డీహైడ్రేషన్
డీహైడ్రేషన్ | |
---|---|
డీహైడ్రేషన్, కలరా వలన కలిగిన హైపోవోలెమియా తగ్గించడానికి నోటి ద్వారా రీహైడ్రేషన్ ద్రావణాన్ని రోగికి తాగిస్తున్న నర్సు. కలరా వచ్చినపుడు నీరు (డీహైడ్రేషన్), సోడియం రెండింటినీ కోల్పోతారు. | |
ప్రత్యేకత | అత్యవసర వైద్య చికిత్స |
డీహైడ్రేషన్ (Dehydration) అంటే శరీరంలోని నీరు బాగా క్షీణించిపోవడం.[1] దీని వల్ల జీవక్రియ దెబ్బతింటుంది. దీనినే తెలుగులో జలహరణం అనవచ్చు.[2]
ఇది సాధారణంగా శరీరంలోనికి వెళ్ళే నీటికన్నా బయటికి వెళ్ళే నీరు ఎక్కువైనప్పుడు సంభవిస్తుంది. మితిమీరిన వ్యాయామం, వ్యాధులు, అత్యంత వేడి వాతావరణం దీనికి ముఖ్యమైన కారణాలు. వేడి వాతావరణంలో బయట తిరిగితే శరీరం నుంచి నీరు, ఖనిజాలు, లవణాలు చెమట రూపంలో ఎక్కువగా బయటకు వెళ్ళిపోతాయి. ఇది డీహైడ్రేషన్ కు దారితీస్తుంది.[3]
శరీరంలోని మొత్తం నీటిలో 3-4% ఆవిరైపోయినా మనుష్యుల్లో చాలావరకు తట్టుకోగలరు. 5-8% నష్టం అయితే కళ్ళు తిరగడం, అలసట సంభవిస్తాయి. నష్టం 10% కి మించితే భౌతికంగా మానసికంగా క్షీణించిపోతారు. విపరీతమైన దాహం వేస్తుంది. 15-25% నీరు పోతే మరణం సంభవిస్తుంది.[4] ఒక మాదిరి డీహైడ్రేషన్ అయితే కొంచెం అసౌకర్యంగా, దాహంగా ఉంటుంది. దీన్ని ఓరల్ రీహైడ్రేషన్ (ప్రత్యేకమైన ద్రవపదార్థాల్ని సేవింపజేయడం) ద్వారా పరిష్కరించవచ్చు.
లక్షణాలు
[మార్చు]బాగా దాహం వేయడం, తలనొప్పి, అసౌకర్యంగా అనిపించడం, ఆకలి మందగించడం, మూత్రం తక్కువగా రావడం, మానసికంగా గందరగోళం, ఏ కారణంలేకుండానే అలసటగా ఉండటం, గోళ్ళు ఊదారంగులోకి తిరగడం, మూర్ఛ మొదలైనవి డీహైడ్రేషన్ ప్రధాన చిహ్నాలు. శరీరంలో నీటి నష్టం ఎక్కువయ్యే కొద్దీ ఈ లక్షణాలు మరింత తీవ్రతరమవుతాయి.
కారణాలు
[మార్చు]ఎండ, తేమ శాతం ఎక్కువగా ఉన్న వాతావరణంలో ఎక్కువగా తిరిగేవారు, ఎత్తైన ప్రాంతాల్లో నివసించేవారు, శ్రమతో కూడిన పనులు, వ్యాయామాలు, క్రీడల్లో పాల్గొనేవారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్న వారు డీహైడ్రేషన్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.[5]
కొన్ని రకాల మందుల వాడకం ద్వారా కూడా డీహైడ్రేషన్కు గురి కావచ్చు.[6]
నివారణ
[మార్చు]సాధారణ స్థాయిలో పనిచేస్తున్నపుడు దాహం వేసినప్పుడల్లా నీరు త్రాగుతుంటే డీహైడ్రేషన్ రాకుండా చూసుకోవచ్చు.[7] కనీసం ఎంత నీరు తీసుకోవాలి అనేది సదరు వ్యక్తి బరువుపైన, వాతావరణంపైన, తీసుకునే ఆహారంపైన, జన్యులక్షణాల మీద ఆధారపడి ఉంటుంది.[8]
మూలాలు
[మార్చు]- ↑ Mange K, Matsuura D, Cizman B, Soto H, Ziyadeh FN, Goldfarb S, Neilson EG (November 1997). "Language guiding therapy: the case of dehydration versus volume depletion". Annals of Internal Medicine. 127 (9): 848–53. doi:10.7326/0003-4819-127-9-199711010-00020. PMID 9382413.
- ↑ ప్రెస్, అకాడెమీ. "పత్రికా పదకోశం". ఆంధ్రభారతి నిఘంటువు. Archived from the original on 2020-05-19.
- ↑ "మండుటెండల్లో మెదడులో విస్ఫోటం". ఈనాడు. 26 May 2020. Archived from the original on 26 May 2020. Retrieved 26 May 2020.
- ↑ Ashcroft F, Life Without Water in Life at the Extremes. Berkeley and Los Angeles, 2000, 134-138.
- ↑ "Dehydration Risk factors - Mayo Clinic". www.mayoclinic.org. Retrieved 2015-12-14.
- ↑ "Types of Drugs and Medications That Can Cause Dehydration". WebMD (in ఇంగ్లీష్). Retrieved 2020-05-26.
- ↑ "Dietary Reference Intakes: Water, Potassium, Sodium, Chloride, and Sulfate : Health and Medicine Division". www.nationalacademies.org (in ఇంగ్లీష్). Retrieved 2018-02-07.
- ↑ Godman, Heidi (September 2016). "How much water should you drink?". Harvard Health. Retrieved 2018-02-07.
బాహ్య లంకెలు
[మార్చు]Classification | |
---|---|
External resources |