అభిలాష (సినిమా)
| అభిలాష (1983 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | కోదండరామిరెడ్డి |
|---|---|
| నిర్మాణం | కె ఎస్ రామా రావు, అల్లు అరవింద్ |
| రచన | యండమూరి వీరేంద్రనాథ్ |
| సంగీతం | ఇళయరాజా |
| కూర్పు | కోటగిరి వెంకటేశ్వరరావు |
| నిర్మాణ సంస్థ | క్రియేటివ్ కమర్షియల్స్ |
| భాష | తెలుగు |
1983లో విడుదల అయిన అభిలాష సినిమా యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం, యండమూరి వీరేంద్రనాథ్ వ్రాసిన "అభిలాష" నవల ఆదారంగా నిర్మింపబడింది. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ మీద కె ఎస్ రామా రావు, అల్లు అరవింద్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించగా ఇళయరాజా సంగీతం అందించాడు. ఈ చిత్రంలో చిరంజీవి, రాధిక, రావు గోపాల్ రావు, గొల్లపూడి మారుతిరావు, రాజ్యలక్ష్మి, అల్లు అరవింద్ తదితరులు ముఖ్యపాత్రలలో నటించారు.
ఇపీఎస్‌లోని 302 శిక్షాస్మృతిని రద్దు చేయించడానికి పెద్దగా ప్రాక్టీసు లేని చిరంజీవి అనే యువకుడు చేసిన సాహసోపేతమైన పోరాటం.. అనుకున్నది సాధించడమే అతని ‘అభిలాష’ అనేది ఈ సినిమా ప్రధాన కథాంశం. యండమూరి నవల ఆధారంగా తీసినప్పటికీ, 1946లో రూపొందిన ‘ద మేన్ హూ డేర్డ్’, 1956లో తెరకెక్కిన ‘బియాండ్ ఏ రీజనబుల్ డౌట్’ సినిమాలు ఇదే పాయింట్ తో రూపొందడం గమనార్హం!
వాణిజ్యపరంగా విజయవంతమైన ఈ చిత్రాన్ని తమిళంలో ‘సట్టతై తిరుతుంగల్ (சட்டத்தை_திருத்துங்கள்)’ పేరుతో పునర్నిర్మించారు.
తారాగణం
[మార్చు]- కొణిదెల చిరంజీవి
- రాధిక
- రావు గోపాలరావు
- గొల్లపూడి మారుతీరావు
- రాజ్యలక్ష్మి
- మాడా వెంకటేశ్వరరావు
- రాళ్ళపల్లి
- భీమరాజు
- పి.జె.శర్మ
- మల్లికార్జునరావు
- కృష్ణ చైతన్య
- సత్యేంద్ర కుమార్
- ఉయ్యూరు రామకృష్ణ
- సి.ఎస్.రావు
- విజయరాం
- థమ్
- కె.ఎల్.ఎన్.రావు
- జి.మూర్తి
- ఎం.జగదీష్ బాబు.
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు: ఎ.కోదండరామిరెడ్డి
- సంగీతం: ఇళయరాజా
- కధ: యండమూరి వీరేంద్రనాథ్
- మాటలు: యండమూరి వీరేంద్రనాథ్ , జి.సత్యమూర్తి
- నిర్మాతలు: కె.ఎస్.రామారావు, అల్లు అరవింద్
- నిర్మాణ సంస్థ: క్రియేటివ్ కమర్షియల్స్
- సాహిత్యం: వేటూరి సుందర రామమూర్తి, ఆచార్య ఆత్రేయ
- నేపథ్య గానం: శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం ,శిష్ట్లా జానకి
- ఫోటోగ్రఫి: లోక్‌సింగ్
- కూర్పు; కోటగిరి వెంకటేశ్వరరావు
- విడుదల తేది: 11-03-1983
కథ
[మార్చు]లాయరుగా పెద్దగా ప్రాక్టీసులేని చిరంజీవి (చిరంజీవి) తమ రూమ్మేటు (అల్లు అరవింద్)తో కలిసి ఓ గదిలో నివసిస్తూ ఉంటాడు. ఏదో ఒకరోజున గ్రేట్ క్రిమినల్ లాయర్ సర్వోత్తమరావు (రావు గోపాల్ రావు) అంతటివాడు కావాలని కలలు కంటూ ఉంటాడు. చిన్నతనంలో తన తండ్రిని అన్యాయంగా ఉరి తీసి ఉంటారు. అతనికి జరిగిన అన్యాయం వేరొకరికి జరగకూడగని ఉరిశిక్ష విధించే సెక్షన్ 302ను భారతీయ శిక్షాస్మృతి నుండి తొలగించాలని, అందుకు చట్టాన్ని మార్చాలని తపిస్తూంటాడు.
ఇలా ఉండగా, సర్వోత్తమ రావు నగరంలోని ప్రముఖ న్యాయవాదులందరికీ పార్టీ ఇస్తాడు. పొరపాటున, ఈ పార్టీ ఆహ్వానం చిరంజీవికి అందుతుంది. ఆ పార్టీలో చిరంజీవి అనుకోకుండా సర్వోత్తమ రావు మేనకోడలు అర్చన (రాధిక)ను కలుసుకుంటాడు. అతని అమాయకత్వం, మంచితనం అర్చనకు నచ్చుతాయి. ఈ సందర్భంలో ఉరిశిక్షను రద్దు చేయాలన్న దానికి తన వద్ద ఓ ప్లాన్ ఉందని, దాని ప్రకారం చట్టాన్ని మార్చవచ్చునని సర్వోత్తమరావుతో చిరంజీవి అంటాడు. ఈలోపు అర్చన విదేశాలకు వెళుతుంది.
వారి పథకంలో భాగంగా చిరంజీవి, ఒక నకిలీ మర్డర్ ను ప్లాన్ చేస్తాడు. అప్పటికే చనిపోయిన ఒక మహిళ శవాన్నితానే చంపినట్టు చిత్రీకరించి, తనని తాను ఇరికించుకుని, చట్టానికి లొంగిపోతాడు. అనుకున్నప్లాన్ ప్రకారం చిరంజీవికి ఉరిశిక్ష విధించాక, సర్వోత్తమ రావు వచ్చి, సాక్ష్యాలు చూపించి, చిరంజీవిని నిర్దోషి అని తేల్చి, మార్చండి మన చట్టాల్ని అని పిలుపునివ్వాలి. జైల్లో తనను కలుసుకున్న అర్చనకు తన ప్రణాళికను రహస్యంగా ఉంచి, తానే కామంతో ఈ నేరం చేసినట్లు చెపుతాడు, దీనితో అర్చన బాధతో వెళిపోతుంది.
ఈలోపు చిరంజీవికి శిక్ష ఖాయమవుతుంది. అయితే సాక్ష్యాలతో గవర్నర్ ను కలవడానికి వెళుతున్న సర్వోత్తమరావుకు యాక్సిడెంట్ అయి ఆసుపత్రి పాలవుతాడు. అప్పుడు చిరంజీవి తాను నిర్దోషినని సెంట్రీ విష్ణుశర్మ (రాళ్లపల్లి)కు అసలు విషయం చెబుతాడు. అతను ఆ విషయాన్ని అర్చనకు చేరవేస్తాడు. వారిద్దరూ కలసి గవర్నర్ కు అసలు విషయం చెప్పి, అప్పటికి శిక్ష రద్దు అయ్యేలా చేస్తారు.
తరువాత సర్వోత్తమ రావుకూడా ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయి, చిరంజీవి విడుదలయినందుకు సంతోషించి, చిరంజీవి అర్చనల నిశ్చితార్థాన్ని ప్రకటిస్తూ పార్టీ ఇస్తాడు. ఆ సమయంలో చిరంజీవి వేసిన ప్లాన్ లో భాగంగా శవం ఇచ్చిన ఓబులేసు (గొల్లపూడి మారుతి రావు) వస్తాడు. అతనితో చిరంజీవి మాట్లాడడం చూసిన అర్చనకు ఏదో అనుమానం కలుగుతుంది. ఆమె వారిని అనుసరిస్తుంది, వారి సంభాషణలో నకిలీ హత్యకు ఉపయోగించిన శవం సహజంగా మరణించలేదని వెల్లడవుతుంది. మళ్ళీ చిరంజీవి చుట్టూ ఉచ్చు బిగించుకుంటుంది. అర్చన సైతం చిరంజీవిని అనుమానిస్తుంది. చివరకు ఆ ప్లాన్ వెనుక ఎవరు ఉన్నారో తెలుసుకుంటాడు. అది తాను ఎంతగానో అభిమానించే సర్వోత్తమరావు అని తెలిసి ఆశ్చర్యపోతాడు. అసలు శవంగా మారిన అమ్మాయి సర్వోత్తమరావు అక్రమ సంతానమని, అందువల్లే ఆమెను అతనే చంపించాడని తెలుస్తుంది. ఈ విషయాలు అర్చనకూ తెలుస్తాయి. సర్వోత్తమరావు అర్చనను, చిరంజీవిని మట్టుపెట్టాలనుకుంటాడు. కానీ, అతనే దొరికిపోయి అరెస్ట్ అవుతాడు. న్యాయమూర్తి అతనికి మరణశిక్ష విధించాడు. అయితే, సర్వోత్తమరావుకు ఉరిశిక్షకు బదులుగా యావజ్జీవ శిక్ష విధించి, అతనిలో మార్పు వచ్చేలా చేయాలని చిరంజీవి వాదిస్తాడు. న్యాయమూర్తి అంగీకరించి, సర్వోత్తమ రావు శిక్షను ఏడు సంవత్సరాల జైలు శిక్షకు తగ్గిస్తాడు. “ఏ ప్రెసిడెంటు, ఏ ప్రైమ్మినిస్టర్ ఉండగా ఈ ఊరిశిక్ష రద్దవుతుందో వారికి ఈ చిత్రం అంకితం” అంటూ ఎండ్ కార్డ్ వేస్తారు.
పాటలు
[మార్చు]- వేళాపాళ లేదు కుర్రాళ్ళాటకీ , రచన: ఆచార్య ఆత్రేయ గానం.ఎస్ పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి,
- యురేకా ఛాకా మీకా
- ఉరకలై గోదారి , రచన: ఆచార్య ఆత్రేయ, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం,ఎస్ జానకి
- బంతీ చామంతీ, రచన:వేటూరి సుందర రామమూర్తి గానం . ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి
- సందె పొద్దులకాడ, రచన: వేటూరి సుందర రామమూర్తి గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి
- నవ్వింది మల్లె చూడు, రచన: వేటూరి సుందర రామమూర్తి,, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి
మూలాలు
[మార్చు]"Abhilasha Movie: ఉరిశిక్షను రద్దు చేయాలన్నదే వారి 'అభిలాష'!". NTV.