తేజ్ బహదూర్ సప్రూ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సర్

తేజ్ బహదూర్ సప్రు

జననం(1875-12-08)1875 డిసెంబరు 8
అలీఘర్, యునైటెడ్ ప్రావిన్సెస్ ఆఫ్ ఆగ్రా , ఔద్, బ్రిటిష్ ఇండియా
మరణం1949 జనవరి 20(1949-01-20) (వయసు 73)
అలహాబాద్, ఉత్తర ప్రదేశ్, డొమినియన్ ఆఫ్ ఇండియా
జాతీయతభారత పౌరసత్వం
విద్యాసంస్థడా. భీమ్‌రావ్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం

సర్ తేజ్ బహదూర్ సప్రూ, KCSI, PC (1875 డిసెంబరు 8 – 1949 జనవరి 20) స్వాతంత్ర్య సమరయోధుడు, న్యాయవాది, రాజకీయవేత్త. అతను భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో కీలకపాత్ర పోషించాడు. భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో పాల్గొన్నాడు. బ్రిటిషు భారతదేశంలో లిబరల్ పార్టీకి నాయకుడు.

ప్రారంభ జీవితం, వృత్తి జీవితం

[మార్చు]

తేజ్ బహదూర్ సప్రూ యునైటెడ్ ప్రావిన్సెస్ (ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ ) లోని అలీగఢ్‌లో, కాశ్మీరీ హిందూ కుటుంబంలో జన్మించాడు.[1] అతను ఆగ్రా కాలేజీలో చదువుకున్నాడు. అలహాబాద్ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశాడు. అక్కడే భావి జాతీయవాద నాయకుడు పురుషోత్తం దాస్ టాండన్, అతని వద్ద జూనియర్‌గా పనిచేశాడు. ఆ తర్వాత బనారస్ హిందూ యూనివర్సిటీలో డీన్‌గా పనిచేశాడు. 1930 డిసెంబరు 13 సప్రూ లండన్‌ లోని మిడిల్ టెంపుల్‌లో చేరాడు, కానీ బారిస్టరు కాక ముందే 1932 జనవరి 14 న మానేసాడు.[2]

రాజకీయ జీవితం

[మార్చు]

సప్రూ యునైటెడ్ ప్రావిన్సెస్ (1913–16) లెజిస్లేటివ్ కౌన్సిల్ లోను, ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ (1916–20) లోను, వైస్రాయ్ కౌన్సిల్ (1920–23) లోనూ న్యాయ వ్యవహారాల సభ్యునిగా పనిచేశాడు. బ్రిటిషు పాలనకు వ్యతిరేకంగా అహింసా పద్ధతిలో పోరాటం చేసిన మహాత్మా గాంధీ స్వాతంత్ర్య ఉద్యమంలో ఉద్భవించిన తర్వాత సప్రూ కాంగ్రెస్‌తో కలిసి పనిచేశాడు. సప్రూ 1920-22 లో జరిగిన సహాయ నిరాకరణ ఉద్యమానికి మద్దతు ఇచ్చాడు. 1923 లో రాజు పుట్టినరోజు పురస్కారాలు పొందిన వారిలో నైట్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఇండియా (KCSI) పురస్కారం పొందాడు. 1927 లోనే సప్రూ, భారత రాజ్యాంగ రూపకల్పనను ప్రారంభించడానికి ఆల్ పార్టీ కాన్ఫరెన్స్‌ను నిర్వహించాడు. 1928లో రాజ్యాంగ సంస్కరణలపై నెహ్రూ కమిటీ, నివేదికను రూపొందించడంలో సహాయపడ్డాడు. నేటి భారత రాజ్యాంగాన్ని రూపొందించినపుడు ఇది అతి ముఖ్యమైన పత్రంగా గుర్తించారు. భారతదేశ చరిత్రలో మొదటిసారిగా ఆ నివేదిక, సమాఖ్య పాలనలో భాగంగా సంస్థానాలను భారతదేశంలో కలిపే ప్రతిపాదన చేసిందిది.

భారతదేశంలో అతిపెద్ద రాజకీయ పార్టీ అయిన భారత జాతీయ కాంగ్రెసులో సభ్యుడు అయినప్పటికీ, సప్రూ దానిని విడిచిపెట్టి లిబరల్ పార్టీ ఆఫ్ ఇండియాలో చేరాడు. అతను స్వరాజ్‌కు మద్దతు నిస్తూ, బ్రిటీష్ వలస పాలనకు వ్యతిరేకంగా శాసనోల్లంఘన ఉద్యమానికి మద్దతిచ్చాడు. రాజ్యాంగకర్తగా, సప్రూ బ్రిటీష్ అధికారులతో సామరస్యంగా చర్చిస్తూ భారతీయులకు మరిన్ని రాజకీయ హక్కులను స్వేచ్ఛనూ సాధించాలని వాదించాడు. ఉదాహరణకు, 1930 ఫిబ్రవరి 28 న, అతను బ్రిటిష్ ఇండియా స్టాండింగ్ కమిటీ, మంత్రి సలహాదారులూ ఏర్పాటు చేసిన విందులో పాల్గొన్నాడు. బాంబే నుండి చిమన్‌లాల్ సెతల్వాద్ కూడా పాల్గొన్నాడు. అతడు MA జిన్నా, MR జయకర్‌, మద్రాసుకు చెందిన CP రామస్వామి అయ్యర్‌తో కలిసి సహకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. స్టాండింగ్ కమిటీ, హక్సర్ నివేదికను స్వీకరించింది. నెలవారీ సమావేశాలను నిర్వహించడానికి అంగీకరించింది. వారి చర్చలు సప్రూ కమిటీ సిఫార్సులుగా ప్రసిద్ధి చెందాయి. "సంస్థానాధీశులతో జరిపిన ఈ సంభాషణలు చాలా ముఖ్యమైనవి" అని న్యూఢిల్లీ ప్రకటించింది.[3] సప్రూ మిత్రుడైన కైలాస్ నాథ్ హక్సర్ బ్రిటిషు భారతదేశంతో, సంస్థానాలతో కూడిన సమాఖ్యను కూడా ప్రతిపాదించాడు. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కోసం ఒక వేదికను నిర్మించడానికి వారు బ్రిటిష్ మినిస్ట్రీ ఆఫ్ వర్క్స్‌తోటి, గాంధీతోటీ మంచి సంబంధాలను ఏర్పరచుకున్నారు. 1930 నవంబరు 17 న అఖిల భారత సమాఖ్య రాజ్యాంగ పరమైన సంబంధం పట్ల రాచరిక మద్దతును పొందింది. ఈ మార్పు ప్రభావం గురించి తెలియకపోయినా, శాసనోల్లంఘన ఉద్యమాలకు వ్యతిరేకంగా సప్రూ గాంధీ, నెహ్రూలతో చర్చించాడు. సైన్యంపై బ్రిటిష్ నియంత్రణ పట్ల, ఆర్థిక భద్రతల పట్లానెహ్రూ నుండి విమర్శలను పొందడం మినహా సప్రూ ఈ చర్చల నుండి సాధించినదేమీ లేదు.

సప్రూ తదితర ఉదారవాద రాజకీయ నాయకులు, చర్చల ద్వారా స్వాతంత్ర్యం సాధించాలనే తపనతో, బ్రిటీష్ వారు ఏర్పాటు చేసిన కేంద్ర, ప్రావిన్షియల్ చట్టసభలలో పాల్గొన్నారు. చాలామంది భారతీయ రాజకీయ పార్టీలు చట్టసభలను "భారత వైస్రాయ్ రబ్బరు స్టాంపుల"ని ప్రజలు భావించి వారిని వ్యతిరేకించారు. చాలా మంది కాంగ్రెస్ రాజకీయ నాయకులు సప్రూ ను ఒక ప్రముఖ న్యాయనిపుణుడిగా గౌరవించారు. ఎందుకంటే అతను విలువైన, సమర్థవంతమైన మధ్యవర్తి. గాంధీకి, వైస్రాయ్ లార్డ్ ఇర్విన్‌కూ మధ్య సప్రూ మధ్యవర్తిత్వం వహించాడు. ఉప్పు సత్యాగ్రహాన్ని ముగిసాక, గాంధీ-ఇర్విన్ ఒప్పందాన్ని రూపొందించడంలో సప్రూ సహాయం చేశాడు.  భారతదేశంలోని "అంటరానివారికి " ప్రత్యేక నియోజకవర్గాల సమస్యపై గాంధీ, డా. భీమ్‌రావ్ రామ్‌జీ అంబేద్కర్‌, బ్రిటిష్ వారి మధ్య సప్రూ మధ్యవర్తిత్వం వహించాడు. అప్పుడే పూనా ఒప్పందం కుదిరింది.  సప్రూ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌లో (1931–33) ఇండియన్ లిబరల్స్ ప్రతినిధిగా ఎంపికయ్యాడు. ఇది భారతీయులకు మరింత స్వయంప్రతిపత్తి కల్పించడంపై ప్రణాళికలను రూపొందించడానికి ప్రయత్నించింది. బ్రిటీష్ ప్రభుత్వానికి, కాంగ్రెసుకూ మధ్య విభేదాలను తొలగించడానికి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌లలో తన సమకాలీనుడైన MR జయకర్‌తో కలిసి సప్రూ కృషి చేసాడు. కానీ మూడవ రౌండ్ టేబుల్ నాటికి చాలా మంది యువరాజులు పాల్గొనలేదు. వారి మంత్రులు సమాఖ్య పట్ల అంత సుముఖంగా లేరు. అతని కుడి భుజం లాంటి హక్సర్‌ను అడ్డుకున్నారు.[4] 1934 ఫిబ్రవరి 26 న సప్రూ ప్రివీ కౌన్సిల్ సభ్యునిగా నియమితుడయ్యాడు

1939లో భారతదేశాన్ని రెండవ ప్రపంచ యుద్ధంలోకి తీసుకురావాలనే వైస్రాయ్ నిర్ణయానికి సప్రూ మద్దతు పలికాడు. వైస్రాయి నిర్ణయం ఏకపక్ష అనీ, భారత ప్రజల ప్రతినిధులను సంప్రదించకుండా తీసుకున్నదనీ కాంగ్రెస్ విమర్శించింది. యుద్ధ సమయంలో ఇంపీరియల్ జపాన్ సహాయంతో జాతీయవాద నాయకుడు సుభాష్ చంద్రబోస్ స్థాపించిన భారత జాతీయ సైన్యానికి చెందిన పట్టుబడిన సైనికులను రక్షించడానికి నిమగ్నమైన ప్రధాన న్యాయవాదులలో సప్రూ కూడా ఒకడు. (1942–46).

సప్రూ కమిటీ నివేదిక

[మార్చు]

1944లో, పార్టీ రహిత సమావేశపు స్టాండింగ్ కమిటీ, భారతదేశంలోని మతపరమైన విభిన్నతను దృష్టిలో ఉంచుకుని రాజ్యాంగ సూత్రాల సిఫార్సులు చేసే కమిటీని నియమించాలని ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఆ కమిటీకి నాయకత్వం వహించడానికి, దాని నివేదిక తయారీలో పాల్గొనేందుకు వివిధ సంఘాలకు ప్రాతినిధ్యం వహించే సభ్యులను నియమించడానికీ సప్రూను ఆహ్వానించారు.[5] 'సప్రూ కమిటీ రాజ్యాంగ ప్రతిపాదనలు' అనే పేరున్న ఆయన నివేదికను సాధారణంగా సప్రూ కమిటీ నివేదిక అని పిలుస్తారు. భారతదేశ పాలన, రాజకీయాలకు సంబంధించిన రాజ్యాంగపరమైన ప్రశ్నలకు సంబంధించిన 21 సిఫార్సులు అందులో చేసాడు.[6] ఈ సిఫార్సుల వెనుక ఉన్న కారణాన్ని సవివరంగా వివరిస్తూ నివేదికను ప్రచురించారు. కమిటీ సభ్యుల నుండి అనేక అసమ్మతి గమనికలు, BR అంబేద్కర్, గాంధీ వంటి రాజకీయ ప్రముఖులతో కమిటీ జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాల వివరాలను కూడా అందులో చేర్చారు.[5] సప్రూ కమిటీ నివేదిక భారత ఉపఖండాన్ని భారతదేశం, పాకిస్తాన్ లుగా విభజించాలనే ప్రతిపాదనను తిరస్కరించింది. సమైక్య దేశంలో మైనారిటీల రక్షణ విషయమై అనేక సిఫార్సులు చేసింది.[5] నివేదిక ప్రచురించబడినప్పుడు పెద్దగా దృష్టిని ఆకర్షించనప్పటికీ, భారత రాజ్యాంగాన్ని రూపొందించేటప్పుడు రాజ్యాంగ సభ అనేక సార్లు దాన్ని ఉదహరించింది, పరిగణించింది.[7][8]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

సప్రూ అంబికా ప్రసాద్ సప్రూ, గౌరా సప్రూ అనే జమీందారు దంపతుల ఏకైక కుమారుడు. సప్రూ తల్లి గౌరా, నిరంజన్ హుక్కు సోదరి. నిరంజన్‌ కుమార్తె ఉమను జవహర్‌లాల్ నెహ్రూ బంధువు శ్యామ్‌లాల్ నెహ్రూను వివాహం చేసుకుంది. సప్రూ ఎనిమిదవ బంధువు అల్లామా ఇక్బాల్, పాకిస్తాన్ జాతీయ కవి. 1930లలో పాకిస్తాన్ ఆలోచనను రూపొందించిన వారిలో అతడొక సిద్ధాంతకర్త. అల్లామా ఇక్బాల్ తాత సహజ్ రామ్ సప్రూ, హిందూ కాశ్మీరీ బ్రాహ్మణుడు, అతను సప్రూకి దూరపు బంధువు.[9]

సప్రూ దంపతులకు ఐదుగురు పిల్లలు. వారి ముగ్గురు కుమారులు ప్రకాష్ నారాయణ్ సప్రూ, త్రిజుగీ నారాయణ్ సప్రూ, ఆనంద్ నారాయణ్ సప్రూ. కుమార్తెలు జగదంబేశ్వరి, భువనేశ్వరి. బ్రిటీష్ ఆక్సిజన్, ITC లిమిటెడ్ యొక్క మాజీ ఛైర్మన్ జగదీష్ నారాయణ్, సప్రూ మనవడు. 

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన పదిహేడు నెలల తర్వాత, సర్ తేజ్ బహదూర్ సప్రూ 1949 జనవరి 10 న అలహాబాద్‌లో మరణించాడు.

గమనికలు

[మార్చు]

 

మూలాలు

[మార్చు]
  1. Mohan Kumar (1981). Sir Tej Bahadur Sapru: a political biography. Vipul Prakashan. Retrieved 25 March 2007. Even now there are many distinguished scholars of Persian among the Kashmiri Brahmins in India. Sir Tej Bahadur Sapru and Raja Narendranath to mention two of them.
  2. Sturgess, H.A.C. (1949). Register of Admissions to the Honourable Society of the Middle Temple. Butterworth & Co. (Publishers) Ltd.: Temple Bar. Vol. 3, p.927.
  3. Setalvad to Sapru, 10 March 1930, National Library of India (NLI), Sapru MSS, I, 24, S 124; ed. B R Nanda, Essays in Modern Indian History, Delhi: OUP, 1980, p.123.
  4. Report of the Joint Committee on Indian Constitutional Reform (session 1933-4), vol.1, pt.1 (London, 1934); Nanda, p.144.
  5. 5.0 5.1 5.2 Sapru, Tej Bahadur; et al. (1945). Constitutional Proposals of the Sapru Committee. Bombay: Padma Publications.
  6. CLPR. "Sapru Committee Report (Sir Tej Bahadur Sapru, 1945)". CADIndia. Retrieved 5 September 2019.
  7. Constituent Assembly of India (1946). "'Chairman's Inaugural Address'". Constituent Assembly Of India Debates (Proceedings). Vol. I. New Delhi: Lok Sabha Secretariat, Government of India.
  8. Constituent Assembly of India, 1956. "'Speech by M. Ananthasayanam Ayyangar (29 July 1947)'". Constituent Assembly of India Debates (Proceedings). Vol. IV. New Delhi: Lok Sabha Secretariat. {{cite book}}: |first= has numeric name (help)
  9. Ahmad, Khalid Bashir (2 February 2018). "Iqbal's Brahmin Cousins". Medium (in ఇంగ్లీష్). Retrieved 17 August 2020.