వీరపాండ్య కట్టబ్రహ్మన

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వీరపాండ్య కట్టబ్రహ్మన
తెన్‌కాశి పాలెగాడు
Veerapandiya Kattabomman 1999 stamp of India.jpg
1999 నాటి వీరపాండ్య కట్టబ్రహ్మన తపాళాబిల్ల
Reign16 అక్టోబర్ 1799న ముగిసింది
Successorబ్రిటిష్ సామ్రాజ్యం
జననంజనవరి 1760
పాంచాలన్‌కురిచ్చి, భారత దేశం
మరణం1799 అక్టోబరు 16(1799-10-16) (వయసు 39)
కయత్తాఱు
Spouseజక్కమ్మ
తండ్రిజగవీర కట్టబ్రహ్మన
తల్లిఆరుముగత్తమ్మ

వీరపాండ్య కట్టబ్రహ్మన (కట్టబొమ్మన్, జగవీర పాండ్య సుబ్రహ్మణ్య కట్టబొమ్మన్) 18శతాబ్దానికి చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు. ఇతను పాలేగార్లలో ఒకడు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సార్వభౌమాధికారాన్ని కాదని వారికి విరుద్ధంగా తిరుగుబాటు చేసాడు. ఇతడిని 39 ఏళ్ళ వయస్సులో సా.శ. 1799లో అక్టోబరు 16వ తేదీన బ్రిటిష్ వారు బంధించి ఉరి తీసారు.[1] ఇతను తెలుగు మాట్లాడే రాజకంబళం నాయక్కర్ తెగలో జన్మించాడు. ఇతని పూర్వీకులు మహమ్మదీయుల దండయాత్ర తర్వాత కంపిలి రాజ్యాన్ని కోల్పోయి విజయనగరాన్ని సృష్టించారు. తరువాత వారు చోళ దేశంలో, పాండ్య దేశంలో నివసించారు. అప్పుడు మహమ్మదీయులు దండయాత్ర చేసి చోళ, పాండ్య రాజులపై దాడి చేసి దేశాన్ని జయించి 50 ఏళ్ళు పాలించారు. పాండ్య దేశంలో దేవాలయాలు ధ్వంసమయ్యాయి. మదురై మీనాక్షి ఆలయాన్ని మూసివేశారు. విజయనగర సామ్రాజ్యపు దళాలు వచ్చి తిరిగి ఈ ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ సందర్భంలో పాంచాలన్‌కురిచ్చిని పాలించిన పాండ్య రాజు వీరపాండ్య కట్టబ్రహ్మన పూర్వీకుల పరాక్రమానికి మెచ్చి పాంచాలన్‌కురిచ్చిని బహుమతిగా సమర్పించారు.

పేరు ప్రాముఖ్యత[మార్చు]

అళగియ వీరపాండ్యపురం (ప్రస్తుత ఒట్టపిడారం) ను పాలించిన జగవీరపాండ్యన్ (నాయక రాజవంశం) మండలిలో మంత్రిగా ఉన్న జెట్టిబొమ్ము అప్పటి తెలుగు ప్రాంతమైన బళ్ళారి నుంచి వచ్చాడు. తెలుగులో వీరత్వం అనే అర్థం వచ్చే జెట్టిబొమ్ము అనే పదం ఆ తర్వాత కట్టబొమ్ముగా మారి తమిళంలో కట్టబొమ్మన్‌గా మారింది. జగవీర పాండ్యన్ మరణానంతరం సింహాసనాన్ని అధిష్టించిన మొదటి (ఆది) కట్టబొమ్మన్‌ను కట్టబొమ్మన్ అని పిలుస్తారు. అతను బొమ్మన్ కుటుంబానికి మొదటి బొమ్మన్.[2] జగవీర (దిగ్విజయ) కట్టబొమ్మన్ మరియు ఆరుముగతమ్మాళ్ దంపతులు ఈ బొమ్మన్ సంప్రదాయానికి చెందిన వారసులు. వారి కుమారుడు వీరపాండ్యన్ కట్టబొమ్మన్. ఇతనినే వీరపాండ్యన్ అని కూడా పిలుస్తారు. నాయక వంశాన్ని పరిపాలించడంతో ఇతడు బొమ్మునాయకర్ అని ప్రసిద్ధి చెందాడు.

జీవితం[మార్చు]

వీరపాండ్య కట్టబ్రహ్మన 1760 జనవరి 3న పాంచాలన్‌కురిచ్చిలో ఆరుముగతమ్మాళ్-దిగ్విజయ కట్టబొమ్మన్ దంపతులకు జన్మించాడు. 1790 ఫిబ్రవరి 2న పాలెగారుగా బాధ్యతలు స్వీకరించాడు. ఇతనికి అప్పుడు ముప్పై ఏళ్ళు. వీరపాండ్య కట్టబొమ్మన్‌కు ఉమైదురై, దురైసింగం అనే ఇద్దరు సోదరులు మరియు ఈశ్వరవడివు, దురైకణ్ణు అనే ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. ఇతని భార్య చక్కమ్మాళ్. వీరికి పిల్లలు లేరు. ఇతను 9 సంవత్సరాల 8 నెలల 14 రోజుల పాటు పాలెగారుగా పాలించాడు.

బ్రిటిష్‌కు విరుద్ధంగా తిరుగుబాటు పోరు[మార్చు]

కర్నాటక పాలకులైన ఆర్కాట్ నవాబులు వలసదారుల నుండి పన్నులు వసూలు చేసే హక్కును కుంఫిణి స్నేనలకు అప్పగించారు. ఈ ఒప్పందం ప్రకారం నెల్లై సీమలో బియ్యాన్ని సేకరించే బాధ్యతను బ్రిటిష్ కమాండర్ మాక్స్వెల్ తీసుకున్నాడు. అయితే అరతనికి పాంచాలన్‌కురిచ్చిలో స్థిరపడిన వీరపాండ్య కట్టబొమ్మన్ నుండి తిరుగుబాటు వచ్చింది. అతను పన్ను సేకరించలేక పై అధికారులకు ఫిర్యాదు చేసాడు. సా.శ. 1797లో, మొదటి ఇంగ్లీషు సైన్యాధిపతి అలాన్ దొర పెద్ద సైన్యంతో పోరాడేందుకు పాంచాలన్‌కురిచ్చి కోటకు వచ్చాడు. 1797 - 1798లో జరిగిన మొదటి యుద్ధంలో అలన్ దొర కోటను ధ్వంసం చేయలేక వీరపాండ్య కట్టబొమ్మన్ చేతిలో ఓడిపోయాడు. నెల్లూరు జిల్లా కలెక్టర్ జాక్సన్ దొర వీరపాండ్య కట్టబొమ్మన్‌ను కలవడానికి ఆహ్వానించాడు. జాక్సన్‌ను అవమానించాలనే ఆలోచనతో కట్టబొమ్మన్ ఉద్దేశపూర్వకంగా అనేక ప్రాంతాలకు తప్పించుకుని తిరిగాడు. చివరకు 1798 సెప్టెంబరు 10న జాక్సన్ రామనాథపురంలో కట్టబొమ్మన్‌ను కలుసుకున్నాడు. అప్పుడు వీరపాండ్య కట్టబొమ్మన్‌ను కుతంత్రంతో బంధించడానికి ప్రయత్నించాడు. దానిని అధిగమించి వీరపాండ్య కట్టబొమ్మన్ మళ్ళీ పాంచాలన్‌కురిచ్చి చేరుకున్నాడు. 1799 సెప్టెంబరు 5న, బానర్‌మాన్ అనే ఆంగ్ల సైన్యాధ్యక్షుడు పాంచాచలన్‌కురిచ్చి కోటను ముట్టడించాడు. భారీ పోరు జరిగింది. యుద్ధంలో చాలా మంది ఆంగ్లేయులు చనిపోయారు. అయితే కోట కూలిపోతుందనుకోవడంతో వీరపాండ్య కట్టబొమ్మన్ కోటను వదిలి పారిపోయాడు.

కట్టబ్రహ్మన విగ్రహం
కట్టబ్రహ్మన విగ్రహం

మరణం[మార్చు]

1799 సెప్టెంబరు 9న పాంచాలన్‌కురిచ్చి కోటను బ్రిటిష్ వారు స్వాధీనం చేసుకున్నారు. 1799 అక్టోబరు 1న పుదుక్కోట్టై రాజు విజయరఘునాథ తొండమాన్ వీరపాండ్య కట్టబొమ్మన్‌ను బంధించి కుంఫిణీ (ఈస్ట్ ఇండియా కంపెనీ) సేనలకు అప్పగించాడు. 1799 అక్టోబరు 16న ఇంగ్లీషు జనరల్ బ్యానర్‌మాన్ ఆదేశానుసారం కట్టబొమ్మన్‌ను ఉరితీసారు.

కట్టబొమ్మన్ వారసత్వం[మార్చు]

కట్టబొమ్మన్‌ని ఉరితీయడంతో పాంచాలన్‌కురిచ్చి చరిత్ర ముగిసిపోలేదు. పాలయంకోట్టైలో బ్రిటిష్ వారు ఖైదు చేసిన కట్టబొమ్మన్ సోదరుడు ఉమైదురై 1801 ఫిబ్రవరి 02న పాంచాలన్‌కురిచ్చి సైన్యం ద్వారా తప్పించుకున్నాడు. ఆ తరువాత ఇతని హయాములో పాంచాలన్‌కురిచ్చి కోట పునరుద్ధరించబడింది. ఉమైదురైను బంధించేందుకు వచ్చిన మేజర్ మెకాలీ కోటలోకి ప్రవేశించలేక వెనుదిరిగాడు. మెకాలీ ఆధ్వర్యంలో ఒక పెద్ద సైన్యం 1801 మార్చి 30న కోటను ముట్టడించడం ప్రారంభించి 1801 మే 24న దానిని స్వాధీనం చేసుకుంది. అక్కడి నుండి తప్పించుకున్న తర్వాత, కలైయార్ కోవిల్, విరుపాచ్చి, దిండిగల్ మరియు ప్రణ్మలైలకు పారిపోయిన ఉమైదురై, అతని సోదరుడు దురైసింగాన్ని బంధించి పాంచాలన్‌కురిచ్చి ఫిరంగి దిబ్బ వద్ద బ్రిటిష్ వారు ఉరితీసారు. తెల్లదొరలు తమిళనాడు పటం నుండి పాంచాలన్‌కురిచ్చి పేరును తొలగించారు. కోటను పూర్తిగా నేలమట్టం చేసి చదును చేశారు. 1974లో అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి పాంచాలన్‌కురిచ్చిలోని పురాతన కోటను పోలిన కోటను నిర్మించాడు. అది వీరపాండ్యన్‌ను వారసత్వాన్ని ప్రతిబింవిస్తూ నేటికీ నిలిచి ఉంది. కోట, కొలువుమండపం, జక్కమ్మ దేవి గుడి అన్నీ మళ్ళీ రూపొందించబడ్డాయి. స్మారక కోట చుట్టూ 6 ఎకరాల విస్తీర్ణంలో గోడను నిర్మించారు. లోపల పురావస్తు కేంద్రం ఉంది. హాలు లోపల కట్టబొమ్మన్ వీర చిత్రాలు ఉన్నాయి. ఈ కోటను 1977 నుండి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ పర్యాటక శాఖ నిర్వహిస్తోంది. ప్రస్తుతం 35 ఎకరాలకు పైగా ఉన్న పాత కోటకు సంబంధించిన నేలమాళిగ భారత పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉంది. కట్టబొమ్మన్ ఉపయోగించిన ఆయుధాలు, ఆయన కాలం నాటి ప్రజలు ఉపయోగించిన వివిధ వస్తువులు, నగలు, నాణేలు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు గుర్తించి చెన్నైలోని తమిళనాడు ప్రభుత్వ మ్యూజియంలో ప్రజల ప్రదర్శనకు ఉంచారు.

మూలాలు[మార్చు]

  1. "వీర పాండ్య కట్టబొమ్మన్‌". వార్త. వార్త. 16 July 2017. Archived from the original on 19 మార్చి 2022. Retrieved 19 March 2022.{{cite news}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "Major John Bannerman on the hanging of Veerapandiya Kattabomman". తమిళ్‌నేషన్. Retrieved 19 March 2022.