Jump to content

అనైలేషన్ ఆఫ్ క్యాస్ట్

వికీపీడియా నుండి
అనైలేషన్ ఆఫ్ క్యాస్ట్
పుస్తకం తొలి ముద్రణ కవర్ పేజీ
రచయిత(లు)బి.ఆర్‌. అంబేద్కర్‌
దేశంభారతదేశం
భాషఆంగ్లం
ప్రచురించిన తేది
1936
ISBN978-8189059637
OCLC498680197

అనైలేషన్ ఆఫ్ క్యాస్ట్ (Annihiliation of Caste) అన్నది 1936 లో బి.ఆర్‌. అంబేద్కర్‌ రాసిన పుస్తకం పేరు. నిజానికి ఇది మొదట ఒక సభలో ఇవ్వాల్సిన ప్రసంగానికి పాఠం. తరువాత ఆ సభ జరుగనందున అంబేద్కర్ దీనిని ఒక పుస్తకంగా ప్రచురించాడు. ఈ రచనలో అంబేద్కర్ భారతదేశంలోని కులవ్యవస్థ పుట్టుపూర్వత్తరాలను గురించి, దానికి పూర్వపు స్థితిగా చెబుతున్న చాతుర్వర్ణ వ్యవస్థ లోని మంచి చెడుల గురించి విశ్లేషించి, ఈ వ్యవస్థ దేశ సమైక్యతకు హానికారకమని తీర్మానించాడు. స్వతంత్రం, సమానత్వం, సౌభ్రాతృత్వం ఉన్న ఆధునిక సామాజిక వ్యవస్థ నిర్మితమవ్వాలంటే హిందూ మత గ్రంథాలని ధిక్కరించాలని సూచించాడు. అంబేద్కర్ చేసిన అనేక రచనల మధ్య చాలా పేరొందిన రచన ఇది. మరాఠీ, హిందీ, పంజాబీ, మలయాళం వంటి అనేక భాషల్లోకి అనువాదం కూడా చేశారు. దీనిని "కుల నిర్మూలన" పేరుతో బోయి భీమన్న తెలుగులోకి అనువదించాడు.[1]

రచనా నేపథ్యం[2]

[మార్చు]

ప్రస్తుతం పాకిస్తాన్ దేశంలో ఉన్న లాహోర్ నగరానికి చెందిన జాత్-పాత్-తోడక్ మండల్ అన్న సంస్థ 1936లో జరుగనున్న తమ వార్షిక సమావేశానికి అధ్యక్షత వహిస్తూ కులవ్యవస్థపై ప్రసంగించమని అంబేద్కర్ ను ఆహ్వానించింది. ఈ సంస్థ హిందూ సంఘ సంస్కర్తల ఆధ్వర్యంలో నడిచేది. అంబేద్కర్ మొదట అంగీకరించకపోయినా, వారి బలవంతం మీద ఒప్పుకున్నాడు. అయితే అతని ప్రసంగ పాఠం చిత్తుప్రతిని చూసిన మండల్ వారు అందులోని కొంత భాగాన్ని తొలగించమని అడిగారు. అందుకు అంబేద్కర్ ఒప్పుకోలేదు. కొంతకాలానికి అసలు ఆ వార్షిక సమావేశం రద్దు చేశారు. అయితే, అప్పటికే అంబేద్కర్ తన ప్రసంగ పాఠం ప్రతులని సమావేశానికి వచ్చేవారికి కాపీలు ఇవ్వడం కోసం ముద్రించాడు. దీనితో ఆ ప్రతులని అంబేద్కర్ పుస్తకంగా అమ్మాడు.

రచన వివరాలు

[మార్చు]

ఈ రచన/ప్రసంగం భారతదేశపు కుల వ్యవస్థలో సతి, బాల్య వివాహాలు, అస్పృశ్యత వంటి అనేక సాంఘిక దురాచారాలు ఉన్నాయని ఎందరో వాదించినా ఎందుకు సంఘ సంస్కరణ కష్టం? అన్న ప్రశ్న గురించిన విచారణతో మొదలవుతుంది. ఇక్కడే ఇతర దేశాలలో ఉన్న ఇటువంటి వ్యవస్థలతో పోలిస్తే కుల వ్యవస్థలో తేడాలు ఏమిటి అన్నది కూడా చర్చించి "కుల వ్యవస్థ ఉత్త శ్రమ విభజన కాదు, శ్రామికుల విభజన కూడా" (Caste System is not merely division of labour. It is also a division of labourers.), శ్రామికులని శ్రేణీకరించి ఈ పని గొప్ప, ఈ పని కాదు అన్న విభజన చేయడం ఇతర దేశాల వ్యవస్థలలో లేదు అని తీర్మానించాడు రచయిత.

అలాగే కుల వ్యవస్థ ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ దేశానికి మేలు చెయ్యదు అని తన వాదనలతో నిరూపించాడు. కుల వ్యవస్థ దేశంలో హిందువుల మధ్య ఐక్యత లేకుండా చేసింది అని వాదించాడు. భారతదేశానికి వివక్షలేని, స్వతంత్రం, సమానత్వం, సౌభ్రాతృత్వం ఉన్న ఆధునిక సామాజిక వ్యవస్థ కావాలి అని అన్నాడు. తరువాత కుల వ్యవస్థకు ముందుది, ఇలాంటి భావాలు కలది అని చెప్పబడుతున్న చాతుర్వర్ణ వ్యవస్థ వైపుకి దృష్టి సారిస్తాడు. ఈ చాతుర్వర్ణ వ్యవస్థను వివరంగా చర్చించి, పరిశీలించి, ఆ వ్యవస్థ గురించిన సిద్ధాంతంలో ఉన్న లోపాలను చూపుతూ, అది ఆచరణలో అసాధ్యమని తీర్మానించాడు.

తరువాత, కుల వ్యవస్థ నిర్మూలన జరిగితే కానీ దేశాభివృద్ధి జరగదనీ, దేశంలోని ప్రజల మధ్య సమైక్యత ఉండదనీ వాదించాడు. మరి ఈ వ్యవస్థని నిర్మూలించడం ఎలా?‌అన్న ప్రశ్నకి జవాబుగా కులాంతర వివాహాలని ప్రోత్సహించినా అది చాలదనీ, హిందూ మత గ్రంథాలు, శాస్త్రాల సరైన తాత్పర్యం కంటే జనం దాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారు అన్నది గమనిస్తే, కుల వ్యవస్థని సమర్థిస్తాయని అనేక హిందువులు భావిస్తున్నారనీ, కనుక వాటిని ధిక్కరించాలనీ అన్నాడు. ఈ విధంగా ఒక మతాన్నే విచ్ఛిన్నం చేసి సంస్కరణలు తేవడం అసాధ్యమని కూడా గుర్తించాడు.

చివరగా, ఈ విషయమై ఏలాంటి కృషి చేయాలి? ఈ వ్యవస్థ ఉండాలా, పోవాలా? అన్న విషయాలపై హిందువులు కృషి చేయాలనీ, ఈ ప్రసంగం తరువాత తాను హిందూ మతాన్ని వదిలి వెళతాననీ, హిందువుగా, హిందువులతో ఇదే తన చివరి ప్రసంగమనీ చెప్పి ముగించాడు.

ప్రచురణానంతరం చర్చ

[మార్చు]

ఈ పుస్తకం మొదటి ముద్రణ రెండు నెలల్లోనే 1500 కాపీలు అమ్ముడుపోయి 1937లో రెండవ ముద్రణకు వెళ్ళింది. రెండవ ముద్రణకు అనుబంధంగా ఈ పుస్తకాన్ని గురించి మహాత్మా గాంధీ వెలిబుచ్చిన అభిప్రాయాలను, దానికి అంబేద్కర్ స్పందననూ కలిపి ముద్రించారు. మరికొంతకాలానికే మూడవ ముద్రణ (1944), తదనంతర కాలంలో మరిన్ని ముద్రణలూ వచ్చాయి.

లింకులు

[మార్చు]