Jump to content

శ్యామ్‌జీ కృష్ణ వర్మ

వికీపీడియా నుండి
పండిట్

శ్యామ్‌జీ కృష్ణ వర్మ
జననం(1857-10-04)1857 అక్టోబరు 4
మరణం1930 మార్చి 30(1930-03-30) (వయసు 72)
స్మారక చిహ్నంక్రాంతి తీర్థం, మాండవి, కచ్
విద్యాసంస్థబల్లియోల్ కాలేజ్, ఆక్స్‌ఫర్డ్
వృత్తిస్వాతంత్ర్య సమరయోధుడు, న్యాయవాది, పాత్రికేయుడు
ఇండియన్ హోం రూల్ సొసైటీ,
ఇండియా హౌస్,
ది ఇండియన్ సోషియాలజిస్ట్
ఉద్యమంభారత స్వాతంత్ర్య ఉద్యమం
జీవిత భాగస్వామిమూస:వివాహం
తల్లిదండ్రులుకార్సన్ భానుశాలి (నఖువా), గోమతిబాయి

శ్యామ్‌జీ కృష్ణ వర్మ (1857 అక్టోబరు 4 - 1930 మార్చి 30) భారతీయ విప్లవ పోరాట యోధుడు. న్యాయవాది.[1] పాత్రికేయుడు. బ్రిటిష్ వలస పాలకుల గడ్డ లండన్ నుంచే స్వాతంత్ర్య ఉద్యమానికి ఊపిరిలూదిన ధీరుడు. ఏకంగా లండన్ కేంద్రంగానే ఇండియా హౌస్, ఇండియన్ హోమ్ రూల్ సొసైటీ, ది ఇండియన్ సోషియాలజిస్ట్‌ పత్రికలను స్థాపించిన భారతీయ దేశభక్తుడు.

బాల్యం, విద్యాభ్యాసం, వృత్తి

[మార్చు]

శ్యామ్‌జీ కృష్ణ వర్మ గుజరాత్ లోని కచ్ లో 1857 లో జన్మించాడు. ముంబయిలోని విల్సన్ హైస్కూల్లో చదివాడు. సంస్కృతంలో పాండిత్యం సంపాదించాడు. 1875లో స్వామి దయానంద సరస్వతి స్ఫూర్తితో వేదతత్వంపై అధ్యయనం చేసాడు. 1877లో వారణాసి విశ్వవిద్యాలయం నుంచి పండిట్ బిరుదు పొందాడు. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి లా పట్టా పుచ్చుకున్నాడు. 1885లో స్వదేశం తిరిగొచ్చిన అతను న్యాయవాదిగా ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. 1897లో ఆ వృత్తిని వీడి మళ్లీ లండన్ వెళ్లాడు.

1900లో అక్కడ ఇండియా హౌస్ ను, 1905లో ది ఇండియన్ సోషియాలజిస్ట్‌ను స్థాపించాడు. తన సొంత డబ్బుతో భారతదేశంలో ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉపకారవేతనాలిచ్చేవాడు. లండన్‌లో చదువుకోవటానికి కూడా వారిని ప్రోత్సహించేవాడు. ఇలా వచ్చే విద్యార్థులతో, భారతీయులతో ఇండియా హౌస్ క్రమంగా లండన్ లో జాతీయోద్యమ వేదికగా రూపాంతరం చెందింది. వీర సావర్కర్, భికాజీ కామ, లాలా హర్దయాళ్, మదన్ లాల్ ధింగ్రా.. ఇలాంటి వారంతా ఇక్కడ తయారైనవారే.

ఇండియన్ సోషియాలజిస్ట్ పత్రిక స్థాపించి బ్రిటిష్ పాలనపై వ్యాసాలు రాసేవాడు, శ్యామ్‌జీ కృష్ణ వర్మ. స్వరాజ్య సాధన లక్ష్యంగా 1905లో ఇండియా హోమ్రూల్ సొసైటీని కూడా ఏర్పాటు చేశాడు. బ్రిటన్ తో పాటు మిగిలిన ఐరోపా దేశాల్లోనూ భారత స్వాతంత్ర్య ఆవశ్యకతను విడమరచి చెప్పే ప్రయత్నం చేశాడు. వీటన్నింటి కారణంగా శ్యామ్‌జీ కృష్ణ వర్మను లక్ష్యంగా చేసుకుంది, బ్రిటన్ ప్రభుత్వం. బ్రిటన్ కోర్టుల్లో అతను అడుగుపెట్టకుండా నిషేధించారు. అతనిపై నిఘా పెంచారు. పోలీసుల ఒత్తిడి పెరగటంతో తప్పించుకొని 1907లో ఫ్రాన్స్కు చేరుకున్నాడు. వెనక్కి రప్పించాలని బ్రిటిష్ ప్రభుత్వం ప్రయత్నించినా ఫ్రాన్స్ రాజకీయవర్గాల్లో అతనికున్న బలం కారణంగా అది సాధ్యపడలేదు. కింగ్ జార్జ్ ఫ్రాన్స్ పర్యటన నేపథ్యంలో అక్కడి నుంచి స్విట్జర్లాండ్ వెళ్లి అక్కడ ఒంటరిగా గడిపాడు. ఇదే అదనుగా అతన్ని గృహనిర్భందం చేసారు, బ్రిటన్ గూఢచారులు. తన సన్నిహితులనుకున్నవారే మోసం చేయటంతో 1930 లో స్విట్జర్లాండ్ లోనే అతను కన్నుమూసాడు.[2]

పోస్టల్ స్టాంప్
క్రాంతి తీర్థం, శ్యామ్‌జీ కృష్ణ వర్మ మెమోరియల్, మాండ్వి, కచ్ (బ్యాక్ గ్రౌండ్‌లో ఇండియా హౌస్ ప్రతిరూపం)

గుర్తింపు

[మార్చు]

తన జీవితాన్ని, సంపదనంతటినీ భారత స్వాతంత్ర్య సాధనకోసం దానం చేసిన అతను.. మరణించే ముందు స్విట్జర్లాండ్ ప్రభుత్వంతో, తన అస్థికలను భారత్ కు స్వాతంత్ర్యం వచ్చాకే అప్పగించాలని ఒప్పందం కుదుర్చుకున్నాడు. అతని మరణ వార్తను లోకానికి తెలియకుండా చేయాలని బ్రిటన్ ప్రభుత్వం చూసినా విఫలమైంది. లాహోర్ జైలులో భగత్ సింగ్ తదితరులు అతనికి నివాళి అర్పించారు. బాల గంగాధర్ తిలక్ ప్రారంభించిన ఆంగ్ల దినపత్రిక మరాఠా అతనికి నివాళి అర్పించింది. 2003 ఆగస్టు 22న అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోదీకి స్విస్ ప్రభుత్వం శ్యామ్‌జీ కృష్ణ వర్మ, అతని భార్య భానుమతిల అస్థికలను అప్పగించింది. అతని స్మృతి చిహ్నంగా లండన్ లోని ఇండియా హౌస్ లాంటి ఇంటినే మాండ్వాలో గుజరాత్ ప్రభుత్వం నిర్మించింది. అతని స్మారకార్థం 1989 అక్టోబరు 4న ఇండియా పోస్ట్ పోస్టల్ స్టాంపు విడుదల చేసింది. అతని గౌరవార్థం కచ్ విశ్వ విద్యాలయానికి అతను పేరు పెట్టింది.[2]

మూలాలు

[మార్చు]
  1. Chandra, Bipan (1989). India's Struggle for Independence. New Delhi: Penguin Books India. p. 145. ISBN 978-0-14-010781-4.
  2. 2.0 2.1 "Who was Shyamji Krishna Varma?". The Indian Express (in ఇంగ్లీష్). 2017-10-04. Retrieved 2021-10-24.