అయ్యగారి సోమేశ్వరరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అయ్యగారి సోమేశ్వరరావు

అయ్యగారి సోమేశ్వరరావు ప్రముఖ వైణిక విద్వాంసుడు.

జీవిత విశేషాలు

[మార్చు]

సోమేశ్వరరావు విజయనగరం జిల్లా వేగేశ అగ్రహారంలో 1920లో జన్మించాడు. విజయనగరంలోని సంగీత కళాశాలలో చదివి "డిప్లొమా" అందుకున్నాడు. చిన్నతనంనుండి సంగీతాభిలాష అతనికి ఎక్కువగా ఉండేది. తన స్నేహితులను కూర్చోబెట్టుకొని "సంగీత ఆట" ఆడేవాడు. ప్రతీ మాటకు సమాధానాన్ని సంగీతంలో చెప్పటం అతని ప్రత్యేకత. అప్పటి కాలంలో ఉన్న గ్రామఫోను రికార్డులను శ్రద్ధగా వినేవాడు. ఆదిభట్ల నారాయణదాసు వీరి బాల్య సంగీత ప్రతిభ గుర్తించి, విజయనగర సంగీత పండితులకు పరిచయం చేసి పేరి శ్రీరామమూర్తి గారి వద్ద గాత్ర విద్యకు కుదిర్చాడు. అతను 1951 మే 17న కోయంబత్తూరులోనూ, తరువాత తంజావూరులోను వీణ కచేరీలు చేసి సంగీతాభిమానులను మెప్పించాడు. 1952 ఫిబ్రవరి 15న "ఆంధ్ర సారస్వతి సమితి" వారు "వైణికరత్న" బిరుదు యిచ్చి సత్కరించారు. అతను వాసా కృష్ణ మూర్తి తో కలిసి వారింట వీణ సాధన చేస్తూ, నిలబెట్టి వీణ వాయించేవాడు. దేశమంతా పర్యటించి అనేక కచేరీలు చేసి చాలా.సువర్ణ ఘంటా కంకణాలతో  సన్మానింప బడ్డాడు. వీరి ధర్మపత్నికూడా వీరి శిష్యురాలే. వీరి సంగీతారాధనకు అచ్చెరువొందిన బాపట్ల ప్రజలు సగౌరవంగా ఆహ్వానించి అక్కడే ఉండే ఏర్పాటు చేసి గౌరవించారు. 1973 జూలై 14న తన 53వ ఏటనే సోమేశ్వర సాన్నిధ్యం చేరుకున్నాడు.[1]

అతను మొదట్లో ఆల్ ఇండియా రేడియో నుండి వీణ వాయించేవాడు. 1948 లో విజయవాడ ఆకాశవాణి కేంద్రం ఏర్పడిన తరువాత అక్కడ నుండి ఉన్నత శ్రేణి విద్వాంసులుగా అనేక  కార్యక్రమాలను చేసాడు. దక్షిణ భారతదేశంలో అనేక కచేరీలను చేసాడు. ఇతని కుమారుడు అయ్యగారి శ్యామసుందరం కూడా ప్రముఖ వైణిక విద్వాంసుడు.[2]

సన్మానములు-సత్కారములు

[మార్చు]
  • ప్రతిష్టాత్మకమైన సంస్థ "భారతీ తీర్ధా" నుండి " వీణా కోవిద" బిరుదును పొందాడు.
  • ఆంధ్ర సారస్వత పరిషత్ కార్యసభ వారి నుండీ "వైణిక రత్న" బిరుదును పొందాడు.
  • "వాగ్గేయ కారక రత్న" హరి నాగభూషణం ఈయన ప్రతిభకు చకితులై "వైణిక బాల భాస్కర" బిరుదమునిచ్చారు.
  • విజయ నగరం పౌరులు అతనికి "వీణా గాన సుధానిధి" బిరుదమునిచ్చారు.
  • 1955 లో బాపట్ల  పురజనులు అతనికి కాశీ కృష్ణాచార్యుల వారి ద్వారా  సువర్ణ ఘంటా కంకణమును బహూకరించారు.

మూలాలు

[మార్చు]
  1. gdurgaprasad (2016-08-08). "ఇది విన్నారా కన్నారా ! 16". సరసభారతి ఉయ్యూరు. Retrieved 2019-01-15.
  2. "syamveena". www.syamveena.com. Archived from the original on 2018-08-27. Retrieved 2019-01-15.

బయటి లంకెలు

[మార్చు]
  • Jayalakshmi, వీరిచే పోస్ట్ చెయ్యబడింది Ayyagari. "Ayyagari Jayalakshmi". Retrieved 2019-01-15.