతికవాదం అనే విమర్శనాత్మక దృక్పథాన్ని ఉపయోగించి, మార్క్స్ పునాది, పైనిర్మాణ సిద్ధాంతం (బేస్ అండ్ సూపర్ స్ట్రక్చర్ థియరీ) ని ప్రతిపాదించాడు. సమాజంలోని సాంస్కృతిక, రాజకీయ స్థితిగతులను, అలానే వాటి మానవ స్వభావపు భావనలను ప్రధానంగా నిగూఢమైన ఆర్థిక పునాదులే నిర్ధారిస్తాయని ఈ సిద్ధాంతం చెప్తోంది. ఈ ఆర్థిక విమర్శలు 1867 నుంచి 1894 వరకూ మూడు భాగాలుగా ప్రచురితమైన ప్రభావశీలమైన దాస్ కేపిటల్లో పొందుపరిచారు.

మార్క్స్ ప్రకారం, రాజ్యాలు ప్రజలందరి సాధారణ ఆసక్తులకు అనుగుణంగా నడుస్తున్నట్టుగా చూపించుకున్నా, నిజానికి పాలకవర్గం ఆసక్తులకు అనుగుణంగా నడుస్తాయి.[5] గత సామాజిక ఆర్థిక వ్యవస్థల్లాగానే పెట్టుబడిదారీ వ్యవస్థలోని అంతర్గత సమస్యలు స్వయం వినాశనానికి దారితీసి, దాని స్థానంలో కొత్త వ్యవస్థ ఐన సామ్యవాదం ఏర్పడుతుందని ఊహించారు. మార్క్స్ అభిప్రాయంలో పెట్టుబడిదారీ వ్యవస్థలోని వర్గ వైరుధ్యాలు దాని అస్థిరతకు, సంక్షోభానికి గురయ్యే లక్షణానికి కొంత కారణమై క్రమంగా కార్మిక వర్గం వర్గ చైతన్యాన్ని సాధించడానికి దారితీస్తుంది, ఇది వారు రాజకీయ ఆధిపత్యాన్ని సాధించేందుకు, చివరకు ఉత్పత్తిదారుల స్వేచ్ఛా సంఘటితంగా ఏర్పడే ప్రభుత్వం ద్వారా వర్గ రహిత, కమ్యూనిస్టు సమాజం స్థాపనకు దారితీస్తుంది.[6][7] మార్క్స్ కార్మిక వర్గం పెట్టుబడిదారీ వ్యవస్థను కూలదోసి, సామాజిక ఆర్థిక విముక్తి తీసుకువచ్చేందుకు సంఘటిత విప్లవ చర్య చేపట్టాలని వాదిస్తూ క్రియాశీలకంగా దాని ఆచరణ కోసం పోరాడారు.[8]

కార్ల్ మార్క్స్ మానవ చరిత్రలోకెల్లా అత్యంత ప్రభావశీలమైన వ్యక్తుల్లో ఒకరిగా పేరొందారు, ఆయన కృషి, సిద్ధాంతం అటు ప్రశంసలు, ఇటు విమర్శలు కూడా విస్తృతంగా పొందింది.[9] ఆర్థిక శాస్త్రంలో ఆయన కృషి శ్రమ గురించి, దానికీ పెట్టుబడికీ ఉన్న సంబంధం గురించి ప్రస్తుత అవగాహనకీ, తత్ సంబంధితమైన ఆర్థిక ఆలోచనకీ చాలావరకూ పునాదిగా నిలుస్తోంది.[10][11][12] ప్రపంచవ్యాప్తంగా ఎందరో మేధావులు, కార్మిక సంఘాలు, కళాకారులు, రాజకీయ పార్టీలు మార్క్స్ ఆలోచనాధార, తాత్త్వికత, కృషిలకు ప్రభావితం అయ్యాయి, చాలామంది ఆయన ఆలోచనను స్వీకరించడమో, మార్పుచేసుకోవడమో చేశారు. మార్క్స్ ని సామాన్యంగా ఆధునిక సామాజికశాస్త్ర నిర్మాతల్లో ఒకరిగా పేర్కొంటారు.[13]

మార్క్స్ మరణించేంతవరకూ ఆయన భావాలు ప్రధానంగా వ్యాప్తి చెందకపోయినా, ఆయన మరణానంతరం వాటి ప్రభావం విస్తరించింది. రష్యన్ విప్లవం మొదలుకొని ప్రపంచ వ్యాప్తంగా జరిగిన అనేక విప్లవాలు మార్క్సిజం సిద్ధాంతం పునాదిగా చేసినట్టు ప్రకటించుకున్నాయి. 20వ శతాబ్దిలో అనేక దేశాలు మార్క్సిస్టు దేశాలుగా తమను ప్రకటించుకున్నాయి. వ్లాదిమిర్ లెనిన్, మావో జెడాంగ్, ఫిడెల్ కాస్ట్రో, సాల్వడార్ అలెండె, జోసిప్ బ్రొజ్ టిటో, క్వామే క్రుమా సహా ఎందరో 20వ శతాబ్దికి చెందిన ప్రముఖ ప్రపంచ నాయకులు మార్క్స్ తమపై గాఢ ప్రభావం చూపాడని పేర్కొన్నారు.

ప్రారంభ జీవితం

[మార్చు]

కార్ల్ మార్క్స్ జర్మనీ లోని ట్రీర్ అనే పట్టణంలో ఒక యూదు కుటుంబంలో జన్మించాడు. మార్క్స్ బాన్, బెర్లిన్, జెనా విశ్వవిద్యాలయాలలో విద్యనభ్యసించాడు.1842లో మార్క్స్ ఒక పత్రికకు సంపాదకుడుగా పనిచేశాడు. పత్రికా యాజమాన్యంతో వచ్చిన విభేదాలతో 1843లో మార్క్స్ సంపాదకత్వ బాధ్యతలనుండి తప్పుకుని పారిస్ చేరుకున్నాడు. అక్కడ చరిత్ర, రాజనీతి శాస్త్రం, తత్వశాస్త్రాలను అభ్యసించటంతో మార్క్స్ లో సామ్యవాద భావాలు రూపుదిద్దుకున్నాయి. మార్క్స్ 1844లో ఎంగెల్స్ను పారిస్ లో మొదటిసారి కలిసాడు. భావ సారూప్యత కలిగిన వారిద్దరూ శాస్త్రీయ కమ్యూనిజం యొక్క సైద్దాంతిక సూత్రాలను ఆవిష్కరించటానికి, ఆ సూత్రాల ప్రకారంగా అంతర్జాతీయ కార్మికవర్గ ఉద్యమ నిర్మాణాన్ని చేపట్టటానికి కలసి పనిచేయాలని నిర్ణయించుకున్నారు.వారి స్నేహం మార్క్స్ జీవించి ఉన్నంతవరకు అలానే కొనసాగింది.

కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక

[మార్చు]

1845లో మార్క్స్ తన విప్లవ కార్య కలాపాల వలన పారిస్ నుండి బహిష్కరించబడ్డాడు.దానితో మార్క్స్ బ్రస్సెల్స్ చేరుకుని అచట మరలా తన విప్లవ కార్యాచరణను ప్రారంభించాడు.

యూరోపియన్ నగరాలన్నింటిలోని విప్లవ సమూహాలన్నీ 1847లో కమ్యూనిస్టు లీగ్గా ఏకీకృతమయ్యాయి. మార్క్స్, ఎంగెల్స్ ఈ కమ్యూనిస్టు లీగ్ కు సైద్దాంతిక సూత్రీకరణలను తయారు చేయుటకు నియమింపబడ్డారు. ఎంగెల్స్ సహాయంతో మార్క్స్ ఈ బాధ్యతను నిర్వర్తించాడు. అలా రచింపబడినదే చరిత్రలో ఆధునిక సోషలిస్టు సిద్ధాంతం యొక్క మొట్టమొదటి శాస్త్రీయ ప్రకటనగా ప్రసిద్ధి చెందిన కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక.

ఈ రచనలో మార్క్స్ చారిత్రక భౌతిక వాద దృక్కోణంలో చరిత్రను వ్యాఖ్యానించాడు.సమాజపు చరిత్రంతా పీడక, పీడిత వర్గాల అంటే పాలక, పాలిత వర్గాల మధ్యన జరిగిన సంఘర్షణల చరిత్రే.ఈ క్రమంలో పెట్టుబడిదారీ వర్గం ప్రపంచ వ్యాప్త కార్మిక వర్గ విప్లవం ద్వారా తొలగింపబడి వర్గరహిత సమాజం ఏర్పడుతుందని ఈ ప్రణాళికలో మార్క్స్ సూత్రీకరించాడు.

ఈ ప్రణాళిక తన తదనంతర సామ్యవాద సాహిత్యాన్ని, సమస్త విప్లవకర ఆలోచనలనూ ప్రభావితం చేసింది. ఈ గ్రంథం అనేక భాషలలోకి అనువదింపబడి, అనేక లక్షల ప్రతులు ప్రచురింపబడింది.

లండన్ లో జీవితం

[మార్చు]

కమ్యూనిష్టు పార్టీ ప్రణాళిక రచనానంతరం తన విప్లవ కార్య కలాపాల వలన యూరప్ లోని అనేక దేశాలు మార్క్స్ ను బహిష్కరించాయి. దానితో మార్క్స్ చివరికి లండన్ చేరుకుని తన మిగిలిన జీవితాన్నంతా అక్కడే గడిపాడు. లండన్ లో మార్క్స్ అధ్యయనానికి, రచనా వ్యాసంగానికి, అంతర్జాతీయ కమ్యూనిష్టు ఉద్యమ నిర్మాణ ప్రయత్నానికీ తన జీవితాన్ని అంకితం చేశాడు. ఈ కాలంలో మార్క్స్ సామ్యవాద సాహిత్యంలో మకుటాయమాన మనదగిన ఎన్నో రచనలు చేశాడు. వీటన్నింటి లోకి ప్రధానమైనది దాస్ కాపిటల్. ఈ గ్రంథంలో మార్క్స్ సమాజం లోని పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ యొక్క క్రమబద్దమైన, చారిత్రకమైన విశ్లేషణను చేశాడు. ఈ గ్రంథాలోనే పెట్టుబడిదారులు శ్రామిక వర్గం సృష్టించే అదనపు విలువను దోపిడీ చేసే విధానాన్ని సిద్ధాంతీకరించాడు.ఆ తదనంతరం మార్క్స్ ఫ్రాన్స్లో 1871లో నెలకొల్పబడి అతికొద్దికాలం మనగలిగిన పారిస్ కమ్యూన్ అనబడే విప్లవ ప్రభుత్వం గురించి వివరించిన ఫ్రాన్స్ లో అంతర్యుద్దం (ద సివిల్ వార్ ఇన్ ఫ్రాన్స్) అనే గ్రంథం రచించాడు. ఇవే కాక మార్క్స్ ఆకాలంలో ఇంకా అనేక రచనలను చేశాడు.

చివరి రోజులు

[మార్చు]
లండన్ లో మార్క్స్ సమాధి

1852లో కమ్యూనిస్టు లీగ్ రద్దవ్వగానే మార్క్స్ అనేక మంది విప్లవకారులతో సంబంధాలు కొనసాగించి చివరకు 1864లో మొదటి ఇంటర్నేషనల్ అనే విప్లవ సంస్థను లండన్ లో స్థాపించాడు. ఈ సంస్థ కార్యక్రమమంతా మార్క్స్ ఆధ్వర్యంలోనే, అతని మార్గదర్శకత్వంలోనే నడిచేది. కానీ ఈ సంస్థలోని సభ్యులు పారిస్ కమ్యూన్ విప్లవంలో పాల్గొనడం, ఆ విప్లవం క్రూరంగా అణచి వేయబడటంతో మొదటి ఇంటర్నేషనల్ కూడా క్షీణించడంతో దాని కేంద్ర స్థానాన్ని మార్క్స్ అమెరికాకు మార్పించాడు. జీవితంలో ఆఖరి కొద్ది సంవత్సరాలు మార్క్స్ అనేక వ్యాధులతో బాధ పడ్డాడు. అవి అతని రాజకీయ, రచనా వ్యాసంగానికి ఆటంకంగా పరిణమించాయి.దానితో మార్క్స్ తాను రచించదలచుకున్న వాటిలో కొన్నింటిని రచించలేక పోయి చివరకు లండన్ లోనే మార్చి 14, 1883 న మరణించాడు.

మార్క్స్ ప్రభావం

[మార్చు]
1979 నుంచి 1983 వరకూ తమను తాము మార్క్సిస్ట్-లెనినిస్ట్ లేదా మావోయిస్టు నిర్వచనం కింద సామ్యవాద దేశాలుగా ప్రకటించుకున్న దేశాల పటం. ఈ కాలం సామ్యవాద రాజ్యాల విస్తృతి విషయంలో అత్యంత శిఖరాయమానమైన కాలం.

మార్క్స్ జీవితకాలంలో అతడి సిద్ధాంతాల ప్రభావం స్వల్పంగానే ఉండేది. ఐతే మరణానంతరం అతని ప్రభావం కార్మికోద్యమంతో పాటు పెరుగుతూవచ్చింది. అతని విధానాలు, సిద్ధాంతాలు, మార్క్సిజం లేక శాస్త్రీయ సామ్యవాదంగా పేరు గాంచాయి. కార్ల్ మార్క్స్ చేసిన పెట్టుబడిదారీ ఆర్థిక విశ్లేషణ, అతడి చారిత్రక భౌతికవాద సిద్ధాంతాలు, వర్గ పోరాటం, అదనపు విలువ, కార్మిక వర్గ నియంతృత్వం మొదలైన సూత్రీకరణలన్నీ కూడా ఆధునిక సామ్యవాద సిద్ధంతానికి పునాదిగా నిలిచాయి. మార్క్స్ సిద్ధాంతాలన్నీ అతడి మరణానంతరం పెక్కు మంది సోషలిష్టులచే పరిశీలించబడినాయి. ఐతే 20 వ శతాబ్దంలో లెనిన్ ఈ సిద్ధాంతాలన్నింటినీ మరింతగా అభివృద్ధి చేసి ఆచరణలోకి తెచ్చాడు.

మార్క్స్ ప్రభావం ఆంధ్ర రాష్ట్రంలో

[మార్చు]

విజయవాడ కేంద్రంగా అనేక ప్రచురణా సంస్థలు రష్యన్ అనువాద గ్రంథాలను తక్కువ ధరకే ప్రచురించడము, సోవియట్ రష్యా ఒక భూతల స్వర్గంగా ఈ రచనలు ప్రతిబింభింపసాగడంతో మార్క్సిజం ఒక ఆచరించదగ సిద్ధాంతంగా పరిగణించడం మొదలయ్యింది. ముప్పాళ్ల రంగనాయకమ్మ మార్క్స్ దాస్ కాపిటల్ ను తెలుగులో అనువదించడం అది కూడా చాలా సులభరీతిలో వుండటంతో అనేక ప్రతులు లాభదాయకంగా ప్రచురించడం మార్క్స్ భావజాలం అన్ని వర్గాలవారికి వ్యాపించడం జరిగింది. స్వాతంత్య్రం అనంతర జరిగిన అనేక భూస్వామ్య ఉద్యమాలు వామపక్ష పార్టీలు ముందుండి నడిపించడంతో అనేక వర్గాలు వారితో భాగస్యామ్యాన్ని పంచుకున్నాయి.

బయటి లంకెల

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.

మూలాలు

[మార్చు]
 1. Mehring, Franz, Karl Marx: The Story of His Life (Routledge, 2003) pg. 75
 2. John Bellamy Foster. "Marx's Theory of Metabolic Rift: Classical Foundations for Environmental Sociology", American Journal of Sociology, Vol. 105, No. 2 (September 1999), pp. 366–405.
 3. Allen Oakley, Marx's Critique of Political Economy: 1844 to 1860, Routledge, 1984, p. 51.
 4. కార్ల్ హెన్రిక్ మార్క్స్ అని అనేక పదకోశాల్లో ప్రచురితమైన పేరు, ఒక పొరపాటును ఆధారం చేసుకున్నది. ఆయన జనన ధ్రువపత్రాన్ని ఆధారం చేసుకుంటే కార్ల్ మార్క్స్ అన్న పేరు Carl Marxగానూ, మరే ఇతర పుస్తకాలు తిరగవేసినా Karl Marxగానూ కనిపిస్తుంది. కొన్ని కవిత్వ సంకలనాల్లోనూ, తన పరిశోధన డెజర్టేషన్ యొక్క వ్రాతప్రతిలోనూ మాత్రం కె. హెచ్. మార్క్స్ అని వాడారు, దీనికి కారణం ఆయన 1838లో మరణించిన తన తండ్రి హెన్రిక్ ని గౌరవించేందుకు చేసిన పని. మూడు డాక్యుమెంట్లలో మాత్రం కార్ల్ హెన్రిక్ మార్క్స్ అని రాసుకున్నారు. ఈ కొద్ది చెదురుమదురు మార్పులు కార్ల్ మార్క్స్ పేరులో హెన్రిక్ చేర్చడాన్ని సమర్థించవు. Heinz Monz: Karl Marx. Grundlagen zu Leben und Werk. NCO-Verlag, Trier 1973, p. 214 and 354, చూడండి.
 5. ". గత పాలక వర్గం స్థానంలో వచ్చే ప్రతి కొత్త వర్గం, కేవలం తన లక్ష్యాలను సాధించుకోవడానికి గాను, తప్పనిసరి పరిస్థితిలో తన ఆసక్తులు సమాజంలోని ప్రజలందరి సామాన్య ఆసక్తిగా చేసేందుకు ఉత్తమ సాధనంగా తన ఆలోచనలకు విశ్వజనీనమన్న రూపాన్ని ఇవ్వాల్సివుంటుంది, అలానే అవి మాత్రమే హేతుబద్ధమైనవనీ, విశ్వజనీనమైనవనీ చూపాల్సివుంటుంది." చూడండి: https://www.marxists.org/archive/marx/works/1845/german-ideology/ch01b.htm
 6. Karl Marx: Critique of the Gotha Program (Marx/Engels Selected Works, Volume Three, pp. 13–30;)
 7. In Letter from Karl Marx to Joseph Weydemeyer (MECW Volume 39, p. 58; )
 8. Calhoun 2002, pp. 23–24
 9. "Marx the millennium's 'greatest thinker'". BBC News World Online. 1 October 1999. Retrieved 23 November 2010.
 10. Roberto Mangabeira Unger. Free Trade Reimagined: The World Division of Labor and the Method of Economics. Princeton: Princeton University Press, 2007.
 11. John Hicks, "Capital Controversies: Ancient and Modern." The American Economic Review 64.2 (May 1974) p. 307: "The greatest economists, Smith or Marx or Keynes, have changed the course of history..."
 12. Joseph Schumpeter Ten Great Economists: From Marx to Keynes. Volume 26 of Unwin University books. Edition 4, Taylor & Francis Group, 1952 ISBN 0415110785, 9780415110785
 13. "Max Weber – Stanford Encyclopaedia of Philosophy".