ఉప్పు
ఈ వ్యాసాన్ని వికీకరించి ఈ మూసను తొలగించండి. |
ఉప్పు (Salt) భూమిమీద జంతువులన్నింటి మనుగడకు కావలసిన లవణము. ఇది షడ్రుచులలో ఒకటి. ఉప్పులో అత్యధిక శాతం ఉండే రసాయనము సోడియం క్లోరైడ్. ఉప్పు ఆహార పదార్థాలకు రుచిని ఇస్తుంది. ముఖ్యంగా మన భారతీయ వంటకాలలో ఉప్పుది ఒక ప్రధాన పాత్ర. ఆహారాన్ని భద్రపరచడానికి కూడా ఉప్పును వాడుతారు. ఉదాహరణకు ఆవకాయ మొదలగు పచ్చళ్ళను, చేపలను (ఉప్పు చేపలు) ఎక్కువ కాలం నిలువ ఉంచటానికి ఉప్పును వాడుతారు. మన దేశంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల ప్రజల జీవనశైలి మారుతోంది. ప్యాకేజ్డ్, ప్రాసెస్ చేసిన, రెడిమేడ్‌గా దొరికే ఆహారాలను తీసుకోవడానికి అలవాటు పడుతున్నారు. ఇందులో సోడియం ఎక్కువ మోతాదులో ఉంటుంది. ప్రతీరోజు సగటున ఒక భారతీయుడు 30 గ్రాముల ఉప్పు వాడుతున్నాడు. ఇది జాతీయ పోషకాహార సంస్థ సిఫార్సు కన్నా చాలా ఎక్కువ. రోజుకు ఆరు గ్రాముల కన్నా ఎక్కువ ఉప్పు తీసుకూడదని సంస్థ సూచిస్తోంది. ఉప్పు ఎక్కువ తీసుకుంటే గుండె జబ్బులు, మూత్రపిండాల జబ్బులు, కడుపులో క్యాన్సర్, ఆస్టియోపోరొసిస్ కలుగుతాయి. సముద్రం నుంచి లభించే ఉప్పులో 40 శాతం సోడియం, 60 శాతం క్లోరైడ్ ఉంటాయి. మన శరీరంలో ఉప్పుమీద ఆధారపడని అవయవమంటూ ఏమీలేదంటే అతిశయోక్తి కాదు. మన శరీరంలో జరిగే రసాయనిక చర్యలు అన్నీ కూడా ఉప్పు మీదే ఆధారపడి ఉంటాయి. మనం తీసుకునే ఆహారంలో ఉప్పు ముఖ్యమైన పదార్థం. కండరాలు సంకోచించడంలో, నీటి నిల్వ ఉండటంలో కీలక పాత్ర వహిస్తుంది. అంతేకాక శరీరంలో జీర్ణవ్యవస్థకు అవసరమైన పోషకాలు ఉప్పులో ఉన్నాయి. శరీరంలో సోడియం తక్కువైతే డీహైడ్రేషన్ కలుగుతుంది. మరోవైపు సోడియం ఎక్కువ ఉండే ఉప్పు పదార్థాలు తీసుకుంటే అధిక రక్తపోటు ప్రమాదం పెరుగుతుంది. ఇక్కడో సందేహం కలుగుతుంది. మన శరీరానికి ఎంత ఉప్పు అవసరం? జాతీయ పోషకాహారం సంస్థ ప్రకారం ఒక వ్యక్తి రోజుకు ఆరు గ్రాములు మాత్రమే ఉప్పు తీసుకోవాలి. కానీ సగటున ఒక వ్యక్తి రోజులో 8 నుంచి 12 గ్రాముల ఉప్పు తీసుకుంటున్నాడు. ఉప్పు మన శరీరంలో నీటి సమతుల్యతను కాపాడుతుంది. శరీరంలోని ఆమ్ల క్షార నిష్పత్తిని క్రమబద్దీకరించే చర్యలో సోడియం ఒక ముఖ్య పాత్ర వహిస్తుంది. సోడియం శాతం పడిపోతే హార్మోనులు పంపే సంకేతాలు శరీరంలో సరిగా వ్యాప్తికావు. కండరాలు నీరసించి మనిషి తేలికగా అలసటకూ చికాకుకూ లోనవుతాడు.
రకాలు
[మార్చు]- గడ్డ ఉప్పు లేదా సముద్రపు ఉప్పు
- అయోడిన్ ఉప్పు
- రాతి ఉప్పు (Rock salt)
- నల్ల ఉప్పు (Black salt)
ఆరోగ్యం
[మార్చు]- ఆహారంలో ఉప్పు ఎక్కువగా తీసుకుంటే అధిక రక్తపు పోటు వచ్చే అవకాశం ఎక్కువ.
- జీర్ణాశయం కాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
వైద్య పరంగా ఉప్పు ఉపయోగాలు
[మార్చు]గుండెను కబలిస్తుంది
[మార్చు]సోడియం ఎక్కువగా తీసుకుంటే రక్తంలో ద్రవాలు ఎక్కువైతాయి. ఇది రక్తపోటును పెంచుతుంది. సాధారణంగా ఈ అదనపు నీటిని శరీరం నుంచి మూత్రపిండాలు బయటికి పంపిస్తాయి. కొన్నిసార్లు మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోవచ్చు. ఈ సమయంలో అదనంగా ఉన్న నీటిని సమర్థవంతంగా బయటికి పంపించలేవు. దీంతో ద్రవాలు శరీరంలోనే ఉండిపోతాయి. ఇది రక్తం పరిమాణాన్ని పెంచుతుంది. ఈ రక్తం రక్తనాళాల ద్వారా పంప్ అవుతుంది. ఇది అధిక రక్తపోటుకు దారితీస్తుంది. ఇలా అదనంగా ఉన్న ద్రవాలతో కూడుకున్న రక్తాన్ని శరీరమంతా పంప్ చేయడానికి గుండె తన సైజును పెంచుకుంటుంది. ఈపరిస్థితిలో గుండెలోని కణాలు పనిచేయవు. ఎందుకంటే వీటికి అవసరమైనంత ఆక్సీజన్, పోషకాలు అందవు కాబట్టి. కొంతకాలానికి అదనపు రక్తపోటు వల్ల కలిగిన నష్టం తీవ్రరూపం దాల్చుతుంది. అప్పుడు ధమనులు పేలిపోవడం లేదా పూర్తిగా రక్తప్రసరణకు అడ్డుగా ఉంటాయి. ఇలాంటప్పుడు రక్తాన్ని స్వీకరించే గుండెలోని ఒక భాగం తనకు అవసరమైన ఆక్సీజన్, పోషకాలను పొందలేదు. దీంతో ఇది నషిస్తుంది. ఫలితంగా ఇది గుండెపోటుకు కారణం అవుతుంది. స్థూలకాయులు ఎక్కువగా ఉప్పు తింటే గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. అధిక రక్తపోటు ఉన్నవాళ్లు ఉప్పు తగ్గించకపోతే కిడ్నీలు దెబ్బతినే ప్రమాదముంది.
రక్తపోటును పెంచుతుంది
[మార్చు]శరీరంలోకి చేరుకున్న అదనపు ఉప్పును మూత్రపిండాలు విసర్జిస్తాయి. శరీరంలో నీటికంటే ఉప్పు ఎక్కువ ఉన్నప్పుడు మెదడు లోని దప్పిక కేంద్రం ప్రేరేపణకు గురై మరిన్ని నీళ్లు తాగమంటూ ప్రోత్సహిస్తుంది. అయితే ఉప్పు శాతం అధికంగా వాడడం వల్ల మూత్రపిండాలు అధికంగా ఉన్న నీటి మొత్తాన్ని విసర్జించలేకపోతాయి. అప్పుడు శరీరంలోని రక్త పరిమాణం పెరుగుతుంది. ద్రవపరిణామం పెరిగి ద్రవాన్ని ఇముడ్చుకునే ఖాళీ పెరగకపోవడంతో ఆలోపల ఒత్తిడి అధికమవుతుంది. ఈ పెరిగిన ఒత్తిడినే మనం రక్తపోటు అంటాం. అంటే ఉప్పు ఎక్కువ తీసుకోవడం వల్ల బిపి పెరుగుతుందన్న మాట. రక్తం శరీరంలోని అన్ని అవయవాలకు సరఫరా అవ్వడానికి బ్లడ్ ప్రెజర్ (బిపి-రక్తపోటు) అవసరం. బిపి 120/80 ఉంటే నార్మల్ ఉందని అర్థం. పైన ఉన్న సంఖ్య (120) సిస్టాలిక్ అని, కింద ఉన్న సంఖ్య (80) డయాలిస్టిక్ అని అంటారు. రక్తపోటు వయసును బట్టి కొంత పెరుగుతుంది. కొన్ని సందర్భాల్లో మిగతా అలవాట్ల వల్ల, యాంగ్జైటీ, ఆందోళన, ఒత్తిడి, డిప్రెషన్ వల్ల బిపి పెరిగే అవకాశముంది. బిపి పెరిగినప్పుడు వెంటనే ఏమీ అవ్వకపోవచ్చు. అయితే నెమ్మది నెమ్మదిగా శరీరంలోని కీలక అవయవాలపై ప్రభావం చూపుతుంది. బిపి ఎక్కువైనప్పుడు మెదడు, కళ్లు, గుండె, మూత్రపిండాలు ఎక్కువ ప్రభావితం అవుతాయి. భోజనంలో ఉప్పు వల్ల బిపి పెరుగుతుంది. కొంత మందిలో ధూమపానం, ఆల్కహాలు అలవాట్లు, వ్యాయామం లేకపోవడం వల్ల కూడా బిపి పెరుగుతుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో ఇతర కారణాల వల్ల కూడా బిపి పెరిగే అవకాశముంది. మూత్రపిండాలకు వెళ్లే రక్తనాళాలు సన్నగా ఉండడం వల్ల బిపి ఎక్కువైతుంది. కిడ్నీపైన ఉండే కొన్ని గ్రంథులు ఎక్కువగా పనిచేసినా కూడా బిపి పెరుగుతుంది. థైరాయిడ్ తక్కువైనా కూడా బిపి వస్తుంది. కొంత మంది గర్భం రాకుండా ఉండటానికి పిల్స్ తీసుకుంటారు. ఈ పిల్స్ వల్ల కలిగే దుష్ప్రభావాల్లో బిపి ఒకటి. పిల్స్‌తో వీరిలో బిపి పెరుగుతుంది. వేరే ఏ కారణాలు లేకుండా బిపి ఎక్కువుంటే ప్రైమరి హైపర్‌టెన్షన్ అంటారు. 95 శాతం మందిలో బిపికి కారణం ఏమిటనేది కనుక్కోలేం. ఇది జన్యుపరమైనవి కావొచ్చు, అలవాట్లు కావొచ్చు. తీసుకునే ఉప్పు వల్ల కూడా కావొచ్చు. ఒక్కోసారి అకస్మాత్తుగా హైబిపి వస్తుంది. ఇది చాలా ప్రమాదకరం. అకస్మాత్తుగా హైబిపి వచ్చినప్పుడు కళ్లు మసకగా కనిపించడం, కళ్లలోని నరాలు దెబ్బతినడం జరుగుతాయి. ఒక్కోసారి మెదడులోని నరాలు చిట్లే అవకాశముంది. దీన్ని సెరిబ్రల్ హెమరేజ్ అంటారు. ఈ పరిస్థితిలో మరణించే అవకాశాలెక్కువ. ఒత్తిడి వల్ల పెద్దలే కాక పిల్లల్లో కూడా బిపి వస్తోంది. ఒత్తిడి ఉన్నప్పుడు శరీరంలోని హార్మోన్లు పెరగుతాయి. మనం ఏదైనా విషయం గురించి ఆందోళన చెందినప్పుడు పల్స్‌రేటు ఎక్కువై బిపి పెరుగుతుంది. శరీరానికి మేలు చేసే హార్మోన్లు ఒత్తిడి వల్ల కీడు చేస్తాయి.
బిపికి జీవితాంతం మందులు
[మార్చు]ఒక సారి రక్తపోటు వస్తే దీన్ని నయం చేయలేం. కేవలం నియంత్రిచే వీలుంది. దీని కోసం జీవితాంతం మందులు వాడాల్సి ఉంటుంది. ఎందుకంటే బిపి మన శరీరంలోని ప్రతీ అవయవం ప్రతీక్షణం ప్రభావితమవుతుంది. మన గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుందో అన్ని సార్లు రక్తం శరీరమంతా ప్రసరిస్తుంది. 25 ఏళ్లు వచ్చినవారు బిపిని చెక్ చేయించుకోవాలి. కనీసం ఆరు నెలలకోసారైనా. మందులు వాడుతున్నవారు మూడు నెలలకోసారి పరీక్ష చేయించుకోవాలి. ఏడాదికోసారి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి.బిపి ఉన్నప్పుడు వైద్యున్ని కలిసి అన్ని రకాల పరీక్షలు చేయించుకోవాలి. సూచించిన మందులను క్రమం తప్పకుండా జీవితాంతం వాడాలి. తరచూ బిపి చెకప్ చేయించకుంటూ ఉండాలి. బిపి వల్ల బ్రెయిన్ హెమరేజ్, పక్షవాతం, కళ్లలో సమస్యలు, దృష్టి దెబ్బతిని చూపుపోతుంది. గుండెపోటు, కిడ్నీ దెబ్బతినడం వల్ల కిడ్నీ సమస్యలు.
బహు ప్రయోజనకారి
[మార్చు]ఉప్పు నాడీ ప్రేరేపణ ప్రసారానికి తోడ్పడుతుంది. సరైన మోతాదులో శరీరంలో ద్రవాలు నిల్వ ఉంచడానికి సహకరిస్తుంది. కండరాలు సంకోచించడానికి, వ్యాకోచించడానికి సహాయపడుతుంది. ఉప్పులో ఉండే అయోడిన్ ఎదుగుదలకు తోడ్పడుతుంది. అయోడిన్ లోపం వల్ల థైరాయిడ్ సమస్యలు వస్తాయి. శరీరంలో సోడియం బాగా తగ్గితే 'లో బ్లడ్ ప్రెజర్ ' కలుగుతుంది. ఇది రక్తప్రసరణను తగ్గిస్తుంది. సోడియం ఎక్కువైతే శరీరానికి హానికరం. పాల ఉత్పత్తులు, కూరగాయలు, చేపలు, రొయ్యలు, గుడ్లలో సహజసిద్ధంగా సోడియం ఉంటుంది. ఉప్పు ఎక్కువ తీసుకున్నప్పుడు కిడ్నీలో రెనిన్ అనే పదార్థం ఉత్పత్తి/విడుదల అవుతుంది. రెనిన్ అల్డొస్టిరాన్‌ను సెక్రియేట్ చేస్తుంది. ఆల్డోస్టిరాన్ రక్తనాళాలను సంకోచింప చేస్తుంది. శరీరంలో సోడియం ఉండేలా చేస్తుంది. శరీరంలో ఎక్కువ సోడియం నిల్వ ఉంటే ద్రవాలు ఎక్కువైతాయి. రక్తనాళాలు సంకోచించినప్పుడు బిపి అధికమవుతుంది. రెనిన్, ఆల్డోస్టిరాన్ అనేది ముఖ్యమైన మెకానిజం. భోజనంలో ఉప్పు తగ్గించినప్పుడు రెనిన్ తక్కువ ఉత్పత్తి అవుతుంది. మందుల వల్ల రెనిన్ ఉత్పత్తిని తగ్గించొచ్చు. ఆల్డోస్టిరాన్‌ను బ్లాక్ చేయడానికి మందులు ఉన్నాయి.
ఎంత తీసుకోవాలి?
[మార్చు]రోజూ ఆఫీసుకు బస్సులో ప్రయాణిస్తూ, అరమైలు దూరం నడక సాగించే సాధారణ వ్యక్తికి రోజుకు ఆరు గ్రాముల ఉప్పు అవసరం. కష్టపడి పనిచేసే కూలీకి, కార్మికునికి, క్రీడాకారునికి లేక ఇతరత్రా వ్యాయామాలు చేసే మనిషికి ఇంకాస్త ఎక్కువ అవసరం. చెమటలో 0.1 నుంచి 0.3 శాతం దాకా సోడియం క్లోరైడ్ ఉంటుంది. చలికాలంలో చెమట ద్వారా బయటికి పోయే ఉప్పు అంటూ ఏమీ ఉండదు. కానీ మంచి మండే వేసవిలో మాత్రం ఆఫీసుకు వెళ్లే వ్యక్తి రోజుకు 12.5 గ్రాముల దాకా ఉప్పును చమట ద్వారా విసర్జిస్తాడు. ఇదే రోజులో వ్యాయామాలు చేసినా లేక ఏడారి ప్రాంతాల్లో నివసించే వారిలో ఇది ఇంకా బాగా ఎక్కువగా ఉంటుంది. అయితే చెమట ద్వారా శరీరం ఉప్పు కంటే నీటిని ఎక్కువ కోల్పోతుంది. దీని వల్ల బాగా చెమటలు పట్టినప్పుడు రక్తంలో ఉండాల్సిన దానికంటే ఉప్పు ఎక్కువ శాతం గానూ నీరు తక్కువ శాతంగానూ ఉండి వాటి మధ్య నిష్పత్తి దెబ్బతింటుంది. దీన్ని పసిగట్టిన మెదడులోని దప్పిక కేంద్రం నీటిని ఎక్కువ తాగమంటూ నోటికి సందేశం పంపిస్తుంది. మనకు దప్పిక అయ్యేది ఈ సందర్భంలోనే.
పారిశ్రామిక ఉత్పత్తి
[మార్చు]ఉప్పు ముఖ్యంగా సముద్రపు నీటి నుండి తయారుచేయ బడుతుంది. కొన్ని ప్రాంతాలలో రాతి ఉప్పు గనులనుండి కూడా దీన్ని తయారుచేస్తారు. 2002 సంవత్సరంలో, ప్రపంచ ఉప్పు ఉత్పాదకత 210 మిలియన్ మెట్రిక్ టన్నులు, అందులో మొదటి ఐదు స్థానాలలో అమెరికా (40.3 మిలియన్ టన్నులు), చైనా (32.9), జర్మనీ (17.7), భారతదేశం (14.5),, కెనడా (12.3) ఉన్నాయి.[1] ప్రపంచములో అతి పెద్ద ఉప్పు నేల బొలీవియా దేశంలొ ఉంది.
50 శాతం తగ్గిన ఉప్పు ఉత్పత్తి
[మార్చు]- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏడాదికి ఆరున్నర లక్షల మెట్రిక్ టన్నుల ఉప్పు ఉత్పత్తి అవసరంకాగా, వాతావరణ పరిస్థితులు అనుకూలించక పోవడం వలన అందులో 50% మాత్రమే ఉత్పత్తి జరుగుతుంది అని మద్రాసు సాల్ట్ కమిషనరు చెప్పారు. ప్రతి సంవత్సరం ఉప్పు పండించే సీజనులో (సమయం) వర్షాలు పడటంవలన, ఉప్పు ఉత్పత్తికి తీవ్రమైన్ అడ్డు కలుగుతుంది. ఉప్పు ఉత్పత్తిలో, మూడవ స్థానంలో ఉన్న, ఆంధప్రదేశ్, నేడు తీవ్రమైన సంక్షోభంలో కూరుకు పోయింది. 1995 సెప్టెంబరు 5 మంగళవారం నాడు నౌపడా (శ్రీకాకుళం జిల్లా) లో జరిగిన రాష్ట్ర ప్రాంతీయ ఉప్పు సలహా మండలి సమావేశానికి మద్రాసు సాల్ట్ కమిషనరు అధ్యక్షత వహించారు. ఉప్పు భూములలో, రొయ్యల పెంపకం చేపడుతున్నారని, అందువల్ల ఉప్పు ఉత్పత్తి తగ్గిపోతుందని అన్నారు. రాష్ట్రంలో ఉప్పు పండేప్రాంతాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు, నౌపడాలో 6 పడకల పి.హెచ్.సి.ని 10 పడకల ఆస్పత్రిగా మార్చేందుకు ఈ సమావేశం ఏకగ్రీవంగా అమోదింఛారు. అసిస్టెంట్ సాల్ట్ కమిషనర్ (కాకినాడ), హైదరాబాదు (అడిషనల్) ఇండస్ట్రియల్ డైరక్టర్, టెక్కలి సబ్ కలెక్టరు, జిల్లా పౌర సరఫరా అధికారి, విశాఖపట్నం రైల్వే అధికారి, నౌపదా సాల్ట్ సూపరింటెండి,, సాల్ట్ బోర్డు సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఉప్పు సత్యాగ్రహం
[మార్చు]భారత స్వాతంత్ర్యోద్యమంలో ఒక ముఖ్యమైన భాగం మహాత్మా గాంధీ నిర్వహించిన దండి ఉప్పు సత్యాగ్రహం.
ఉప్పు వివరాలు
[మార్చు]ఉప్పు అత్యంత ముఖ్యమైనది, అత్యంత విలువైనది, ఆతి సరసమైనది ఆహార పదార్థాలలో ఏదైన వున్నదంటే అది ఉప్పు. మాత్రమే. వంట ఎంత బాగా చేసినా అందు కొంచెం ఉప్పు చేర్చనిదే దాని రుచి రాదు. ఏ కూర లేకున్న అన్నంలో నీళ్లు పోసుకొని కాస్త ఉప్పు వేసుకుంటే ఆ పూట గడిపేసే బడుగు జీవులెందరో ఉన్నారు. షడ్రుచుల్లో ఒక దాని రుచిని నియంత్రించే శక్తి మరొక దానికి లేదు ఒక్క ఉప్పుకు తప్ప. అందుకే ఉప్పుని రుచుల్లో రారాజు అన్నారు. ఇప్పుడు ఉప్పు విరివిగా దొరకడం వల్ల ఇది చాల చవక. కాని ఒకప్పుడు ఉప్పు ఎంతో విలువైనది. ఉప్పుని బంగారం లాగ చూసేవారు. రాజుల కాలంలో ఉప్పు ద్రవ్వంగా వాడ బడి నట్లు తెలుస్తున్నది. ఉప్పు రాజ్యాలని నిర్మించింది అలాగే రాజ్యాలను కూల్చి వేసింది కూడ. అంతటి ఘన చరిత్ర గురించి తెలుసుకోవడం ఎంతైనా ఆవసరం:
'ఉప్పు లేక రుచి పుట్టగ నేర్చునటయ్య భాస్కరా".......అని ఉప్పు విలువను గొప్పగా చెబితే, "వీడు ఉప్పు రాతికి కూడ కొరగాడు" అనే నానుడి ఉప్పు అతి చవక అనే విషయాన్ని తెలియ జేస్తుంది.
ఉప్పు ఎలా తయారు చేస్తారు?
[మార్చు]భూగోళంపై మూడొంతులు నీరే అనే విషయం అందరికి తెలిసినదే. ఆనీరంతా ఉప్పు నీరే అనే సంగతి కూడా అందరికి తెలిసినదే. ఆ ఉప్పు నీటిని మడులలో సూర్యరశ్మితో ఇగర బెట్టి ఉప్పు తయారు చేస్తారు. కాని అన్ని ప్రాంతాలలోని సముద్రం నీరుతో అలా ఉప్పును తయారు చేయలేరు. ఆ నీటిలో ఉప్పు సాంద్రత తగినంత ఉండాలి. భూమిలో గనులనుండి కూడా ఉప్పును త్రవ్వి తీస్తారు. అలా తీసిన ఉప్పును రాతి ఉప్పు లేదా సైందవ లవణం అంటారు. ఆయుర్వేద వైద్యంలో దీని ఉపయోగం ఎక్కువ. కొన్ని ప్రాంతాలలో ఉప్పు నీటిని పాత్రలలో పోసి మరగ బెట్టి ఇగర బెట్టి ఉప్పును తయారు చేస్తారు. సామాన్యంగా డిసెంబరులో ఉప్పు మడులను తయారు చేస్తారు. మడులను చదునుగా తయారు చేసి గట్టి పరుస్తారు. బాగా ఆరబెట్టిన తరువాత ఉప్పునీటిని మడులలోకి యంత్రాల ద్వారా మళ్ళిస్తారు. ఎండకు ఆ మడుల లోని నీరు ఆవిరి అయి ఉప్పు స్పటికాలుగా ఏర్పడు తుంది. వాతావరణం అనుకూలంగా వుంటే సుమారు నలబై రోజులలో ఉప్పు తయారు అవుతుంది. తయారైన ఉప్పును పక్కనే కొంచెం ఎత్తైన ప్రదేశంలో రాసులుగా పోసి పైన కప్పు వేస్తారు. తిరిగి మడులలో ఉప్పు నీటిని నింపుతారు. ఉప్పు మడి తయారు చేసిన తరువాత మొదటి పంట కన్నా రెండో పంట కొంత స్వచ్ఛంగా ఉంటుంది. మొదటి పంటలో మడిని తయారు చేసి నప్పుడు కొంత మలినాలుండి ఉప్పుకు రంగులో తేడా వుంటుంది.
ఉప్పు ఉపయోగాలు
[మార్చు]ఉప్పు ఉపయోగాలు అనంతం, ముఖ్యమైన కొన్నింటిని పరిశీలిస్తే: గొంతు గరగరకు, ఎడతెరపలేని దగ్గుకు ఉప్పు నీటి వాడకం సార్వత్రికమే. విషాహారం తిన్నవారికి మొదట ఇచ్చేది ఉప్పు నీరే. ఉప్పు మంచి వమన కారి. ఉప్పు కలిపిన పండ్ల పొడి మంచిది. ఇప్పుడు టూత్ పేస్ట్ లో కూడా ఉప్పు ఉందా అని అడుగుతున్నారు. శరీరం పై కలిగిగ గాయాలకు ముందు ఉప్పు నీటితో కడగ మంటారు. కళ్ళు పుసులు కడితే ఉప్పు నీటితో కడగ మంటారు. ఇది మంచి ప్రాథమిక చికిస్త. ఉప్పు నీటితో ముఖాన్ని మసాజ్ చేస్తే మృత ఖణాలు పోయి ముఖం కాంతి వంతంగా వుంటుంది. మనుషులకే కాదు చెట్లకు కూడా ఉప్పు ఉపయోగముంది. కొబ్బరి చెట్లకు మువ్వ తెగులుకు ఉప్పు వాడతారు. వంగ మొక్కజొన్న వంటి పంటలకు సోడియం క్లోరైడ్ ను ఎరువుగా వాడతారు. జంతువులకు, వివిధ రకాల వనమూలికలతో చేసిన పొడిని ఉప్పు కలిపి తినిపిస్తారు. దాన్ని ఉప్పు చెక్క అంటారు. ఇది ఆవులకు, గొర్రెలకు చాల దివ్వ ఔషధం. మామూలు కూరల్లోనే కాదు స్వీట్లు, బ్రెడ్, బిస్కట్, పిజ్జాలు, ఐస్క్రీంలు, జంకు వుడ్స్, ప్యాక్డ్ ఫుడ్స్, ఇలా అన్నింటిలోను రుచి కొరకు, నిల్వ కొరకు ఎంతో కొంత ఉప్పు వాడాల్సిందే. 1675 లో బ్రిటిష్ లో ఉప్పు పై అధిక పన్నుకు ప్రతి కూలంగా ప్రజా పొరాటం జరిగింది. బ్రిటిష్ పాలకులు ఉప్పు తయారి పై సుంకం విధించి నందున దానికి వ్యతిరేకంగా మహాత్మా గాంధీ నడిపించిన "ఉప్పు సత్యాగ్రహం" స్వాతంత్ర్యోద్యమంలో ఎంతో ప్రధాన ఘట్టమనే సంగతి తెలియని వారుండరు. కొన్ని ప్రాంతాలలో శవాలను ఖననం చేసేటపుడు తప్పని సరిగా ఉప్పును కూడా వేస్తారు. మన దేశంలో ఉప్పును అప్పుగా ఇవ్వకూడదనే నియమంకూడ ఉంది. ఉప్పును చేతికి ఇవ్వరు ......... తీసుకోరు, (నూనెలకు కూడా ఈ నియమం ఉన్నది) ఉప్పును దొంగలించరు. ఇలా ఉప్పుకు సంబంధించిన కొన్ని ఆచారాలున్నాయి.
ఉప్పు వల్ల ఉపయోగాలేమంటే ఉప్పు వేసిన వంటలు త్వరగా ఉడుకుతాయి. దానివలన ఇందనం, సమయం ఆదా. ఉప్పు నీరు వంద డిగ్రీల వద్ద మరిగి ఆవిరై పోదు. సున్న డిగ్రీల వద్ద గడ్డ కట్టి పోదు. ఒకరి మీద కృతజ్ఞత చెప్ప డానికి "మీ ఉప్పు తిన్న వాడిని" అంటారు గాని "మీ తిండి తిన్న వాణ్ణి" అనరు. అదే ఉప్పు ఘనత. ఉప్పు ఘనత కారణంగా కొన్ని నగరాలు వెలిశాయి. బ్రిటన్ లోని లివర్ పూల్నిన్న నగరం. ఉప్పు ఎగుమతితో అనారం చిన్న స్థాయి నుండి ప్రపంచ స్థాయి నగరంగా ఎదిగింది. ఆస్ట్రియా లోని శాల్జ్ బర్గ్ నగరాన్ని ది సిటి ఆఫ్ సాల్ట్ అని పిలుస్తారు, ఒకప్పుడు రోమన్ సామ్రాజ్యంలో సైనికులకు ఉప్పును జీతంగా ఎచ్చేవారు. ఇంకొన్ని ప్రాంతాలలో ఉప్పును మారకద్రవ్యంగా వాడారు. ఆ హార పదార్థాల నిల్వకు అతి సులువైన మార్గం ఉప్పులో ఊర వేయటం. ఊరగాయలు, చేపలు, మాంసం మొదలగునవి ఉప్పులో నిల్వతో ఎగుమతిలో జరిగే జాప్యాన్ని తట్టు కుంటాయి. ఉప్పుని పారిశ్రామిక ఉత్పత్తుల్లో ఎక్కువగా వాడతారు. ఎన్నో పార్మాసూటికల్స్ తయారికి ఉప్పే ముఖ్యమైన ముడి సరుకు. కీలక రసాయానాలను తయారు చేయడానికి ఉప్పే ముడి సరుకు. వాటితో ఫార్మాసూటి కల్ మందులు, మైక్రో చిప్ లు, ఆప్టికల్ ఫైబర్లు, కేబుల్సు, ప్లాస్టిక్ పైపులు మొదలగు వేల రకాల వస్తువుల తయారికి ఉప్పు అత్యవసరం. ధ్రువ ప్రాంతాల దేశాలలో కొన్ని సీజన్లలో మంచు దారాపాతంగ కురుస్తుంది. నేలంతా గడ్డ కట్టిన మంచుతో పేరుక పోతుంది. రోడ్లపై అతుక్కు పోయిన మంచును పెకలించి తొలిగించడం చాల కష్టం. దాంతో రోడ్ల పై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచి పోతాయి. ఆమంచును తొలగించడానికి ఉప్పే శరణ్యం. ఎలాగంటే మామూలు నీటి లాగ ఉప్పు నీరు సాధారణ ఉష్ణోగ్రత వద్ద గడ్డకట్టదు. కనుక రోడ్డుపై ఉప్పు నీరు చల్లితే కురిసిన మంచు గడ్డ కట్టినా రోడ్డుకు అతుక్కొనదు. మంచుకు, రోడ్డుకు మధ్యన ఉప్పు నీటి పొర వున్నందున మంచు రోడ్డుకు అతుక్కోదు. అంచేత దాన్ని తొలిగించడము చాల సులభం. అటు వంటి దేశాలలో ఉప్పును ఎక్కువగా వాడేది రోడ్లపై నున్న మంచును తొలగించడానికే. అందుకని రహదారుల వెంబడి పెద్ద పెద్ద ఉప్పు నిల్వ ఉన్న గిడ్డంగులుంటాయి. మంటలను ఆర్పడానికి కూడా ఉప్పును వినియోగిస్తారు. మంటలలోని వేడిని ఉప్పు గ్రహిస్తుంది. అది ఆక్సిజన్ తో సంయోగం చెంది ఆప్రదేశంలో ఆక్సిజన్ తగ్గి మంటలను ఆర్పడానికి దోహద పడుతుంది. అగ్గికి విరొది నీరే కాదు ఉప్పు కూడా. అందుకే ఉప్పు---నిప్పు అంటారు. " వారిద్దరు ఉప్పు నిప్పు" అనే సామెత అందుకే వచ్చంది.
ఉప్పు వల్ల అన్నీ ఉపయోగాలేనా అంటే అదేంకాదు. ఉప్పు అధికమైతే అరోగ్య పరంగా అనేక దుష్పరిమాణాలు కలుగుతాయి. అధిక రక్త పోటుకు మోతాదు మించిన ఉప్పే కారణమని వైద్యులు అంటున్నారు. తద్వారా వచ్చే అనేక గుండె జబ్బులకు పరోక్షంగా ఉప్పే కారణం అని వైద్యులు తేల్చి చెప్పుతున్నారు. ఆమధ్యన న్యూయార్కులో నగర పాలకులు హోటళ్లలో ఏ వంటలోను వుప్పు వేయ కూడదని అలా వేస్తే జరిమానా విధిస్తామని ఉత్తర్వులిచ్చారు. తినేవారు తమకు కావలసిన ఉప్పును వారే వేసుకుంటారని . ఇదంతా ప్రజారోగ్య పరి రక్షణకే నని వారి వాదన.
ఇంతటి ఘనచరిత్ర కలిగిన ఉప్పు గురించి అన్ని విషయాలు వివరంగా అందించడానికి ప్రముఖ ఉప్పు తయారీ దారులంతా కలిసి "సాల్ట్ ఇన్ స్టిస్ట్యూట్ ను నెలకొల్పారు. ఇది అమెరికాలోని అలెగ్జాండ్రియాలో వున్నది. ఇన్ని ఉపయోగాలున్న ఉప్పు గురించి పాఠశాల విద్యార్తులకు చెప్పితే చిన్నప్పుడే వారికి ఉప్పు విలువ తెలుస్తుందని ....ఉప్పు ఉపయోగాల గురించి పాఠ్య ప్రణాళిక తయారు చేసి ఉపాద్యాయులకు ఉచితంగా ఇస్తున్నారు. ..
ఇతరాలు
[మార్చు]ఆహారంలో ఉప్పు వాడకాన్ని తగ్గించాలంటూ కార్పొరేట్ ఆస్పత్రులు ఓ వైపు ప్రచారం చేస్తుండగా మరోవైపు డెన్నార్క్‌కు చెందిన శాస్తవ్రేత్తలు ఉప్పు పూర్తిగా తగ్గిస్తే గుండెకు సమస్యలు తప్పవని తేల్చి చెబుతున్నారు. వినడానికి వింతగా ఉన్నా, తాజా పరిశోధనలు ఉప్పు వినియోగాన్ని పూర్తిగా తగ్గించవద్దని ఘోషిస్తున్నాయి. తిండిలో లవణం లేకుండా చేస్తే గుండెకు చేటు కలుగుతుందని, ఫలితంగా హృద్రోగాలు తప్పవని డెన్మార్క్ పరిశోధకులు దండోరా వేస్తున్నారు. ఉప్పును బాగా తగ్గించడం వల్ల కొలెస్ట్రాల్‌లో 2.5 శాతం, రక్తం గడ్డ కట్టడానికి సహకరించే కొవ్వులో ఏడు శాతం పెరుగుదల సంభవించినట్లు వారు గుర్తించారు. ఉప్పు వినియోగం మానేస్తే అధిక రక్తపోటుకు కారణమయ్యే ‘అల్డోస్టెరాన్’ హార్మోన్లు శరీరంలో విడుదలవుతున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. (మూలం,, 14 ఆగస్టు...2011 ఆంధ్ర జ్యోతి.)
మూలాలు
[మార్చు]- ↑ Susan R. Feldman. Sodium chloride. Kirk-Othmer Encyclopedia of Chemical Technology. John Wiley & Sons, Inc. Published online 2005. doi:10.1002/0471238961.1915040902051820.a01.pub2