Jump to content

అడిగోపుల వెంకటరత్నం

వికీపీడియా నుండి
(అడిగోపుల వెంకటరత్నమ్ నుండి దారిమార్పు చెందింది)
అడిగోపుల వెంకటరత్నం
అడిగోపుల వెంకటరత్నం
జననం
అడిగోపుల వెంకటరత్నం

01 జూలై 1945
కొత్తవంగల్లు గ్రామం, కొడవలూరు మండలం, నెల్లూరు జిల్లా (నివాసం: తిరుపతి, అంధ్రప్రదేశ్)
మరణం2024 జూలై 19
తిరుపతి
వృత్తిసివిల్ ఇంజనీరు
జీవిత భాగస్వామిఅడిగోపుల పద్మజ
పిల్లలుఅడిగోపుల మాధవి, అడిగోపుల శ్రీకాంత్, అడిగోపుల శాంతి
తల్లిదండ్రులు
  • అడిగోపుల వెంకయ్య (తండ్రి)
  • అడిగోపుల వెంకట సుబ్బమ్మ (తల్లి)
వెబ్‌సైటుhttp://adigopula.com

అడిగోపుల వెంకటరత్నం, ఒక ప్రఖ్యాత కవి, రచయిత. ఆయన రచించిన కవితలు అవధులు లేని ఆలోచనాశక్తి తో, బలమైన భావవ్యక్తీకరణతో , ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించి, తనదైన మార్గంలో వాటికి పరిష్కార మార్గాలను ప్రతిపాదించాడు. అపూర్వమైన భావ చిత్రాలతో సర్వాంగీకారంగా ప్రతీకాత్మికలు పరుచుకుని ప్రతి కవితా సరళసుందరం, అర్ధవంతం, సమాజస్థాపన, పేదరికం నిర్మూలన, పురుషాధిక్యత, అంటరాని వ్యధ మొదలైన వాటిని గురించి ఉంటుంది.

మంచి మనిషిగా వుండి కావాల్సినంత కవిత్వం రాయొచ్చు అన్న జర్మన్ తత్త్వజ్ఞుడు 'గోధే' మాటల్ని అడిగోపుల నిజం చేశాడు. వీరి కవిత్వంలో నిబద్ధత, నిరాడంబరత, వృత్తి పట్ల నిజాయితీ, ప్రవృత్తి పట్ల అభిరుచితో కూడిన ఒక పెద్ద బాధ్యత కనిపిస్తాయి. ఈ సందర్భంగా 'ఎరిక్ ఫామ్' అన్న మాటలు గుర్తొస్తాయి - " The affirmation of one's own life, happy, growth, freedom is rooted in once capacity to love ie., in care, respect, responsibility and knowledge". తన జీవితాన్ని, సమాజాన్ని, మనుషుల్ని ఎంతగా ప్రేమిస్తాడో, అభిమానిస్తాడో తను కవిత్వాన్ని అంతే ప్రేమిస్తాడు.

బాల్యం, విద్యాభ్యాసం

[మార్చు]

వెంకటరత్నం నెల్లూరు జిల్లా, కొడవలూరు మండలం, గండవరం గ్రామంలో ఉన్నత పాఠశాల విద్య నభ్యసించాడు. కావలి లోని జవహర్ భారతిలో కళాశాల విద్యను పూర్తి చేశాడు. తిరుపతి, చెన్నైలో ఇంజనీరింగ్ పూర్తి చేసాడు.

రచనలు

[మార్చు]

మొత్తం ప్రచురించిన రచనలు 28: కవితా సంపుటాలు - 27 , కథా సంపుటి - 1

1.సూర్యోదయం (కవితా సంపుటి) 1984
2.ఎన్నాళ్లీచరిత్ర (కవితా సంపుటి) 1985
3.పురోగతి అంచున (కథా సంపుటి) 1985
4.జీవన పోరాటం (కవితా సంపుటి) 1986
5.బానిసత్వం అమ్మబడును (కవితా సంపుటి) 1987
6.మరణానికి రెండు ముఖాలు (కవితా సంపుటి) 1988
7.విప్లవానికి పురిటిగది (కవితా సంపుటి) 1990
8.అశ్రువీధిలో అగ్నిగానం (కవితా సంపుటి) 1991
9.యుద్ధమంటే మాకు భయం లేదు (కవితా సంపుటి) 1992
10.మట్టి మౌనం వహించదు (కవితా సంపుటి) 1994
11.మహాపథం (కవితా సంపుటి) 1996
12.రాతిచిగుళ్ళు (కవితా సంపుటి) 1998
13.అదృశ్యకుడ్యం (కవితా సంపుటి) 2000
14.సంకెళ్ళు తెగిన చప్పుళ్ళు (కవితా సంపుటి) 2002
15.శ్వేతపత్రం (కవితా సంపుటి) 2004
16.విశ్వగీతం (కవితా సంపుటి) 2006
17.రంగుల చీకటి (కవితా సంపుటి) 2009
18.రేపటి వర్తమానం (కవితా సంపుటి) 2011
19.రెక్క విప్పిన రాగం (కవితా సంపుటి) 2013
20.రేపటి జ్ఞాపకం (కవితా సంపుటి) 2016
21.ముందడుగు (కవితా సంపుటి) 2017
22.ముందడి (కన్నడం కవితా సంపుటి) 2018
23.కన్నీరిన్ నిరంగళ్ (తమిళం కవితా సంపుటి) 2018
24.పదండి ముందుకు (కవితా సంపుటి) 2019

25.కాలం నా చేతిలో వుంది (కవితా సంపుటి) 2020

26.జయభేరి (కవితా సంపుటి) 2021

27. కొత్త గాలి (కవితా సంపుటి) 2022

28.నిలువెత్తు సంతకం(కవితా సంపుటి)2024

అవార్డులు

[మార్చు]

1985 లో కుందుర్తి స్మారక అవార్డు
1988 లో కుందుర్తి స్మారక అవార్డు
1990 లో శ్రీశ్రీ స్మారక అవార్డు
1990 లో తానా అవార్డు
1991 లో శ్రీశ్రీ స్మారక అవార్డు
1992 లో కరుణశ్రీ అవార్డు
1993 లో రంజని - కుందుర్తి స్మారక అవార్డు
1995 లో వాసిరెడ్డి - సుంకర అవార్డు
2000 లో శ్రీశ్రీ స్మారక అవార్డు
2002 లో సాహితీరత్న అవార్డు
2002 లో పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ప్రతిష్ఠాకర ప్రతిభా పురస్కారం.
2004 లో హర్యానా రాష్ట్ర జెమిని అకాడెమీ వారి సుభద్రాకుమారి చౌహాన్ జన్మ శతాబ్ది సమ్మాన్ అవార్డు
2009 లో భీమనాథం రాఘవరెడ్డి స్మారక సాహిత్య పురస్కారం.
2014 లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయిడు చే "కవిరత్న" బిరుదు ప్రదానం.2015 లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయిడు చే ఉగాది అవార్డు.

2016 లో ఆగష్టు 29 న గిడుగు రామమూర్తి (జయంతి తెెెెెలుగు బాషా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశిష్ట సేవా పురస్కారం ,ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయిడు చే ప్రదానం.)

2017 లో నూతలపాటి గంగాధరం సాహితీ పురస్కారం .

2018 లో కొలకలూరి భాగీరథీ కవితా పురస్కారం.

2018 లో ఉమ్మడి శెట్టి సాహితీ ప్రతిభా పురస్కారం.

2021 లో గార్లపాటి సిద్ధమనాయుడు పురస్కారం.

2022 లో వచన కవితా పితామహుడు కుందుర్తి ఆంజనేయులుగారి శతజయంతి సందర్భంగా ఫ్రీవెర్స్ ఫ్రంట్ పురస్కారం.

సాహితీ కృషికి గుర్తింపు

[మార్చు]
  1. 1994, 1996, 1998, 2000, 2002, 2004, 2006, 2009 మద్రాసు, హైదరాబాదు, ఢిల్లీ, విశాఖపట్నం, సింగపూర్, బెంగళూరు, విజయవాడ లలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలలో ప్రతినిధిగా పాల్గొనటం జరిగింది. మొదటి ఐదు సభలకు నాగార్జున యూనివర్శిటి తన ప్రతినిధిగా పంపబడ్డారు.
  2. వీరి కథలు తమిళం, మలయాళం, కన్నడంలోకి తర్జుమా చేశారు. కవితలు దేశం లోని 18భాషల్లోకి తర్జుమా చేశారు.
  3. 'జాతీయ కవి'గా ప్రసార భారతి ద్వారా ఎంపికై 2000 సంవత్సరంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా పూణేలో జరిగిన జాతీయ కవి సమ్మేళనంలో పాల్గొన్నాడు.
  4. అదృశ్యకుడ్యం కవిత 18 భాషల్లోకి తర్జుమా చెయ్యబడింది
  5. భారత ప్రభుత్వపు సాంకేతిక మంత్రిత్వ శాఖచే యూనివర్శిటి ఆఫ్ హైదరాబాదులో అన్ని రచనలు వారి వెబ్ సైట్ లోను, కార్సస్ లోను భద్రపరచారు.
  6. 2008 లో ఆస్ట్రేలియా తెలుగు సంఘం వార్షికోత్సవం సందర్భంగా సన్మానించబడ్డారు. ఈ సందర్భంగా 'సమకాలీన తెలుగు తీరుతెన్నులు' అనే అంశం పై సిడ్నీలో ప్రసంగం చేశారు.

అవార్డు పొందిన పుస్తకాలు

[మార్చు]

1990లో 'విప్లవానికి పురిటిగది' సమతా రచయితల సంఘం ఉత్తమ కవితా సంపుటి అవార్డు పొందినది.
1991 లో 'పురోగతి అంచున' ఉత్తమ కథా సంపుటిగా నాగార్జున యూనివర్శిటి శ్రీశ్రీ స్మారక గోల్డు మెడల్ పొందినది.
1992 లో 'యుద్ధమంటే మాకు భయం లేదు' ఉత్తమ కవితా సంపుటిగా కిన్నెర ఆర్ట్ థియేటర్, అయ్యగారి చారిటబుల్ ట్రస్టు అవార్డు పొందినది.

సంఘ సేవకు ప్రశంసలు

[మార్చు]
  • 1986 లో విజయవాడ లయన్స్ క్లబ్ వారి ప్రశంసాపత్రం లభించింది.
  • 1986-87 నాగార్జున యూనివర్శిటిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి తెలుగు గ్రామీణ క్రాంతి పథకం కింద అభివృద్ధి పనులు చేసినందుకు గాను ప్రశంసాపత్రం లభించింది.
  • 1987-88 నాగార్జున యూనివర్శిటిలో ఎన్.ఎస్.ఎస్. కార్యక్రమాలు సమర్ధవంతంగా నిర్వహించినందుకు కేంద్ర ప్రభుత్వ మానవవనరుల శాఖ నుండి ప్రశంసాపత్రం లభించింది.

ప్రత్యేక గుర్తింపులు

[మార్చు]
  1. 'మర్రిచెట్టు కింద మల్లెతీగ' ఉత్తమ కవితగా ఎంపిక చేసి నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా వారు '20వ శతాబ్దపు తెలుగు కవిత్వం' అనే గ్రంథంలో ప్రచురించారు.
  2. అమెరికన్ బయోగ్రాఫికల్ ఇన్స్టిట్యూట్ వారి కాంటెంపరరీ 'హు ఈజ్ హు'కు ఎంపిక కాబడి అడిగోపుల సంగ్రహ జీవితం ప్రచురించబడింది. ఆసియా పసిఫిక్ 'హు ఈజ్ హు'కు ఎంపిక కాబడి సంగ్రహ జీవితం ప్రచురించబడింది.
  3. భారత్ ఎక్స్ లెన్సీగా 'ఫ్రెండ్ షిఫ్ ఫోరం ఆఫ్ ఇండియా' వారిచే 2000వ సంవత్సరంలో ఎంపిక చెయ్యటం జరిగింది.
  4. ఆసియా పసిఫిక్ "హూ ఈజ్  హూ" కు ఎంపిక కాబడి సంగ్రహ జీవితం ప్రచురించబడింది  

అడిగోపుల పై పరిశోధనలు

[మార్చు]
  1. నాగార్జున యూనివర్శిటి ప్రొఫెసర్ గోగినేని యోగప్రభావతి దేవి ఆధ్వర్యాన 'అడిగోపుల వారి కథలు - ఒక పరిశీలన' అనే పరిశోధనకు ఎన్. త్రివిక్రమ సూరికి ఎం.ఫిల్ డిగ్రీ 2005సంవత్సరంలో ప్రధానం చెయ్యటం జరిగింది.
  2. శ్రీ వెంకటేశ్వర యూనివర్శిటిలో ప్రొఫెసర్ మేడిపల్లి రవికుమార్ పర్యవేక్షణలో 'అడిగోపుల వెంకటరత్నమ్ కవిత్వం - పరిశీలన ' అనే పరిశోధనకు ఎన్.భీమన్నకు 2012 సంవత్సరంలో పి.హెచ్ డి. ఇవ్వబడింది.
  3. ఆంధ్రా యూనివర్సిటిలో ఆచార్య M.జయదేవ్ ఆధ్వర్యాన " అడిగోపుల వెంకటరత్నమ్ రచనలు - పరిశీలన"అనే అంశంపై నక్కెళ్ళ వెంకట పద్మకుమారికి 2023 సంవత్సరంలో పి.హెచ్ డి. ఇవ్వబడింది.

అడిగోపుల గురించి ప్రముఖులు

[మార్చు]
డాక్టర్ ఆరుద్ర

పిడికిలి బిగించి ప్రజలు
మ్మడిగా మన ఈ వ్యవస్థ మార్చేదాకా
పెడబొబ్బ సింహనాదం
అడిగోపుల హోరుగాలి ఆగవు సుమ్మీ!

మన పూర్వులు 'వాక్యం రసాత్మకం కావ్యం' అన్నారు. కానీ 'భావం రసాత్మకం కావ్యం' అన్న సంగతిని అడిగోపుల అభ్యుదయ కవితలు తేటతెల్లం చేసి చాటుతున్నాయి.

ఆచార్య ఆత్రేయ

అడిగోపులకి సామాజిక రాజకీయ స్పృహచైతన్యం ఎంతో గాఢంగా ఉంది. ఆయన కవిత్వం మనకు లోకం చూపుతాయి. లోకంలో జరిగే అన్యాయాల్ని ఎదుర్కొనే దారులు నేర్పుతాయి.

డాక్టర్ సి. నారాయణ రెడ్డి

అపూర్వమైన భావచిత్రాలతో సాముదాయకంగా అడిగోపుల వెంకటరత్నానిది ప్రతీతాత్మక కవిత్వం. అనువాదానికి ఒదిగే సారమూలికలన్నీ వీరి కవిత్వంలో ఉన్నాయి. వీరు అగ్రకవుల సరసన నిలుస్తారు.

డాక్టర్ ఎన్.గోపి

అడిగోపుల వెంకటరత్నం పరమ భావుకుడు. ఏది రాసినా సమయస్ఫూర్తితో రాస్తారు. వీరి కవిత్వంలో ఒక ఆల్కెమీ చదివేవారిని, రాసేవారిని క్షాలితం చేస్తుంది.

ప్రొఫెసర్ రాచపాళెం చంద్రశేఖర రెడ్డి

నెల్లూరు జిల్లా అనగానే మనకు వెంటనే గుర్తుకొచ్చేది సంప్రదాయవాదుల్లో వేదం వెంకటరాయ శాస్త్రి, దీపాల పిచ్చయ్య శాస్త్రి, ఆధునికుల్లో పట్టాభి, దువ్వూరి రామిరెడ్డి వంటి కవులు, కరుణకుమార్ వంటి కథకులు. కే.వి.ఆర్ వంటి విమర్శకులు, బంగూరి వంటి పరిశోధకులు, పుచ్చలపల్లి సుందరయ్య వంటి నిబద్థ రాజకీయ నాయకులు, వర్ధమాన సమాజం వంటి సాహితీ సాంస్కృతిక సంస్థలు..మొదలైనవి. ఈ వరుసలో చెప్పుకోవాల్సిన కవి అడిగోపుల వెంకటరత్నం.

డాక్టర్ రావూరి భరద్వాజ

ఒక సాధారణ దృశ్యాన్ని అసాధారణమైన కోణం నుండి వీక్షించి, అలా చూసినప్పుడు గోచరమయ్యే సౌందర్యం మీద ఎక్కడా మసకంటని పారదర్శకమైన పదాలను ఎన్నుకుని వాటి సాయంతో రంగు గీతలతో ఆలోచనల ఆటల్ని పాటల్ని చిత్రించడం తెలిసినవారు అడిగోపుల. ఆ కవిత్వంలో వర్తమాన సమాజం అంతా కనబడుతుంది. కొత్తగా, వెచ్చగా, కారంగా, పరిమళంగా, మట్టి వాసనగా, సూచనంగా, సమగ్రంగా ఇంకా చాల చాల వాటిగా...

డాక్టర్ ఎస్.వి.భుజంగరాయ శర్మ

ఈ సమాజాన్ని మార్చటానికి రచయతగా తనకున్న బాధ్యతను గుర్తించటానికి చాల దాఖలాలు అన్ని రచనల్లో కనబడతాయి.

డా.సంజీవదేవ్

కవితలు చదువుతున్నంత సేపు ఆలోచననిస్తాయి. అనుభూతినిస్తాయి. చదివి ముగించిన తర్వాత వాటి ఛాయలు దగ్గరనుండి దూరానికి, దూరం నుండి సుదూరానికి పొడవయ్యి పోతూ పోతూ ఇంకొంత సేపటికి పొడవు లోతుగా మారిపోతుంది. పొడవు నీడలు లోతు నీడలై హృదయాన్ని తొలుస్తాయి. అడిగోపుల ఒక విలక్షణమైన కవి. ఆయనవి విశిష్ట కవితలు.

డాక్టర్ గుంటూరు శేషేంద్ర శర్మ

అడిగోపుల కావ్యాల్ని ఎంత గొప్ప రచనలుగా రూపొందించారంటే మన వర్తమాన దేశానికి ఇంతకంటే శక్తిశాలి చిత్రం మరొకటి వుండబోదనుకోవచ్చు. ఈయన కవిత్వం మనకు జ్ఞాపకం చేయని బాధ అంటూ లేదు. ఇలాంటి కావ్యాలే దేశాన్ని మార్చి మనిషి దుఖాన్ని హరిస్తాయి. ఇలాంటి కవులకి మనుషులు రుణగ్రస్తులై వుంటారు.

కళాప్రపూర్ణ కొండవీటి వెంకటకవి

అడిగోపుల కథలు ఒక ప్రత్యేకత సంతరించుకున్నాయి. ఇవి పరభాషలైన కన్నడం, మలయాళం, తమిళంలోకి అనువాదం అవ్వడమే వీటి ప్రత్యేకత. అడిగోపుల పురోగతి అంచున నుంచి తిరోగమనం సాగిస్తున్న ప్రజానీకానికి జీవితం పూల పాన్పు కాదని విప్పి చెప్పారు.

పెద్దిభొట్ల సుబ్బరామయ్య

అడిగోపులకు అవసరమైనంత కథన శక్తి ఉంది. కథా రచన పట్ల ప్రేమ ఉంది. చుట్టూ వున్నజీవితాన్ని నిశితంగా సానుభూతితో పరిశీలించగల హృదయం ఉంది. సమాజం పట్ల, వ్యక్తుల పట్ల అపారమైన సానుభూతి ఉంది. అవసరమైనంత చక్కని భాషా సంపద ఉంది. కథలలో వైలక్షణ్యం ఉంది.

రావెల సాంబశివరావు

రెండు సహస్రాబ్దాల సాక్షిగా రెండు శతాబ్దాలకు చెందిన ఈ కవి కొత్త మిలీనియంలో మనముందు నిలబెట్టిన సరికొత్త మహోదయం ఇదిగో...సోషలిజం రాల్చిన విత్తనాలతో నారుమళ్ళు పెంచి విశ్వ వినువీధిన అరుణపతాకం రెపరెపలాడిస్తూ ఈయన వేసిన కేకకు- కూతమరిచిన రైలుకూ పెట్టాల్సిందే. విచ్చుకున్న నిశ్శబ్దం రక్తాశ్రువై జారాల్సిందే. అడ్డుగోడలు ఎక్కడ తలెత్తినా బదాబదలు కావాల్సిందే.

డాక్టర్ నాగభైరవ కోటేశ్వరరావు

జీవితంలోను, కవిత్వంలోను సిన్సియారిటీకి ఎంత విలువుందో సి.నారాయణ రెడ్డికి తెలుసు. చిరంజీవి వెంకటరత్నానికి తెలుసు. శిల్ప సుందరం కానిదీ, జీవిత సంపర్కం లేనిదీ కవిత్వం ఎంత గొప్పదైనా నిరుపయోగం అన్న సంగతి ఆరుద్రకీ, అతడి ఏకలవ్యుడు అడిగోపులకీ తెలుసు. అడిగోపుల కవిత్వంలో ఆ తపన తీవ్రత ఉంది. ఆమ్రఫలపు రుచీ ఉంది. తీవ్రత భావానికి, రుచి శిల్పానిది. అడిగోపుల కవిత్వంలో విల్లంబు గురీ ఉంది. వైవిధ్యపు సిరీ ఉంది. గురి గమ్యం కోసం సిరి రమ్యం కోసం. అడిగోపుల తన్ను తాను ఆవిష్కరించుకున్న సందర్భాలని పాఠకుడు పరికించి, పులకించి, కదలి, కంపించి, కరాలెత్తి.. కంగ్రాట్స్ కవీ అంటాడు. వెంకటరత్నానికి సెల్యూట్ చేస్తాడు.

రాచకొండ విశ్వనాధశాస్త్రి

గాయాలే గేయాలని అడిగోపుల గారిని చదివితే తెలుస్తుంది.

కాటూరు రవీంద్ర త్రివిక్రమ్

అడిగోపులది స్పష్టమైన కవితా ముద్ర. ఈయన సొంత గొంతుతోనే సాధించుకున్నాడు. ఆయనకు జాతీయ, అంతర్జాతీయ గౌరవాలు దక్కాలని నా ఆకాంక్ష. దక్కుతాయని నా తిరుగులేని నమ్మకం.

వీరాజి

అడిగోపుల గారిని నేను అల్లంత దూరాన చూస్తూనే.. అదిగో.. పులి వస్తున్నాడంటాను. అవును అడిగోపుల పులి లాంటి కవి. అచ్చమైన అభ్యుదయ కవి. అడిగోపుల ఒక్క కార్మికుడ్ని లేదా మరో కర్షకుడ్నిమాత్రమే భుజాన వేసుకున్న అభ్యుదయ కవి కాదు. సమాజంలోని అన్ని వర్గాల అంతరాల పోరలలోకి పంపించాలని నిరూపిస్తున్నాడు. అడిగోపుల రేపటి సుఖశాంతుల వైపు పోయే మార్గాన్ని కనిపెట్టాలని, ప్రచారం చెయ్యాలని కంకణం కట్టుకున్న ఇవాల్టి మేటి కవి.

కళాప్రపూర్ణ మరుపూరు కోదండరామిరెడ్డి

అడిగోపుల మధుర కవియై భావస్ఫూర్తితో అధిక్షేపణ రూపమైనా, మార్గదర్శకమైన కవిత్వం చెప్పి ఇంపు కలిగిస్తున్నాడు. ఎక్కిరింపుతో దెబ్బతిన్న వ్యక్తి చేతనే నవ్వించే ఈ కవి నేర్పు వేమన బాణితో వియ్యమందుతున్నది.

ప్రొఫెసర్ జి.ఎన్.రెడ్డి, వైస్ చాన్సెలర్, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం

అడిగోపుల గారికి ఉత్తమ ఆధునికాభ్యుదయ కవుల్లో ఒకరిగా రాణించే కవి హృదయం, ప్రతిభ, రచనా పాటవం వుండటం అభినందించదక్క విషయం. వీరిది ఆవేశంలో కన్నా ఆలోచనలో పుట్టిన కవిత.

డాక్టర్ జె. బాపురెడ్డి :

"కాలపురుషుడొకండె త్రికాలవేది

అతని దివ్యాంశం అడిగోపులాఖ్యా సుకవి

కాన రేపటి చూపతన్ కవిత కబ్బి

భావ భౌతిక సత్య సంబరితమయ్యె ! "

విహారి :

వాక్యాన్ని వ్యంగ్య విలసితం చేయటం, వక్రోక్తి,అభివ్యక్తి చాతుర్యం, అలంకార ప్రయోగం, ప్రతీకల్ని సంధించటం, ధ్వని ప్రసరణ వంటి అనేక గుణవిశేషాల సమాహారం శిల్ప మర్మజ్ఞుడైన వెంకటరత్నమ్ గారి కవిత్వం.

ఆచార్య మేడిపల్లి రవి కుమార్ :

అడిగోపుల కవిత్వం ఒక హోరుగాలి. సమాజంలో అసమానతలూ , దోపిడీలు, దౌర్జన్యాలు, మోసాలు వంటి ఇతరేతర అవలక్షణాలన్నీ సమసిపోనంత వరకూ..

ఈ హోరుగాలిలోని అగ్గి ఆరదు  

అలుపెరుగని అడిగోపుల కలం ఆగదు!

ఆచార్య కోలకనూరి ఇనాక్ :

భవిష్యత్తును స్వప్నించే సామాజికుడు. అసంబద్దతలను తిరస్కరించే వేదనాశీలి, మాధుర్యం ఆహ్వానించే రసహృదయుడు, మానవ వికాస భావజాలం సంభవించే ఉన్నతకవి శ్రీ అడిగోపుల వెంకటరత్నం సాహిత్యంలో జవం, జీవం, వడి, వేడి, ఉన్నతంగా ఉన్నవని సహృదయులు గ్రహిస్తారు.

మరణం

[మార్చు]

ఈయన 2024, జూలై 19వ తేదీన తిరుపతిలో తుదిశ్వాసను విడిచాడు.[1]

మూలాలు

[మార్చు]
  1. కల్చరల్ రిపోర్టర్ (20 July 2024). "ప్రముఖ కవి అడిగోపుల కన్నుమూత." ఆంధ్రజ్యోతి దినపత్రిక. Retrieved 20 July 2024.

ఇతర లింకులు

[మార్చు]