అరుణాచలం మురుగనాథమ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అరుణాచలం మురుగనాథమ్
జననం1962
జాతీయతభారతీయుడు
పౌరసత్వంభారత్
వృత్తిఆవిష్కర్త, సామాజిక ఔత్సాహితుకుడు
జయశ్రీ ఇండస్ట్రీస్
సుపరిచితుడు/
సుపరిచితురాలు
ప్యాడ్ మ్యాన్ ఆఫ్ ఇండియా

అరుణాచలం మురుగనాథమ్ ఓ సామాజిక ఔత్సాహికుడు. తక్కువ ఖర్చుతో నాణ్యమైన శానిటరీ ప్యాడ్స్ తయారు చేసే యంత్రాన్ని ఆవిష్కరించిన ఇంజనీరు. పదో తరగతి వరకే చదివినా..ప్రపంచం గుర్తించే స్థాయికి ఎదిగాడు. ఎన్నో అవమానాలను ఎదుర్కొని, పోటీని తట్టుకొని ప్యాడ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా గుర్తింపు పొందారు.[1]

జీవిత విశేషాలు[మార్చు]

అరుణాచలం మురుగనాథమ్ 1962లో తమిళనాడులోని కోయంబత్తూరులో జన్మించారు. ఆయన తండ్రి అరుణాచలం చేనేత కార్మికుడు. తల్లి వనిత గృహిణి. చాలా పెద్ద కుటుంబం. తన తండ్రి తోడబుట్టిన వారు ఆరుగురున్నారు. వారిలో మురగనాథన్ తండ్రి మూడో వాడు. మురగనాథన్ అమ్మమ్మకు 23మంది సంతానం కాగా వారిలో అతని తల్లి వనిత నెంబరు నాలుగు. మురుగనాథమ్ గవర్నమెంట్ స్కూల్ లో చదువుకున్నాడు. తనకి 14 ఏళ్లు వచ్చేసరికి తండ్రి చనిపోయాడు. దీంతో పదో తరగతిని మధ్యలోనే ఆపేశాడు. కుటుంబ పోషణ కోసం పటాకులు అమ్మాడు.గణేషుడి విగ్రహాలు విక్రయించాడు. కొన్ని రోజుల చెరుకు గడలు అమ్మాడు. అయితే ఓ చిన్నవెల్డింగ్ వర్క్ షాప్ లో పనిచేస్తున్న సమయంలోనే అతని జీవితం మారిపోయింది. శ్రద్ధతో వెల్డింగ్ పని నేర్చుకున్న ఆయన.. కొన్నేళ్లకు తాను పనిచేసిన షాప్ కే యజమాని అయ్యాడు. అందరిలా కాకుండా..డిజైన్లను తయారు చేయడంలో మంచి పేరు సంపాదించుకున్నాడు.ఆ తర్వాత 1998లో శాంతి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు.

ఆవిష్కరణ[మార్చు]

పెళ్లి తర్వాత మురుగనాథమ్ జీవితం పూర్తిగా మారిపోయింది. ఒకరోజు మురగనాథమ్ తన భార్య ఏదో వస్తువు దాస్తుండటం గమనించాడు. ఆ రోజు జరిగిన సంఘటనే అతన్ని కొత్త ఆవిష్కరణకు పునాది వేసేలా చేసింది. తన భార్యకు శానిటరీ ప్యాడ్స్ తయారు చేసి ఇవ్వాలన్న సంకల్పమే..ఆయన్ని ప్యాడ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా మార్చింది. ఐతే ఆ ప్యాడ్స్ తయారి కోసం మురుగనాథమ్ పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. తన భార్య ఛీకొట్టినా, సమాజం వెలేసినా..ఆయన మాత్రం వెనక్కి తగ్గలేదు. ఆయన అంత తొందరగా ఓటమిని అంగీకరించేవాడు కాదు. మురగనాథమ్ తాను తయారు చేసే శానిటరీ ప్యాడ్ లను తానే స్వయంగా ఉపయోగించి వాటి పనితీరు తెలుసుకోవాలనుకున్నాడు. ఇందుకోసం ప్రయోగాలుచేసి కృత్రిమ గర్భాశయాన్ని తయారుచేశాడు. ఫుట్ బాల్ ట్యూబ్ బ్లాడర్ సాయంతో దాన్ని రూపొందించాడు. రక్త స్రావమయ్యేందుకు దానికి చిన్న రంధ్రాలు చేశాడు. అంతటితో ఆగకుండా మాంసం దుకాణం వ్యక్తితో మాట్లాడి మేకల రక్తాన్ని తీసుకుని దాన్ని ప్రయోగాలకు ఉపయోగించడం మొదలుపెట్టాడు. మేకను కోసే ముందు ఆ వ్యక్తి మురగనాథమ్ కు కబురుపంపేవాడు. ఆ సమయానికి మురగనాథమ్ వెళ్లి తాజా రక్తాన్ని సేకరించి ప్రయోగానికి ఉపయోగించుకునేవాడు. రక్తంతో నిండిన చిన్న రంథ్రాలున్నా ఫుట్ బాల్ బ్లాడర్ తో తయారుచేసిన కృత్రిమ గర్భాశయానికి తాను రూపొందించిన శానిటరీ ప్యాడ్లను తొగిడి ప్రయోగాలు చేసేవాడు. శానిటరీ ప్యాడ్ లు ధరించి నెమ్మదిగా నడవడం, పరిగెత్తడం చేసేవాడు. ప్యాడ్ వేసుకుని సైకిల్ తొక్కుతూ రకరకాల ప్రయోగాలు చేశాడు. ఈ ప్రయోగం విఫలం కావడంతో..వాడిన శానిటరీప్యాడ్ లను సేకరించడం మొదలుపెట్టాడు. ఉపయోగించిన బ్రాండెడ్ శానిటరీ ప్యాడ్స్ రక్తాన్ని ఎలా పీల్చుకుంటాయన్న విషయాన్ని గమనించాడు. తాను రూపొందించిన ప్యాడ్స్ ను బ్రాండెడ్ ప్యాడ్స్ తో పోల్చిచూశాడు. మురగనాథమ్ ప్రయోగాల్లో ఉండగా..తన భార్య విడాకుల నోటీసులు ఇచ్చి తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఒక రోజు గ్రామపంచాయితీ పెద్దలు తనని బంధించేందుకు ప్రయత్నించాలని తీర్మానం చేశారు. దీంతో మురగనాథన్ ఊరు విడిచి పారిపోయాడు. ఐనా తన ప్రయత్నాన్ని మానుకోలేదు. 8 ఏళ్లు కష్టపడి ప్యాడ్స్ తయారు చేసే మిషన్ ను తయారు చేశాడు. ట్రయల్ అండ్ ఎర్రర్ విధానంతో రూ. 65వేల ఖర్చుతో మిషన్ తయారైంది. ఐఐటీ మద్రాస్ మురగనాథమ్ జీవితాన్ని కొత్త మలుపు తిప్పింది. అక్కడ ఇన్నోవేషన్ ఫర్ బెటర్ మెంట్ ఆఫ్ సొసైటీ పేరుతో జరిగిన కాంపిటీషన్ లో పాల్గొన్నారు. మురగనాథమ్ కథ విని ఆయన ఆవిష్కరణ గురించి తెలుసుకుని ఐఐటీ సైంటిస్టులతో మిగతా వారు చాలా ప్రభావితులయ్యారు. అప్పటి రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ చేతుల మీదుగా మురగనాథమ్ ఇన్నోవేషన్ అవార్డ్ అందుకున్నాడు.

విజయం[మార్చు]

ఇన్నోవేషన్ అవార్డు తర్వాత మురగనాథన్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. మురగనాథమ్ విజయ ప్రస్థానాన్ని బీబీసీ, సీఎన్ఎన్, అల్ జజీరా ఛానెల్ లు ప్రపంచానికంతటికీ చూపించాయి. మహిళల శానిటరీప్యాడ్స్ వాడిన మొట్టమొదటి మగాడని ఒకరంటే… మహిళోద్దారకుడు అని మరోకరు కితాబిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేద అమ్మాయిలు, మహిళలకు సులువుగా, సరసమైన ధరల్లో శానిటరీ ప్యాడ్లు దొరకాలన్న ఉద్దేశంతో మురగనాథమ్ జయశ్రీ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేశాడు. ఈ కంపెనీలో మురగనాథమ్ చౌక శానిటరీ ప్యాడ్స్ తయారు చేసే మెషీన్ల తయారీ ప్రారంభించాడు. దేశంలోని 23 రాష్ట్రాల్లో ప్యాక్టరీలో తయారైన మెషీన్లతో శానిటరీ ప్యాడ్లు తయారుచేసి విక్రయిస్తున్నారు. మన దేశంతో పాటు మరో 19 దేశాల్లోనూ మురగనాథమ్ మెషీన్లతో శానిటరీ ప్యాడ్లు అమ్ముతున్నారు.ఐఐటీ, ఐఐఎంలకు వెళ్లి విద్యార్థులకు, భావి పారిశ్రామికవేత్తలకు ప్రేరణ నిస్తున్నారు. మురగనాథమ్ సాధించిన విజయానికిగానూ భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.

మూలాలు[మార్చు]

  1. యువర్ స్టోరీ. "మహిళల కష్టాలు తీర్చిన మహనీయుడు". telugu.yourstory.com. ఉదయ్ కిరణ్. Retrieved 25 December 2017.