అనంత్ లక్ష్మణ్ కన్హెరే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అనంత్ లక్ష్మణ్ కన్హెరే
జననం1892 జనవరి 7
ఆయనీ (అంజని), రత్నగిరి జిల్లా
మరణం1910 ఏప్రిల్ 19(1910-04-19) (వయసు 18)
మరణ కారణంఉరితీత
జాతీయతభారతీయుడు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
విప్లవ స్వాతర్యోద్యమం

అనంత్ లక్ష్మణ్ కన్హెరే (1892 జనవరి 7 - 1910 ఏప్రిల్ 19) భారత స్వాతంత్ర్య సమరయోధుడు. అతను బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. బ్రిటిషు ఇండియాలో నాసిక్ జిల్లా కలెక్టరు జాక్సన్‌ను కాల్చి చంపాడు. జాక్సన్ హత్య నాసిక్ చరిత్ర లోను, మహారాష్ట్రలో స్వాతంత్ర్య విప్లవోద్యమం లోనూ ఒక ముఖ్యమైన సంఘటన.

జీవిత విశేషాలు[మార్చు]

అనంత్ లక్ష్మణ్ కన్హెరే 1892 జనవరి 7 న రత్నగిరి జిల్లాలోని ఖేడ్ తాలూకాలో అయని (అంజనీ) అనే చిన్న గ్రామంలో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. అతనికి ఇద్దరు సోదరులు (అన్నయ్య గణపత్‌రావు, తమ్ముడు శంకర్రావు), ఇద్దరు సోదరిలు ఉన్నారు. అతను తన ప్రాథమిక విద్యను ప్రస్తుత తెలంగాణ లోని నిజామాబాదులో (ఇందూరు) పూర్తి చేశాడు. ఆంగ్ల విద్య ఔరంగాబాద్‌లో జరిగింది. అతని సోదరుడు గణపత్రావు బార్షిలో ఉండేవాడు. అనంత్ తన సోదరుడితో కొంతకాలం ఉండి 1908 లో ఔరంగాబాద్ తిరిగి వచ్చి గంగారామ్ రూపచంద్ ష్రాఫ్ ఇంట్లో అద్దె గదిలో ఉన్నాడు.

రాజకీయ కార్యకలాపాలు[మార్చు]

గంగారామ్‌కు ఏవాలేలో తోన్‌పే అనే స్నేహితుడు ఉన్నాడు. అతను నాసిక్ రహస్య సమాజంలో సభ్యుడు. గను వైద్య అనే వ్యక్తి తన బంధువును కలవడానికి యేవాలేను సందర్శించేవాడు. వైద్య, గంగారామ్ ఒకసారి నాసిక్ సీక్రెట్ సొసైటీ కోసం ఆయుధం కొనుగోలు చేయడానికి వెళ్లారు. అనంత్‌ వైద్యతో పరిచయం పెంచుకున్నాడు.

అనంత్, తాను పెంచుకున్న ఈ స్నేహాల గురించి 'మిత్ర ప్రేమ్' అనే నవల రాశాడు. అనంత్‌కు ఈ సమయంలో రహస్య విప్లవ గ్రూపుల సభ్యులతో పరిచయమైంది. అతడు వారి పని పట్ల ఆకర్షితుడయ్యాడు.

ఆ సమయంలో బ్రిటిషు కాలంలో బొంబాయి ప్రావిన్స్ అనే నేటి మహారాష్ట్రలో వాతావరణమంతా బ్రిటిషు వ్యతిరేక భావాలు వ్యాపించి ఉండేవి. సావర్కర్ సోదరులు స్థాపించిన విప్లవ సంస్థ అభినవ్ భారత్ సొసైటీతో నాసిక్ ముందంజలో ఉండేది. వినాయక్ దామోదర్ సావర్కర్ అన్నయ్య బాబారావు సావర్కర్ మార్గదర్శకత్వంలో నాసిక్ లోను, ఆ చుట్టుపక్కలా అనేక చిన్న రహస్య విప్లవ సంస్థలు ఏర్పడ్డాయి. కృష్ణాజీ గోపాల్ కర్వే, (అన్నా కర్వే అనేవారు), నాసిక్‌లో అలాంటి రహస్య సంఘాన్ని ఏర్పాటు చేసాడు. అన్నా కర్వే తన మాతృభూమి కోసం ఏదైనా చేయాలనుకున్న యువ న్యాయవాది.

జాక్సన్ హత్య కేసులో ప్రధాన నిందితులలో ఒకరైన వినాయక్ నారాయణ్ దేశ్ పాండే రహస్య సమాజంలోని మరొక సభ్యుడు; అతను నాశిక్‌లోని పంచవటిలోని ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఉపాధ్యాయుడు.

జాక్సన్ దురంతాలు[మార్చు]

బ్రిటిషు అధికారి జాక్సన్‌కు ఈ కార్యకలాపాల గురించి తెలుసు. అతను ఇతర బ్రిటిషు అధికారుల మాదిరిగా కాకుండా ప్రజలతో మమేకం కావడం ప్రారంభించాడు. తాను ప్రజలకు అనుకూలంగా ఉండే అధికారి ననే ఒక ఇమేజ్‌ను ఏర్పరచుకున్నాడు. గతజన్మలో తానొక వేద పండితుడైన బ్రాహ్మణుడననీ, అందుకే భారతీయ ప్రజల పట్ల తనకు ప్రేమ ఉందనీ చెప్పేవాడు. మరాఠీలో మాట్లాడేవాడు. సంస్కృత పరిజ్ఞానంకూడా ఉండేది.

వాస్తవానికి, బానిసత్వంలోనే తాము సురక్షితంగా ఉన్నామని ప్రజలు భావించేలా చెయ్యడం అతడి ఉద్దేశం. బ్రిటిషు వ్యతిరేక కార్యకలాపాలను అణచివేయాలనేది కూడా అతని ఉద్దేశం. ఉదాహరణకు, ఒక గోల్ఫ్ బాల్‌ని పట్టుకున్నందుకు ఒక భారతీయుడిని కొట్టి చంపిన ఓ ఆంగ్ల అధికారిపై నేరారోపణను తొలగించి, అతన్ని మరొక ప్రదేశానికి బదిలీ చేసాడు; మరణించిన వ్యక్తి అతిసారం కారణంగా చనిపోయినట్లు ప్రకటించాడు. మరొక సందర్భంలో, కాళికా ఉత్సవం నుండి తిరిగి వస్తూ వందేమాతరం అంటూ దేశభక్తి నినాదాలు చేసిన యువకులపై "దేశ ద్రోహ" కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ వారిపై కేసు పెట్టారు. ప్రభుత్వం కేసులు పెట్టిన విప్లవకారులకు సాయపడిన న్యాయవాది బాబాసాహెబ్ ఖరేను కోర్టు నుండి బహిష్కరించారు. అతని ఆస్తి జప్తు చేసి, అరెస్టు చేసి జైలుకు పంపారు.

జాక్సన్ హత్య, కేసు[మార్చు]

కవి గోవింద్ రాసిన పదహారు పేజీల పాటల పుస్తకాన్ని ముద్రించినందుకు గాను బాబారావు సావర్కర్ ను అరెస్టు చేసి, విచారణ చెయ్యడంతో జాక్సన్ ఆగడాలు పతాకస్థాయికి చేరాయి. బాబారావును అరెస్టు చేసి, విచారించడంలో జాక్సన్ కీలక పాత్ర పోషించాడు. కృష్ణాజీ కర్వే నేతృత్వంలోని ఒక విప్లవ సమూహం 1910 మొదటి నెలలో జాక్సన్‌ను చంపెయ్యాలని నిర్ణయించుకుంది. [1] అయితే, 1909 చివరి నాటికి, జాక్సన్ ముంబై కమిషనర్‌గా పదోన్నతి పొందాడు. జాక్సన్ బదిలీ అవడానికి ముందే అతడిని చంపాలని కృష్ణాజీ కర్వే, వినాయక్ దేశ్ పాండే, అనంత్ కన్హెరే‌లు నిర్ణయించుకున్నారు.

1909 డిసెంబరు 21 న, నాసిక్ ప్రజలు నాసిక్ లోని విజయానంద్ థియేటర్ వద్ద జాక్సన్‌కు వీడ్కోలు సభ ఏర్పాటు చేసారు. అతని గౌరవార్థం సంగీత శారద అనే నాటకాన్ని ప్రదర్శించారు. తమ ప్రణాళికను అమలు చేయడానికి ఇదే తగిన సమయమని అనంత్ నిర్ణయించుకున్నాడు. అతను జాక్సన్‌ను చంపే బాధ్యత తీసుకున్నాడు. తనను బంధించకుండా ఉండటానికి, సహచరులను రక్షించడానికీ విషం తీసుకుని ఆత్మహత్య చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నాడు. అనంత్ ప్రయత్నం విఫలమైతే వినాయక్ జాక్సన్ ను కాల్చాలనేది బ్యాకప్ ప్లాన్. ఈ రెండూ విఫలమైతే, కరవే ఆయుధంతో సిద్ధంగా ఉన్నాడు.

జాక్సన్ నాటకాన్ని చూడటానికి వచ్చాక, అనంత్ అతని ముందు దూకి, బ్రౌనింగ్ పిస్టల్ తో అతనిపై నాలుగు తూటాలు కాల్చాడు. [1] జాక్సన్ వెంటనే చనిపోయాడు. భారతీయ అధికారులలో ఒకరైన పాల్షికర్, మాజీ DSP మారుతరావు తోరద్మల్‌లు లాఠీలతో అనంత్‌పై దాడి చేశారు. అక్కడున్న ఇతర వ్యక్తులు అనంత్‌ని పట్టుకున్నారు. దాంతో అతను తనను తాను కాల్చుకోలేకపోయాడు, విషం తీసుకోలేకపోయాడు. అతడి వద్ద "హత్యకు బదులుగా హత్య" పేరుతో కార్వే రాసిన కాగితం కాపీ కనుగొన్నారు. [1]

18 ఏళ్ళ అనంత్ కన్హెరే, హత్యలో తన బాధ్యతను అంగీకరించాడు. ఈ కేసులో 1910 మార్చి 29 న బొంబాయి ప్రధాన న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. ఆ తీర్పు ప్రకారం, 1910 ఏప్రిల్ 19 న, జాక్సన్‌ను హత్య చేసిన నాలుగు నెలల తర్వాత, థానే జైలులో అనంత్‌ను ఉరితీసారు. అతనితో పాటు, కృష్ణాజీ కర్వే, వినాయక్ దేశ్‌పాండేలను కూడా ఉరితీశారు. ఇతర నిందితులు శంకర్ రామచంద్ర సోమన్, వామన్ అలియాస్ డాజీ నారాయణ్ జోషి, గణేష్ బాలాజీ వైద్యలకు జీవిత ఖైదు విధించారు. దత్తాత్రేయ పాండురంగ జోషికి రెండేళ్ల కఠిన కారాగార శిక్ష పడింది. [1] ఉరిశిక్ష సమయంలో ఈ ముగ్గురి బంధువు లెవరూ లేరు. వారి మృతదేహాలను జైలు అధికారులు కుటుంబాలకు ఇవ్వకుండా కాల్చివేశారు, అస్థికలను కూడా అప్పగించకుండా, థానే సమీపంలోని సముద్రంలో విసిరివేసారు.

స్మరణ[మార్చు]

1909 అనే పేరుతో 2014 జనవరి 10 న ఒక మరాఠీ చిత్రం విడుదలైంది. ఈ సినిమా 2013 డిసెంబర్ 21 న - సరిగ్గా జాక్సన్‌ను చంపేసిన రోజునే - నాసిక్‌లోని విజయానంద్ థియేటర్‌లో - సరిగ్గా చంపేసిన చోటనే - విడుదలైంది. జాక్సన్ పాత్రను చార్లెస్ థామ్సన్ పోషించాడు. ఆస్ట్రేలియన్ అయిన అతడు, భారతదేశంలో నివసిస్తూ, బాలీవుడ్ చిత్రాలలో పని చేస్తున్నాడు.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 Pathak, Arunchandra. "History, British Period". www.cultural.maharashtra.gov.in. Govt. of maharashtra. Retrieved 3 May 2020. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "Gazetteer" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు