Jump to content

అమెదియో అవగాడ్రో

వికీపీడియా నుండి
అమెదియో అవగాడ్రో

అమెదియో అవగాడ్రో

పరమాణువులను లెక్కపెట్టిన వాడు!

[మార్చు]

డాక్టరేట్‌ పూర్తి చేసి మంచి ఉద్యోగంలో స్థిరపడిన ఎవరైనా తిరిగి కొత్తగా చదువు మొదలు పెడతారా? అలా చదివిన ఓ వ్యక్తి శాస్త్రవేత్తగా ఎదిగి ప్రపంచ గుర్తింపు పొందాడు. ఆయన పుట్టింది ఈరోజే--1776 ఆగస్టు 9న .

సమగ్రమైన అధ్యయనం ద్వారా ఓ శాస్త్రవేత్త ఓ సిద్ధాంతాన్ని ప్రకటించాడు. అది ఆయన కాలంలో ఆదరణకు నోచుకోలేదు. తర్వాతి కాలంలో అదెంత కీలకమైనదో తెలుసుకున్న శాస్త్రవేత్తలు ఆయన పేరును ఓ స్థిరాంకానికి పెట్టి నివాళులు అర్పించారు. ఆ శాస్త్రవేత్త పేరు అవొగాడ్రో అయితే, ఆయన పేరిట ఇప్పటికీ ఉపయోగపడుతున్న స్థిరాంకం 'అవగాడ్రో సంఖ్య'.

'విశ్వంలో ఒకే రకమైన పీడనం, ఉష్ణోగ్రతలు ఉండే సమాన ఘనపరిమాణం ఉన్న ఏ రెండు వాయువుల్లోనైనా సమాన సంఖ్యలో అణువులు ఉంటాయి'- ఇదే విజ్ఞానశాస్త్రంలో ప్రసిద్ధిపొందిన అవగాడ్రో నియమం (Avogadro Law). రసాయన శాస్త్రంలోను, వివిధ వాయువుల ధర్మాల నిర్ణయంలోను ఎంతో కీలకమైనదిగా ఈనాటికీ ఉపయోగపడుతున్న ఈ సిద్ధాంతాన్ని అవగాడ్రో 1811లో ప్రపంచానికి అందించాడు.

ఇటలీలోని ట్యూరిన్‌లో 1776 ఆగస్టు 9న న్యాయవాదుల కుటుంబంలో పుట్టిన అవగాడ్రో చురుకైన విద్యార్థి. పదహారేళ్లకే పట్టభద్రుడై, ఇరవై ఏళ్లకల్లా చర్చికి సంబంధించిన న్యాయశాస్త్రంలో డాక్టరేట్‌ సాధించాడు. న్యాయవాద వృత్తిని స్వీకరించి ఆర్థికంగా ఎదిగి సుఖవంతమైన జీవనంలో స్థిరపడినా సంతృప్తి చెందలేదు. తిరిగి భౌతిక, రసాయనిక, గణిత శాస్త్రాలను కొత్తగా అధ్యయనం చేయసాగాడు. ఇరవై నాలుగేళ్ల వయసులోనే విద్యుత్‌ రంగంలో ప్రయోగాలు చేశాడు. ఆపై రాయల్‌ కళాశాలలో ప్రొఫెసర్‌గా నియమితుడయ్యాడు.మూలకాల సాపేక్ష అణుభారాలను భాష్పసాంద్రతల నుంచి కనుగొనడం, వాయు సమ్మేళనాల్లో అణువుల నిష్పత్తిని కనుగొనడంలో ఈ సిద్ధాంతం ఉపయోగపడుతుంది. పరమాణువుల కలయిక వల్ల అణువులు ఏర్పడతాయని కూడా అవగాడ్రో ప్రతిపాదించగలిగాడు. అలాగే నీరు ఒక ఆక్సిజన్‌ పరమాణువు, రెండు హైడ్రోజన్‌ పరమాణువుల సంయోగంతో ఏర్పడుతుందని నిర్ధరించాడు. అయితే ఈయన సిద్ధాంతాలను అప్పట్లో ఎవరూ గుర్తించలేదు. ఆయన మరణించిన నాలుగేళ్లకు అణు, పరమాణు భారాల వివరణలో తలెత్తిన చిక్కుముడులను అవగాడ్రో నియమాన్ని అన్వయించుకోవడం ద్వారా శాస్త్రవేత్తలు అర్థం చేసుకోగలిగారు. అందుకు గుర్తింపుగా పదార్థంలోని ప్రాథమిక కణాలను లెక్కించే ప్రమాణమైన మోల్ (mole) సూచించే సంఖ్య (6.023 తర్వాత 23 సున్నలు)ను అవగాడ్రో సంఖ్యగా గుర్తించారు. డజను అనేది 12 సంఖ్యను సూచించినట్టే మోల్‌ అనేది ఈ పెద్ద సంఖ్యను సూచిస్తుంది. అలాగే చంద్రునిపై ఉండే ఓ క్రేటర్‌కి కూడా ఆయన పేరే పెట్టారు.

మూలాలు

[మార్చు]