Jump to content

మహాదేవ గోవింద రనడే

వికీపీడియా నుండి
మహాదేవ గోవింద రనడే
జననం(1842-01-18)1842 జనవరి 18
నాసిక్ జిల్లా, బాంబే ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా
మరణం1901 జనవరి 16(1901-01-16) (వయసు 58)
ముంబై
విద్యాసంస్థబాంబే విశ్వవిద్యాలయం
వృత్తిపండితుడు, సంఘ సంస్కర్త, రచయిత
సుపరిచితుడు/
సుపరిచితురాలు
భారత జాతీయ కాంగ్రెస్ సహ వ్యవస్థాపకుడు
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామిరమాబాయి రనడే

మహాదేవ గోవింద రనడే (1842 జనవరి 18 – 1901 జనవరి 16) ఒక భారతీయ విద్యావేత్త, సంఘ సంస్కర్త, న్యాయమూర్తి, రచయిత. ఇతను భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరు.[1] బాంబే లెజిస్లేటివ్ కౌన్సిల్లోనూ, కేంద్ర ఆర్థిక కమిటీల్లోనూ, బాంబే హైకోర్టులో న్యాయమూర్తిగా పలు పదవులు నిర్వహించాడు.[2]

గోవింద రనడే ప్రజలకు బాగా తెలిసిన వ్యక్తి, ప్రశాంతమైన వ్యక్తిత్వం కలవాడు, ఓరిమి కలిగిన ఆశావాది. ఈ లక్షణాలే అతను బ్రిటన్ తో వ్యవహరించడం, భారతదేశంలో సంస్కరణలు అమలుచేయడం లాంటి కార్యక్రమాల్లో అతని వైఖరిని ప్రభావితం చేశాయి. రనడే జీవిత కాలంలో వక్తృత్వోత్తేజక సభ, పూర్ణ సార్వజనిక సభ, మహారాష్ట్ర గ్రంథోత్తేజక సభ, ప్రార్థనా సమాజం లాంటి సంస్థలను స్థాపించాడు. తన సాంఘిక, మత సంస్కరణల ఆలోచనలకు అనుగుణంగా ఇందుప్రకాష్ అనే మరాఠీ-ఆంగ్ల దినపత్రికను నిర్వహించాడు.ఇతను రావు బహదూర్ అనే బిరుదును అందుకున్నాడు.[3]

బాల్యం, విద్యాభ్యాసం

[మార్చు]

మహాదేవ గోవింద రనడే మహారాష్ట్ర, నాసిక్ జిల్లా లో ఓ తాలూకా పట్టణమైన నిఫాడ్ లో 1842 జనవరి 18 న ఒక చిత్‌పవన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు.[4] కొల్హాపూర్ లోని ఒక మరాఠీ పాఠశాలలో చదివాడు, తర్వాత ఓ ఆంగ్ల మాధ్యమం పాఠశాలకు మారాడు. 14 సంవత్సరాల వయసులో బాంబేలోని ఎల్ఫిన్‌స్టోన్ కళాశాలలో చేరాడు.[5] బాంబే విశ్వవిద్యాలయం మొదటి విద్యార్థుల్లో ఈయనా ఒకడు. 1862 లో అక్కడ నించి ఆర్థిక శాస్త్రం, చరిత్రలో బి. ఎ పట్టా పుచ్చుకున్నాడు. 1864 లో చరిత్రలో ఎం. ఎ చదివాడు. 1867 లో ఎల్. ఎల్. బి పట్టా పుచ్చుకున్నాడు.

వివాహం

[మార్చు]

ఆయన ముప్ఫై సంవత్సరాల వయసు పైబడి ఉండగా మొదటి భార్య మరణించింది. ఆయన కుటుంబం ఆయన్ను మళ్ళీ పెళ్ళి చేసుకోమని కోరింది. ఆయన వితంతు వివాహాలను ప్రోత్సహిస్తుండటం చూసిన స్నేహితులు, శ్రేయోభిలాషులు ఆయన ఒక వితంతువు ను వివాహం చేసుకుని ఆదర్శంగా నిలుస్తాడనుకున్నారు కానీ అలా జరగలేదు. ఆయన కుటుంబ పెద్దలకు తలవంచి తన కన్నా సుమారు ఇరవై సంవత్సరాలు చిన్నదైన 11 ఏళ్ల రమాబాయిని వివాహం చేసుకున్నాడు. ఇందుకు కారణం ఒకవేళ ఆయన వితంతువును పెళ్ళి చేసుకుని వారికి పిల్లలు కలిగితే వారిని అంటరానివారిగా భావించేది ఆనాటి సమాజం. దీని వల్ల ఆయన పలు విమర్శలకు గురైనాడు. అయితే ఆయనకు మళ్ళీ సంతానం కలగనే లేదు. కానీ దంపతులిద్దరూ ఏ అభిప్రాయ బేధాలు లేకుండానే జీవించారు.

ఉద్యోగం, సామాజిక సేవ

[మార్చు]

న్యాయవిద్య పూర్తయిన తర్వాత 1871 లో పూనాలో సబార్డినేట్ జడ్జిగా నియమితుడయ్యాడు. ఆయన రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనడం గమనించిన ఆంగ్లేయులు 1895 దాకా ఆయనను బాంబే హైకోర్టుకు పంపే పదోన్నతికి అడ్డుపడుతూ వచ్చారు.[6]

సాంఘిక సంస్కర్తగా ఆయన కొన్ని పాశ్చాత్య భావాలకు ప్రభావితుడయ్యాడు. అందరికీ విద్య, సమానత్వం, మానవత్వం మొదలైనవి ఇందులో ప్రధాన అంశాలు.

మతపరంగా హిందూమతంలో ఆయన చేయాలనుకున్న సంస్కరణలు ప్రార్థనా సమాజం స్థాపించడానికి ప్రేరణనిచ్చాయి.

అప్పటి హిందూ సమాజంలో స్త్రీల కోసం ఏర్పడ్డ పరదా విధానంపై ఆయన వ్యతిరేకత ప్రకటించాడు. అలాగే బాల్య వివాహాలు, భర్త మరణించిన స్త్రీలకు శిరోముండనం చేయించడం లాంటి ఆచారాలను ఖండించాడు. పెళ్ళిళ్ళు, ఇతర కార్యాల కోసం పెద్ద ఎత్తున ధనాన్ని ఖర్చు పెట్టడం, కొన్ని కులాల వారు విదేశాలకు వెళ్ళడానికి ఉన్న నిర్బంధాలు మొదలైన వాటికి వ్యతిరేకంగా పోరాడాడు. వితంతు వివాహాలను, స్త్రీ విద్యను ప్రోత్సహించాడు. ఆంగ్లేయుల పాలనా విధానంలో పునర్వివాహాలను అనుమతించే చట్టాలను తీసుకురావడానికి ప్రయత్నించాడు.[7] 1885 లో ఆయన వామన్ అభాజీ మోదక్, చరిత్రకారుడు ఆర్. జి. భండార్కర్ తో కలిసి మహారాష్ట్ర గర్ల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ అనే సంస్థను స్థాపించాడు. ఇది మహారాష్ట్రలోనే అత్యంత పురాతనమైన బాలికల పాఠశాల.[8][9]

మూలాలు

[మార్చు]
  1. "Mahadev Govinde Ranade". Retrieved 2015-08-22.
  2. "Encyclopaedia Eminent Thinkers (Vol. 22 : The Political Thought of Mahadev Govind Ranade)", p. 19
  3. Mahadev Govind Ranade (Rao Bahadur) (1992). The Miscellaneous Writings of the Late Hon'ble Mr. Justice M.G. Ranade. Sahitya Akademi.
  4. Wolpert, Stanley A. (April 1991). Tilak and Gokhale: Revolution and Reform in the Making of Modern India By. Oxford: Oxford University Press. p. 302. ISBN 978-0195623925.
  5. K. S. Bharathi (1998). Encyclopaedia of Eminent Thinkers: The political thought of Mahadev Govind Ranade. Concept Publishing Company. pp. 18–. ISBN 978-81-8069-582-7.
  6. Stanley A. Wolpert (1962). Tilak and Gokhale: Revolution and Reform in the Making of Modern India. University of California Press. p. 12. GGKEY:49PR049CPBX.
  7. "THE GROWTH OF NEW INDIA, 1858-1905". Astrojyoti.com. 2012-05-17. Retrieved 2012-07-07.
  8. Bhattacharya, Sabyasachi, ed. (2002). Education and the disprivileged : nineteenth and twentieth century India (1. publ. ed.). Hyderabad: Orient Longman. p. 239. ISBN 978-8125021926. Retrieved 12 September 2016.
  9. Ghurye, G. S. (1954). Social Change in Maharashtra, II. Sociological Bulletin, page 51.