ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కాకసస్ ప్రాంతానికి చెందిన ప్రజలు భారతదేశంపై దాడి చేసి, అక్కడున్న స్థానికులను తరిమిగొట్టి తమ భాషయైన సంస్కృతాన్ని, తమ సంస్కృతినీ ఇక్కడ విస్తరింపజేసాఅరని చెప్పే సిద్ధాంతమే ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం. 19 వశతాబ్దంలో రూపుదిద్దుకున్న ఈ సిద్ధాంతం, 20 శతాబ్దపు చివరి పాదం వరకూ ప్రచారంలో ఉంది. ఈ సిద్ధాంతం ప్రకారం -నల్ల సముద్రానికి, కాస్పియన్ సముద్రానికీ మధ్య ఉన్న కాకసస్ ప్రాంతానికి చెందిన ప్రజలు సుమారు సా.పూ.1500 ప్రాంతంలో ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్ - పాకిస్తాన్ - భారతదేశ మార్గంలో ఖైబర్ కనుమ ద్వారా భారతదేశానికి వచ్చారు; వారు గుర్రాలు పూన్చిన రథాలపై వచ్చారు. స్థానికులపై దాడి చేసి, వారిని ఓడించారు; ఈ ప్రజలు ఆర్య జాతికి చెందినవారు; వారు ఇండో-ఆర్యన్ లేదా ఇండో-యూరోపియన్ భాషలను తమతో తీసుకువచ్చారు; ఋగ్వేదం సా.పూ 1200 నాటిది. తరువాతి వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలను సా.పూ. 1000-800 మధ్య కాలంలో రాసారు.[1]

ఈ సిద్ధాంతం ఏ ఒక్కరో రూపొంచించినది కాక, వివిధ పరికల్పనలను కలుపుకుని ఒక దండయాత్ర సిద్ధాంతంగా రూపుదిద్దుకుంది. విలియం జోన్స్, మ్యాక్స్ ముల్లర్, మోర్టిమర్ వీలర్ వంటి వారు ఈ సిద్ధాంతాన్ని కల్పించి, ప్రచారం చేసింవారిలో ప్రముఖులు. ఈ సిద్ధాంతాన్ని భాషాశాస్త్రంపై ఆధారపడి కల్పన చేసారు. సంస్కృత భాషకు, యూరపియన్, ఇరానియన్ భాషలకూ ఉన్న సారూప్యతలను గమనించిన కొందరు భాషావేత్తలు, ఈ భాషలు ఒకే కుటుంబానికి చెంది ఉండవచ్చునంటూ చేసిన ఆలోచనల నుండి ఈ ఆర్యుల దండయాత్ర పరికల్పన పుట్టింది. దీనికి పురావస్తు ఆధారాలేమీ లేవు. సింధు నాగరికత శిథిలాల లోని అస్థిపంజరాలను ఈ దండయాత్ర సిద్ధాంతానికి ఆధారాలుగా మోర్టిమర్ వీలర్ అనువర్తింప జూసినప్పటికీ అది పండితుల ఆమోదం పొందలేదు.

స్వామి వివేకానందుడు, అరబిందో, డా. బి. ఆర్ అంబేద్కర్ వంటి సామాజిక ప్రముఖులే కాకుండా, రొమిల్లా థాపర్, మిచెల్ డానినో, కోయెన్‌రాడ్ ఎల్స్ట్, ఎన్.ఎస్. రాజారామ్ వంటి ఆధునిక చారిత్రికులు కూడా ఈ సిద్ధాంతాన్ని తిరస్కరించారు. ఆర్యుల దండయాత్ర సిద్ధాంతాన్ని అత్యంత తీవ్రంగా విమర్శించిన అంబేద్కర్, అసలు ఆర్య "జాతి" అనే భావననే తిరస్కరించాడు.

సిద్ధాంతానికి బీజం

[మార్చు]

సంస్కృతం, పర్షియన్, గ్రీకు భాషల మధ్య సారూప్యతలు

[మార్చు]

16 వ శతాబ్దంలో, భారతదేశానికి వచ్చిన యూరోపియన్ సందర్శకులు భారత, యూరోపియన్ భాషల మధ్య సారూప్యతలు ఉన్నట్లు గమనించారు.[2] 1653 లోనే వాన్ బాక్సార్న్ జర్మానిక్, రోమాన్ష్, గ్రీకు, బాల్టిక్, స్లావిక్, సెల్టిక్, ఇరానియన్ లకు ఒక ఆదిమ భాష ( "స్కైతియన్") ఉందనే ప్రతిపాదనను ప్రచురించాడు.[3]

జీవితమంతా భారతదేశంలో గడిపిన ఫ్రెంచ్ జెస్యూట్ గాస్టన్-లారెంట్ కోర్దూ, 1767 లో ఫ్రెంచ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌కు పంపిన ఒక జ్ఞాపికలో, సంస్కృతానికి యూరోపియన్ భాషలకూ మధ్య ఉన్న సారూప్యతను చూపాడు.[4][note 1]

1786 లో, కలకత్తాలోని ఫోర్ట్ విలియంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తి అయిన విలియం జోన్స్, ఆసియాటిక్ సొసైటీ మూడవ వార్షికోత్సవంలో చేసిన ఉపన్యాసంలో సంస్కృతం, పర్షియన్, గ్రీకు, లాటిన్, గోతిక్, సెల్టిక్ భాషలు ఒకే కోవకు చెందినవని సూత్రీకరించాడు. అతడు భాషా శాస్త్రవేత్త, సంస్కృతాన్ని అధ్యయనం చేస్తున్న క్లాసిక్ పండితుడు కూడా. కానీ అతడు చేస్తున్న పని అనేక విధాలుగా అతని పూర్వీకుల కంటే తక్కువ కచ్చితమైనది. ఎందుకంటే అతను చేసిన ఈజిప్షియన్, జపనీస్, చైనీసులను ఇండో-యూరోపియన్ భాషలలో చేర్చడం, హిందూస్థానీ [3] స్లావిక్ భాషలను చేర్చకపోవడం రెండూ తప్పే. [5] [6] జోన్స్ ఇలా రాసాడు.

సంస్కృత భాష ప్రాచీనత ఎప్పటిదైనా కావచ్చు, అద్భుతమైన దాని నిర్మాణం గ్రీకు భాష కంటే పరిపూర్ణమైనది, ప్రఖ్యాతిలో లాటిన్ భాషను మించినదీను. నాగరికతలో ఈ రెండింటికన్నా చాలా ఉన్నతమైనది. అయినప్పటికీ క్రియల మూలాల్లోను, వ్యాకరణ రూపాల్లోనూ సంస్కృతానికి ఈ రెండు భాషల తోటీ బలమైన అనుబంధం ఉంది. ఇదేదో కాకతాళీయంగా జరిగినది కాకపోవచ్చు. ఈ సారూప్యత ఎంత బలంగా ఉందంటే, ఈ మూడింటినీ అధ్యయనం చేసే ఏ భాషాశాస్త్రవేత్తైనా ఇవి ఒకే మూలం నుండి ఉద్భవించాయని భావించకుండా ఉండడు. వీటి మధ్య ఉన్నంత బలమైన సంబంధం కాకపోయినా, గోతిక్ సెల్టిక్ భాషలు కూడా సంస్కృతంతో పాటు ఒకే మూలం నుండి ఉద్భవించాయని భావించవచ్చు. అలాగే ప్రాచీన పర్షియను భాషను కూడా ఈ జాబితాలో చేర్చవచ్చు.[7]

ఈ భాషలన్నీ ఒకే మూలం నుండి వచ్చాయని జోన్స్ తేల్చాడు. [7] ఎక్కడో మధ్య ఆసియా ప్రాంతంలో ఒక ఆర్య జాతి ఉండేదని, ఆ ప్రజలు ఈ భాషను తీసుకుని తూర్పు దిశగా భారతదేశానికి తరలి వచ్చారనే వాదానికి జోన్స్ ప్రచురణతో బీజం పడింది.[8]

మాక్స్ ముల్లర్

[మార్చు]
హచిన్సన్[permanent dead link] యొక్క "హిస్టరీ ఆఫ్ ది నేషన్స్" నుండి ఆర్యులు భారతదేశంలోకి ప్రవేశించిన 1910 చిత్రణ

1850 లలో మాక్స్ ముల్లర్, పశ్చిమ అర్యులు తూర్పు ఆర్యులు అనే రెండు ఆర్య జాతుల భావనను ప్రవేశపెట్టాడు. కాకసస్ ప్రాంతం నుండి ఐరోపా వైపు వెళ్ళిన వారు పశ్చిమ ఆర్యులు కాగా, భారతదేశానికి వలస వచ్చిన వారు తూర్పు ఆర్యులు. ముల్లర్ ఇలా రెండు సమూహాలుగా విడదీసి, పశ్చిమ శాఖకు ఎక్కువ ప్రాముఖ్యతను, విలువనూ ఆపాదించాడు. అదెలా ఉన్నప్పటికీ, ఈ "తూర్పు ఆర్య జాతి తూర్పు ప్రాంతపు స్థానికుల కంటే శక్తివంతమైన వారు. వారు స్థానికులను సులభంగా జయించగలిగారు" అని కూడా అతడు సిద్ధాంతీకరించాడు. [9]

ముల్లర్ ప్రతిపాదించిన ఇండో-యూరోపియన్ భాష మాట్లాడే రెండు-జాతుల ఆర్యుల దండయాత్ర సిద్ధాంతాన్ని హెర్బర్ట్ హోప్ రిస్లీ విస్తరించాడు. కులవ్యవస్థ అనేది స్థానిక ద్రావిడలపై ఇండో-ఆర్యులు సాధించిన ఆధిపత్యపు అవశేషమేనని అతడు సిద్ధాంతీకరించాడు.[10][11] రిస్లీ "ఆర్యుల రక్తం, ముక్కు పొడవు వెడల్పుల నిష్పత్తి లను బట్టి అత్యున్నత స్థాయి కులాల నుండి నిమ్న స్థాయి కులాల తారతమ్యతను ఆపాదించాడని థామస్ ట్రాట్మన్ చెప్పాడు. కులానికి జాతికీ మధ్య చూపిన ఈ సారూప్యత చాలా ప్రభావాన్ని చూపింది" [12]

ఋగ్వేదం సా.పూ. 1200 లో ఉనికి లోకి వచ్చిందని కూడా మాక్స్ ముల్లర్ ప్రతిపాదించాడు. బుద్ధుడి కాలం నాటికి, అంటే సా.పూ. 600-500 నాటికి సూత్రాలు ఉనికిలో ఉన్నాయి కాబట్టి, వైదిక సారస్వతం లోని ఇతర రచనలైన అరణ్యకాలు, బ్రాహ్మణాలు, వేదాలకు ఒక్కొక్కదానికి 200 ఏళ్ళ చొప్పున ఇచ్చుకుంటూ, తొలి వేదమైన ఋగ్వేదం సా.పూ. 1200 నాటిదని ముల్లర్ లెక్కవేసాడు. అతడి లెక్కపై తీవ్రమైన విమర్శలు రావడంతో 1890 లో అతడు దాన్ని వెనక్కి తీసుకున్నప్పటికీ అతడు వెల్లడించిన ఋగ్వేద కాలం అలాగే ప్రాచుర్యంలో ఉండిపోయింది.[8]

సింధు నాగరికత

[మార్చు]

1920 ల్లో మొహెంజో దారో, హరప్పాల్లో జరిపిన తవ్వకాల్లో సింధు లోయ నాగరికతకు సంబంధించిన ఆధారాలు బయట పడడంతో, సా.పూ. 3 వ సహస్రాబ్ది నాటికే భారతదేశంలో నాగరికత విలసిల్లిందని వెల్లడైంది. దీంతో, ఆర్యుల దండయాత్ర సిద్ధాంతానికి ముప్పు వచ్చింది. మొహెంజో దారో వద్ద తవ్వకాలకు నేతృత్వం వహించిన జాన్ మార్షల్, 1931 లో సింధు నాగరికత గురించి ఇలా చెప్పాడు.[13]

ఆర్యులు రాకముందు భారతదేశంలో ఉన్న ప్రజలు తమను జయించిన ఆర్యుల కంటే పూర్తిగా నాగరికత పరంగా తక్కువ స్థాయిలో ఉండేవారని ఇప్పటివరకూ భావించారు. కానీ, ఐదు వేల సంవత్సరాల క్రితమే, అసలు ఆర్యుల ప్రసక్తే వినబడక ముందే - పంజాబ్, సింద్‌లలో ఒక ఉన్నతమైన, ఏకరీతి నాగరికత, సమకాలీన నాగరికతలైన మెసొపొటేమియా, ఈజిప్టుల వంటి నాగరికత, కొన్ని విషయాల్లో వాటి కంటే గొప్పదైన నాగరికత ఒకటి విలసిల్లిందని ఒక్క క్షణం కూడా ఎవరూ ఊహించలేదు. హరప్పా, మొహెంజో దారోల వద్ద కనుగొన్న విషయాలు ఈ వాస్తవాన్ని నిర్ద్వంద్వంగా తేల్చి చెప్పేసాయి.

ముల్లర్ చెప్పిన వేదాల కాలం కంటే సింధు నాగరికత చాలా ముందుది అని తేలిపోయింది కాబట్టి, భారతదేశంలో నివసించిన ప్రజలు ద్రవిడులని, బయటి నుండి వచ్చిన ఆర్యులు వారిని ఓడించి దక్షిణానికి తరిమి కొట్టారనీ కొత్త కథనం ప్రచారం లోకి వచ్చింది. ఇండో-ఆర్య వలసలు జరిగాయని చెబుతున్న కాలం, చరిత్రలో సరిగ్గా సింధు లోయ నాగరికత క్షీణ దశ సమయంతో సరిపోలడంతో, ఆర్యుల దండయాత్ర సిద్ధాంతానికి మద్దతు లభించినట్లుగా భావించారు. ఈ వాదనను 20 వ శతాబ్దం మధ్యలో పురావస్తు శాస్త్రవేత్త మోర్టిమెర్ వీలర్ ప్రతిపాదించాడు.

మోర్టిమర్ వీలర్

[మార్చు]

మోర్టిమర్ వీలర్ 1944 - 48 మధ్య కాలంలో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు డైరెక్టర్ జనరలుగా ఉన్నాడు. 1946 లో అతడు మొహెంజో దారో, హరప్పా లను సందర్శించినపుడు అక్కడి తవ్వకాల్లో బయటపడ్డ, సరిగ్గా ఖననం చెయ్యని 37 మానవ అస్థిపంజరాలను గమనించాడు. ఆర్యులు సింధు నాగరికులపై దండయాత్ర చేసి స్థానికులను ఊచకోత కోస్తున్నపుడు, పారిపోయే హడావుడిలో, మరణించినవారిని సరిగ్గా ఖననం చెయ్యలేదనీ అవే ఈ అస్థిపంజరాలనీ దాని చుట్టూ వీలర్ ఒక కథనాన్ని అల్లాడు. అర్యుల దేవుడైన ఇంద్రుడు తన భక్తులైన అర్యుల కోసం ఈ యుద్ధం చేసాడని అన్యాపదేశంగా చెబుతూ, "ఇంద్రుడే నిందితుడ"ని వ్యాఖ్యానించాడు.[14] వీలర్ వ్యాఖ్యలతో అర్యుల దండయాత్ర సిద్ధాంతానికి ఊపు వచ్చింది. అయితే, ఈ సిద్ధాంతాన్ని బలపరచే పురావస్తు ఆధారాలేమీ లభించలేదు. (ఉదాహరణ: ఊచకోత నిజమే అయితే అస్థిపంజరాలన్నీ తవ్వకాల్లో ఒకే స్థాయి పొరలో కనిపించాలి. కాని అవి వేరువేరు స్థాయిల్లో ఉన్న పొరల్లో కనిపించాయి.) దండయాత్ర సిద్ధాంతం క్రమంగా ఆదరణ కోల్పోతూ వచ్చింది.

వీలర్, దండయాత్ర పట్ల తన అభిప్రాయాన్ని కొంత సవరించుకుని, తన తరువాతి ప్రచురణలలో ఇలా వివరణను ఇచ్చాడు, "ఇది ఒక సంభావ్యత, కానీ దాన్ని నిరూపించలేం. ఇది సరి కాకపోవచ్చుకూడా." [15] మోహెంజో-దారో ప్రాంతంలో మానవ నివాసాల చివరి దశలో జరిగిన సంఘటనను సూచిస్తూ ఉండవచ్చని, ఆ తరువాత ఆ స్థలంలో జనావాసాలు ఉండి ఉండకపోవచ్చనీ సూత్రీకరిస్తూ, మోహెంజో-దారో క్షీణతకు కారణం లవణీయత వంటి మౌలిక విషయాలు అయి ఉండవచ్చనీ వీలర్ అన్నాడు [16] అయితే, వివరణలు ఇచ్చినప్పటికీ దండయాత్ర పట్ల వీలర్ అభిప్రాయం మారలేదు. 1968 లో రాసిన ది ఇండస్ సివిలైజేషన్: సప్లిమెంటరీ వాల్యూమ్ టు ది కేంబ్రిడ్జ్ హిస్టరీ ఆఫ్ ఇండియా అనే పుస్తకంలో వీలర్ ఇలా రాసాడు:[17]

సా.పూ రెండవ మిలీనియం సమయంలో... ఆరియన్ మాట్లాడే ప్రజలు ఏడు నదుల భూమి అయిన పంజాబ్ దాని పొరుగు ప్రాంతంపై దాడి చేశారు. ఈ దండయాత్ర ప్రసక్తి ఋగ్వేదం లోని పాత శ్లోకాలలో ప్రతిబింబిస్తుందని చాలా కాలంగా అంగీకరించిన సంగతే. ఈ శ్లోకాలను సహస్రాబ్ది రెండవ సగంలో కూర్చారు. ఈ ఆక్రమణ అనేది స్థానిక నివాసుల నగరాలపై జరిగిన దాడిగా ఋగ్వేదంలో కనిపిస్తూంటుంది.

విమర్శ

[మార్చు]

ఆర్యుల దండయాత్ర సిద్ధాంతంపై పలు విమర్శలు వచ్చాయి. దీన్ని అత్యంత తీవ్రంగా విమర్శించిన వారిలో బి.ఆర్. అంబేద్కర్ ప్రముఖుడు. 1946 లో ప్రచురించిన తన పుస్తకంలో ఆయన ఇలా రాసాడు:

 • "ఋగ్వేదానికి సంబంధించినంత వరకు, బయటి నుండి వచ్చిన ఆర్యులు భారత దేశాన్ని ఆక్రమించినట్లు సూచించే ఆధారం అందులో అణువంత కూడా లేదు".[18]
 • "ఆర్య జాతి సిద్ధాంతం అనేది ఎంత అసంబద్ధమైనదంటే అది ఎప్పుడో చచ్చి ఉండాల్సింది"[19]

1949 లో ప్రచురించిన పుస్తకం, "ది అన్‌టచబుల్స్ హూ వర్ దే.."లో మరింత తీవ్రంగా ఇలా రాసాడు: "ప్రజల జాతి ఏంటి అనేది నిర్ణయించడానికి అంత్రోపోమెట్రీ అనే సైన్సు హిందూ సమాజంఫై చేసిన పరిశీలన ఫలితాల ప్రకారం - అంటరానివారు, ఆర్య, ద్రావిడుల కంటే వేరు జాతికి చెందినవారు అనడం తప్పని తేలిపోయింది. ఆ కొలతల ప్రకారం బ్రాహ్మణులు, అంటరానివారు ఒకే జాతికి చెందినవారు. దీని ప్రకారం తెలుస్తున్నదేంటంటే, బ్రాహ్మణులు ఆర్యులే అయితే అంటరానివారూ ఆర్యులే. బ్రాహ్మణులు ద్రావిడులైతే అంటరానివారూ ద్రావిడులే"[20]

దండయాత్ర సిద్ధాంతం 1990 ల వరకూ కొనసాగుతూనే ఉంది. భారతీయ చారిత్రికురాలు రొమిల్లా థాపర్ 1988 లో ఇలా రాసింది

హరప్పన్ పట్టణ నాగరికత క్షీణించడానికి కారణం, వివిధ రకాల పర్యావరణ మార్పులు, రాజకీయ ఒత్తిళ్ళు, వాణిజ్య కార్యకలాపాలు ఆగిపోవడం తప్ప, దండయాత్ర కాదని ఇప్పుడు సాధారణంగా అంగీకరించే విషయమే. స్థానికంగా ఉన్న సంస్కృతులను ముంచెత్తే స్థాయిలో ఇరాన్ నుండి వాయువ్య భారతదేశానికి భారీగా వలసలు వచ్చాయని చెప్పేందుకు తగిన పురావస్తు ఆధారాలు కనబడలేదు. దండయాత్ర సిద్ధాంతాన్ని పక్కన బెడితే, ఇక అప్పుడప్పుడూ ఏర్పడిన పరిచయాల ద్వారా జరిగిన వలసలు దృష్టిలోకి వస్తాయి. అవెస్తా లోను, ఋగ్వేదం లోనూ ప్రముఖంగా ఉన్న పశువుల కాపరులు ఈ వలసలు జరిపి ఉంటారని అనిపిస్తోంది.

కథనంలో వచ్చిన మార్పులు

[మార్చు]

దీనితో ఆర్యుల దండయాత్ర అనే కథనానికి మార్పు చేర్పులు చేసారు. దండయాత్ర స్థానే వలస అనే కల్పన ప్రాచుర్యం లోకి వచ్చింది. భారతదేశంలో ఈసరికే ఒక ఉన్నతమైన నాగరికత వేల సంవత్సరాలుగా ఉందని ఆధారాలు ఈసరికే లభించాయి కాబట్టి వలస వచ్చిన ప్రజలు ఎటువంటివారు అనే విషయమై కల్పనలో మార్పు వచ్చింది. ఆధునికులైన ఆర్యులు, ఆదిమ అనాగరికులైన స్థానికుల జనావాసాల వైపు జరిగిన వలస లాగా కాకుండా, సంచార ప్రజలైన ఆర్యులు అభివృద్ధి చెందిన పట్టణ నాగరికత విలసిల్లిన ప్రాంతానికి జరిపిన వలసగా ఈ సిద్ధాంతాన్ని మార్చేసారు. పాశ్చాత్య రోమన్ సామ్రాజ్య పతనానికి ఒక కారణమైన జర్మనీయుల వలసల్లాగా, బాబిలోనియాపై కాస్సైట్ దండయాత్ర లాగా ఈ అర్యుల వలస కథనాన్ని మార్చేసారు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

నోట్స్

[మార్చు]
 1. See:
  • Duperron, Anquetil (1808), Histoire et mémoires de l'Académie des Inscriptions et Belles-Lettres, de 1701 à 1793, imprimerie royale
  • Godfrey, John J. (1967). "Sir William Jones and Père Coeurdoux: A philological footnote". Journal of the American Oriental Society. 87 (1): 57–59. doi:10.2307/596596. JSTOR 596596.

మూలాలు

[మార్చు]
 1. Prasanna, T. R. S. (2012). "There is no scientific basis for the Aryan Invasion Theory". Current Science. 103 (2): 216–221. ISSN 0011-3891.
 2. Auroux, Sylvain (2000). History of the Language Sciences. Berlin, New York: Walter de Gruyter. p. 1156. ISBN 3-11-016735-2.
 3. 3.0 3.1 Roger Blench Archaeology and Language: methods and issues. In: A Companion To Archaeology. J. Bintliff ed. 52–74. Oxford: Basil Blackwell, 2004.
 4. Wheeler, Kip. "The Sanskrit Connection: Keeping Up With the Joneses". Dr.Wheeler's Website. Retrieved 16 April 2013.
 5. Campbell & Poser 2008, p. 37.
 6. Patil, Narendranath B. (2003). The Variegated Plumage: Encounters with Indian Philosophy : a Commemoration Volume in Honour of Pandit Jankinath Kaul "Kamal". Motilal Banarsidass Publications. p. 249. ISBN 9788120819535.
 7. 7.0 7.1 Anthony 2007, p. 7.
 8. 8.0 8.1 లాల్, బి,బి. (2005). "ఆర్యన్ ఇన్వేజన్ ఆఫ్ ఇండియా:పెర్పెచ్యుయేషన్ ఆఫ్ ఎ మిత్". In బ్రయంట్, ఎడ్విన్; పాటన్, లారీ ఎల్ (eds.). ది ఇండో ఆర్యన్ కాట్రవర్సీ: ఎవిడెన్స్ అండ్ ఇన్ఫరెన్స్ ఇన్ ఇండియన్ హిస్టరీ. రూట్‌లెడ్జ్. p. 50.{{cite book}}: CS1 maint: multiple names: authors list (link)
 9. McGetchin 2015, p. 116.
 10. Trautmann, Thomas R. (2006) [1997]. Aryans and British India (2nd Indian ed.). New Delhi: YODA Press. p. 203. ISBN 81-902272-1-1.
 11. Risley, Herbert Hope (1891). "The Study of Ethnology in India". The Journal of the Anthropological Institute of Great Britain and Ireland. 20. Royal Anthropological Institute of Great Britain and Ireland: 253. JSTOR 2842267.
 12. Trautmann, Thomas R. (2006) [1997]. Aryans and British India (2nd Indian ed.). New Delhi: YODA Press. p. 183. ISBN 81-902272-1-1.
 13. "(PDF) Aryans and the Indus Civilization: Archaeological, Skeletal, and Molecular Evidence". ResearchGate (in ఇంగ్లీష్). Retrieved 2021-02-10.
 14. బ్రయంట్, ఎడ్విన్; బ్రయంట్, ఎడ్విన్ ఫ్రాన్సిస్ (2001). The Quest for the Origins of Vedic Culture -The Indo-Aryan Migration Debate. అమెరికా: Oxford University Press, USA. pp. 159. ISBN 9780195137774.
 15. Wheeler 1967, p. 76.
 16. Wheeler 1967, pp. 82–83.
 17. వీలర్, మోర్టిమర్ (1968). ది ఇండస్ సివిలైజేషన్ : సప్లిమెంటరీ వాల్యూమ్ టు ది కేంబ్రిడ్జ్ హిస్టరీ ఆఫ్ ఇండియా. Internet Archive. Cambridge : University Press. p. 131. ISBN 978-0-521-06958-8.
 18. బి.ఆర్. అంబేద్కర్ (1946). హూ వర్ ది శూద్రాస్ (శూద్రులెవరు). థక్కర్ అండ్ కంపెనీ. p. 68.
 19. బి.ఆర్. అంబేద్కర్ (1946). హూ వర్ ది శూద్రాస్ (శూద్రులెవరు). థక్కర్ అండ్ కంపెనీ. p. 76.
 20. B. R. Ambedkar (1948). The Untouchables. న్యూ ఢిల్లీ: అమృత్ బుక్ కో. p. 62.{{cite book}}: CS1 maint: date and year (link)