అష్ట సోమేశ్వరాలయాలు
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
ఈ వ్యాసాన్ని వికీకరించి ఈ మూసను తొలగించండి. |
అష్ట సోమేశ్వరాలయాలు (అష్ట సోమేశ్వరాలు) - 8 చంద్ర ప్రతిష్ఠిత శివక్షేత్రాలు: ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లాలో చంద్రునిచే ప్రతిష్ఠింపబడిన ఎనిమిది శివలింగములు గల దివ్యక్షేత్రాలను “అష్ట సోమేశ్వరాలు” అంటారు. పూర్వకాలంలో కుమారస్వామి తారకాసురుని వధించుటకు అతని దేహమునందు భద్రపరచుకొన్న శివుని ఆత్మ లింగమును విష్ణుమూర్తి సలహామేరకు విచ్ఛిన్నము చేయగా అది ఐదుభాగములుగా విడిపోయి దూరంగా పడినపుడు దేవతలచే ఆయా ప్రదేశములలో ప్రతిష్ఠింపబడి పంచారామములనే దివ్యక్షేత్రములుగా వెలుగొందెను. వాటిలో సూర్యునిచే ప్రతిష్ఠింపబడి “దక్షిణకాశి ”గా పేరుగాంచిన దక్షారామము పరిసర ప్రాంతములన్నీ సూర్యభగవానుని వేడికి తట్టుకొనలేక వేడెక్కెను. అపుడు దేవతలందరూ చంద్రుని వేడుకొని శివుని అనుమతి తీసికొని దక్షారామమునకు ఎనిమిది ప్రక్కలా (నాలుగు దిక్కులు, నాలుగు మూలలు) ఎనిమిది శివలింగములను సప్తఋషుల సహాయముతో చంద్రుడు స్వయముగా ప్రతిష్ఠించి చల్లబరచెనని కథనము ఉంది. చంద్రునిచే ప్రతిష్ఠింపబడిన ఈ ఎనిమిది శివక్షేత్రాలను “అష్ట సోమేశ్వరాలయములు” లేదా “అష్ట సోమేశ్వరాలు” అంటారు. (గురుపత్నిని మోహించిన చంద్రునికి గురువుగారి వల్ల వచ్చిన శాప పరిహారార్ధం వీటిని చంద్రుడు ప్రతిష్ఠించినట్లు వేరొక కథనము ఉంది. ఈ మధ్య కాలంలో వీటిని నక్షత్ర శివాలయాలుగా పరిగణిస్తూ 27 జన్మ నక్షత్రాలకూ సంబంధించి 108 పాదములకు గల దోష నివారణ కొరకు దర్శనీయ క్షేత్రములుగా ప్రసిద్ధి చెందుతున్నాయి) చంద్రునిచే ప్రతిష్ఠింపబడుటచే ఈ ఆలయములలో గల ఈశ్వరులు “సోమేశ్వరులు”గా పిలువబడుతూ భక్తజనులకు దర్శనమిచ్చి తరింపజేయుచున్నారు. వాటి వివరాలు మనం తెలుసుకుందాము. అష్ట సోమేశ్వరాలయములు గల ప్రదేశములు :
1. కోలంక ( దక్షారామానికి తూర్పు దిక్కున ) (శ్రీ ఉమా సమేత సోమేశ్వర స్వామి) దక్షారామానికి తూర్పు దిక్కున 13 Km దూరంలో గల కోలంకలో శ్రీ ఉమా సమేత సోమేశ్వర స్వామివారి ఆలయం ఉంది.
2. దంగేరు (దక్షారామానికి ఆగ్నేయ మూల) (శ్రీ పార్వతీ సమేత సోమేశ్వర స్వామి) దక్షారామానికి ఆగ్నేయం వైపు 11 Km దూరంలో గల దంగేరులో శ్రీ పార్వతీ సమేత సోమేశ్వర స్వామివారి ఆలయం ఉంది.
3. కోటిపల్లి (దక్షారామానికి దక్షిణ దిక్కున) (శ్రీ రాజరాజేశ్వరీ సమేత సోమేశ్వర స్వామి) దక్షారామానికి దక్షిణ దిక్కున 11 Km దూరంలో గల కోటిపల్లిలో శ్రీ రాజరాజేశ్వరీ సమేత సోమేశ్వర స్వామివారి ఆలయం ఉంది. కోటిపల్లిని పూర్వకాలంలో “ కోటిఫలి ” అని పిలిచెడివారు. అది కాలక్రమేణా రూపాంతరంచెంది కోటిపల్లిగా మారినది. కోటిపల్లిలో గోదావరిని గౌతమ మహర్షి రప్పించుటచే గౌతమీ నదిగా పిలువబడెను. సప్తఋషులందరూ కలసి గోదావరిలో తమ తపోశక్తితో సప్త గోదావరుల నీటిని ఆవాహనచేసి ఆ నీటిలో స్నానమాచరించిన వారికి అన్నిజన్మల పాపములూ నశించిపోయి కోటిఫలితాలనిచ్చేటట్లు పునీతము చేసారు. కాబట్టి కోటిఫలిగా పిలువబడెను. కాబట్టి కోటిపల్లిలో గోదావరిలో స్నానమాచరిస్తే సమస్త పాపాలు తొలగిపోతాయని చెప్తారు.
4. కోరుమిల్లి (దక్షారామానికి నైరుతి మూల) (శ్రీ రాజరాజేశ్వరీ సమేత సోమేశ్వర స్వామి) దక్షారామానికి నైఋతి వైపు 21 Km దూరంలో గల కోరుమిల్లిలో శ్రీ రాజరాజేశ్వరీ సమేత సోమేశ్వర స్వామివారి ఆలయం ఉంది.
5. వెంటూరు (దక్షారామానికి పశ్చిమ దిక్కున) (శ్రీ పార్వతీ సమేత సోమేశ్వర స్వామి) దక్షారామానికి పడమర దిక్కున 8 Km దూరంలో గల వెంటూరులో శ్రీ పార్వతీ సమేత సోమేశ్వర స్వామివారి ఆలయం ఉంది.
6. సోమేశ్వరము (దక్షారామానికి వాయవ్య మూల) (శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత సోమేశ్వర స్వామి) దక్షారామానికి వాయవ్యం వైపు 14 Km దూరంలో గల సోమేశ్వరంలో శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత సోమేశ్వర స్వామివారి ఆలయం ఉంది. చంద్రునిచే ప్రతిష్ఠింపబడిన శివలింగము గల క్షేత్రము కాబట్టి ఈ ప్రదేశానికి సోమేశ్వరం అని పేరువచ్చింది.
7. వెల్ల (దక్షారామానికి ఉత్తర దిక్కున) (శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత సోమేశ్వర స్వామి) దక్షారామానికి ఉత్తర దిక్కున 5 Km దూరంలో గల వెల్లలో శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత సోమేశ్వర స్వామివారి ఆలయం ఉంది.
8. పెనుమళ్ళ (దక్షారామానికి ఈశాన్య మూల) (శ్రీ పార్వతీ సమేత సోమేశ్వర స్వామి) దక్షారామానికి ఈశాన్యం వైపు 8.5 Km దూరంలో గల పెనుమళ్ళలో శ్రీ పార్వతీ సమేత సోమేశ్వర స్వామివారి ఆలయం ఉంది.
(ముఖ్య గమనిక: అష్ట సోమేశ్వరముల గురించి ఈ వివరాలను నేను స్వయముగా ఎంతో కష్టపడి పరిశోధన చేసి, మంచి పదముల కూర్పుతో ఈ వ్యాసమును అందరికీ అందించాలని తయారుచేసుకున్నాను. దీనిని ఎవరైనా వారి సైట్ లలో కాపీ చేసినచో దానిలో కచ్చితముగా నా పేరును సూచించవలెను. లేనియెడల కాపీ రైట్ యాక్ట్ క్రిందకు వచ్చునని తెలియజేయుచున్నాను.)
శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ కార్తీకమాస పుణ్యదినములలోఅష్ట సోమేశ్వరాలలోగల ఈశ్వరులకు మా కుటుంబ సభ్యులందరి తరపున శతసహస్ర వందనములు. సమస్త జనులకు అష్ట సోమేశ్వరాలలోగల ఈశ్వరుల అనుగ్రహ ప్రాప్తిరస్తు........ సర్వేజనాః సుఖినోభవంతు.......... సమస్త సన్మంగళాని సంతు........ స్వస్తి. (Written by Nemani.V.V.S.N.Murty, Lecturer in Physics, Nedunuru, Konaseema Dt., Andhra Pradesh, Mobile: 9440249930, Dt: 12-11-2022)