Jump to content

అన్నే బోనీ

వికీపీడియా నుండి
అన్నే బోనీ బొమ్మ

అన్నే బోనీ (16 శతాబ్ది తుదికాలం - 1720 నవంబరు 28న మాయమైంది) కరేబియన్ ప్రాంతంలో కార్యకలాపాలు సాగించిన ఐరిష్ మహిళా సముద్రపు దొంగ.[1] చరిత్రలో నమోదైన కొద్దిమంది మహిళా సముద్రపు దొంగల్లో ఈమె ఉంది.[2][3] 1724లో ప్రచురితమైన కెప్టెన్ చార్ల్స్ జాన్సన్ రాసిన "ఎ జనరల్ హిస్టరీ ఆఫ్‌ ద పైరేట్స్" పుస్తకంలో నమోదైనదే ఆమె గురించి తెలిసిన కొద్దిపాటి సమాచారంలో ప్రధాన భాగం.

ఐర్లాండ్‌లో జన్మించిన బోనీ పుట్టిన తేదీ ఏమిటన్నది ఖచ్చితంగా తెలియదు.[a] ఆమె మేరీ బ్రెనన్ అనే పనిమనిషికి, ఆమె యజమాని, లాయర్ విలియం కోర్మాక్‌కి పుట్టింది. కోర్మాక్ భార్య అనారోగ్యంతో ఉండడంతో భర్త ఇంటి నుంచి కొన్ని మైళ్ళ దూరంలో ఉన్న తన అత్తయ్య ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో కోర్మాక్ తన దగ్గర పనిచేసే మేరీ బ్రెనన్‌తో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దాని ఫలితంగా అన్నే జన్మించింది. ఆ విధంగా అన్నేని ఆ రోజుల్లో అక్రమ సంతానంగా పరిగణించే అవకాశం ఉన్నా కోర్మాక్ ఆమెను తన సక్రమమైన కుమార్తెగానే చూపించుకునేవాడు.[4]

కార్మాక్ తన భార్య నుంచి, ఇతర కుటుంబం నుంచి దూరంగా లండన్ వెళ్ళి అక్కడ అన్నేని అబ్బాయిలాగా బట్టలువేసి ఆండీ అని పిలుస్తూ పెంచసాగాడు. ఆ విషయాన్ని అతని భార్య పసిగట్టడంతో అతనికి సామాన్యంగా తానిచ్చే అలవెన్స్ నిలిపివేసింది. దానితో అక్కడి నుంచి కార్మాక్ అన్నేని, ఆమె తల్లి మేరీ బ్రెనెన్ని తీసుకుని ఈనాటి అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉన్న కరోలినా ప్రావిన్సుకు వెళ్ళి స్థిరపడ్డాడు. అక్కడ మెల్లిగా కార్మాక్ ఒక టౌన్ హౌస్, పట్టణానికి కొద్ది దూరంలోనే ప్లాంటేషన్ సంపాదించగలిగాడు. అన్నే తర్వాత జేమ్స్ బోనీ అనే నావికుడిని పెళ్ళిచేసుకుని బహమాస్‌లోని నాసౌ ప్రాంతానికి వెళ్ళింది. ఇది అప్పట్లో సముద్రపు దొంగల అడ్డాగా ఉండేది.[5] అక్కడే ఆమె సుప్రసిద్ధ సముద్రపు దొంగ కాలికో జాక్ రాకమ్‌ని కలిసింది. ఆమె అతన్ని ఇష్టపడి అతనితో వెళ్ళిపోయి సముద్రపు దొంగల జట్టులో కలిసింది.[6]

అలెన్ & గింటర్ సిగరెట్ల కోసం రూపొందించిన పైరేట్స్ ఆఫ్ ద స్పానిష్ ప్రధాన సీరీస్లో కాల్పులు జరుపుతున్న అన్నే బోనీ బొమ్మ

సముద్రపు దొంగగా అన్నే సాహస కృత్యాలు, ధైర్యంతో కూడిన పనులు చేసి పేరుతెచ్చుకుంది. సముద్రపు దొంగల ముఠాలో ఇతర మగాళ్ళతో కలసి పనిచేస్తూ తాను కూడా మగాడినేనని చాలాకాలం నమ్మించింది. మొదట్లో ప్రియుడు కాలికో జాక్‌కీ, మరో మహిళా సముద్రపు దొంగ మేరీ రీడ్‌కీ మినహా మిగిలినవారికెవ్వరికీ అన్నే మహిళ అన్న సంగతి తెలియకుండా వ్యవహరించింది.[7] కానీ, ఆ సమయంలోనే ఆమె గర్భవతి కావడంతో విషయం స్పష్టమైంది. నౌక మీంచి ఆమెను క్యూబాలో దించడంతో ఆమె అక్కడే మగబిడ్డని ప్రసవించింది.[8] ఆ తర్వాత బోనీ తన భర్తకు విడాకులిచ్చి, సముద్రంపై ప్రయాణిస్తూండగానే జాక్‌ని పెళ్ళిచేసుకుంది.[9]

1720 అక్టోబరులో జాక్ ముఠాపై జమైకా గవర్నర్ ఆదేశం మేరకు జొనాథన్ బ్రానెట్ అనే ప్రైవేటీర్ పట్టుకోవడానికి దాడిచేశాడు. ఈ సమయంలో ముఠాలోని మగ సముద్రపు దొంగలంతా తప్పతాగి ఉండడంతో పెద్దగా పోరాడకుండా డెక్ కింద దాక్కుండిపోయారు. మహిళలైన అన్నే బోనీ, మేరీ రీడ్ మాత్రం సాహసోపేతంగా పోరాడారని చెప్తారు. తుదకు అన్నే, మేరీలతో సహా జాక్ ముఠా మొత్తం అధికారులకు పట్టుబడ్డారు. వారందరినీ జమైకాకు తీసుకువెళ్ళగా గవర్నర్ లూయిస్ నేరాలను నిర్ధారించి, ఉరిశిక్ష విధించాడు.[10]

అన్నే బోనీ, మేరీ రీడ్‌లు ఆ సమయంలో గర్భవతులుగా ఉండడంతో తమ గర్భధారణ కారణంగా క్షమాభిక్ష ప్రసాదించమని అభ్యర్థించారు. కోర్టు వాళ్ళకు ప్రసవాలు జరిగేదాకా ఉరిశిక్షను ఆపుచేస్తూ తీర్పునిచ్చింది. మేరీ రీడ్ జైల్లోనే మరణించింది, బహుశా ప్రసూతి రోగాల కారణంగా అయ్యుంటుందని చరిత్రకారుల అంచనా.[11] కానీ, అన్నే బోనీ ఏమైందన్నది ఇప్పటికీ తెలియదు.

ఆమె చివరిరోజులు ఎలా గడిచాయన్నదానిపై వివిధ అంచనాలున్నాయి.[12] కొందరు ఆమె జైలు నుంచి విడుదలై అమెరికన్ కాలనీల్లో జీవించిందని చెప్తారు. మరికొందరు ఆమె జమైకాలోనే చనిపోయివుండొచ్చు అంటారు. కెప్టెన్ చార్ల్స్ జాన్సన్ ఆమెకు ఉరిశిక్ష తరచుగా వాయిదా పడుతూండగా జైలు జీవితం కొనసాగిస్తూ వచ్చిందని రాశాడు, కానీ ఆమె చివరకు ఏమైందన్నది మాత్రం ప్రశ్నగానే మిగిలిపోయింది.[13][14]

అన్నే బోనీ జీవితం సినిమాలు, డాక్యుమెంటరీలు, గేమ్స్, సాహిత్యం, సంగీతం, యానిమె, నాటకాలు వంటి రకరకాల మాధ్యమాల్లో వచ్చింది. వీటిలో చారిత్రక అవాస్తవాల నుంచి పూర్తిగా కాల్పనిక కథనాల వరకూ ఎన్నో రకాలు చోటుచేసుకున్నాయి.[15] 2020లో ఇంగ్లండ్‌లో ఆమె విగ్రహాన్ని కూడా ఏర్పాటుచేశారు. అయితే, శాశ్వతంగా పబ్లిక్ ప్రదేశంలో ప్రతిష్టించడానికి "సముద్రపు దొంగతనాన్ని గ్లామరైజ్ చేస్తున్నారన్న" ఆరోపణలు అడ్డుతగిలాయి. తర్వాత ఇంగ్లండ్‌కి చెందిన లూయిస్ ఫుట్‌బాల్ క్లబ్ ఈ విగ్రహాన్ని తీసుకుంది.[16][17][18]

నోట్స్

[మార్చు]
  1. Commonly cited dates include 1690, 1697, 1698, and 1702. All sources on date of birth were written centuries after Bonny's trial and cannot be collaborated.

మూలాలు

[మార్చు]
  1. Baldwin, Robert. "The Tryals Of Captain John Rackham and Other Pirates". Internet Archives. 1721. Retrieved 22 October 2023.
  2. The Boston Gazette 1720 October 17 The Documentary Record Archived 25 సెప్టెంబరు 2023 at the Wayback Machine,
  3. "Anne Bonny and Famous Female Pirates". www.annebonnypirate.com (in ఇంగ్లీష్). Archived from the original on 4 March 2018. Retrieved 3 March 2018.
  4. Legendary Pirates The Life and Legacy of Anne Bonny . Charles River Editors , 2018.
  5. "Anne Bonny | Biography & Facts | Britannica". www.britannica.com (in ఇంగ్లీష్). Archived from the original on 4 December 2020. Retrieved 17 February 2022.
  6. Johnson, Charles (14 May 1724). The General History of Pyrates. Ch. Rivington, J. Lacy, and J. Stone.
  7. Johnson, Charles (14 May 1724). The General History of Pyrates. Ch. Rivington, J. Lacy, and J. Stone.
  8. Joan., Druett (2005) [2000]. She captains : heroines and hellions of the sea. New York: Barnes & Noble Books. ISBN 0-7607-6691-6. OCLC 70236194.
  9. Druett, Joan (2000). She Captains: Heroines and Hellions of the Sea. New York: Simon & Schuster. ISBN 0-684-85690-5.
  10. Zettle, LuAnn. "Anne Bonny The Last Pirate". Archived from the original on 22 May 2019.
  11. Bartleme, Tony (28 November 2020). "A 22-year-old YouTuber may have solved Anne Bonny pirate mystery 300 years after trial". The Post and Courier. Archived from the original on 28 November 2020. Retrieved 28 November 2020.
  12. Carmichael, Sherman (2011). Forgotten Tales of South Carolina. The History Press. p. 72. ISBN 978-1-60949-232-8.
  13. Fictum, David (8 May 2016). "Anne Bonny and Mary Read: Female Pirates and Maritime Women". Colonies, Ships, and Pirates. 8 May 2016. Archived from the original on 14 October 2023. Retrieved 6 October 2023.
  14. Captain Charles Johnson, A General History of the Robberies and Murders of the most notorious Pyrates, Chapter 8, , retrieved 21 September 2017 ISBN 978-1-60949-232-8
  15. Molenaar, Jillian (7 July 2019). "Anne of the Indies by Herbert Ravenel Sass". Depictions of John Rackam, Anne Bonny, and Mary Read. 6 July 2019. Archived from the original on 3 March 2021. Retrieved 22 October 2023.
  16. Lewis, Samantha (18 March 2023). "Introducing Lewes FC, the world's only gender-equal football club, and the Australians who play there". ABC News. 18 March 2023. Archived from the original on 14 October 2023. Retrieved 6 October 2023.
  17. "Female pirate lovers whose story was ignored by male historians immortalised with statue". The Independent. 18 November 2020. Archived from the original on 7 May 2022.
  18. "Burgh Island female pirates statue plans withdrawn". BBC News. 30 March 2021. 30 March 2021. Archived from the original on 14 October 2023. Retrieved 6 October 2023.