Jump to content

అబ్దుర్ రజాక్ మలీహాబాదీ

వికీపీడియా నుండి
అబ్దుర్ రజాక్ మలీహాబాదీ
జననం1895
మరణం1959(1959-00-00) (వయసు 63–64)
ముంబై
సుపరిచితుడు/
సుపరిచితురాలు
భారత స్వాతంత్ర్య పోరాట సమయంలో పాత్రికేయుడు

అబ్దుర్ రజాక్ మలీహాబాదీ (1895-1959) [1] రచయిత, పాత్రికేయుడు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ జీవిత చరిత్ర రాసాడు.

జీవిత విశేషాలు

[మార్చు]

మలీహాబాదీ లక్నో శివారు లోని మలీహాబాద్‌లో జన్మించాడు. అతను పఠాన్ సంతతికి చెందినవాడు.[2] అతని పాఠశాల విద్య లక్నో (నద్వతుల్ ఉలామా) లో జరిగింది. తరువాత ఈజిప్టు వెళ్ళి అక్కడ డాక్టరేట్ సాధించాడు. అక్కడే తన జీవితంలో చాలా సంవత్సరాలు గడిపాడు. అతను ఉర్దూ, పర్షియన్, అరబిక్, పష్తో వంటి భాషలలో నిష్ణాతుడు. ఆల్ ఇండియా రేడియోలో న్యూ ఢిల్లీలోని అరబిక్ డిపార్ట్‌మెంట్‌లో కొన్ని సంవత్సరాలు పనిచేశాడు. అతను సౌదీ రాజకుటుంబానికి సన్నిహితుడు. స్వాతంత్ర్య పోరాట సమయంలో మహాత్మా గాంధీకి, పండిట్ నెహ్రూ కుటుంబానికీ సన్నిహితుడు. భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో అతని పాత్రకు తగిన గుర్తింపును ఇస్తూ, నెహ్రూ ప్రభుత్వంలో స్వాతంత్ర్యానంతరం అతనికి క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వజూపగా, అతను దానిని తిరస్కరించాడు. మరొక స్వాతంత్ర్య పోరాట యోధుడూ, కవీ అయిన జోష్ మలీహాబాదీ ("షాయర్-ఇ-ఇంక్విలాబ్" అని అతడికి పేరు) అతనికి బంధువు.

స్వాతంత్ర్యోద్యమంలో పాత్రికేయుడిగా, రచయితగా

[మార్చు]

స్వాభావికంగా అతను పాత్రికేయుడు. బ్రిటిష్ రాజ్‌కు వ్యతిరేకంగా పత్రికల్లో రాసాడు. వారి దురాగతాలను సాధారణ భారతీయుడి వద్దకు తీసుకెళ్లాడు. మలీహాబాదీ, జికార్-ఇ-ఆజాద్, ఆజాద్ కి కహానీ ఖుద్ ఆజాద్ కీ జుబానీ అనే పుస్తకాలు రాసాడు. రెండవ పుస్తకాన్ని దఫ్తార్ ఆజాద్ హింద్ సంస్థ అతని మరణానంతరం ప్రచురించింది.[3] అతను ఖిలాఫత్ ఉద్యమంలో పాల్గొన్నాడు. ఇస్తాంబుల్ నుండి అరబిక్, ఉర్దూ భాషల్లో ప్రచురితమైన జిహాన్-ఇ-ఇస్లాం పత్రికలో పనిచేసాడు. కోల్‌కతా నుండి ప్రచురితమైన ఉర్దూ దినపత్రిక ఆజాద్ హింద్ [4]కు అతను వ్యవస్థాపక సంపాదకుడు. స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో మౌలానా అబుల్ కలామ్ అజాద్ కలకత్తా లోని 19-ఏ, బాలీగంజ్ సర్క్యులర్ రోడ్డులో నివసించిన రోజుల్లో మలీహాబాదీ అతనికి సన్నిహితంగా ఉండేవాడు.[5] మౌలానా అబుల్ కలాం ఆజాద్ జీవిత చరిత్ర రాసాడు.

మలీహాబాదీ ముంబైలో క్యాన్సరుతో మరణించాడు. అతనికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. రాజ్యసభ సభ్యుడైన సయీద్ మలీహాబాదీ అతని పెద్ద కుమారుడు. తండ్రి మరణానంతరం అతడు ఉర్దూ దినపత్రిక ఆజాద్ హింద్‌కు సంపాదకుడిగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ వార్తాపత్రిక శారదా గ్రూప్ యాజమాన్యంలో ఉంది.[6]

మూలాలు 

[మార్చు]
  1. Qureshi, M. Naeem (1999). Pan-Islam in British Indian politics: a study of the Khilafat Movement. BRILL. p. 65.
  2. ARSH MALSIANI (1976). ABUL KALAM AZAD. Publications Division Ministry of Information & Broadcasting. pp. 106–. ISBN 978-81-230-2264-2. When Azad heard about this incident, he began to tease him and said, "Maulvi Saheb, you are no Pathan. Perhaps you are a Sheikh. How could a Pathan of Malihabad keep quiet after being abused ?" Abdur Razzak retorted: "It was no abuse, just a compliment to your paper." Azad was pleased with this retort and complimented Abdur Razzak on his self-control.
  3. By Aijaz Ahmad (2002). Lineages of the Present: Ideology and Politics in Contemporary South Asia. Verso. p. 78.
  4. Ahmed, Firoz Bakht. "Forgotten crusader". The Deccan Herald. Retrieved 30 April 2013.
  5. Ahmed, Firoz Bakht. "Memorial for Maulana Azad in Kolkata". The Milli Gazette. New Delhi. Retrieved 4 October 2016.
  6. "RICE scraps Channel 10 deal with 'tainted firm'". The Times of India. Retrieved 23 April 2013.