Jump to content

వంకాయ

వికీపీడియా నుండి
(వంగ నుండి దారిమార్పు చెందింది)

వంకాయ
Scientific classification
Kingdom:
Class:
Subclass:
Order:
Family:
Genus:
Species:
సొ. మెలాంజిన
Binomial name
సొలానమ మెలాంజిన
కూర వంకాయలు

వంగ - వంకాయ (Brinjal) - తెలుగు దేశములో చాలా ప్రముఖమైన, విరివిగా పెంచబడుతున్న కూరగాయల రకాలలో ఒకటి. దీని చరిత్ర సరిగ్గా తెలీదు, కానీ హిందూ మత శ్రాద్ధ కర్మలందు దీనిని కూడా నిషేధించి ఉన్నందువల్ల దీనిని భారతదేశానికి ఇతర దేశములకు వచ్చినదిగా భావింపబడుతున్నది, కానీ ఎప్పుడు ఎలా భారత దేశానికి వచ్చినదో సరిగ్గా తెలీదు. వంకాయలు రకరకాలుగా - చిన్న వంకాయలు, పొడుగు వంకాయలు, తెల్ల వంకాయలు, ఎర్ర వంకాయలు, గుత్తి వంకాయలు - లభిస్తున్నాయి.

వివిధ భాషా నామములు

[మార్చు]
వంకాయ టమాట చిక్కుడుకాయ పోపు కూర
వంకాయ పచ్చిమిర్చి రోటి పచ్చడి
  1. (బ్రింజాల్) brinjal
  2. (ఎగ్గ్ ప్లాంట్) eggplant
  3. (ఆబర్జీన్) aubergine[1][2]

భౌతిక వివరణ

[మార్చు]

వంగ సుమారుగా ఒకటి, ఒకటిన్నర మీటర్ల యెత్తెదుగు చిన్న గుల్మము. సామాన్యముగా ఒక సంవత్సరము పెంచబడిననూ, పరిస్థితులు అనుకూలంగా ఉన్నచో ఒకటి కన్నా ఎక్కువ సంవత్సరములు ఈ మొక్క పెరుగును. వేళ్ళు మొక్క యొక్క పైభాగమునకు తగినంత విరివిగ వ్యాపించవు. కాండము సామాన్యముగా 1.25 - 2.50 సెం. మీ. లావుగా పెరుగును. దీనికి చాలా కొమ్మలూ, రెమ్మలూ వచ్చును. ఆకులు పెద్దవిగా ఉంటాయి. సుమారుగా 15 సెంటీమీటర్లు పొడువూ, 10 సెంటీమీటర్లు వెడల్పు కలిగిఉంటాయి. అంచుకు కొద్ది గొప్ప తమ్మెలుగ చీలి ఉంటాయి. కొన్నిటిలో ఏకముగా ఉండుటనూ చూడవచ్చు.

సారల వంకాయ

ఆకులు అంతటనూ మృదువయిన నూగు కలిగి ఉండును. కొన్ని రకములలో ఆకులయందలి యీనెల పైననూ, కాండము మీదనూ, కాయల తొడిమల మీదనూ, ముచికలమీదను వాడియయిన ముళ్ళు స్వల్పముగా ఉండును. పూవులు తొడిమెలు కలిగి ఆకు పంగలందునూ, కొమ్మల చివరనుకూడా సామాన్యముగా జంట గుత్తులు బయలుదేరును. ఒక్కొక్క గుత్తిలో 1-3 వరకు పూవులుండును. ఒక్కొక్కచోట బయలుదేరు రెండు గుత్తులలో ఒకదానియందు సామాన్యముగ పిందె కట్టుటకు తగిన ఒకటే ఉండును, రెండవ గుత్తియందు పూవులు సాధారణంగా పిందెకట్టవు. ఇందు అండాశయము నామమాత్రముగా ఉండును. కానీ ఒకే గుత్తియందు కానీ, రెంటిలోనూ కలిపికానీ పిందెలు కట్టు పూవులు 2-3 ఉండుటయూ ఉంది. పుష్పకోశము సంయుక్తము. తమ్మెలు ఐదు. నీచమైనను కాయలతో కూడా పెరిగి తుదివరకూ ఉండును. దళ వలయమునూ సంయుక్తమే.

తమ్మెలిందునూ ఐదే. ఎరుపుతో కూడిన నీలవర్ణము కలిగియుండును. కింజల్కములు ఐదు. వీని కాడలు దళవలయము నధిష్టించి యుండును. అండాశయము ఉచ్చము. కీలము పొడవుగ ఉండును. కాయలు అనేక గింజలు కలిగి యుండు కండకాయ. గింజ చిన్నది. గుండ్రముగానూ, బల్లపరుపుగానూ ఉండును. పది గ్రాములకు సుమారుగా 1600 గింజలు తూగును.

ఉపజాతులు

[మార్చు]

ఇందు గుండ్రని కాయలు, నిడివి కాయలు, పొట్టిశీఘ్రకాలపు కాయలు అని మూడు ఉపజాతులు గుర్తింపబడినాయి.

ఇదొక రకం వంకాయ

కాయల ఆకార, పరిమాణ, వర్ణభేదములనుబట్టియూ, ఆకులందును కాయల ముచికలందును ముళ్ళుండుటను లేకుండుటను బట్టియు, సాగునకనుకూలించు పరిస్థితులనుబట్టియునూ వంగలో అనేక రకములు గుర్తింపబడుచున్నవి. ఆకారమును తరగతులుగ విభజించవచ్చును.

  • గుండ్రని రకములలో కొంచెమించుమించు గుండ్రములు, అడ్డు కురుచ రకాలు గూడగలవు. బాగా ఎదిగిన కాయలు కొన్ని 12, 15 సెంటీమీటర్లు మధ్య కొలత కలిగి, చిన్న గుమ్మడి కాలంతేసి యుండును.
  • పొడవు రకాలలో సుమారు 30 సెంటీమీటర్లు పొడవు కలిగి సన్నగ నుండు రకాలు ఉన్నాయి.
  • కోల రకాలు పొడవు, లావులందు రెండు తరగతులకును మధ్యమముగ నుండును.

తూనికలో 25 గ్రాముల లోపునుండి 1000 గ్రాముల వరకు తూగు రకములు ఉన్నాయి. కాయల రంగులో ఆకుపచ్చ ఊదా రంగులు ముఖ్యములు. తెల్లని లేక దంతపు రంగు రకాలును ఉన్నాయి. ఆకుపచ్చ వర్ణములలో చాలా లేబనరు రంగు మొదలు, కారుపసరు రంగు వరకు కన్పడును. కొన్నిటిలో దట్టమగు ఆకుపచ్చ రంగుపైన లేత ఆకు పచ్చ రంగు చారలు కానీ, పట్టెలు కానీ ఉండును. ఇట్టే ఊదా రంగు నందును లేత ముదురు భేదములే కాక ఆకుపచ్చకును, ఊదా రంగుకును మధ్య అంతరములు అనేకములు ఉన్నాయి. సాగునకనుకూలించు పరిస్థితులననుసరించి వంగలో మెట్టవంగలనియూ, నీటి వంగలనియూ రెండు తరగతులేర్పడుచున్నవి. వంగపూవు పరసంపర్కమునకు అనుకూలించుటచే స్వతస్సిధ్ధ్ముగనూ మానవ కృషివలన కూడా అనేక రకములును, ఉపరకములునూ పుట్టుచున్నవి. వ్యవసాయదారులచే ప్రత్యేకముగ వ్యవహరింపవడు తోటలలోనే యిట్టివి కలసియుండుట ఉంది.

ఆంధ్ర దేశమున ఆయా ప్రదేశములందు ప్రత్యేక రకములుగ పరగణింపబడుచున్న కొన్నిటిని గురించి ఈ క్రింద క్లుప్తముగా తెల్సుకుందాము.

ముండ్ల వంగ

[మార్చు]

దీనిని నీరు పెట్టకుండానే వర్షాధారమున సాగుచేయ వీలగును. మిగుల తక్కువ తేమతో పెరగగలుగును. ఆకులందు కాయలు తొడిమలందు, పుష్పకోశములపైనూ ముండ్లుండును. కాయ గుండ్రముగ నుండును. పెద్దదిగ ఎదిగి ఒక్కొక్కసారి 1కి.గ్రా. వరకూ తూగు కాయలు వచ్చును. పచ్చికాయపైన ఆకుపసరుగ ఉండి క్రింది భాగమున తెలుపుగా ఉండును. కొన్ని కాయలపై చారలుకానీ, మచ్చలు కాని ఉండును. కొండెవరం మొదలగు కొన్ని ప్రదేశములలో ముఖ్యముగా పాటినేలలందు పెంచవడును. ఈ రకపు వంగ మిగుల రుచివంతముగా ఉండుటచే చాలా ప్రసిద్ధి పొందినది. ఈ రకము వర్షాకాలాంతమున నాతి పెంచవడును. ఆయా ప్రదేశములందు వర్షాధారమున పెంచబడు రకములలో ఈ ముండ్ల రకమే చాలా శ్రేష్టమైనది.

ఆకుపచ్చ వంకాయలు

ఆత్రేయపురపు వంగ

[మార్చు]

ఇది పొడువుగాను, సన్నముగాను ఉండు కాయలను కాయును. ఇది కూడా మెట్ట ప్రాంతములలో పండించు వంగ రకమే. ముండ్లుండవు. తూర్పుగోదావరి జిల్లాలోని మధ్య డెల్టాయందలి ఆత్రేయపుర ప్రాంతములందలి మెట్ట భూములలో కొంత విరివిగా పెంచబడి యీ పండ్ల నుండి వరుగు తయారు చేయబడెను. అందువల్లే ఈ పేరు వచ్చింది. పచ్చి కాయలు ఆకుపచ్చగానూ, చారలు కలిగియూ ఉండును. ఇదియూ వర్షాకాలాంతమున నాతి పెంచబడు రకమే.

కస్తూరి వంగ

[మార్చు]

ఇది తొలకరిలో నాటి పెంచదగు ముళ్ళు లేని మెట్టవంగ. కాయ మధ్యమ పరిమాణముగలిగి కోలగా ఉండును. ఆకు పసరువర్ణపు చారలు, బట్టలు కలిగి ఉండును. క్రిందిభాగము లేబసరుగ కానీ, తెలుపుగా కానీ ఉండుటయు ఉంది. వర్షాకాలమున పుట్టుటచే ఈ కాయలు మెట్టవంగ కాయలంత రుచికరముగా ఉండవు

నీటి వంగ

[మార్చు]

ఇది శీతాకాలాంతమున నాటి నీరుకట్టి పెంచబడు, ముళ్ళులేని రకము. ఇందు కాయలు సుమారొక అంగుళము లావు వరకూ, 25-30 సెం.మీ. పొడవు వరకునూ పెరిగి ఊదారంగు కలిగి యుండును. కానీ యీ రంగునందు రకభేదమునుబట్టి లేత ముదురు భేదములునూ, పసరువర్ణమిశ్రణములును కానవచ్చును. కాయల పొడువునందు కూడా రకభేదములను బట్టి కాల భేదములను బట్టీ నేల యొక్క సత్తువను బట్టి కురుచ పొడవు తారతమ్యములుండును. నీరు కట్టి పెంచబడుటచేత ఈ కాయలు సామాన్యముగ రుచివంతముగా ఉండవు. కానీ గుంటూరు జిల్లాలో కొన్నిచోట్ల పెంచబడు తోటలలో ఫలించు మధ్యమరకము పొడవుగ ఎదుగు కాయలు రుచికి ప్రసిద్ధముగా ఉన్నాయి.

ఆకుపచ్చని పొట్టి వంకాయలు

గుత్తి వంగ

[మార్చు]

ఇది మిగుల చిన్నవిగా ఉండు కోల కాయలను గిత్తులుగగాయు మరియొక నీటివంగ రకము. సామాన్యముగా ఇతర రకములలో కూడా - ముఖ్యముగా నీటి వంగలోనూ, కస్తూరివంగలోనూ అరుదుగా రెండేసి కాయలొకే గెలలో బయలుదేరుచుండును, కాని యిందు తరచూ 2, 3 కాయలుగల గెలలు బయలుదేరును. కాయల సంఖ్య హెచ్చుగా ఉన్ననూ మొత్తమూపి దిగుబడి తక్కువగుటచేనీరకము విరివిగా సాగుచేయుటకు అనుకూలము కాదు. ఆంధ్రదేశమున ఈ గుత్తివంకాయ కూర బహుప్రసిద్ధి. ఈ కాయపైననే చలనచిత్రాలలో ఎన్నో పాటలూ, సంభాషణలు వ్రాయబడినాయి.

పోచవారి రకము

[మార్చు]

పోచావారి గుండ్రకాయలు రకము ఊదారకమును, దొడ్లలోనూ పెరళ్ళలోనూ నాటి పెంచదగిన ప్రశస్తమగు రకము. ఇవి రాష్ట్రములకు విదేశములనుండి తెప్పించబడింది. ఈ రకము యొక్క వ్యాప్తిలో వ్యవసాయ శాఖవారు శ్లాఘనీయమైన పాత్ర పోషించారు.

పూసాపర్పుల్‌ లాంగ

[మార్చు]

ఇది చిక్కటి ఊదారంగు కలిగి 8 - 10 అంగుళముల వరకు పొడవు ఉండును. ఈ రకము మంచి రుచి కలిగి యెక్కువ దిగుబడి నిచ్చును. ఇది వేసవి సాగుకు మిగుల ప్రశస్తమైనది. నాటిన 100 రోజులకు కాపు వచ్చును, తరువాత 75 రోజుల వరకూ కాయలు విపరీతముగా కాయును. ఈ రకము కాండము తొలిచే పురుగును తట్టుకొనగలదు. ఇది మొదట కాపు తగ్గిన తరువాత ఆకులను దూసి రెమ్మలను కత్తిరించి యెరువులు వగైరా దోహాదము చేసిన మరల చిగిర్చి కాపు కాయును. దీనిని 2 1/2 అంగుల వరసలలో 1 1/2 అడుగు దూరములో ఒక్కొక్క మొక్క చొప్పున నాటిన చాలును. ఢిల్లీ పరిశోధనా కేంద్రమువారు నాటిన రెండవ రోజూననే పారుదల నీటిని పెట్టి సాగు చేస్తున్నారు.

పూసాపర్పుల్‌ రౌండ్‌

[మార్చు]
వంకాయ పుష్పము

ఈ రకము కాయలు అర కేజీ వరకూ తూగును. ! కానీ మొక్కకు 10 వరకు కాయలు మాత్రమే వచ్చును. ఈ రకము కాండము తొలిచే పురుగును తట్టుకొనగలదు. కానీ కొక్కెర తెగులునకు తట్టుకోలేదు.

పూసా క్రాంతి

[మార్చు]

పూసా ఫల్గుని

[మార్చు]

పూసా బర్సాత్‌

[మార్చు]

H 158, H 128, H129

[మార్చు]

సాగు చేయు పద్దతి

[మార్చు]

వంగను వర్షాకాలపు పైరుగా సాగుచేసిన యెడల ఆ సంవత్సరము దాని తరువాత మెట్ట నేలలో మరియొక సస్యమౌను సాగు చేయుటకు సామాన్యముగా వీలుపడదు. దానిని శీతాకాలపు పైరుగా పెట్టుకొనినచో తొలకరిని నూవు, మెట్టవరి మొదలగువానిని సాగు చేయవచ్చును. కానీ వీనిని కోసిన వెనుక నేలను బాగుగ తయారుచేయుటకంతగా వ్యవధియుండదు. కనుక వంగకు ముందే పైరును పెట్టకుండుటయే మంచిది. తోటభూములలో పై సస్యములనే కాక అరటి, మిరప, పొగాకు మొదలగు వానితో కూడా వంగను మార్చి పెట్ట వచ్చును. నీటివంగ తోటలను సామాన్యముగా దంపనేలలో వరితో రెండవ పంటగ పరివర్తనము కావించుదురు.

విత్తులను చిన్న చిన్న మళ్ళలో జల్లి నారు పెంచి ఆ మొక్కలను నాటుటయే వంగ తోటలను పెంచు సామాన్యమైన విధానము. విత్తులను జల్లుటకు కొంతకాలము ముందు నారు మడిని బాగుగ ద్రవ్వి పెంట విస్తారముగ బోసి కలిపి తయారు చేయవలెను. మొక్కలు నాటు దూరమును బట్టి 400-600 గ్రాముల విత్తులను 1/2 - 3/4 సెంట్లు విస్తీర్ణమున వేసిన యెడలలో బాగుగ నెదిగిన మొక్కలోక ఎకరమునకు సరిపోవును. చిన్న పెరళ్ళలో 6 గ్రాముల విత్తులను 50 చదరపు మీటర్ల మడిలో పోసి పెంచిన నారు ఒక సెంటునకు సరిపోవును. బలిష్ఠముగా ఎదిగిన మొక్కలనే నాటి తక్కిన వానిని వదలివేయవచ్చును. ముళ్ళు కట్టి చదును చేసి విత్తులను సమముగ జల్లి కలిపి పైన నీరు చల్లవలెను. గింజలు మొలచుటకు 7–10 రోజులు పడుతుంది. అంతవరకు నారుమడి పైన యీతాకులు కానీ యితర ఆకులుగానీ పరచి కప్పవలెను. పదును కనిపెట్టి అప్పుడప్పుడు నీరు చల్లుచుండవలెను. గింజలు మొలకలెత్తనారంభించగనే పై కప్పు తీసివేసి యెండ క్రమముగ తగలనీయవలెను. అవసరమగునపుడెల్ల కుండలతో నీరు చిమ్ముచుండవలెను. సామాన్యముగ 6 వారములు మొదలు 2 నెలల వరకు నెదిగిన పిమ్మట నారు నాటుటకర్హముగనుండును. మిగుల లేత వంగనారు కంటే కొంచెము ముదురునారే ప్రశస్తముగనెంచవడును. వంగ ముదురు, వరి లేత అని సామెత. నారుమడిలో వారం పదిరోజులకొకసారిగా మాత్రము నీరుపోసి నారును రాటుదేల్చినచో పంట హెచ్చుగా వచ్చునని తెలియుచ్చున్నది.

వంగ మొక్కలను నాటు నేలను కూడా నారెదుగు లోపల తరచు బాగుగ ద్రవ్విగానీ, దున్నిగాని సిద్ధము చేయవలెను. శీతాకాలమున పెంచబడు మెట్టవంగతోటలకు నేలలను మరింత సమగ్రముగ తయారుచేయవలెను. లేనిచో నేలయందు తగిన పదును నిలచిన తోటయంత బాగుగగాని, హెచ్చు కాలముగాని కాయదు.

పది టన్నుల వంగపంట నేల నుండి 120 కిలోగ్రాముల నత్రజనిను, 80 కిలోగ్రాముల ఫాస్పారిక్‌ ఆసిడును తీసికొనును. సామాన్యమయిన పంటకు హెక్టారుకు 50 కి. గ్రాముల నత్రజనిను 60 ఫాస్ఫారిక్‌ ఆసిడును, 60 పొటాషును వేయుట మంచిదని కొందరి అభిప్రాయము.

చీడ పీడలు

[మార్చు]

అక్షింతల పురుగు (Epilachna (en))

[మార్చు]

ఇది పైన నల్లని చుక్కలు కలిగి చిన్నవిగను, గుండ్రముగనుండి ఒక జాతి. దీని శాస్త్రీయ నామం Henosepilachna vigintioctopunctata (en). వంగ మొక్కల ఆకులపై పచ్చని పొరను డింభదశయందునూ, పూర్ణదశయందునూ కూడా తినివేయును. డింభదశలో ఈ పురుగు ఎగురలేవు, కావున ఈ దశలో వీనిని సులభముగ ఏరి చంపవచ్చును. ఈ పురుగు చిస్తారముగా వ్యాపించినప్పుడు ఉల్లి పాషాణమునుగానీ, ఖటికపాషాణమును కానీ చల్లి చంపవచ్చును. పేలు, ఎర్రపేలు లేని చోట్ల డి డి టి 0.16 % చిమ్మవచ్చును. మాలాథియాన్‌ 0.16% ను కూడా దీనిని నివారించుటకు వాడవచ్చును

తలదొలుపు పురుగు

[మార్చు]

దీని శాస్త్రీయ నామం Leucinodes orbonalis (en) కాగా సాధారణ నామం shooter bore. ఇది ఇంచుక గులాబి వర్ణము కలిగియుండును. డింభము మొక్కల చిగుళ్ళను ఒక్కొక్కప్పుడు కాయలను కూడా తొలచును. పుప్పిపట్టిన చిగుళ్ళను, కాయలను వెంటనే కోసి గోతిలోవేసి కప్పవలెను. ఎండ్రిన్‌ 0.032% కాయలన్నిటిని కోసివేసిన పిదప చిమ్మవచ్చును. పిందెలను తీసివేసిన పిమ్మటనే దీని చిమ్మదగును. 0.25% కార్బరిల్‌ కూడా పనిచేయును.

కాడదొలుపు పురుగు

[మార్చు]

దీని శాస్త్రీయ నామం Euzophera perticella (en) కాగా సాధారణ నామం step borer. ఇది దీపపు పురుగు. దీని డింభము కాండమును తొలిచి మొక్కను చంపును. ఈ పురుగుపట్టి చచ్చిన మొక్కలను కాల్చివేయుటయు, కాపు ముగిసిన వెనుక మోళ్ళను వెంటనే పీకి తగులబెట్టుటయు ఈ తెగులు బాధను తగ్గించుకొనుటకు చేయవలసిన పనులు. ఎండ్రిన్‌, ఉపయోగించవచ్చు. నువాన్‌ కూడా ఉపయోగించవచ్చును

వంగపిండి పురుగు

[మార్చు]

ఇది ఒక పిండిపురుగు. దీని శాస్త్రీయ నామం Phenacoccus insolitus కాగా సాధారణ నామం Brinjal mealy bug. మొక్కల లేత భాగములకు బట్టి యందలి రసమును పీల్చుకొనును. ఇది చురుకుగ ఎదుగు మొక్కలను సామాన్యముగ పట్టదు. ఎపుడైన అచటచట ఒక మొక్కకు బట్టినచో అట్టి మొక్కలను కనిపెట్టి వెంటనే లాగివ్యవలెను. చాలా మొక్కలను బట్టినచో 0.05% పారాథియాను చిమ్మవలెను. కాయలు ఏర్పడియున్నచో నువాను చల్లవచ్చును. సామాన్యముగ ఈ చీడ కాపు ముగిసి మరళ విగుర్చు ముదితోటలలోని లేతకొమ్మలకే పట్టును. డి.డి.టీ. చల్లిన పిమ్మట ఈ పురుగులు అధికమగును. క్రిస్టోలీమసు అను పెంకుపురుగులను తెచ్చివివ్డిచినచో అవి పిండిపురుగులను అదుపులో ఉంచును.

వెర్రితల రోగము

[మార్చు]

వంగ తోటలకు వచ్చు తెగుల్లలో వెర్రితల రోగము ముఖ్యము. ఇది సూక్ష్మదర్శని సహాయముననైనను కంటికి కానరాని వైరసువలన వచ్చు తెగులు. ప్రథమ దశలో తెగులుబట్టిన కొమ్మలను హెచ్చుగ బట్టిన యెడల మొక్కలను తీసివేసి తగులబెట్టవలెను. ఈ వైరసును ఒక మొక్కనుండి మరియొక దానికి మోసుకొనిపోవు జాసిడులవంటి పురుగులను డి.డి.టి. చల్లి నివారించుటచే ఈ తెగులుయొక్క వ్యాప్తిని అరికట్టవచ్చును.

ఈ తెగులు తట్టుకోగల వంగడములు వాడుట శ్రేష్టము.

వంటకములు

[మార్చు]
చిక్కుడుకాయ వంకాయ పోపు కూర
వంకాయ అల్లం పచ్చిమిర్చి కూర
వంకాయ చిక్కుడుకాయ పోపు కూర
తరిగిన వంకాయలు (కూరకి సిద్ధం అవుతున్నాయి)

వంకాయలను చప్పిడి కూరగకానీ, పులుసుపెట్టి కానీ వండి తినవచ్చును. ముదురుకాయలును, గిజరుకాయలను కారము పులుసుపెట్టి వండిననేగాని తిన బాగుండవు. ఇటువంటి కాయలను ముందు ఉడుకబెట్టి వార్చి వేసినచో అందలి గిజరు మరికొంత తగ్గును. లేత కాయలను ముందు ఉడకబెట్టకుండ పోపులో నూనెవేసి మ్రగ్గనీయవచ్చును. లేక చమురులో వేచి పైన మసాలాపొడి చల్లవచ్చును. నిడివిగనుండు నీటివంకాయలను ముచికవద్ద కొంతభాగము విడిచి క్రింది భాగమును నాలుగు లేక ఆరు చీలికలుగ దరిగి యందు మసాలా పొదిని కూరి మువ్వ లేక గుత్తివంకాయగ కూడా వండి తినవచ్చును. గుండ్రని మెట్ట వంకాయను కాల్చి అల్లమును చేర్చి యిగురు పచ్చడిగగానీ, పులుసు పచ్చడిగ గానీ పెరుగుపచ్చడిగగానీ చేయవచ్చును. వంకాయ ముక్కలను సామాన్యపు పులుసులోనూ, మజ్జిగ పులుసులోనూ కూడా తరచు వేయుచుందురు. వంకాయ ముక్కలను వాంగీబాత్ మొదలను చిత్రాన్నములలో కూడా ఉపయోగింతురు. బంగాళాదుంప మొదలగు ఇతర కూరలతో కలిపి వండుటయు ఉంది. వంకాయ ముక్కలను పలుచని బిళ్ళలుగ తరిగి సెనగ వగైరా పిండితో చేసిన చోవిలో ముంచి చమురులో వేచి బజ్జీలుగ చేయవచ్చు[3].[4]

నానుళ్ళు, చాటుపద్యాలు

[మార్చు]

తెలుగునాట వంకాయపై దాని కూర రుచిపై అనేక నానుళ్ళున్నాయి. వంకాయ వంటి కూర, పంకజముఖి అయిన సీత వంటి భార్య, భారతం వంటి కథ ఉండవని ఒక నానుడి. ఇదే నానుడి కొద్ది మార్పులతో చాటుపద్యంగా కూడా ప్రచారంలో ఉంది.

 కం।। 
వంకాయ వంటి కూరయు
పంకజముఖి సీతవంటి భామా మణియున్
శంకరుని వంటి దైవము
లంకాధిపు వైరి వంటి రాజును గలడే!!
వంకాయ వంటి కూరా, పంకజముఖి ఐన సీత వంటి   భామామణి, శంకరుని వంటి దైవము, లంకకు రాజైన వాడికి   శత్రువు (శ్రీ రాముడు) వంటి రాజు. వీటన్నిటికీ  ప్రత్యామ్నాయాలున్నాయా? (లేవు) అని సారాంశం.

అలాగే వంకాయతో వెయ్యి రకాలు అని కూడా ఒక నానుడి.

వంకాయతో మేలు

[మార్చు]
వంకాయ అల్లం, పచ్చిమిర్చి కూర
వంకాయ కారప్పొడి కూర

వంకాయలో విటమిన్లు, ఖనిజాలు కీలకమైన ఫైటో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. వంకాయ పొట్టులో ఉండే ఆంథోసియానిన్ ఫైటో న్యూట్రియెంట్‌ను న్యాసునిన్ (nasunin) అంటారు. ఇది యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. శరీరంలో ఎక్కువైన ఇనుమును తొలగిస్తుంది. ఫ్రీరాడికల్స్‌ను నిరోధిస్తుంది. రక్తంలో కొలెస్ట్రాల్ కణాల దెబ్బతినటాన్ని నరోధించడం ద్వారా క్యాన్సర్‌ను నివారిస్తుంది. కీళ్లు దెబ్బతినటాన్ని తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ నిల్వల్ని తగ్గిస్తుంది.

మరింత వివరమైన వంకాయ వంటకాల కోసం ఈ క్రింది వివరములు చూడండి.

వంకాయలో పోషక విలువలు

[మార్చు]

100 గ్రాముల వంకాయలో ఈ క్రింది పోషక విలువలు ఉంటాయి.

  • మొత్తం పిండి పదార్థాలు – 17.8g
  • మాంసకృత్తులు – 8g
  • సంతృప్త క్రొవ్వులు – 5.2g
  • పీచు పదార్థం – 4.9g
  • మొత్తం క్రొవ్వులు – 27.5g
  • కొలెస్ట్రాల్ – 16 mg
  • చక్కెరలు – 11.4g
  • ఇనుము – 6 mg
  • విటమిన్ A – 6.4 mg
  • కాల్షియం – 525 mg
  • సోడియం – 62 mg
  • పొటాషియం – 618 mg

వంకాయ పై పాటలు

[మార్చు]

గుత్తి వంకాయ కూరోయ్ మామా............... కోరి వండి నాను మామా.........

వంకాయలో ఔషధ విలువలు

[మార్చు]
  • బల్ల వ్యాధికి వంకాయ అమోఘముగా పనిచేస్తుంది . పచ్చి వంకాయ పేస్టుకి పంచదార కలిపి పరగడుపున తినాలి .
  • వంకాయ కొలెస్టిరాల్ తగ్గించేందుకు సహకరిస్తుంది,
  • వంకాయ, టమటోలు కలిపి వండుకొని కూరగాతింటే అజీర్ణము తగ్గి ఆకలి బాగా పుట్టించును.
  • వంకాయను రోస్టు చేసి తొక్కను తీసేసి కొద్దిగ ఉప్పుతో తింటే " గాస్ ట్రబుల్, ఎసిడిటీ, కఫము తగ్గుతాయి.
  • వంకాయ ఉడకబెట్టి ... తేనెతో కలిపి సాయంత్రము తింటే మంచి నిద్ర వస్తుంది . నిద్రలేమితో బాధపడేవారికి ఇది మంచి ఆహారవైద్యము .
  • వంకాయ సూప్, ఇంగువ, వెళ్ళుల్లితో తయారుచేసి క్రమము తప్పకుండా తీసుకుంటే కడుపుబ్బరము (flatulence) జబ్బు నయమగును .
  • మధుమేహం ఉన్నవారు వంకాయ వలన అన్నము కొద్దిగ తినడము వలన, దీనిలోని పీచు పదార్థము మూలాన చక్కెర స్థాయిలు అదుపులో ఉండును .
  • కొన్ని ఆఫ్రికా దేశాలలో మూర్ఛ వ్యాధి తగ్గడానికి వాడుతున్నారు .
  • వంకాయ రసము నుండి తయారుచేసిన ఆయింట్ మెంట్లు, టించర్లు, మూలవ్యాధి (Haemorrhoids) నివారణలో వాడుతారు .
  • దీన్ని పేదవారి పోటీన్‌ (మాంసము ) గా నూట్రిషనిస్టులు భావిస్తారు .

జాగ్రత్తలు :

  • ఎసిడిటీ, కడుపులో పుండు (అల్సర్ ) ఉన్నవారు వంకాయ తినకూడదు,
  • గర్భిణీ స్త్రీలు వంకాయ తినడము మంచిది కాదు. ఎలర్జీలకు దారితీయును.
  • వంకాయ చాలా మందికి దురద, ఎలర్జీని కలిగించును .
  • శరీరముపైన పుల్లు, చర్మ వ్యాధులు ఉన్నవారు వంకాయ తినరాదు .

మూలాలు

[మార్చు]

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Oxford English Dictionary, 1st edition, 1891
  2. Oxford English Dictionary, 3rd edition, 2000, s.v.
  3. http://www.pennilessparenting.com/2011/09/vegan-meat-substitute.html
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-02-09. Retrieved 2014-01-27.

యితర లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=వంకాయ&oldid=4317324" నుండి వెలికితీశారు