Jump to content

లాలా హర్ దయాళ్

వికీపీడియా నుండి
లాలా హర్ దయాళ్
1987లో హర్ దయాల్ జ్ఞాపకార్థంగా భారత తపాలా బిళ్ళ
పుట్టిన తేదీ, స్థలంహర్ దయాల్ సింగ్ మాథుర్
(1884-10-14)1884 అక్టోబరు 14
ఢిల్లీ, ఢిల్లీ డివిజన్, పంజాబ్ ప్రావిన్స్, బ్రిటిష్ ఇండియన్ ఎంపైర్
మరణం1939 మార్చి 4(1939-03-04) (వయసు 54)
ఫిలడెల్ఫియా, పెన్సిల్వేనియా, U.S.
గుర్తింపునిచ్చిన రచనలువిద్యా సమస్య, విద్యపై ఆలోచనలు, సంస్కృతికి సూచనలు, ప్రపంచ మతాల సంగ్రహావలోకనం, బౌద్ధ సంస్కృత సాహిత్యం

లాలా హర్ దయాళ్ సింగ్ మాథుర్ (1884 అక్టోబరు 14 - 1939 మార్చి 4) భారతీయ జాతీయవాద విప్లవకారుడు, స్వాతంత్ర్య సమరయోధుడు.[1] అతను భారతీయ సివిల్ సర్వీస్‌లో ఉద్యోగాన్ని తిరస్కరించిన బహుముఖ ప్రజ్ఞాశాలి . అతని సాధారణ జీవనం, మేధో చతురత మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో భారతదేశంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా కెనడా, అమెరికాల్లో నివసిస్తున్న అనేక మంది ప్రవాస భారతీయులను ఉత్తేజితులను చేసాయి.

జీవిత చరిత్ర

[మార్చు]

ప్రారంభ జీవితం

[మార్చు]

హర్ దయాళ్ సింగ్ మాథుర్ 1884 అక్టోబరు 14న ఢిల్లీలో హిందూ మాధుర్ కాయస్థ కుటుంబంలో జన్మించాడు.[2] అతను భోలీ రాణి, గౌరీ దయాల్ మాథుర్ ల ఏడుగురు పిల్లలలో ఆరవవాడు. అతని తండ్రి జిల్లా కోర్టు రీడర్. లాలా అనేది కాయస్థ కమ్యూనిటీలో ఉప-కుల హోదా ఏమీ కాదు, సాధారణంగా తెలివైన వ్యక్తుల పట్ల గౌరవ పురస్సరంగా వాడే పండిట్ వంటి పదం. చిన్నవయసులోనే అతనిపై ఆర్యసమాజ్‌ ప్రభావం పడింది. అతనికి శ్యామ్ కృష్ణవర్మ, వినాయక్ దామోదర్ సావర్కర్, భికాజీ కామాతో అనుబంధం ఉండేది. అతను గియుసేప్ మజ్జినీ, కార్ల్ మార్క్స్, మిఖాయిల్ బకునిన్ నుండి కూడా ప్రేరణ పొందాడు. ఎమిలీ బ్రౌన్ ప్రకారం, "అతను నాస్తికుడు, విప్లవకారుడు, బౌద్ధుడు, శాంతికాముకుడు" అని జుర్గెన్స్‌మేయర్ ఉటంకించాడు.

అతను కేంబ్రిడ్జ్ మిషన్ స్కూల్‌లో చదువుకున్నాడు. ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ నుండి సంస్కృతంలో బ్యాచిలర్ డిగ్రీ, పంజాబ్ విశ్వవిద్యాలయం నుండి సంస్కృతంలో మాస్టర్స్ డిగ్రీ కూడా పొందాడు. 1905లో, అతను సంస్కృతంలో ఉన్నత చదువుల కోసం ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నుండి రెండు స్కాలర్‌షిప్‌లను అందుకున్నాడు: 1907 బోడెన్ స్కాలర్‌షిప్, అతను చదువుతున్న సెయింట్ జాన్స్ కాలేజీ నుండి కాస్బర్డ్ ఎగ్జిబిషనర్ అనే అవార్డు.[3] 1907లో ప్రచురించబడిన ది ఇండియన్ సోషియాలజిస్ట్‌కి రాసిన లేఖలో, అతను అరాచక ఆలోచనలను అన్వేషించడం ప్రారంభించాడు, "మా లక్ష్యం ప్రభుత్వాన్ని సంస్కరించడం కాదు, దానిని తుడిచి పారెయ్యడం. అవసరమైతే మాత్రమే దాని ఉనికి యొక్క నామమాత్రపు జాడలను మాత్రమే వదిలడం" అని వాదించాడు. ఈ లేఖతో పోలీసులు అతనిపై నిఘా పెట్టారు. ఆ సంవత్సరం తరువాత, "టు హెల్ విత్ ది ICS " అంటూ, అతను ప్రతిష్ఠాత్మకమైన ఆక్స్‌ఫర్డ్ స్కాలర్‌షిప్‌లను వదులుకున్నాడు. నిరాడంబర జీవితం గడపడానికి 1908లో అతను భారతదేశానికి తిరిగి వచ్చాడు. కానీ భారతదేశంలో కూడా, అతను ప్రముఖ వార్తాపత్రికలలో దురుసు వ్యాసాలు రాయడం ప్రారంభించాడు. బ్రిటిష్ ప్రభుత్వం అతని రచనలను సెన్సార్ చేయాలని నిర్ణయించినప్పుడు, లాలా లజపతిరాయ్ అతన్ని విదేశాలకు వెళ్లమని సలహా ఇచ్చాడు. ఈ కాలంలోనే అతను ది ఇండియన్ సోషియాలజిస్ట్ను ముద్రించినందుకు విచారణకు గురైన అరాచకవాది గై ఆల్డ్రెడ్ తో స్నేహం చేసాడు.

1909 ఆగస్టు పారిస్ నుండి ప్రచురించబడిన వందేమాతరం సంచిక

1909 లో అతను పారిస్ వెళ్లి అక్కడ వందేమాతరం సంపాదకుడయ్యాడు. కానీ అతను పారిస్‌లో అంత సంతోషంగా లేడు. దాంతో పారిస్ వదిలి అల్జీరియాకు వెళ్లాడు. అక్కడ కూడా, అతను సంతోషంగా లేడు. క్యూబా లేదా జపాన్‌కు వెళ్లడం గురించి ఆలోచించాడు. ఆ తరువాత, అతను మార్టినిక్ వెళ్ళాడు. అక్కడ అతను నిరాడంబర జీవితం గడపడం ప్రారంభించాడు. ఆర్యసమాజ్ మిషనరీ, భాయ్ పరమానంద్ అతని కోసం వెతకడానికి అక్కడికి వెళ్లాడు. అతను ఒంటరిగా, ఏకాకిగా ఉన్నాడు. బౌద్ధమతం ఆధారంగా కొత్త మతాన్ని స్థాపించడంపై ఇద్దరూ చర్చించుకున్నారు. హర్ దయాళ్ ఉడకబెట్టిన ధాన్యం, బంగాళాదుంపలను మాత్రమే తింటూ, నేలపై నిద్రిస్తూ, ఏకాంత ప్రదేశంలో ధ్యానం చేస్తూ సన్యాసి జీవితాన్ని గడిపాడు. ఈ మతం నినాదం నాస్తికత్వం, కాస్మోపాలిటనిజం, నైతికత అని గై ఆల్డ్రెడ్ ఆ తరువాత చెప్పాడు . ఎమిలీ బ్రౌన్, ఎరిక్ ఎరిక్సన్ దీనిని అతని లోని "ఇగో-ఐడెంటిటీ" సంక్షోభంగా అభివర్ణించారు. ఆర్య జాతి ప్రాచీన సంస్కృతిని ప్రచారం చేసేందుకు హర్ దయాళ్ అమెరికా వెళ్లేందుకు అంగీకరించాడని పరమానంద్ చెప్పాడు.

హర్ దయాళ్ బోస్టన్ నుండి నేరుగా కాలిఫోర్నియాకు వెళ్లాడు. అక్కడ అతను అమెరికాలో జీవితం గురించి రాసాడు. తరువాత అతను హవాయిలోని హోనోలూలూ వెళ్ళాడు. అక్కడ అతను వైకికీ బీచ్‌లో కొంత సమయం గడిపాడు. తన బసలో, అతను జపనీస్ బౌద్ధులతో స్నేహం చేశాడు. కార్ల్ మార్క్స్ రచనలను కూడా అధ్యయనం చేయడం ప్రారంభించాడు. ఇక్కడ అతను భారతదేశంలో సమకాలీన ఆలోచనల్లో కొన్ని దశలు రాసాడు. ఆ తర్వాత దాన్ని మోడరన్ రివ్యూలో ప్రచురించాడు. కాలిఫోర్నియాకు తిరిగి వచ్చేందుకు పరమానంద్ అతనిని ఒప్పించాడు.

అమెరికాలో అరాచకత్వ క్రియాశీలత

[మార్చు]
గురు గోవింద్ సింగ్ సాహిబ్ ఎడ్యుకేషనల్ స్కాలర్‌షిప్ బ్రోచర్

అతను 1911 లో హర్ దయాళ్ అమెరికా వెళ్ళాడు. అక్కడ అతను పారిశ్రామిక సమైక్యవాదంలో పాల్గొన్నాడు. అతను ఫ్రిట్జ్ వోల్ఫ్‌హీమ్‌తో కలిసి శాన్ ఫ్రాన్సిస్కో బ్రాంచ్ ఆఫ్ ఇండస్ట్రియల్ వర్కర్స్ ఆఫ్ వరల్డ్ సెక్రటరీగా కూడా పనిచేశాడు. ఎర్ర జెండా యొక్క సోదరభావ సూత్రాలను వివరించే ఒక ప్రకటనలో, వారు "కమ్యూనిజం స్థాపన, పారిశ్రామిక సంస్థ, సార్వత్రిక సమ్మె ద్వారా భూమిలో పెట్టుబడులలో ప్రైవేట్ ఆస్తిని రద్దు చేయాలని ప్రతిపాదించారు, అంతిమంగా నియంతృత్వ రాజ్యాధికారపు రద్దు"ను ప్రతిపాదించారని చెప్పాడు. ఒక సంవత్సరం తర్వాత, ఈ సమూహానికి ఓక్లాండ్‌లో 6 ఎకరాలు (24,000 మీ2) భూమి, ఇల్లు లభించింది. అక్కడ అతను బకునిన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాలిఫోర్నియాను స్థాపించాడు. దానిని అతను "అరాజకత్వపు మొదటి మఠం"గా అభివర్ణించాడు.[4] బహిష్కరించబడిన మెక్సికన్లు రికార్డో, ఎన్రిక్ ఫ్లోర్స్ మాగోన్ స్థాపించిన పునరుత్పత్తి ఉద్యమంతో సంస్థ తనకు తానుగా జతకట్టింది. అతను లేలాండ్ స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో భారతీయ తత్వశాస్త్రం, సంస్కృతంలో లెక్చరర్‌గా నియమితుడయ్యాడు. అయితే, అరాచక ఉద్యమంలో తన కార్యకలాపాలకు ఈ ఉద్యోగం అడ్డుగా ఉన్నందున అతను దానికి రాజీనామా చేసాడు.

కాలిఫోర్నియాలో, స్టాక్‌టన్‌లోని పంజాబీ సిక్కు రైతులతో పరిచయాలను పెంచుకున్నాడు. పంజాబీలు, వీరిలో ఎక్కువ మంది సిక్కులు, శతాబ్దం ప్రారంభంలో పశ్చిమ తీరానికి వలస రావడం ప్రారంభించారు. వాంకోవర్‌లో కెనడియన్ల వ్యతిరేకత ఎదుర్కొన్నందున వారు అప్పటికే బ్రిటిష్ వారి పట్ల అసంతృప్తితో ఉన్నారు. ఈ చురుకైన సిక్కులు, ఇతర పంజాబీల మనోభావాలను తన భావాలకు అనుకూలంగా మలచుకున్నాడు. భారతీయ జాతీయవాద దృక్పథాన్ని పెంపొందించుకుని వైజ్ఞానిక, సామాజిక విద్యను పొందేందుకు యువ భారతీయులను ప్రోత్సహించాడు.[5][6] తేజా సింగ్, తారక్ నాథ్ దాస్, ఆర్థర్ పోప్ ల సహాయంతో, స్టాక్‌టన్‌కు చెందిన జ్వాలా సింగ్ అనే ధనిక రైతు సమకూర్చిన నిధులతో, అతను భారతీయ విద్యార్థుల కోసం గురు గోవింద్ సింగ్ సాహిబ్ ఎడ్యుకేషనల్ స్కాలర్‌షిప్‌ను ఏర్పాటు చేశాడు. లండన్‌లోని శ్యామ్‌జీ కృష్ణ వర్మ యొక్క ఇండియా హౌస్‌తో కలిసి, అతను ఈ విద్యార్థుల నివాసంగా తన ఇంటిని ఇచ్చాడు. అతని ఆఫర్‌కు ప్రతిస్పందించిన ఆరుగురు విద్యార్థులలో నంద్ సింగ్ సెహ్రా, దరిశి చెంచయ్య, తన భార్య తరపు బంధువైన గోవింద్ బిహారీ లాల్ ఉన్నారు. వారు బర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి సమీపంలో అద్దెకు తీసుకున్న అపార్ట్మెంట్లో కలిసి నివసించారు.

భారత వైస్రాయ్‌పై హత్యాయత్నం

[మార్చు]

ఆ సమయంలో, అతను ఇప్పటికీ తీవ్రమైన అరాచకవాద ప్రచారకుడి గానే ఉన్నాడు. భారతీయ విద్యార్థులతో కూడిన జాతీయవాద నలందా క్లబ్‌తో పెద్దగా సంబంధం లేదు. అయితే, 1912 డిసెంబరు 23 న భారతీయ వైస్రాయ్ లార్డ్ హార్డింగ్ ను చంపేందుకు బసంత కుమార్ బిస్వాస్ చేసిన ప్రయత్నం అతనిపై పెద్ద ప్రభావాన్ని చూపింది. ఈ వార్త చెప్పేందుకు రాత్రి భోజన సమయంలో నలందా క్లబ్ హాస్టల్‌కు వెళ్ళాడు. అక్కడ అతను ఒక ఉత్తేజకరమైన ఉపన్యాసం ఇచ్చాడు. ఢిల్లీకి చెందిన ఉర్దూ కవి మీర్ తాకి 'మీర్' చెప్పిన కింది షేర్‌తో ఆనాటి ప్రసంగాన్ని ముగించాడు:

పగడీ అప్నీ సంభాలియేగా 'మీర్' !
ఔర్ బస్తీ నహీ, యే దిల్లీ హై !!

తలపాగా జాగ్రత్త మీర్ !
ఇదేదో మీ ఊరి గల్లీ కాదు, ఇది దిల్లీ !!

(గమనిక: ఇక్కడ మీర్ అంటే బ్రిటిషువాళ్ళని కవి హృదయం.)

డ్యాన్సులతో, వందేమాతరం గానంతో హాస్టలు, వేడుక స్థలంగా మారిపోయింది. హర్ దయాళ్ ఉత్సాహంగా తన అరాచక మిత్రులకు భారతదేశంలో తన వ్యక్తి చేసిన పని గురించి చెప్పాడు.

అతను యుగాంతర్ సర్క్యులర్ అనే కరపత్రాన్ని తీసుకువచ్చాడు, అందులో అతను బాంబు దాడిని ప్రశంసించాడు:

జై! జై! జై!

1912 డిసెంబరు 13 నాటి బాంబు

ఆశ, ధైర్యాన్నిచ్చే ప్రతీహారి

నిద్రించే ఆత్మలకు మేలుకొలుపు

సాంద్ర నైతిక డైనమైటు

విప్లవం ముల్లుగర్ర

బాంబు నైతిక శక్తిని ఎవరు వర్ణించగలరు? ఇది సాంద్రీకృత నైతిక డైనమైట్. తమ శక్తితో అహంకారంతో బలవంతులు, మోసగాళ్లు నిస్సహాయులైన బాధితుల ముందు తమ కీర్తిని కవాతు చేసినప్పుడు, ధనవంతులు దుర్మార్గులు ఉన్నత పీఠంపై కూర్చున్నప్పుడు, తమ బానిసలను తమ కాళ్ళపై పడిపోయి పూజించమన్నప్పుడు, నేలబారు దుష్టులు ఆకాశపుటెత్తున కీర్తించబడినప్పుడు, వారి శక్తిని ఎవరూ తట్టుకోలేరని అనిపిస్తుంది. అప్పుడు ఆ అంధకారంలోంచి, మానవత్వపు వెలుగు చూపుతూ బాంబు వస్తుంది, నిరంకుశుడిని మట్టికరిపిస్తుంది. దేవుడిలా సింహాసనం మీద కూర్చున్న వాడూ మీలాంటి మనిషే అని బానిసలందరికీ చెబుతుంది. అప్పుడు, అవమానకరమైన ఆ క్షణాన, మానవులందరూ సమానమనే శాశ్వత సత్యాన్ని బోధిస్తుంది. గర్వంతో ఊగిపోయిన ఉన్నతాధికారులను, వైస్రాయ్‌లను తమ మహళ్ళ నుండీ అంబారీల నుండీ, సమాధికీ ఆసుపత్రికీ సాగనంపుతుంది. అప్పుడు, ఆ ఉద్విగ్న క్షణంలో, మానవ స్వభావం తనను చూసి తానే సిగ్గుపడినప్పుడు బాంబు, శక్తీ ఆడంబరాలు ఎంత వ్యర్థమో నిరూపించి, మనల్ని నీచత్వం నుండి విముక్తి చేస్తుంది.

ఎవరైనా శౌర్యాన్ని చూపినప్పుడు మనం ఎంత గొప్పగా భావిస్తాం? వారి నైతిక శక్తిని మనమూ పంచుకుంటాం. మానవ సమానత్వం గురించీ గౌరవం గురించీ వారు ఎలుగెత్తి వేసిన చాటింపుకు మనమూ గొంతు కలుపుతాం.

— లాలా హర్‌దయాళ్ (యుగంతర్ సర్క్యులర్:1913)

1914 ఏప్రిల్‌లో, అరాచక సాహిత్యాన్ని వ్యాప్తి చేసినందుకు అమెరికా ప్రభుత్వం అతన్ని అరెస్టు చేసింది. అప్పుడతడు జర్మనీలోని బెర్లిన్‌ పారిపోయాడు. బెర్లిన్‌లో అతను బెర్లిన్ కమిటీ (తరువాత అదే ఇండియన్ ఇండిపెండెన్స్ కమిటీ అయింది) ఏర్పాటులో కీలక పాత్ర పోషించాడు. జర్మన్ ఇంటెలిజెన్స్ బ్యూరోతో సహకరించాడు.[7] స్వీడన్‌లో ఒక దశాబ్దం పాటు నివసించాడు. లండన్ విశ్వవిద్యాలయంలో స్కూల్ ఆఫ్ ఓరియంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్ నుండి 1930లో Ph.D. పట్టా పొందాడు. 1932లో, అతను తన స్వీయ సంస్కృతికి సూచనలు అనే పుస్తకాన్ని ప్రచురించాడు. ఐరోపా, భారతదేశం, యునైటెడ్ స్టేట్స్‌లలో చేసే ఉపన్యాసాల శ్రేణిని ప్రారంభించాడు.

లాలా హర్ దయాళ్ 1939 మార్చి 4 న ఫిలడెల్ఫియాలో మరణించాడు. మరణించిన సాయంత్రం, అతను ఎప్పటిలాగే ఉపన్యాసం ఇచ్చాడు: "నేను అందరి తోటీ ప్రశాంతతతో ఉన్నాను" అని చెప్పాడు. కానీ లాలా హరదయాళ్‌కు అత్యంత సన్నిహిత మిత్రుడు, భారత్ మాతా సొసైటీ (దీన్ని 1907లో స్థాపించారు) వ్యవస్థాపక సభ్యుడూ అయిన లాలా హనుమంత్ సహాయ్ అతని మరణాన్ని సహజ మరణంగా అంగీకరించలేదు. అది విషప్రయోగమని అతను అనుమానించాడు.[8]

1987లో, భారత తపాలా శాఖ హర్ దయాళ్ గౌరవార్థం "భారత స్వాతంత్ర్య పోరాటం" సిరీస్‌లో స్మారక స్టాంపును విడుదల చేసింది.[9] మోడరన్ రివ్యూ 1912 మార్చి సంచిక కోసం అతను రాసిన "కార్ల్ మార్క్స్: మోడ్రన్ ఋషి" అనే వ్యాసం మలయాళంలోకి అనువదించబడింది. నాలుగు నెలల తర్వాత (1912 ఆగస్టు) స్వదేశాభిమాని రామకిష్ణ పిళ్లై దాన్ని ముద్రించాడు. రచయితకు సరైన ఆపాదింపు లేనందున, ఇది కాపీగా పరిగణించారు. దీనిని కేరళ లైబ్రరీ కౌన్సిల్ ప్రచురణ అయిన గ్రంథలోకం 2018 జనవరి సంచికలో ప్రముఖ సంపాదకుడు, రచయిత రామచంద్రన్ బహిర్గతం చేశాడు.  రెండింటి మధ్య ఉన్న సారూప్యతను కిరణ్ మోయిత్రా తన పుస్తకం "మార్క్సిజం ఇన్ ఇండియా"లో గుర్తించాడు.

లాలా హర్ దయాళ్ రచనలు

[మార్చు]

అందుబాటులో ఉన్న రిఫరెన్స్‌లతో అతని కొన్ని పుస్తకాలు క్రింద ఇవ్వబడ్డాయి:[10]

  1. మన విద్యా సమస్య : లాలా రాసిన వ్యాసాల సేకరణ. లాహోర్ నుండి వచ్చే పంజాబీ పత్రికలోలాలా లజపత్ రాయ్ పరిచయంతో 1922 లో పుస్తకంగా ప్రచురించబడింది.
  2. విద్యపై ఆలోచనలు : లాలాజీ పంజాబీ, మోడరన్ రివ్యూ (కలకత్తా నుండి ప్రచురించబడింది) పత్రికల్లో రాసిన వ్యాసాలు; వాటిలో ఎక్కువ భారతదేశంలోని బ్రిటిష్ ప్రభుత్వ విద్యా విధానానికి వ్యతిరేకంగా ఉన్నాయి.
  3. హిందూ జాతి యొక్క సామాజిక విజయం : బ్రిటీష్ రాజ్ నిషేధించిన 21 పేజీలతో కూడిన బుక్‌లెట్. Acc నం.74. కింద నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియాలో ఉంది.
  4. లాలా హర్ దయాళ్ రచనలు : ఈ పుస్తకాన్ని 1920లో వారణాసి లోని స్వరాజ్ పబ్లిషింగ్ హౌస్, ప్రచురించింది.
  5. జర్మనీ, టర్కీలో నలభై-నాలుగు నెలలు : ఈ పుస్తకాన్ని 1920లో లాలాజీ స్వీడన్‌లో నివసిస్తున్నప్పుడు లండన్‌లోని PS కింగ్ అండ్ సన్స్ ప్రచురించారు.
  6. లాలా హర్ దయాళ్ జీ కే స్వాధీన్ విచార్ : ఈ పుస్తకాన్ని శ్రీ నారాయణ్ ప్రసాద్ అరోరా హిందీలోకి అనువదించారు.
  7. అమృత్ మే విష్ : ఇది 'థాట్స్ ఆన్ ఎడ్యుకేషన్' కు హిందీ అనువాదం.
  8. స్వీయ సంస్కృతికి సూచనలు : లాలా హర్ దయాళ్ రాసిన ఈ ప్రసిద్ధ పుస్తకాన్ని లండన్‌లో 1934లో Hy.SLPolak & Co. (UK)చే ప్రచురించింది.
  9. ప్రపంచ మతాల సంగ్రహావలోకనాలు' : ఇది చరిత్ర, నీతి, వేదాంతశాస్త్రం, మత తత్వశాస్త్రం యొక్క అనేక కోణాల నుండి లాలా హర్ దయాళ్ సత్ర్వమత సందర్శన.
  10. బోధిసత్వ సిద్ధాంతాలు : హర్ దయాళ్‌కు గురువుగా ఉన్న లాలా లజపత్ రాయ్, గౌతమ బుద్ధుని సూత్రాల ఆధారంగా ఒక ప్రామాణికమైన పుస్తకాన్ని రాయమని సూచించాడు. 1927లో హర్ దయాళ్‌కు భారతదేశానికి తిరిగి రావడానికి బ్రిటిష్ ప్రభుత్వం అనుమతి ఇవ్వనప్పుడు, అతను లండన్‌లోనే ఉండాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు అతను ఈ పుస్తకం రాసి, దానిని థీసిస్‌గా విశ్వవిద్యాలయానికి అందించాడు. ఈ పుస్తకం పిహెచ్‌డి కోసం ఆమోదించారు. 1932లో అతనికి డాక్టరేట్ లభించింది. ఇది 1932 సంవత్సరంలో లండన్‌లో ప్రచురించాడు. మోతీలాల్ బనార్సిదాస్ పబ్లిషర్స్ ఆఫ్ ఇండియా వారు 1970లో ఈ పుస్తకాన్ని బౌద్ధ సంస్కృత సాహిత్యంలో బోధిసత్వ సిద్ధాంతాలుగా తిరిగి ప్రచురించారు.

మూలాలు

[మార్చు]
  1. Brown, Emily C. (1975). Har Dayal: Hindu Revolutionary and Rationalist. Tucson: University of Arizona Press. ISBN 0-8165-0422-9.
  2. Sareen, Tilakraj (1994). Select Documents on the Ghadr Party. Mounto Publishing House. p. 20. Hardayal was a Delhi man, a high caste Hindu of the Mathur, Kayastha Community
  3. "Making of Britain". Open University. Retrieved 24 October 2013.
  4. Avrich, Paul (1988). Anarchist Portraits. Princeton: Princeton University Press. p. 30. ISBN 0-691-00609-1.
  5. Farquhar, J.N. The Crown Of Hinduism. pp. 36–37. ISBN 978-1375792240. Metaphysics has been the curse of India. It has blighted her history and compassed her ruin. ... It has blinded her seers and led them to mistake phantoms for realities. ... Young men of India, look not for wisdom in the musty parchments of your metaphysical treatises. There is nothing but an endless round of verbal jugglery there. Read Rousseau and Voltaire, Plato and Aristotle, Haeckel and Spencer, Marx and Tolstoi, Ruskin and Comte, and other European thinkers, if you wish to understand life and its problems. India has hundreds of really sincere and aspiring young men and women, who are free from all taint of greed and worldliness, but they are altogether useless for any purpose that one may appreciate. They have established monasteries in remote, nooks in the mountains in order to realize the Brahman.
  6. "The Inanity of Brahman and the Vedantic Worldview". Nirmukta (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2012-02-16. Archived from the original on 2020-07-26. Retrieved 2020-07-26. We keep moving in the old rut; we edit and re-edit the old books instead of translating the classics of European social thought. Indian pundits and graduates seem to suffer from a kind of mania for what is effete and antiquated. Thus an institution, established by progressive men, aims at leading our youths through Sanskrit grammar to the Vedas via the Six Darshanas! What a false move in the quest for wisdom!
  7. Liebau, Heike (2019). ""Unternehmungen und Aufwiegelungen": Das Berliner Indische Unabhängigkeitskomitee in den Akten des Politischen Archivs des Auswärtigen Amts (1914–1920)". MIDA Archival Reflexicon: 3–4.
  8. Dr.'Krant', M.L.Verma (2006). Swadhinta Sangram Ke Krantikari Sahitya Ka Itihas (Vol-2). New Delhi-110002 (India): Praveen Prakashan. p. 452. ISBN 81-7783-120-8.{{cite book}}: CS1 maint: location (link)
  9. Jain, Manik (2018). Phila India Guide Book. Philatelia. p. 114.
  10. Dr.'Krant', M.L.Verma (2006). Swadhinta Sangram Ke Krantikari Sahitya Ka Itihas (Vol-2). New Delhi (India): Praveen Prakashan. pp. 453–458. ISBN 81-7783-120-8.