అయ్యగారి శ్యామసుందరం
అయ్యగారి శ్యామసుందరం ప్రముఖ వైణికుడు. అతను కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారాన్ని పొందాడు. అతను దేశంలో ఒక సీనియర్ టాప్ గ్రేడ్ వీణా కళాకారుడు.[1] వీణా వాద్యవిశారద, సంగిత విద్వన్మణి, సునాద సుధానిధి, వీణా వాదన చతుర, వంటి అనేక బిరుదులను పొందాడు.
జీవిత విశేషాలు
[మార్చు]అతను విజయనగరంలో 1948 సంవత్సరంలో ప్రముఖ వైణికుడు "వైణికరత్న" బిరుదాంకితుడు అయిన అయ్యగారి సోమేశ్వరరావు, జయకుమారి దంపతులకు జన్మించాడు. నాలుగేళ్ళకే 20 కృతులు వీణపై వాయించడం, రాగాలు చెబితే కీర్తనల పల్లవి చెప్పడం ఆయనకు అలవోకగా అబ్బాయి. తన తండ్రి వద్ద వీణా వాద్యంలో నిపుణత సాధించిన తల్లి, ఈయన వీణా సాధన గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవారట. 8 ఏళ్ళు వచ్చేసరికి 50 కీర్తనల దాకా అభ్యసించి, గాత్రం, వీణ కచేరీలు ఇచ్చే స్థాయికి ఎదిగారు. తన తండ్రి వద్ద సంగీత విద్యను అభ్యసించాడు. అతను తన మొదటి వైణిక ప్రదర్శనను తన 8వ యేట చేసాడు. విజయవాడ ఎస్.ఆర్.ఆర్ కాలేజీలో బి.కాం వరకూ చదువుకున్నాడు. అతనికి 23 ఏళ్ళ వయసు ఉండగా, సంగీత కళాశాలలో అధ్యాపకుడిగా పాఠాలు చెప్తుండేవాడు. ఆ సమయంలోనే 16 ఏళ్ళ వయసున్న అతని మేనమామ కూతురు జయలక్ష్మితో పెద్దలు వివాహం జరిపించారు. అప్పటికే ఆమె తండ్రి పప్పు సోమేశ్వర్రావు గారి వద్ద వర్ణాల వరకూ నేర్చుకుంది. "స్త్రీలు ఎప్పుడూ ఒకడుగు ముందుండాలి. వారికి బ్రతికే ధైర్యం ఇవ్వాలి" అన్న వారి కుటుంబ సిద్ధాంతం ప్రకారం జయలక్ష్మికి వీణా వాదనలో శిక్షణనిచ్చారు. ఆమె ‘గాన విపంచి’గా బిరుదు పొందింది. వారిరివురూ కలసి జంటగా అనేక ప్రోగ్రాంలు ఇచ్చారు.[2]
మనోధర్మ సంగీతంలో తమకంటూ ప్రత్యేక ముద్రను కలిగిన, ప్రఖ్యాత విజయనగర వీణా సాంప్రదాయంలో ప్రముఖుడు. అతను సంగీత సాధన, సరికొత్త ప్రయోగాలు చెయ్యటం, సమకాలీకులతో ఆరోగ్యకరమైన పోటీతత్వం, ఇవన్నీ తన తండ్రి వద్ద నుంచే నేర్చుకున్నాడు. 1965 లో ఆయన తండ్రి చనిపోవడానికి వారం రోజులు ముందు ఒక రేడియో ప్రోగ్రాం నుంచి బయటకు వచ్చి, తన వీణను అతని చేతిలో పెట్టి, "ఇక నా రెండవ జీవితం నీతోనే మొదలవ్వాలి" అని అన్నాడు.
అతని సంగీతం కచ్చితమైన గాయకి శైలిలో సృజనాత్మకంగా, శ్రావంగా ఉంటుంది. అతను 55 సంవత్సరాలకు పైగా ఇప్పటికీ చురుకుగా సంగీత వృత్తిని కొనసాగిస్తున్నాడు. అతను భారతదేశంతో పాటు అమెరికా సంయుక్త రాష్ట్రాలలో కూడా అనేక నగరాలలో తన ప్రదర్శనలను నిర్వహించాడు. అతను 1978లో ప్రతిష్ఠాత్మకమైన మద్రాస్ సంగీత అకాడమీ నుండి ఉత్తమ వీణా ప్రదర్శాన పురస్కారాన్ని అందుకున్నాడు. 1979లో శ్రీకృష్ణగానసభ నుండి కూడా పురస్కారాన్ని పొందాడు. అతను సీనియర్ అత్యున్నత స్థాయి వీణా విద్వాంసునిగా ఆల్ ఇండియా రేడియో కోసం అనేక జాతీయ సంగీత, సంగీత సమ్మేళన కచేరీలలో పాల్గొన్నాడు. అతని ప్రదర్శనలు దూరదర్శన్ తో పాటు అనేక టెలివిజన్ ఛానల్స్ లో ప్రసారితమైనాయి.
అతను దేశ విదేశాలలో ప్రదర్శనలు ఇస్తుండటంతో పాటు పర్తీ రోజూ వీణా, సంగీతం బోధనను వ్యక్తిగతంగానూ, స్క్రైప్, సామాజిక మాధ్యమాల ద్వారా బోధిస్తున్నాడు. అతను ఆంధ్రప్రదేశ్ లోని అనేక ప్రభుత్వ కళాశాలలో 34 సంవత్సరాల పాటు అధ్యాపకునిగా, ప్రధానాధ్యాపకునిగా తన సేవలనందించాడు.[3]
విజయవంతమైన వైణికునిగా
[మార్చు]- సంగీత నాటక అకాడమీ పురస్కారం
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యున్నత స్థాయి వీణా విద్వాంసుడు.
- 50 సంవత్సరాలపాటు ఆల్ ఇండియా రేడియోలో కచేరీలు
- 35 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంగీత & నృత్య కళాశాలలలో సేవలు
- 20 సంవత్సరాలు ప్రధానాద్యాపకునిగా పనిచేసి డిసెంబరు 2005లో పదవీ విరమణ.
- ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్ లలో జాతీయ కార్యక్రమాలలో పాల్గొన్నారు.
- OBS, సంగీత సమ్మేళన కచేరీలు మొదలైనవి.
- 60 సంవత్సరాల పాటు సంగీత జీవితం
- భారత, విదేశాలలో అనేక సంగీత కచేరీలు.
పురస్కారాలు
[మార్చు]- 1964 : ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్శిటీ యూత్ ఫెస్టివల్ లో వీణా ప్రదర్శనలో మొదటి బహుమతి.
- 1967 : సరస్వతి గానసభ, కాకినాడలో వోకల్ లో మొదటి బహుమతి
- 1969 : పురందరదాస కాంపిటీషన్, తంబుర పురస్కారం, విజయవాడ.
- 1978 : ఉత్తమ వీణా కచేరీ పురస్కారం, మ్యూజిక్ అకాడమీ, చెన్నై.
- 1980 : ఉత్తమ వీణా కచేరీ పురస్కారం, శ్రీకృష్ణ గాన సభ, చెన్నై.
- 1983 : ఆకాశవాణి పురస్కారం - వినూత్న కార్యక్రమం "నాదబంధం"
- 1995 : కళా సౌజన్య, నవరత్న పురస్కారాలు, విజయవాడ. వారిచే పురస్కారం.
- 2000 : దాసరి సంగీత అకాడమీ, గుంటూరు.
- 2001 : తానా, ఫిలడెల్ఫియా, యు.ఎస్.ఎ
- 2002 : శ్రీజ వార్షిక పురస్కారాలు, విజయవాడ.
- 2004 : టి.ఎఫ్.ఎ.ఎస్ పురస్కారం - న్యూజెర్సీ, యు.ఎస్.ఎ.
- 2005 : కిన్నెర పురస్కారం, హైదరాబాదు.
- 2005 : సంగీత విద్వామణీ పురస్కారం, విజయవాడ.
- నృత్యరవళీ, విజయవాడ వారిచే సువర్ణ ఘంట కంకణం.
- 2006 : సప్నా చికాగో (యు.ఎస్.ఎ) అన్నమాచార్య ప్రాజెక్టు ఆఫ్ అమెరికా నుండి పురస్కారం.
- 2007 : సద్గురు శివానందమూర్తి గారు, భీమిలి, విశాఖపట్నం నుండి గౌరవ పురస్కారం.
- 2007 : "మహతి కలానిథి" పురస్కారం - అజోయిభో కందాళం ఫౌండేషన్ న్యూజెర్సీ, యు.ఎస్.ఎ.
- 2008 : ఢిల్లీ తెలుగు అకాడమీ పురస్కారం - ఉగాది పురస్కారం.
- 2008 : సునద వీణా వాద్య విద్వమణి పురస్కారం, సప్తస్వర- హైదరాబాదు.
- 2008 : సూరజ్‌కుండ్ క్రాప్ట్ విలేజ్, వీణా పురస్కారం న్యూఢిల్లీ హర్యానా.
- 2008 : వీణా వాదన చతుర పురస్కారం, త్యాగరాజ భక్త బృందం, హైదరాబాదు.
- 2009 : చోర్లెట్ యు.ఎస్.ఎ ఆంధ్ర అసోసియేషన్ నుండి సన్మానం.
- 2009 : భారతీ తీర్థ చికాగో యు.ఎస్.ఎ నుండి పురస్కారం.
- 2009 : హోస్టన్ సాహితీ లోకం, యు.ఎస్.ఎ నుండి సన్మానం.
- 2009 : డైటాన్ నాథయోగం యు.ఎస్.ఎ నుండి సన్మానం.
- 2011 : ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉగాది పురస్కారం.
- 2011 : తెలుగు విశ్వవిద్యాలయం విశిష్ట ప్రతిభా పురస్కారం.
- 2011 : శ్రీ కంచి కామకోటి పీఠం ఆస్థాన విధ్వాన్.
- 2011 : పారుపల్లి రామకృష్ణయ్య పంతులు పురస్కారం "సునద సుధానిధి" విజయవాడ.
- 2011 : కేంద్ర సంగీత నాటక అకాడమి పురస్కారం.
మూలాలు
[మార్చు]- ↑ "అయ్యగారి శ్యామసుందరం | Ayyagari Syamasundaram". Telugu Buddies (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2017-02-01. Retrieved 2019-01-15.
- ↑ Telugu, Acchamga. "ప్రఖ్యాత వైణికులు శ్రీ అయ్యగారి శ్యామసుందరం గారి మనసులో మాట... ప్రత్యేకించి మీ కోసం..." Retrieved 2019-01-15.
- ↑ "syamveena". www.syamveena.com. Archived from the original on 2018-08-27. Retrieved 2019-01-15.